ఈ మాటే , తమ కోడలికి భూదేవమ్మ నయానా భయానా నచ్చ చెప్పి చూసింది. గుట్టుగా రట్టు కాకుండా అన్నీ చక్కబెట్టాలనీ చూసింది ఒంటి చేత్తో. ఆ అమ్మణ్ణి తప్పు కూడా ఏముంది?
కొత్త మోజులోనేమి ,మంచి మనసుతోనేమి, మొదటంతా వీడు ఆ పిల్లను నెత్తిన బెట్టుకు గారాబం జేసే. వారమంతా పట్నాన ఏమి వొళ్ళు ఇరుసుకోనేటోడొ గానీ, శని వారం రాత్రికి గుట్టెడు ఆశలతో సంసారానికి తిరిగి వొచ్చేవాడు. ఆఖరి బండిలో.
కొంత కాలానికి, కోడలిని పట్నం తీసుకు బోయి కాపురం పెట్టాడు.భూదేవమ్మ పోయొచ్చి కతలుకతలుగా చెప్పేది.
బొమ్మలపెట్టెలు<1>, మాటలపెట్టెల <2 >గురించి .అయ్యన్నీ సరేగానీ, ఇట్టా కొండగాలి పోసుకొనే తనకు , ఆ అగ్గిపెట్టిలాంటి కొంపల్లో బింగన్న<3 >లా కాళ్ళుచేతులు ముడుచుకు కూర్చోవడం మింగుడుపడక ,ఆ తట్టు పోలేదు.
తన కొడుకు చేసే మొనగాడి పనేంటో కళ్ళారా చూసి రావాలనీ తనకి మాత్రం గుండె కొట్టుకులాడలేదూ? కొడుకు పనిమంతుడు అయితే తండ్రికే కదా గర్వమూ గవురమూ !
అనుకుంటుండగానే, వాడి పనే , మూలన బడింది.
“సెల్లు ఫోనొచ్చింది. వైరులెస్సు వొచ్చింది. “అన్నాడు వాడు
“అవేమిరా “అని భూదేవమ్మ అంటే ,”మీకు తెల్దు పోమ్మా “అనేవాడు.కానీ, వాటి దెబ్బ ఏంటో తమకే ముందు తెలిసి వొచ్చింది.
చుట్టలు చుట్టలుగా కేబుల్ వైరు కొండచిలువ చుట్టుకున్నట్లు తమ వూరిని చుట్టేసింది.
ఒక్కోడు ఇంటిముఖం బట్టాడు. వొచ్హినోడు వొచ్చాడా రానోడు అక్కడ తిప్పలు బడ్డడా ..ఎవరికి అనువైన పనిలోకి వాళ్ళు బోగా, కూసోని తీరుబడిగా కాపురం చేస్తున్న తన కోడలు లాంటొళ్ళు కష్టాన బడ్డారు. ఒక్కోడు ఒక్కో దిక్కు .ఒకరికి ఒకరు మాట సాయం చేసుకొనే సమయంకూడా దక్కలేదు.ఎవరికి వారు ఒంటరి వారయి పోయారు.
పూట గడవని స్థితి.పరిస్థితి చేతిలో ఉండగానే ,తమ కొడుకు భూదేవమ్మను పిలవనంపి కోడల్నీ బుడ్డొడ్నీ ఇంటికి పంపాడు. తెలివిగల బిడ్డ. వాడికి తోచినది చేసాడు. అయితే ఏమి ,సుఖాన నిలిచిన తోడు కష్టాన నిలవలేక పోయింది. నునుపు బండల మీద నడుస్తూ నాజుకు పనులు చేసిన మనిషి కొండపల్లెలో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
ఆమే తప్పేమీ లేదు. వారానికి ఒక మారు వచ్చే మగడు నెలకో రెన్నెళ్ళకో రాసాగాడు. ముద్దుమురిపెంగా పలకరించే వాడు కస్సుబుస్సు లాడగాడు.చీరారవికా పండూఫలము తెచ్చేవాడు పిడిగుద్దులు తెస్తు న్నాడు. ఎత్తిపొడుపులూ ఏడుపులు .కాపురం కన్నీళ్ళపరమైంది. కరకరలు మెరమెరలు. ఒకరంటే ఒకరికి కంటిలో నలుసు యవ్వారమైపోయింది. కన్నవారిగా చూస్తూ ఉండడమే కానీ, కల్పించుకొనే , వీలు లేకుండా బోయింది.
అట్టాంటిది, ఒకనాడు ఇద్దరూ గుట్టుగా కలిసివచ్చారు. వారితో పాటే ఒక పట్నం సారొచ్చాడు. మళ్ళీ వ్యవహారం సర్దుకొన్నట్లే తోచింది కొన్నాళ్ళు. దాచితే దాగే విషయం కాదు కదా .మా బోడికొండ వాలుచెలక ను గుట్టుగా వారికి బేరం పెట్టినట్లు తెలిసింది.గుండె చెరువయ్యింది.లబోదిబోమన్నాడు.
“పనికి మాలిన కొండల్నీ బండల్నీ ఎన్నాళ్ళు పట్టుకు వేళ్ళాడుతాం?ఇదుగో ఈ సారోల్లు.మంచోల్లు. వాళ్ళేదో ముచ్చట పడుతున్నారు.మనకు మంచి బేరం చిక్కింది. దక్కిందే పరమాన్నం కదే నాయినా"
“ అవి పనికి కొండలూబండలూ కావురా ఈ భూదేవమ్మకు గుండెలురా..! పొదుగు నరుక్కుంటార్రా ?వాటిని పరాయిపాల్జేయకురా.." ఆదెయ్య ఆక్రోశించాడు.
ఆదెయ్య మాటలు గాలిలో తేలిపోయాయి. కాగితం మీది రాతలే నిలబడి పోయాయి. కుసింత చెలకముక్కా ,ఆ వెనుక బోడికొండా పరాయిపాలయ్యాయి.
అయినా, కొడుకు అనుకున్నది అమలు జేసుకున్నాడు
.వానచుక్క ముఖమెరిగి ఎన్నాళ్ళో.గొర్రెలబయలు తప్ప , ఆ కొండవాలున పిడికేడు పంట ఇంటికి మోసిన పాపాన బోలేదు. వాని మాటనే బోతేపోలా’ అనుకున్నారు తనూ భూదేవమ్మ.
మళ్ళీ మాములు రోజులు వచ్చినట్లు కనబడ్డాయి. కుసింత చెలకముక్కా ,ఆ వెనుక బోడికొండా పరాయిపాలయ్యాయి.కానీ,కొడుకు సంసారం కుదుటబడ్డట్టే తొచింది.
బోడికొండ మీద టవర్ నిలపాలనీ ,తవ్వకాలు జరపాలనీ , పట్నం సారు రాకపోకలు ఎక్కువయ్యాయి. తన కొడుకును ఆ పని మీద ఈ పని మీదా పట్నం పంపుతూ ఉన్నాడు. కోడలు అతనికి దగ్గరయ్యింది. అది, ఏకంగా ఎవరికంట పడకూడదో , వారి కంటే పడింది.
ఆదెయ్య తల విదుల్చుకొన్నాడు.
అందరం అనుకున్నాం . ఇలాంటిదేదో జరుగుతుందనీ.
అయినా , ఆపద రాకుండా ఆపలేక పోయాం.
ఆదెయ్య కంట్లో నీటిచెమ్మ. చేతిలోని కొడవలి ఖణేళ్ మంటూ బండ మీద పడింది. ఆదెయ్య గమనానికే రాలేదు.
"తాతా , ఈడున్నావా ..ఎతికెతికి వొచ్చా" ..వొగరుస్తా అన్నాడు కిష్టప్ప పెద్దకొడుకు ,
"దేనికిరా ?" ఆదెయ్య ఆరా తీశాడు, “ఇందాకడి నుంచి కేకేస్తంది నువ్వట్రా?"
" పెద్దయ్యోరమ్మ నిన్ను ఉన్నోన్ని ఉన్నట్టే ఎంటబెట్టుకు రమ్మంది .మామొచ్చాడు. జైలుకు బోతాంటే తప్పించుకున్నాడంట. బుడ్డోడ్నిచూడను బడికాడికొచ్చాడు”
ఆదెయ్య గుండె గుభేలంది. గొర్రెల్ని అదిలిణ్చడం మాని , బక్కటెద్దు పగ్గం వొదిలేసి , కిష్టప్ప పెద్దకొడుకు వెనక వడివడిగా అడుగులేసాడు. గుండె తపతప కొట్టుకొంటుంటే.
“బుడ్డోడ్ని పలకరిస్తే మక్కెలిరగతంతామని వాల్లమేనమామలొచ్చారు. ఊల్లో వాల్లంతా దడిగట్టినారు.అయ్యవారమ్మ కు ఎటూ తోచక నిన్ను పిలవనంపింది.పద పద."
ఆదెయ్య గుండె మెలిపెట్టినట్లయ్యింది. కన్నబిడ్డను పలకరించు నోచని పాపాత్ముడైనాడమ్మా నా బిడ్డ!
తువ్వాలును నోట్లో కుక్కుకుంటా.. పరుగులు పెట్టాడు.కిష్టప్ప కొడుకు వయసుమీదుండే..వాడు బాణం లా దూసుకు పోయాడు.
ఒకే ఒక్క చెంపపెట్టు. గింగిరాలు తిరుగుతూ ఆమె నేలకొరిగింది. మళ్ళీ లేవలేదు. ఒక బొట్టు రక్తం చిందలేదు. ఒక్క నరం చిట్లలేదు. బతుకులు బండలయ్యాయి. వాడి కోపం ,ఆక్రోశం వాడిని కబళించివేసింది. అంతా క్షణాల్లో.అందరం చూస్తుండగానే. . కోడలి ప్రాణాలు గాలిలోకలిసిపోయాయి. కొడుకు కటకటాల పాలయ్యాడు. బుడ్డోడు తండ్రి చేసిన పనికి ప్రత్యక్ష సాక్షి.
పట్నం సారు ఎటుబోయాడో కానీ, బుడ్డోడ్నికోడలి అన్నదమ్ములు చంకనబెట్టుకు పోయారు.
కొడుకును కోడలనీ మనవణ్ణీ పోగొట్టుకొని అనాథలయ్యారు తనూ భూదేవమ్మ.
ఆదెయ్య బడి దగ్గరికి వెళ్ళేసరికి , ఒక పక్క పోలీసులు ,మరోపక్క బుడ్డోడి మేనమావలు .వింతనుజూస్తా ఊరిజనం.
పడతా లేస్తా కొడుకు దగ్గరికి పోబోయాడు.
చిన్నాయ్యవోరమ్మ మధ్యలోనే అడ్డొచ్చింది.పెద్ద అయ్యవోరమ్మ గదిలో కి తీసుకు వెళ్ళింది.అక్కడ పంతుళ్ళు పంతులమ్మలు ఇన్స్పెక్టరు ..అందరూ ఉన్నారు.
"పొద్దున్న వొచ్చాడు. కసువులు చిమ్మను పోయిన మనిషికి కంచెలో దాక్కోని కనబడ్డాడు. భయపడి కేకలు పెడతా వొచ్చింది. చూద్దుము కదా. ఇతను. మాసిన గడ్డము, చింపిరి జుట్టు, ఖైదీల బట్టలు .కాళ్ళకు చేతులకూ బేడీలు.పిల్లలు భయపడి పోయారు.ఎక్కడొళ్ళక్కడే ఉరుకులు బిత్తరపడి నిలువుగుడ్లేసారు. మేమే వచ్చి అందరినీ లోపలికి పంపాం.
"ఏమ్మా, ఎవరికైనా హాని జేసినాడామ్మా?" మాటలు కుక్కుకొంటూ మెల్లిగా అడిగాడు ఆదెయ్య.
"ఊహు, కానీ,ఉదయం నుంచీ అక్కడే ఉన్నాడు.ఉలుకు పలుకు లేదు. అతనికే ఏదన్నా హాని చేసుకొంటాడేమో నని ఇన్స్పెక్టర్ గారికి కబురు పెట్టం..వాళ్ళ మేనమామలొచ్చారు. పిల్లోడు సాక్ష్యం చెప్పినందుకు వాడిని చంపే దానికే వొచ్చాడనీ.."
ఆదెయ్య ఉన్న చోటనే కుప్ప కూలిపోయాడు. "ఇందరి కళ్ళల్లో ఇంత కిరాతకుడై పోయినాడా నా బిడ్డ.."
( "సురభి" ప్రారంభ సంచికలో ప్రచురితము)
<<<<సశేషం >>>>
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment