Jun 27, 2010

గుట్టెనుక 1

"గుట్టెనుక  దొంగల ముఠా  ...గజ్జెలమోనారే

 తరిమికొట్ట వొస్తవా చెల్లే ...గజ్జెలమోనారే "
ఆదెయ్య తన ఒక్కగానొక్క బక్కటెద్దును ముల్లుగర్రతో అదిలిస్తూ ,అడుగడుక్కో పదం పలుకుతూ ..మెల్లిగా నడుస్తున్నాడు. వెనకే, అటో అడుగూ ఇటో అడుగూ వేస్తూ గొర్రెల దాటు.
"  తాతా " ఎవరో పిలిచినట్లయ్యి, వెనక్కి తిరిగి చూశాడు.కనుచూపు ఆనే మేరలొ ఎవరూ లేరు.
ఎవరో పిలుస్తున్నారు.ఎవరినో మరి.
మునుపటి కాలంలో  కో  అంటే కోటి మంది ”. ఇప్పుడు గొంతు చించుకొన్నా బదులు పలికే దిక్కే లేదు.
"" మనిషి ఉన్నట్లుగానే ఆదెయ్య కేక వేశాడు.చుట్టూ ఉన్న కొండల్ని తాకి , ముసలి గొంతు మురిపెంగా తిరిగి వచ్చింది.
"ఈడ" ఆదెయ్య చుట్టూ చూశాడు.సరిగ్గా బోడికొండ మొదట్లో చిట్టికేసర చెటు మొదట్లో ఉన్నాడు."బోడికొండ
మొదట్లో కి రాండి " బిగ్గరగా కేకేసాడు.  గాలివాటున మాట ఎటు చేరిందో కానీ, మనిషి మాట మళ్ళా వినపడలేదు.
"అంతా ఇడ్డూరం.అసలు మనిషి మాటేనా తను మతి తప్పి ఇన్నాడా? ఆవంతన అరిచిన మనిషి అజాపజా లేడు!" ఆదెయ్య తన బక్కటెద్దుతో వాపోయాడు,"ఒరే సాంబా, చూడరా.. ఎట్టాంటి కాలం చూడాల్సి వొచ్చిందో ! కొండ మీద
కో అంటే కోటి మంది .ఇప్పుడు దిక్కుదెన్నూ లేదు.మాయదారి కాలం!" చెవి వెనకాల భద్రంగా దాచిన బీడీ ముక్కను తీసాడు.చివర కొరికి తుపుక్కున ఊశాడు.
ఆదెయ్య తోలుకొచ్చిన గొర్రెలు అటొకటి ఇటొకటి.తమ పనిలో తాము .తలలు వొంచుకొని .తపస్సు చేస్తున్నట్లుగా.
పగిలిన రాళ్ళ మధ్యన పచ్చిక పరక కోసం ఆత్రంగా వెతుకుతున్నాయి.ఆవురావురున దేవులాడుతూ.
"ట్.. ర్ర్.. ర్ర్.. హ్హె హ్హే.. "  ఆదెయ్య పలకరించాడు.
నింపాదిగా నిలబడ్డ గొర్రె ఒకటి మెడ నిక్క బొడిచి ,"మే" అంటూ బదులిచ్చింది.
"చూశా ... దాని వొయ్యారం!" ఆదెయ్య తెగ మురిసి పోయాడు.
ఎండలింకా ముదర లేదు. అయినా , పెద్దచెట్లన్నీ ఎండుముఖం పట్టాయి.ఆకులన్నీ రాలిపోతున్నాయి.గుట్టలన్నీ ఎండుటాకుల కుప్పల్లా ఉన్నాయి.
ముల్లుగర్ర చివరన వంకీలా కట్టిన పిడి లేని కొడవలిని ,రాతి మీద సాన బెట్ట సాగాడు.
కాగిన బండ.కరకర ఎండ.మొద్దు కొడవలి.
ఒక వింత ద్వని.ఆగి ఆగి. రాచి రాచి. కొండల్ని చుడుట్టూ.ఆదెయ్య చుట్టూ తిరుగుతోంది.
ఆదెయ్య బీడీని వెలిగించ కుండా ,చివరను నోట్లో ఆడిస్తూ ,గొణుగుతూ ,కొడవలి సాన పెడుతూ ఉన్నాడు.
కొండ వొడిలో ఒదిగిన ఒక్కో గుర్తూ ఆదెయ్యను ఆగి ఆగి పలకరించసాగింది.
కొండల్లోని డొంకలూ తోవలూ అన్నీ ఆదెయ్యకు తెలుసు. రాళ్ళూరప్పల్లో  ఎగురుతూ,  కోతి కొమ్మచ్చులు నేలాబండలు చిర్రాగోనెలు ఆడుతూ పెరిగాడు. కొండకి ఆవలి వైపున ఉన్న గంగానమ్మ సాక్షిగా భూదేవమ్మను పెళ్ళి చేసుకొచ్చాడు.
మంచైనా చెడైనా ,మాట రానీయకుండా, మాట పడకుండా,మాట అనకుండా సంసారం నెగ్గుకొచ్చాడు.
ఆ మాట కామాట , భూదేవమ్మ ఒద్దికగా కాపురాన్ని సర్దుకొచ్చింది.
 కొండ మీద కురిసే నాలుగు చుక్కలు భద్రం చేసుకొని జొన్నలో సజ్జలో మొక్కజొన్నలో తయిదలో ,మడిచెక్కలో చల్లుకొని ,సేద్యం చేసారు.
భూదేవమ్మ చెట్టూచేమా గుట్టు మట్టు ఎరిగిన మనిషి.ఏదో అట్టా జరిగిపోతా ఉంటే , నలుసుపడింది.కొడుకు.తెగ మురిసి పడింది.అమ్మ కదా?
నలుగురితో పాటు నారాయణా అనుకొని ,బడికి పంపారు,నాలుగు అక్షరం ముక్కలు ముక్కున పడితే ,మురిసిపోయారు.
చూస్తా ఉండగానే ,ఊరు ఊరంతా ..ఒకరి తరువాత ఒకరు  ..పట్నం దారి బట్టారు.ఒకడి తోక బట్టుకొని ఒకడు.గొర్రెలదాటున బడ్డారు. ఏం చేస్తారు? వాన కురిస్తే ఎవరన్నా ఆ మాట ఎత్తే వారేనా?
ఉరువేది? కరువు తప్ప.
ఏ తాతల కాలం నాటి వూరో ..ఏదో సుడిగాలిన బడ్డట్లు ,ఒక్క పెట్టున ఖాళీ.ఆ వడిలో తమ బిడ్డా.
"ఏందయ్యా దేశం కాని దేశంలో ఏం పని జేస్తాఉండావురా " అంటా,కడుపాతురానికి ఎన్నడ్నా భూదేవమ్మ ఆరాతీస్తే,"కేబుల్ పని " అనేవాడు. "అదేంటయ్యా" అంటే, "నీకు తెల్దు పోమ్మా “అనేవాడు.
. తెలుసుంటే, ఇక్కడిట్టా గుట్టాచెట్టు బట్టి ఇగ్గులాడే వాడా..అందరితో పాటు పడి తనూ పోయే వాడు కాడూ? ఆ నాజూకునాణెంపు పనులు మోటు మడుసులం మాకేం తెలుసు? ఆ మాటంటే ,భూదేవమ్మ మనసు కష్టపెట్టుకొంటది ఎందుకు లెమ్మని చూస్తా ఉండే వాడు.
ఏ కన్న్నీళ్ళు ఎన్ని కొంగుల్లో అదుముకొందో కానీ , తన ముందెప్పుడూ బయట పడిన జ్ఞాపకం లేదు.మేనకోడల్ని తెచ్చి వాడికి ముడేసింది. వాళ్ళకో బుడ్డోడు.
ఆదెయ్య ముక్కు ఎగబీల్చాడు. నానిన బీడీ ముక్కను నోట్లోనుంచి తీశాడు. కొనగోటితో విదిల్చాడు.మళ్ళీ నోట్లో పెట్టుకొన్నాడు.పొసగక, దానిని తీసి ,అగ్గిపుల్ల వెలిగించాడు.ఏమయిందో ఎమో బీడీ వెలిగించకుండానే ,అగ్గిపుల్లను ఆర్పేసి దూరంగా గిరాటేసాడు.మళ్ళీ తన గొర్రెల్ని ఒక మారు అదిలించాడు. కనుచూపు మేరా దృష్టి సారించాడు.
ఏది ఏమైనా బోడికొండ బోడికొండే !
సముద్రం ఒడ్డున బోర్లాబడ్డ శంఖం లా  ఎంత ముచ్చటగా ఉంటుందో.అదుగో అప్పాచెల్లేళ్ళ కొండలు .నీటికోసం వంగిన పిట్టల్లా ఎంతందంగా ఉన్నాయో !అప్పాచెల్లెళ్ళు ఒకదానితో ఒకటి కువకువలాడుతూ ముచ్చట్లాడుతూ ,ఏ పేరంటానికో పబ్బానికో ముస్తాబవుతున్నట్లుగా  ఎంత సొగసుగా ఉన్నాయో !   మభూదేవమ్మ వయసున ముడెసిన కొప్పులో ముడిచిన ముద్దబంతిలా. ఎంతయినా ఈ కొండాకోనా అందం చందం.
ఇంతలో ,కొండను చుట్టేస్తూ పొగ . సుడులు సుడులుగా గాలిలోకి తేలింది.
"అప్పుడే మొదలెట్టారూ!" గొణుక్కున్నాడు."ఆకులు నేల పడనీయరు.మంట ఎగదోస్తారు.  బూడిద తోసేసి ,నేల చదును చేసి,ఇన్ని ఇత్తులు చల్లుతారు.నీటి చుక్క కోసం మబ్బులెంక నోళ్ళెళ్ళబెట్టి కూసుంటారు.వాన బడిందా పరమాన్నం లేదా పస్తు.
అయినా ,ఈళ్ళకింత ఆత్రం ఎందుకుబట్టిందో ,శివరాత్రి సాగనియ్యరు.చెట్టుచేమా చూసుకోరు.మాడిన మాను మరలా చిగుర్చాలంటే ఎన్నికాలాలు పట్టుద్దో!పోయిన అడివి రమ్మంటే వొచ్చుద్దా ?ఆత్రగాడికి బుద్ది మట్టనీ..ఇట్టా అడ్డూ ఆపూ లేకుండా పోతంటే ,చివరాఖరికి మిగిలేదేంటనీ..?"ఆదెయ్య నిట్టూర్చాడు.
( "సురభి" ప్రారంభ సంచికలో ప్రచురితము)

<<<<సశేషం >>>>


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment