ఉదయాన్నే ఈ అటెన్షన్ ..స్టాండటీజ్ అంటూ గొడవేమిటనుకొంటున్నారా ?
పొద్దుటే ఈ రైల్వే అనౌన్స్మెంట్ ఏంటబ్బా ...అని చిరాకు పడుతున్నారా?
కాస్తాగండి.
అక్కడ మా సిరి గారి చిన్నమ్మాయి గుక్కపట్టి ఏడుస్తోంది. పిడికిళ్ళు బిగించి .కప్పెగిరేలా .
వాళ్ళ అమ్మ వళ్ళో చేరగానే ఏమీ ఎరగ నట్లు నవ్వులు!
ఆరో నెలపెట్టి ఆరు రోజులన్నా అయిందో లేదో ..అందర్నీ హడలు కొట్టే కళలో ఆరితేరి పోయింది! ఇంట్లో ఉన్న అరడజను మందీ ఎల్లవేళలా అటెన్షన్ లో ఉండాల్సిందే.
ఇక్కడ ఒక అయిదేళ్ళ పాప గోడంతా బొమ్మలు గీసేసి, తను నేర్చు కొన్న అక్షరాలన్నీ ప్రదర్షించేసి
అమ్మానాన్నల అటెన్షన్ ఓరకంట చూస్తోంది. ప్చ్ ... కథ కొంచం అడ్డం తిరిగినట్లుంది.
వాళ్ళ నాన్న కళ్ళ ముందు కట్టాల్సిన పెయింటు బిల్లులు కదలాడి నట్లున్నాయి. ఆ అమ్మాయి వీపు విమానం
మోత మోగింది . సహజంగానే.
అదుగో , ఆ అమ్మాయేమో మంచం కింద దూరి వెక్కిళ్ళు పెడుతోంది.
వాళ్ళమ్మ కొంగు బిగించి స్పాంజ్ ,సర్ఫు, నీళ్ళతో అక్కడికి దూసుకు వస్తోంది.
“ముందు పాప గుక్క పట్టకుండా చూడండ్రా.”.తాత గారు చదువుతున్న పేపరులోనుంచి ఉచితసలహా జారీ చేసారు.
“మరీ విడ్డూరం కాకపోయే మా కాలంలో ఇలా కాదమ్మా”.. నాయనమ్మా ఒక పాసింగ్ కామెంట్ గాలిలోకి వదిలేసింది.
ఇక మనం తప్పుకోవచ్చు !
ఊ !
ఇక ఇక్కడ పరిస్థితి చూశామా అంటే ,వంటింట్లో ఏదో ఢామ్మనింది!
హతోస్మి!
అటెన్షన్ ప్లీజ్!
అందులోనూ ఇది ఆడియో వీడియో యుగమయ్యే.
స్నానానికి వేన్నీళ్ళకు పుల్లలు ఎగ దోసినా,
భుజాన తువ్వాలేసుకొని స్నానానికి బయలు దేరినా ,
దగ్గినా ,తటాలున తుమ్మినా , వాకిట్లో తెల్లటి దుప్పటేసుకొని ముసుగు పెట్టినా ..అన్నీ ..వింత వార్తలయ్యే.
అయినా మనమేమైనా రాజు గారి బామ్మర్దులమా ,రాణీ గారి అనుంగు చెలికత్తెలమా..
నలుగురి కళ్ళూ మనవైపు తిరగడానికి.
పొయ్యిలో కట్టెలు, పొయ్యిపైని నీరు, ఎసట్లో బియ్యం ..
ఈ పూటకి వీటినెలా సమకూర్చుకోవాలా అని తాపత్రయ పడే అనేకానేకుల్లో ఒకరమైతే!
ఇక, రాజు గారెక్కడా రాణీ గారెక్కడ .... వారి మందీ మార్బలమెక్కడ ?
అడక్కుండానే అటెన్షన్ దొరుకుతుందక్కడ !
***
అంతదాకా ఎందుకు ..మొన్నకు మొన్న
పచ్చటి పొలాల్లో వెచ్చటి నెత్తురుచిందించినా ...
విస్తుపోయిన చూస్తూ ఉన్న మనమందరం ...ఒక్క క్షణంలో దృష్టిని మరల్చేసామంటే ,
. మన అటేన్షన్ ను ఇట్టే తమ వైపు తిప్పుకొన్న వారిదే విజయం! మనం ఎప్పుడు పరాజితులమే .
ఎవరు ఎప్పుడు ఎంత అటెన్షన్ ను పొందగలరు అన్న దే ఈ నాటి మాట !
అదొక సమకాలీన సామజిక కళ ! కాలానికి తగ్గట్లు నడుచుకోవాలి కదండీ!
దేనికెంత అటెన్షన్ ఇవ్వాలా అని నిర్యించుకొనే వ్యవధి అవకాశం మన బోటి సామాన్యులకు ఎక్కడ. ?
రిమోట్ కంట్రోల్ నొక్కులు నొక్కినా నొక్కగలిగినా మన దృష్టి ఎక్కడ పడాలో మనకే తెలియడం లేదు.
మరి ,వారంతా చేస్తోంది అటేన్షన్ కోసమేగా... అని అనకండి.
నిజమే, ఎవరు ఏది చేస్తూన్నా చూస్తున్నా .. వారి దృష్టి తమ వైపు పడాలనే కదా!
ఇంతకీ బ్రౌను గారి నిఘంటువు ఏమంటుందంటే...
అటెన్షన్ అంటే "ధ్యానము ,లక్ష్యము, గమనము" అని.
అమ్మో ! ఈ పదానికి పెద్ద పెద్ద అర్ధాలే ఉన్నాయండోయ్!
వళ్ళు చేసినా చిక్కిపోయినా ,వార్తలకెక్కడానికి మనమేమైనా సినిమాతారలమా?చంద్రులమా ? సూర్యులమా?జగజ్జేతలమా? కనీసం కోచింగు సెంటర్ల టాప్ లిస్ట్ లలోనూ లేక పోతిమి!
సందుల్లో గొందుల్లో చడీ చప్పుడు లేకుండా బతికేస్తుంటిమి.
మన గూట్లో మనం.
మన వలల్లో జాలాల్లో గోలల్లో మనం .
శ్రీశ్రీ మాష్టారుకు చిరాకేయమంటే వేయదూ మరీ!
అక్కడొక అయ్యవారు మూతి బిగించి బోర్లా పడుకొని ధీర్ఘంగా ఆలోచిస్తున్నారు. బహుశా వాళ్ళవిడ కాఫీ కాస్త ఆలస్యం చేసిందని ఆవిడ మీద అలిగారేమో.
అక్కడో మూతి బిగింపు.
ఇక్కడో కొంగు విదిలింపు.
కనుబొమల ముడి. పెదవి విరుపు.
గద్గద స్వరం. హూంకరింపు.
కళ్ళు రెపరెప లాడించే వారొకరకైతే,నేల అదిరేలా ధనధనా నడీఛె వారొకరు.
పువ్వులు కానుకలు అందించడం.నవ్వులు చిందించడం.
అని. అమ్మో ఈ పదానికి పెద్ద పెద్ద అర్ధాలే ఉన్నాయండోయ్
అందాలు అలంకరణలు .సింగారాలు బంగారాలు. వొగలమారి వయ్యారాలు .
అయ్యబాబోయ్.. ..అటెన్షన్ కొరకు ఎన్ని రకాల తిప్పలండీ .
అంత దాకా ఎందుకు ...
మేఘసందేశాలైనా చిట్టిసందేశాలైనా కువకువలైనా..
ఏదో రూపేణా అయిన వారి అటేన్షన్ కోసం అహర్నిషలు ప్రయత్నిస్తూనే ఉంటాం కదా .
తెలిసో తెలియకో.
అయిన వాళ్ళ దృష్టిలో పడడానికి మన తిప్పలు చెప్ప అలవి కాదు.
మనమంతా పసితన్నాన్ని పచ్చబరుచుకొనేది అచ్చం ఆ విషయం లోనే నేమో.
అనకూడదు కానీ ,
మనమందరం ఏకీభవించాల్సిన విషయం ఒకటి ఉన్నది.
ఎవరికి వారం అంతోఇంతో అటెన్షన్ కోరుకొంటాం.
పసి పాపల్లా !
మడిసన్నాక కుసింత అటెన్షన్ కోరుకోవడం తప్పు కాదండీ బాబు...
అర్ధం చేసుకోవాలి తమరు ..!
అయ్యల్లారా... అమ్మల్లారా....
గౌరవనీయులైన మడతపేజీ పాఠకుల్లారా....
ఇంతకీ నే చెప్పొచ్చేదేమంటే...
యువర్ అటెన్షన్ ప్లీజ్..!
ఇది వందో టపా !!!!
ధన్యవాదాలు.
*
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
హ..హ..హ. బావుందండి. అభినందనలు
ReplyDelete