Jul 15, 2009

సొంపు సొబగు


మొదట,

ఇవ్వాళ ఈ వేదిక మీద నన్ను నిలబెట్టిన

పెద్దలకు ధన్యవాదాలు.

ఇక్కడి దాకా నన్ను నడిపించుకు వచ్చిన

పిల్లలందరికి జేజేలు .

పిల్లల తరుఫున , వారి ప్రతినిధిలా, వారి అక్క లా.. నేను మీ ముందు నిలబడ్డాను.

పిల్లల కోసం తమ ఆలో చనను, సృజనను ,తమ జీవితాలనే అంకితం చేసిన

పెద్దలు నిలబడిన చోటు ఇది.

మీరు నన్నుఇక్కడ నిలబెట్టడంలో, నాకు ఒక సందేశం ఒక గట్టి సూచన అందాయి.

ఆ పెద్దల స్పూర్తి తో ముందుకు సాగమని.

"బడి కి పిల్లలు రాలేరా? అయితే ,బడే పిల్లల దగ్గరికి వస్తుంది" అన్న ఆలోచన ఎంత గొప్పది .

అంత ఆలోచన చెసిన పెద్దలు Dr. మంగా దేవి గారు

ఇంత ఆప్యాయంగా మా చిన్న ప్రయత్నాలను ప్రోత్సహించడం బోలెడంత నమ్మకాన్ని ఇచ్చింది.

" మా ఆలోచనా సరి అయిన తోవలోనే నడుస్తున్నది కదా "అని సంతోషం కూడా కలిగింది.

అందుకు Dr.మంగాదేవి గారికి, బాలకుటీరీయులకూ నా ధన్యవాదాలు.

నిన్న ఇక్కడి పత్రికలలో వార్త చదివి ,ఇక్కడి నుంచి ఒక పరిశోధకులు నన్ను పలకరించారు.

"పిల్లల కొసం మీరు ఎన్ని పద్యాలు రాశారు పాటలు రాశారు "అంటూ.

నేనేమీ రాయ లేదు. అదే వారికి చెప్పాను.

"పిల్లలతోను సాహిత్యం తోనూ కొంత సాన్నిహిత్యం ఉన్నది .కానీ ,బాలసాహిత్యానికి నేను కేవలం ఒక పాఠకురాలిని."

వారు నిరాశ పడ్డారు. ఆ నిశ్శబ్దం గమనించి అన్నాను.

" కానీ, పిల్లలతో కొన్ని పుస్తకాలు తీసుకు వచ్చాము"

" ఓ ...అంతేనా ? పిల్లలతో రాయించారా? "

వారు బోలెడు నిరాశ పడ్డారు.

" పిల్లలే రాశారు "

వారు మరింత నిరాశ పడ్డారు.

1

బాల సాహిత్యం తో మా మొదటి పరిచయం , బహుశా మా ఈడు వారందరి వలే ,పుస్తకాల ద్వారా రేడియో "అక్కయ్య అన్నయ్యల" ద్వారా.

మా ఊరి గురించి కూడా ఒక మాట చెప్పాలి.

ఎనభై దశకం నడుమ వరకు విద్యుత్తు లేదు.సమాచార సంబంధాలు లేవు.ప్రయాణ సౌకర్యాలు లేవు.మేడలు లేవు.మిద్దెలు లేవు. ఇన్నెందుకు, అసలు బడే లేదు.

కాలువ,చెరువు,గడ్డివాములు తప్పించి పిల్లలం ఆడుకోవడానికి తోటలు తోపులూ ఏమీ లేవు.మాదో పెద్ద ఉమ్మడి కుటుంబం. మేం బోలెడు మంది పిల్లలము .మాకున్నదల్లా ఒకబ్యాటెరీ రేడియో, కొన్ని పుస్తకాలు. అంతే.

బడి కోసం పాలమూరు వచ్చినా , ,మళ్ళీ, సెలవలకు పల్లెకు పరిగెత్తే వారం.

వేసవి కాలం సెలవు ల్లో ఆ కాలువ ఆగి పొయేది. చెరువులు ఖాళీ అయ్యేవి.పురులు గడ్డివాములు పలచ బడేవి.

చెట్టూ చేమా మోడు వారేవి. నల్లరేగడి నెర్రెలు వారేది. వడ గాడ్పులు.సుడిగాలులు. ఇళ్ళువాకిళ్ళ నిండా పత్తి బోరాలు.

పిల్లలం ఎప్పుడూ సంతోషంగా ఉండే వారం.

అమ్మ పాడి నేర్పించిన పుష్ప విలాపం ,పుత్తడి బొమ్మ పూర్ణమ్మ లు.. నాన్న చదివించిన నండూరి రామ మోహన రావు గారి " విశ్వ రూపం ", మహీధర నళిని మోహన రావు గారి "నరవతారం " క్యాలెండెర్ కథలు", చదివి వినిపించిన" వేమన సుమతీ శతకాలు ...మందార మకరందాలు " పెదనాన్న కథలు కబుర్లూ ,

ఇవీ మా చిన్ననాటి తోడూనీడ. ఆటా పాట.

మాలో కాస్త బద్దకస్తులు ఉన్నారు. కథ చదివే ఓపికైనా లేదు వాళ్ళకి.

ఎవరో ఒకరం చదివి ..మసి పూసి ఆ కథను కాస్తా ఏ మారేడు కాయనో చేసేసి.. వినే వాళ్లకి చెప్పే వాళ్ళం.

ఈ పరిచయం ఎందుకో విజ్ఞులకు అర్ధమై ఉంటుంది.

పిల్లలకు కథలకు ఉన్న అవినాభావ సంబంధమది.

మా లాగా పల్లెవాటున పెరిగిన పిల్లలకు కథలే సకల ప్రపంచం.

ఆ నాటీకి ఈ నాటికీ.

2

ఇక ,మా తరువాతి తరం వారికి , Dr.వాసి రెడ్డి సీతా దేవి గారు బాలభవన్

డైరెక్టర్ గా ఉన్నప్పుడు, శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్ ,ఏడిద కామేశ్వర రావు గారి వంటి పెద్దల కృషి వల్ల ,ఆడియో క్యాసెట్లు వచ్చేసాయి.

ఇప్పుడు, ఆడియో విజువల్స్ వచ్చేశాయి.రేడియో వెనకకు తగ్గి టీవీ లు ..మళ్ళీ

ఎఫ్ ఎం రేడియో లు..ఒక వృత్తం పూర్తయ్యింది.

ఒక సారి,తెలుగు లోని బాల సాహిత్యాన్ని కొంత దగ్గరగా చూసే ప్రయత్నం చేద్దాం.

చాలా మట్టుకు తల పండిన పెద్ద వాళ్ళు పిల్లలకోసం రాసినవే. సహజం గానే,

హితబోధలు,ఉపదేశాలూ,చారిత్రికాలు,పౌరాణిక,జానపద ప్రధానాలు.

అవే కాక , మేము విరివిగా చదివిన రష్యన్, ఇంగ్లీష్ ,అరేబియన్ అనువాదాలు కూడా ఆ కోవలోనివే.

టాం సాయర్ ,అలెక్సీ,చుక్ ,గెక్..అందరిని మేము తెలుగులోనే పరిచయం చేసుకొన్నాం. ఏ మాటకు ఆ మాట చెప్పాలి.

పిల్లల ఊహకు తోడుగా ,ఈ అనువాద కథలకు , ముఖ్యంగా రష్యన్ కథలకు , చక్కటి రంగుల బొమ్మలు ఉండేవి.అయినప్పటికి మా వంటి పల్లె పిల్లలకు మంచు కురవడం లోని అందం ఎలా తెలుస్తుంది ? గౌన్లు వేసుకొనే అమ్మలు, విమానాలు ఎగర వేయ గలిగే అమ్మాయిలు ... ఆనాటి మా ఊహకు ఎలా అందుతారు ?

అలా వీరందరు మా ఊహలకు గట్టి పదును పెట్టారు.అలాగే, పిల్లల ప్రశ్నలకు సమధానాలు చెప్పే నాన్నలు కూడా..!

అయితే, రాజులు మంత్రులు ,రెక్కల గుర్రాలు, ఎగిరే తివాచీలు ,కత్తియుధ్ధాలు,మంత్రాలు తంత్రాలు ..మేము కళ్ళతో చూడక పోయినా, ఊహకు తట్టేవి. భారతీయ నేపధ్యమో , జ్ఞానమోమూలమో .. మరోటో.

.వాటిలోని చెణుకులు చమత్కారాలు టక్కున .తట్టేవి. హాస్యాలు ఫక్కుమనిపించేవి. ఇతిహాసాలు ఇట్టే అర్ధం అయ్యేవి.పువ్వులు ,పక్షులు,చెట్లుచేమలు తెలిసేవి. అందు చేతనే కాబోలు , చందమామ ,బుజ్జాయి, బాల, బాలజ్యొతి..ఇలాంటి అనేక పిల్లల పుస్తకాలు మాలో ఒక భాగం అయి పోయాయి.

అయితే , తెలుగు బాలసాహిత్యం లో పిల్లలు చేసిన రచనలు చాలా తక్కువ.పిల్లలుగా ఊహించుకొని రాయడానికి ... పిల్లలే ఊహించి రాయడానికి చాలా తేడా ఉన్నది.

పిల్లలలో ఆసక్తి , కుతూహలం, పరిశీలనాశక్తి... అపారం.

పెద్దల కలాలు తెలియకుండానే కొన్ని పరిమితులకు లోనవుతాయి.

ఎల్లలు ఎరగని స్వేచ్చ పిల్లల సహజ లక్షణం.

3

ఈనాటి పిల్లలు ఒక మీట నొక్కితే చాలు సకల భువన భాండములు ' వారి ముందు ప్రత్యక్షం అవుతాయి.

వారికి అందుతోన్న సమాచారం అపారం.సాంకేతిక జ్ఞానం పుష్కలం.

ఎంత మారు మూల గ్రామమైనా తాగడానికి నీరుండదేమో కాని చూడడానికి టివి లేకుండా ఉండందు.

ఈ సమాచార యుగంలోని పిల్లలకు కూడా తెలుగు లో అందుబాటులో ఉన్న బాల సాహిత్యం ... మా చిన్న నాటిదే.

కాలం మారింది. భాష ,భావజాలం,వస్తువు,ఇతివృత్తము... అన్నీ మారాయి. కథలు కథనాలు మారలేదు.

ఈ నాటి పిల్లల అవసరాలకు అనుగుణమైన సాహిత్యాన్ని వారే సృజించుకొగలిగితే..? అన్న చిన్న ఆలోచన గట్టి నమ్మకం గా బలపడింది.

పిల్లల స్పందన చూస్తూ చూస్తూ.

ఈ నాటి పిల్లలు చాలా తెలివి గలవారు. వారికి కావలిసింది వారు నిర్మించు కోగలరు.

పిల్లలు కలలు కన గలరు. వారి గురించి.మనగురించి.

ఆ కలలను వ్యక్తపరుచుకొనే సృజనాత్మక మాధ్యమం వారి స్వంతం. వారి స్వతంత్రం. వారి ప్రత్యేకం...అదే ఈ బాలల సాహిత్యం.

సృజనాత్మక రచన నేర్పితే నేర్చుకొనే కళ కాదు. కాని,పిల్లలలో సహజంగా ఉన్న సృజనశీలతను ప్రకటింపబడడానికి ఒక అనుకూల వాతావరణాన్ని సంధర్భాన్ని కలిగించడమే WORK SHOP పేరిట మేము చేసినది. తొలి నాళ్ళలో ఈ వ్యవహారాన్ని అక్కడి పిల్లలు సరదాగా అనే వారు ,"రిషీవ్యాలీ లో తెలుగు విప్లవం" అని . చూస్తుండగానే అది "రిషీవ్యాలీ లో హిందీ విప్లవాని"కీ ప్రేరణ అయ్యింది.

పల్లె గడప దాటని పిల్లల నుంచి.. భూగోళం ఆవలి అంచు నుంచి అక్కడికి వచ్చిన ...విభిన్న మాతృభాషల , నేపధ్యాల ,సంస్కృతుల ,పిల్లలు అక్కడ ఉన్నారు.

ఈ భిన్నత్వమే అక్కడి ప్రజాస్వామిక స్వభావానికి పునాది.ఒకరి నుంచి ఒకరు నేర్చుకొనే ఒక సహజీవన సంస్కృతి ఒక సృజనాత్మక సభ్యత అక్కడ ఉన్నది.

స్వీయ పరిశీలనకు అపారమైన అవకాశం ఉన్నది. భావ వ్యక్తీకరణకు స్వేచ్చ ఉన్నది

అక్షరం కన్నా ముందు అక్కడ అరణ్యం ఉంది. అక్షరం అబ్బిన తరువాత ఎడారి మిగిలింది. అంటారు .... eco linguist ,షాథొబ్రీఒ (chateaubriand/shaathobreeon)

రాళ్ళు రప్పలతో నిండిన కొండవాలు కరువు ప్రాంతం వికసించిన వనాలతో విద్యారణ్యమై పోయింది.

గోడలు లేని బడులు . పకృతి ఒడిలో తరగతులు. పుస్తకాలకు మించిన చదువులు.

అక్కడి సృజనాత్మక సంస్కృతి. స్వేఛ్ఛాభరిత వాతావరణం. సామాజిక స్పృహ. మేధోచింతన. మానస చేతన. బుద్ద భావన,పర్యావరణ ప్రధాన బోధన .....

అదీ డెభ్భై యేళ్ళకు పైగా , జిడ్డు కృష్ణ మూర్తి గారి విద్యా తాత్వికతకు సజీవరూపమైన రిషివ్యాలీ .

*

" చంప నొంప వెయ్యేల బువ్వ చాలదా ?" అన్నాడు మన పెద్దన్న వేమన .

"ఆకలి ఉంటుంది అందరికి.. అన్నం ఉండదు ఎందుకని ?" అమాయకంగా పసి గొంతుతో ప్రశ్నిస్తారు బాలబంధు బి. వి . నరసింహా రావు గారు.

"కొండ నే అన్నంగా మార్చేస్తా... ప్రజలందరికి పంచేస్తా..!" అంటున్నాడుతొమ్మిదేళ్ళ వాసుదేవ.

*

ఎక్కడో పత్రికలో ఒక చిన్న వార్తలా వచ్చిన సునామి విషాద అనుభవంలో ని "మేఘన" అనే అమ్మాయిలా ఊహించుకొంటూ సింధు వ్రాసిన "పీడ కల."

సరిగ్గా ఏడాది తరువాత , అసలు మేఘన అచ్చం అవే మాటలలో ..ఇచ్చిన ఇంటర్వ్యూ పత్రికల పతాక శీర్షికల్లొ వచ్చింది.."అదొక పీడ కల " అంటూ.

4

"కూర్చున్నాను రథచక్రం మీద

ప్రక్క స్కూలులో అందరూ పేద

లక్షలతో కట్టుతారు ఆ రథం

అది అంతా ఎవరి కోసం ?" అంటూ ప్రశ్నించిన పిల్లవాడు

"ఈ భరత మేధిని భాగ్యవిహీనుల క్షుత్తులారునే" అన్న జాషువా గారి మాట విన్నవాడు కాడు.

మా పల్లె ప్రయాణంలో.. ఒక బడి ఆవరణలో... నిర్మాణం లో ఉన్న ఒక రథాన్ని చూసాం.

ఆ రథం పై చేయబోతున్న వ్యయాన్ని తెలుసుకొని.. ఆ రథచక్రం పైనే కూర్చుని ఆ పదేళ్ళ అబ్బాయి అప్పటికప్పుడు రాసిన వాక్యాలు అవి. "ఆకాశ"మంతటి ఆలోచనలు అవి.

*

"మంచి బట్టలు

ఖరీదైన కంప్యూటర్లు

కొత్త కార్లు

ఇదేనా స్వర్గం ?

పెద్దచెట్లు

చల్లని గాలి

చిన్న తూనీగలు

పసుపు పచ్చ పూలు

మధ్యలో నువ్వు

ఇదా స్వర్గం ?"

తొమ్మిదో తరగతి "కృష్ణ" మనోభావమిది.

*

బహుశా .. కాలక్రమం లో , పిల్లలుప్రకటించిన ఈనాటి భావాలు మారి పోవచ్చు. మరిచి పోవచ్చు. మరింత మెరుగు పడొచ్చు.

ఏనాటికైనా ఈ పుస్తకం చూసినప్పుడు .."ఒక నాడు నేను ఇలా ఆలోచించాను " ఆన్న ఒక చిన్న జ్ఞాపకం.. ఒక చిరునవ్వు ..ఒక చిన్ననాటి నిష్కపట మనసు..

మళ్ళీ కొత్త దోవను చూపుతుందేమో ... మరొక మంచి ఆలోచనకు నాంది అవుతుందేమో.

అమ్మ ,ఆకలి ,ఆటలు...పిల్లలు ఎవరైనా ఇవే వారి మొదటి విషయాలు ..మిగిలినవన్నీ ఆ తరువాతే.

బాల సాహిత్యం లో ఈ రచనలప్రాధాన్యత ఏమిటో, ప్రామాణికత ఏమిటో కాలమే నిర్ణయిస్తుంది.

ఇప్పటికి ,ఈ రచనలు సమకాలీన సమాజంలోని పిల్లల ఆలోచనలను అనుభూతులను వారితో ఒకరికొకరు పంచుకొవడానికి ..... .పెద్దలుగా మన పాత్రలు.. ప్రమేయాలు.. పరిమితులను ..తెలుసుకొవడానికి సాయపడగలవనే నా గట్టి నమ్మకం.

పిల్లల కోసం అహర్నిషలు ఆలోచిస్తూ ఉంటూనే ... అనుకోకుండా ఒక అమాయకత్వంలోకి పడి పోతుంటాం. మనకు తెలియ కుండానే.

"ఇంతగా ఆలోచిస్తున్నాం కదా... .మనకు పిల్లల గురించి తెలియనిది ఏముంది ? " అని భావనలో పడిపోతాం.

పెద్దలు క్షమించాలి.

పిల్లల కోసం చేసే ఆలోచనలోనైనా

పిల్లల భాగస్వామ్యం లేనిదే అది సమగ్రం కాదు !

ఎందుకంటే పిల్లల ఆలోచనలేమిటో, అనుభూతులేమిటో,అవసరాలేమిటో ..పిల్లలే చెప్పగలరు.

అది వారి అనుభవం. మనకు ఊహ.

అందుకే , వారు చెప్పగలరు. మనం కేవలం ఊహించ గలం.

పిల్లల్ని ప్రేమించడం తో పాటు వారి అభిప్రాయాల్ని గౌరవించ గలగాలి.

అది ఇల్లైనా, బడైనా ,సమాజమైనా... ఎక్కడైనా సరే.

ఈనాటి విద్యా వ్యవస్థ ఒక తూనికలూ కొలతల దుకాణం లా తయరయ్యింది.

అందులోనూ, ప్రత్యమ్న్యాయ ఆలోచనలు చేసే వారు ఉన్నారు. ఆ ఆలోచనలను కూడా అరకొరగా వాటిని అందిపుచ్చు కొని ..వాటి తోనూ వ్యాపారం చేసే వారూ ఉన్నారు.

అందు కలరు ఇందు లేరు..అని అనలేని సామాజిక పరిస్థితి...!!!

తిలక్ అన్నంత అందంగా ఆనందంగా ...'.' కనుల చివర కాంతి సంగీత గీతాన్ని రచించడం ..." నేర్పితే అబ్బుతుందా?

అది సహజంగా సంతోషంగా మనసు లోలోతుల్లోంచి పెల్లుబికి రావాలి కాని..!

"కలలకు విశ్వకవుల కన్నులుండు .." అన్న నార్ల గారి మాటల్లొని మర్మాన్ని గుర్తించి..పిల్లల కలలలు కలాలలో నింపి .. ఆ "పట్టు పువ్వులు" పుస్థకంలో ముడిచి మీ ముందుంచాం.

తెలుగు మనుగడే ప్రశ్నార్ధకమైనదని అనుకుంటూండగా , అటు భాషపై మమకారాన్ని కలిగించడానికీ ... ఇటు భావవ్యక్తీకరణ మాధ్యమాన్ని పిల్లలకు పరిచయం చేయడం కోసమే ఈ ప్రయత్నాలు .

ప్రకృతిలో ఒక చిన్న భాగమైన మన మనుగడ ఆ ప్రకృతిని పదిల పరుచుకోవడం లోనే ఉన్నది.

చిన్న నాట ప్రకృతి తో పెంచుకొనే మమకరమే పర్యవరణ స్పృహకు ప్రకృతి జ్ఞానానికి నాంది కాగలదు.అక్షరం అరణ్యానికి రక్షణ కాగలదు.

*

ఈ ప్రయత్నాలలో జరిగిన ఒక ముఖ్యమైన ప్రయత్నం.

.."పిల్లలకు నచ్చని పాఠాలనైనా పిల్లలే మార్చుకొవచ్చును" అన్న వాస్తవాన్ని గ్రహించగలగడం.

"చెప్పిన పాఠం వినండి" ..అన్నదే మనకు తెలుసు. అయితే,అలా వింటూ వింటూ ..అటు భాషను,ఇటు భావాన్ని,తిరిగి తిరిగి.. తెలుగు తరగతినీ, ఆ పాఠం చెప్పే ఉపాధ్యాయులను ... తప్పించుకు తిరగకుండా ..ఆ పాఠాలనే తిరగ రాసే ఒక ప్రయత్నం చేయగలిగాం.

రిషీ వ్యాలీ ICSE 2005 తెలుగు విద్యార్థుల చొరవ, ధైర్యం, ప్రోత్సాహం ...ఈ రొజు "ICSE" తెలుగు పాఠాల

నవీకరణకు నాంది అయ్యింది.

అడిగీ అడగగానే విశ్లేషాత్మకం గా వారు వ్రాసి ఇచ్చిన అభిప్రాయాలను ,అప్పటి Senior school incharge, Dr.కుమార స్వామి గారి సమక్షం లో,అప్పటి ప్రిన్సిపాల్ Dr.శైలేష్ షెరాలీ గారి ముందు ఉంచడం..

బడి తరుపున ICSE Board ముందుకు ఈ విషయాన్ని తీసుకు వెళ్ళడం జరిగింది.

ఈ దిశగా ఇది మా మొదటి ప్రయత్నం.

మరొక ఏడాది తరువాత ఎలాంటి మార్పు లేక పోవడం తో, Dr.మంజు లత గారి ఆధ్వర్యం లో, Prof చేకూరి రామారావు గారి అధ్యక్షతన తెలుగు విశ్వవిద్యాలయం ఒక సెమినార్ "ICSE తెలుగు పుస్తకాల నవీకరణ "అన్న విషయం పై ..పలువురు ఆచార్యులు, భాషావేత్తలు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది.

ఈ సెమినార్ నందలి ముఖ్యాంశాలతో పాటుగా , తమ ప్రతిపాదనలతో తెలుగు విశ్వవిద్యాలయం తరుపున Dr. మంజులత గారు ICSE Board కు పాఠ్యపుస్తకాల నవీకరణ ను గట్టిగా ప్రతిపదించారు.

ఇటు "Dr. కుమర స్వామి గారు రిషివ్యాలి నుంచి తమ ప్రయత్నాలను కొనసాగిస్తుండగా అటూ Dr. పరిమి గారు తమ పద్దతిలో "board" ను సంప్రదించారు.

తెలుగు text books నవీకరణకు board నిర్ణయం తీసుకొవడం ఒక సంతోషం.

*

రిషీవ్యాలీలో అమూల్యమైనది ఏదైనా ఉందీ అంటే అది పిల్లల సమయం.

వారి సమయాన్ని నా కొసం కేటాయించడానికి తెలుగు ఉపాధ్యాయులు ..ఇంటింటికీ తిరిగి ,ఇతర ఉపాధ్యాయుల సమ్యాన్ని అరువు తెచ్చుకొని, house parents "అనుమతులు పొంది , పల్లె ప్రయాణాలను ఏర్పాట్లు చేసి ...ఆదివారం సెలవు రొజులు ..అన్నీ వదిలేసి.. నా ప్రయత్నాల లో పాలు పంచుకొన్నారు రంగచార్యులు గారు..ఉషా బాలాక్క..శారదక్క..రాజా మాష్టారు ..రాధా అక్క.

ఇక పల్లె బడుల పిల్లల ను ఒక చోటికి చేర్చడం..వారి బస, వసతి,భొజనం ఏర్పాట్లు చేయడం ..పద్మవల్లి గారి నిర్వహణా చాతుర్యం.

మైళ్ళకు మైళ్ళు నదిచి వచ్చిన పిల్లలు, కొండలూ కోనలు దాటుకు వచ్చిన పిల్లలు..

తమ సైకిళ్ళపై వాహనాలపై పిల్లలను తీసుకు వచ్చిన ఉపాధ్యాయులూ..

ఈ సాధక బాధకాల నడుమ కసరత్తు చేస్తూ..నన్ను మాత్రం తాకనీయ కుండా ..ఇంత మంది నిమగ్నులై.. నాకు ఇచ్చిన స్వేఛ్ఛ ..నాపై ప్రకటించిన నమ్మకం..ఇవ్వాళ మీ ముందున్న ఆ బాలల సాహిత్యం.

ఇదంతా చూస్తున్న నాకు బాగా దిగులు వేసింది.

"ఇంత మంది నాకు ఇచ్చిన సమయాన్ని నాపై ఉంచినా నమ్మకాన్ని నేను వృధా చేస్తున్నానా .. అసలు ఈ ప్రయత్నాల వలన ఎదైనా ఫలితం ఉంటుందా "అని.

అప్పుడు, రంగాచార్యులు గారు అన్నారు

." మీరు విత్తనం నాటారు.పూవులు ఎలా పూస్తాయి..కాయలు ఎలా కాస్తాయి ..పళ్ళు ఎలా ఉంటాయి.. ఇవన్నీ ఆలొచించకండి.విత్తనం నాటడం వరకే మీ పని."

మొదటి సారి పల్లె పిల్లల నుంచి వచ్చిన అసంఖ్యాక స్పందనను చూసి..నేను ఒక నిశ్శబ్దం లొకి కూరుకు పోయాను.

అంతటి సృజనాత్మక ప్రతిభ , చక్కటి భాష, పల్లెపదపు సొంపు సొబగు, చిగురించక మునుపే వాడి పొతుందే ..అన్న బాధ కలిగింది.

"ఇది మన సామాజిక వాస్తవికత. మనం చేయ గలిగిన మేరకు చెసే ప్రయత్నం లో ఉన్నం.ఇది ఏ ఒక్కరి వల్లనో అయ్యె పని కాదు. మనం ఒక చిన్న ప్రయత్నాన్ని చెస్తున్నాము.

.ఒక చిన్న ఉదాహరణలా. ఇది మరొకరికి ప్రేరణ అయితే మనకు సంతోషం." అన్నారు రమాక్క.

హాయిగా సంతోషం గా తమ భావాలను ప్రకటించుకోవడానికి ఒక సృజనాత్మక మాధ్యమాన్ని పిల్లలకు పరిచయం చేయగలిగాము.

ఇది ప్రారంభమూ కాదు. ముగింపూ కాదు. కొనసాగింపు మాత్రమే.

తమ సృజనాత్మక ప్రయత్నాలలో నాకు కొంత భాగం ఇచ్చిన విద్యావేత్తలు పెద్దలు శ్రీ శివరాం గారికి, శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి, శ్రీ మతి ఇంద్రాణి గారికి నా ధన్యవాదాలు. ,

పాఠ్యపుస్తకాల విశ్లేషణ ఎంత శ్రద్దగా చేసారో , చిట్టి రచనలనూ అంత సంబరంగా చదివి స్పందించిన పెద్దలు శ్రీ రావెల సాంబశివరావు గారికి ధన్యవాదాలు.

ఈ నా చిన్న ప్రయత్నాలలో ..నా వెనువెంట ఉన్న నా ప్రాణ స్నేహితులు , ప్రధమ విమర్శకులు ... .మా పిల్లలు ..భవ్య ఆకాశ్ లకు నా అభిమానాలు.

ఈ వర్క్ షాప్ ల నిర్వహణ బాధ్యతలను ఒక పండగలాగా రూపొందించిన తెలుగు అధ్యాపకులకు..

పల్లెబడుల విషయంలో,ముఖ్యం గా .. పద్మవల్లి గారి దీక్ష దక్షత ..నేను మరవలేను.

అంత మంది పిల్లలు పెద్దలు నిశ్శబ్దం గా నేపధ్యంలో నిలబడి ఉండగా, నేను మీ ముందుకు వచ్చి ఇలా వెలుగులో నిలబడ్డాను.

వారు నాకు ఇచ్చిన స్వేఛ్ఛ... నాపై ప్రకటించిన నమ్మకం... ఈ పురస్కారం.

సుమారు రెండు వందల మంది బాల రచయితల తరుపున ..వారి అక్కలాగా ..సంతోషం గా సగౌరవంగా ఈ అవార్డును స్వీకరిస్తున్నాను.

ఈ ప్రతిష్టాత్మక " Dr. మంగా దేవి బాల సాహిత్య పురస్కారాన్ని" రిషి వ్యాలీ విద్యా సంస్థల పిల్లలకే అంకితం చేస్తున్నాను.

అంగీకరించినందుకు ..Dr. రాధికా హెజ్బర్గర్ గారికి, Dr. కుమార స్వామి గారికి Dr.YAP రావు గారికి, శ్రీమతి రమారావు గారికి ... నా ధన్యవాదాలు.

బాల రచయితలకు మరొక్క మారు శుభాకాంక్షలు. బాల కుటీరీయులకు నా నమస్కారాలు.

***

చంద్ర లత

10.12.2007

All rights reserved @writer. Title,labels,postings and related copyright reserved.

6 comments:

  1. Dear Chandra,

    blog lOkaaniki saadara swagatamu.

    Kalpana Rentala

    ReplyDelete
  2. Hi..kalpanaa.. ilaa kalusu kOvaDam santOshamgaa unnadi...
    snehamtO...chandra latha

    ReplyDelete
  3. చంద్రలతగారు..

    స్వాగతం..సుస్వాగతం...

    ReplyDelete
  4. జ్యోతి గారికి,
    నమస్కారం.
    మీ తెర మీదికి రావడం నాకూ సంతోషంగానే ఉన్నది.
    ఇ-జ్ఞానం ఇప్పుడిప్పుడే అబ్బుతున్నది.
    బాలారిష్టాలన్నీ దాటిరావాలి కదా..:-)
    మీ అభిప్రాయల కోసం ..మీ సూచనల కోసం ..
    ఎదురు చూస్తూ ఉంటాను.
    ధన్యవాదాలతో..
    మీ
    చంద్రలత

    ReplyDelete
  5. చంద్రగారు,

    సంతోషం, మీకు ఎటువంటి eసహాయం కావాలన్నా నాకు మెయిల్ చేయొచ్చు. తప్పకుండా చెప్తాను..

    jyothivalaboju@gmail.com

    ReplyDelete
  6. అభినందనలు ఆలస్యంగా ఐనా..

    ReplyDelete