Oct 22, 2013

ఫోటో పండగన్న మాట!

4th class 1977-78  Bharatheeya Vidya Nikethan, Mahaboob Nagar
L to R : Vinita, Maruthi,Nirmala,SudhaAruna, Me, Geetha, Rathi
Standing Exactly behind me : Raghu , Right to him, Ravikanth 
then, Ramesh,Srinivas and the Vijayabhaskar (The Last Boy on the LEFT)
Our Social Teacher and Class Teacher  Sri RamaKrishna Reddy garu
మా బళ్ళో ఫోటో అంటే మా అందరికీ పండగన్న మాట!
ఎవరి టీచర్లు వారికి చకచకా "చక్కటి ఫోటో ఎలా తీయించుకొన వలెను ?" అని పాఠాలు చెప్పేవారన్న మాట.
ఎక్కువ గా ఎలా నవ్వ కూడదు .. తక్కువగా ఎలా నవ్వ కూడదు.. ఎలా నిటారుగా నిలబడాలి ..ఎలా వంగి పోకూడదు... గడ్డం వంచాలా పైకెత్తాలా ... కళ్ళార్పాలా ఆర్పకూడదా ... ఫోటో తీసినంతసేపూ నోటికి తాళం ఎలా వేయాలి ...ఇలా ఎన్నెన్నో  బోధనలన్న మాట!
యూనీఫాం పెళ పెళ లాడుతూ  ఉండాలనీ .. కాలి జోళ్ళు తళ తళా మెరవాలని మా పిల్లలందరికీ ఉత్తర్వులు.
పంతులు గారు ఇచ్చిన ఆ  ఫోటో నియమావళిని తీసుకెళ్లి అమ్మ కివ్వడం ఆలస్యం ..
ఇక ఇంట్లో ఆరంభం.
నాకున్న బడిబట్టల్లో మంచి జతను తీసి , తళతళలాడేలా ఉతికేసి..దానికి సబ్బు అరిగేదాకా  నురగలు తెప్పించింది మేమే ననుకోండి.. ఆ పై రాణీపాల్ లో ... అప్పుడే వార్చిన  వేడి వేడి గంజిలో ముంచెత్తి...ఆపై మధ్యాహ్నం ఎండలో ఆరేసి .. కాకో పిచ్చుకో పాడ చేయ కుండా .. కాపలా కూర్చుని.. ఆరీ ఆర గానే .. మడతేసుకొని.. వీధి చివర  ఇస్త్రీ పెట్టె దగ్గరికి పరుగో పరుగు.
అక్కడేమో అప్పటికే బారులు తీరిన మిత్ర మండలి.
" ఇచ్చేసి పోమ్మా  చేసేసి పెడతాం" అంటే ఊరుకొనే రకాలమా .. మేమూ.. పనేదో కానిచ్చే దాకా .. బొగ్గుల కుంపటి పక్కనే మిడి గుడ్లతో ఎదురుచూపులు. చెవిలో జొరీగల్లా మేం పెట్టే పోరు భరించ లేక ..తటాలున నీళ్ళు చిలకరించేసి గబ గబా పెట్టిని రుద్దేసి .. మా బట్టల జత మా చేతిలో పెట్టేసి ..  డబ్బులడిగితే.. "నాన్న గారి ఖాతాలో రాసుకోండి.." అని ధీమా గా   చెప్పేసి తుర్రుమనడమే  !
" సరే పిల్లలెమ్మని ఊరుకొంటున్నానంటే"
"మా బడిలో ఫోటో తీస్తున్నారు తెలుసా! మరి నా డ్రెస్స్ బాగా  లేక పోతే  మీ వెంకటి  ఏమిస్త్రీ చేశాడని అందరూ నవ్వరూ..? "
అవ్ మల్ల ! అంతే , మన పని అయిపోవడం ఏమిటి.. చక్కగా చాచిన రెండు చేతుల మీద .. వేడి వేడి దోస వడ్డించినట్లు ఇస్త్రీ చేసిన యూనిఫాం ను వడ్డించడమేమీ .. అన్నీ క్షణాల్లో జరిగి ఫొవాల్సిందేవీధిలో అలా తోమిన బట్టల్ని తీసుకెళుతుంటే మహా రాజసంగా ఉండేదిలే. దారిపొడువునా అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ ..
 “జెండాపండగ కాదు.. మా బళ్ళో ఫోటో తీస్తారు రేపు!” చెపుతూ ...
అడుగులో అడుగేస్తూ సాధ్యమైనంత నిదానంగా ... వాకిట్లో  అడుగు పెట్టామా .. అమ్మ  గొంతు  ఆమడ దూరానికే .
"నీకేం చెప్పాను , దండెం మీద బట్టలు తీసి మడతేసి పరుపు కింద పెట్ట మంటినా .. ఎటెళ్ళావ్ ..? "
అని అమ్మ కేకేస్తూ ఉంటే.. ముసి ముసి నవ్వులతో .. చక్కగా తోమిన బట్టల్ని చేతిలో పెట్టేయడమే!
ఇక, బూట్లనేమో వాక్ష్ పాలీషుతో తళతళ లాడించి .. మేజోళ్ళనీ బాగా ఉతుక్కుని ...బొటనవేలు దగ్గర చిరుగు లు గట్రా ఉంటే కుట్టించుకొని .. రిబ్బన్లని చక్కగా ఉతికి మడతేసుకి పరుపుకింద పెట్తుకొని..
 అన్నింటినీ రాత్రే తలగడ దగ్గర పెట్టుకొని .. ఒక చేయి వాటి మీద వేసి మరీ పడుకొనే వారం.
ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా. ప్పుడెప్పుడు బడికెళ్ళి ఫోటో తీయించుకోవడమా అని!
 "తొందరగా నిద్ర పోండి. లేకుంటే రేపు ఫోటో లో సరిగ్గా పడరు.! “
అమ్మ హెచ్చరిక .
మా భారతీయ విద్యానికేతన్ ఎదురుగా షాబుద్ధీన్ బంగ్లా. పావురాల నెలవు. ఆ ఇంటి ముంగిట కాంపౌండ్ చుట్టూ అశోక చెట్ల వరుస. పచ్చిక తివాచీ మధ్యలో  ఫౌంటైన్లు . అవి ఎప్పుడూ నీళ్ళు చిమ్మడం జ్ఞాపకం లేదనుకోండి.
ఇక, ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనాలు తినేది అశోక చెట్ల కిందేఅన్నాలు తినడం ఆలస్యం పావురాళ్ళ వద్దకు వెళ్లే వాళ్లం. చెట్ల వరుసల నడుమ చోరాట , కుంటాట ఆడుకొనేవారం. చెట్ల కింద కూర్చుని కథలు చెప్పుకొనే వారం.
  ఇంట్లోని మనుషులెవరూ మాకు కనబడే వారు కారు. మమ్మల్ని పలకరించే వారు కారు . అక్కడెవరూ లేనట్టూ అదంతా మారాజ్యం అన్నట్లూ పిల్లలం తిరుగాడే వారం. మమ్మల్ని దారిలో పెట్టడానికా అన్నట్లు బడి గంట గణ గణ మోగేది.
సరే, షాబుద్ధీన్ గారి ముంగిట అశోక చెట్ల ముందు... మా తరగతి అబ్బాయిలు బుద్ధిమంతులుకదా ..
చెప్పగానే చెట్ల కింద వరసగా కుర్చీలు వేసేసారుఇక ఒక్కో తరగతి లో హాజరయిన పిల్లల  ప్రకారం ఆ అమరిక ను మార్చుతూ పోయారు.
 మా తరగతిలో రోజు అపర్ణ రాలేదు. శశికిరణ్ ఇంకా మా బడిలో చేరలేదు.
విజిల్ వేయడం ఆలస్యం అందరం వరసగా కూర్చున్నాం. అబ్బాయిలు గబ గబా  బెంచీలు ఎక్కేసారు. వాళ్ళ కాళ్ళజోళ్ళతొ సహా
"ఇటు చూడండి అటు చూడండి. గడ్డంపైకెత్తండి . కళ్ళు దించండి." ఇక ,ఫోటోగ్రాఫరు గారి ఉత్తర్వులు.మాటి మాటికీ కెమెరా మీద వేసిన నల్లబట్టలో నుంచి ముఖం బయటకు పెడుతూ.
 చేతులు ఎలా పెట్టలో నుంచి ఎంత మోతాదులో నవ్వాలో వరకు ..ఆయన గారు ఆయన అసిస్టెంట్లు చెపుతూ ఉండగా .. కదలకమెదలక .. నవ్వులుచిందిస్తూ .. ఎండలో నానుతూ .. ఇదుగోండి ఇలా అందరం.
ఎండ వెలుగు సరిచూసుకొని మమ్మల్ని చక్కగా ఫోటో తీసేసరికి  మధ్యాహ్నం వేళయ్యింది.
మరో రెండు వారాలకు పసుపుపచ్చ అట్ట మీద అంటించి,   
ఇదుగోండి.. ఫోటో చేతిలో పెట్టారా ... ఇక ఏడుపొక్కటే తక్కువ.
అపర్ణ లేదని కాదు.  
ఫోటో తీసే రోజున మా అమ్మ  చిలక్కి చెప్పినట్లు ఏం చెప్పింది? నూనె రాసి బిగించి రెండు జళ్ళేస్తు న్నంత  సేపు చెప్పిందా లేదా .. రిబ్బన్లు ముడేసినప్పుడూ చెప్పింది.మరిచి పోతాననుకొని మొట్టికాయ వేసి మరీ గట్టిగా చెప్పింది. ఒక జడ ముందుకు మరోటి వెనక్కు వేసుకోమని.  నేనెలా మర్చిపోయాను..?
గుర్తొచ్చింది.
పూట బళ్ళో అడుగు పెట్టగానే మా పంతులమ్మ చివాట్లు.. “ తెల్ల జాకెట్టు వేసుకు రమ్మంటే , దాని మీద ఆ  గులాబి పువ్వేంటి ?”అని
పాపం ..మా అమ్మ!
 అప్పుడే మ్యాటీ బట్టముక్కను పాలియస్టర్ మీద టాకాలు వేసి పువ్వు కుట్టాక,  దారాలు లాగేయడం అనే కళను నేర్చు కొంటోంది. ఖాళీగా కనబడింది నా  బడి జాకెట్టేగా !  చక్కగా గులాబి పువ్వు కుట్టేసింది!
ఆకులతో సహా. ఎరుపూ పచ్చ దారాలతో.
మరి మీకు పువ్వు కనబడుతోందా?
ఏది ఏమైనా రోజు మా అమ్మ ఫోటో చూసి ఎన్ని మొట్టికాయలేసిందంటే , తరువాత ఫోటోలన్నిటిలో నా రెండు జళ్ళూ బుద్ధిగా ముందుకు వాలి ఉంటాయన్న మాట !
ఎన్నడూ రెండు కాళ్ళూ కుదురుగా ఒక చోట పెట్టిన పాపాన పోని మా తరగతి అల్లరి అబ్బాయిలు ముఖ్యంగా, రఘూ.. రవికాంత్ .. ఇంత బుద్ధిగా నిల్చున్నారంటే ,అందునా  ఫోటో తీసినంతసేపూ తిన్నగా నిలబడ్డారంటే ... నాకయితే ఇప్పటికీ నమ్మశక్యం కావట్లేదు!
నమ్మక తప్పదండోయ్!
ఇప్పటికి పాతికేళ్ళకు పైగా బెంచీ మీద అలా నిల్చునే ఉన్నారు !
ఏం అల్లరి చేసి ఉంటారు చెప్మా ?
***
 చిన్ననాటి మంచి మిత్రులు రఘు రవికాంత్ అపర్ణ శ్రీలత లను  తిరిగి కలుసుకొన్న సంతోష సమయాన ..    ఒక పచ్చటి జ్ఞాపకం. 
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

4 comments:

 1. మహబాబ్ నగర్ లో అప్పట్లోనే అంత మంచిగా యూనిఫామ్, షూస్ ఉండే స్కూల్ ఉందా! ఫోటోలోని అందరిలోనూ మీ ముఖం brightగా కనిపిస్తోంది.

  ReplyDelete
  Replies
  1. అప్పుడు కాదండీ... ఇది రాస్తున్నప్పుడు నా ముఖం చూడాల్సింది మీరు!
   దాదాపు 30 ఏళ్ళ తరువాత మా చిన్ననాటి Best Friends మి కలుసుకొన్నాం. Thanks to FB
   వారి జ్ఞాపకంగా రాసాను ఇది.
   ఆ బడి శ్రీమతి దుర్గాభక్తవత్సలం గారు స్థాపించినది.వారు తరువాత శ్త్రీ సంక్షేమ శాఖ కు మంథ్రి గా వ్యవహరించారు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్న రోజుల్లో.
   పాలమూరులో అన్ని బడుల్లో దాదాపుగా సంస్కృతి ఒకటే. చిన్న వూరు కాబట్టి. మా రఘు రవి మధ్యలో వేరే బడికి వెల్లి పోయినా , అందరం ట్యూషన్లలో కలుసుకొనే వారం. కలిసే ఆడుకొనే వాళ్ళం.
   కపటం లేని పసితనపు రోజులవి.
   మా లాగే మా వూరు.
   నేను రాసిన కొన్ని కథలకు, నా మొదటి నవల "వర్ధని"కి ఈ బడే స్పూర్తి.నా బాల్యస్నేహితులు అందించిన స్నేహమే , నాలో జీవితం పట్ల గొప్ప ప్రేమను ,మానవ సంబంధాల పట్ల సద్భావనను నింపాయనుకొంటాను.జీవన వైవిధ్యాన్ని పరిచయం చేసింది వారే.అక్కడే. ఆ ముచ్చట్లన్నీ ముందు ముందు:-)
   ధన్యవాదాలు.

   Delete
 2. Chandra Latha Garu
  Nice memories!
  These are the most valuable treasures.
  I had similar experience in summer when I went to my home. My kids and my brother kids were asking each and every kid name in the group picture
  It was quite an experience looking at these treasures and sharing with kids.
  I do read your blog but never commented as I am not so good in typing telugu.
  I like all your works and specially I envy you on you being hanging with kids all day night. Even I love being with kids and be one among them with such plain hearts.

  Surabhi

  ReplyDelete
  Replies
  1. Surabhi garu,
   Many thanks! I understand language is just a medium ! Most of the times ,we communicate beyond the words.You can always write whenever you feel like.
   You are most welcome to be part our small world of children anytime!

   Delete