Dec 22, 2013

ఒకానొక నిశ్శబ్ద శబ్దావరణం !

Jampala' Woods , Photo Aruna Jampala 18.12.2013
తోపు ఎవరిదో నాకు తెలుసనే అనుకుంటా.
అతని ఇల్లు పల్లెలోనే ఉంది కదా.
అతని తోపంతా మంచుతో నిండిపోవడాన్ని చూస్తున్నా.
నేనిక్కడ ఆగడం అతను చూడలేడు.

చిన్నప్పుడు గూడవల్లి వెళ్ళాలంటే , ఏ పెళ్ళికో పేరంటానికో.
అప్పట్లో అన్నీ వేసంకాలం పెళ్ళిళ్ళు.ఆ ప్రయాణాలన్నీ చాలా మట్టుకు వేసంకాలంలోనే.
" దేశం వెళుతున్నామోచ్! " అని బయలుదేరేవాళ్ళం.
గ్రంథాలయం వీధిలో చిట్ట చివరి ఇల్లు మాది. ఇంటి ముందు కొబ్బరి చెట్ల వరుస. వాటిని అల్లుకొని గుత్తులు గుత్తులుగా వేళ్ళాడే రాధామనోహరాలు. వాటి మొదట్లో సరిగ్గా వేసవిలోనే గుబాళించే దొంతరమల్లి.
Winter Morning by Aruna Jampala 18.12.2013
ఎప్పటికీ కట్టడం పూర్తి కాని ఇటుకల ప్రహరీగోడ వారగా  కనకాంబరాలు,నిత్యమల్లి. కొబ్బరిచెట్ల ముందుగా సగర్వంగా పలకరించే పురి. ఆ పక్కనే  నాన్నగారు మద్రాసు  నుంచి తెచ్చి మరీ నాటిన ,మా తాతయ్య లాంటి , పెద్ద పొగడచెట్టు.
ఎండా..చెమట ,వళ్ళంతా జిడ్డు
చిర చిర మంటూ.
అయినా , ఎప్పుడెప్పుడు గూడవల్లికి  వెళదామా అని అనుకొనేవాళ్ళం అంటే, అది ఖచ్చితంగా అక్కడ చేసిపెట్టే అప్పచ్చులకోసమో పాల తాలికలు, కొబ్బరి బూరెలు, పాలకోవాలు, అరిసెలు ,తపాల చెక్కల కోసమో  కాదు.
మంచు వెన్నెల By Dr.Chowdary Jampala 14-12-2013
ఎందుకంటే,గూడవల్లంటే మా ఇంటి పిల్లలందరికీ నాతో బాటూ వచ్చే పచ్చటి జ్ఞాపకం . ఆ ఇంటి వెనకాల తాటితోపు. 
ఆ పక్కనే ఉన్న మామిడి చెట్లు.సపోటాలు.రాతిఉసిరి.
చింత చెట్టు దాని కింది పెద్దపుట్ట.
 తోపంతా గజిబిజి గా పాకిన గురివింద తీగలు.  ఎర్రగా పండి గుత్తులు గుత్తులుగా వేళ్ళాడుతూ పిల్లలని తెగ ఊరించే వంకర టింకరల సీమ చింతకాయలు. చెట్ల మొదట్లో పాతేసిన త్యాగలు.  గడ్డివాములో మాగేసిన ఈతకాయలు, సపోటాలు.
ఇవండీ మా సెలవల  నెలవులు.
ఆ  మామిడి కొమ్మల మీద కోతికొమ్మచ్చులు ఆడుతోంటే , చెట్ల కింద చాపలు పరుచుకొని కారప్పూస నములుతూ... చదివిన చందమామలు మళ్ళీ చదువుతూ.. కసరు మామిడి పిందెలని ఉప్పూకారంతో కర కర  నమిలేస్తూ ...
ఎన్నడూ కనబడని చింతచెట్టు కింది పుట్టలోనినాగుపాము గురించి కథలు చెప్పుకొంటూ ...ఎప్పుడూ వినబడే పేరుతెలియని గువ్వల వివిధ భారతిని వింటూ..
తాటిముంజెలు ,కొబ్బరిబోండాలు ,సపోటాలు, ఈత కాయలవంతుల కోసం  పిల్లలం జుట్టూ జుట్టూ పట్టుకొంటూ...ఉండగా ,
 అసలా వేసవి వేడి ,చెమట, జిడ్డు ఎటు పోయేవో !
నిజమే, ఆ కాలంలో మా తాతలు  ఇంటి వెనకాల తోపులు పెంచారు కాబట్టి మా చిన్నతనం అలా గడిచింది !
అనకూడదు కానీ, సరిగ్గా అలాంటి   పెరటితోపు  మళ్ళీ చూడడానికే వెళ్లానా అన్నట్లు , "దేశానికి వెళ్ళానోచ్ !"
అక్షరాలా మన అరుణ గారి పెరట్లో ఉంది అలాంటి అందమైన పచ్చటితోపు.
 మన  మన దేశాన చెట్లన్నీ మనలాగానే విశాల హృదయాలతో భాసిల్లుతుంటాయ్! 
Jampala Woods in Summer  30-9--08 Photo :Me
కాబట్టి ,చక్కగా గుమ్మటాల్లా కొమ్మలతో రెమ్మలతో ,హాయిగా ఎగిరి దూకి కోతికొమ్మచ్చులు ఆడుకొనేంత అనువుగా ఉంటే,
అరుణగారి తోపులోఆ చికాగోచెట్లు సూదంటు ఆకులతో కొమ్మలతో,
ఎవరో నిలబెట్టిన గాలిగోపురాల్లాంటి ఆకాశహర్మ్యాలు !
 ఏమో అనుకుంటాం కానీ, అవి మన హిమాలయ దేవదారు గారి అప్పచెల్లెళ్ళే  కదండీ!
హాయిగా వారింట అతిథి మర్యాదల్లో మునిగితేలుతూ , ప్రతి ఉదయం అరుణ గారు ఆప్యాయంగా  అందించే వెచ్చటి కాఫీ తో పాటూ, వారి వంటింటి వసరా లో నిల్చుని,ఆ కొయ్య చేపట్టును ఆనుకొని ,అరుణగారి తోపు పచ్చదనాన్ని   ఆస్వాదిస్తుంటే ,
ఆహా !
బృందావనమది అందరిదీ అనుకొన్నారు కాబోలు! జంపాల గారు , వెన్నెల్లో తడుస్తూ మంచులో మునకలేస్తోన్న వారి పెరటితోపు చిత్రాలను మనందరితో పంచు కొంటే, తెలిమంచు తెరలలో దోబూచులాడుతూ, దూది మేఘాలపై ఉదయభానుడు  గీస్తోన్న వెలుగు చిత్రాలను అరుణ గారు పంచుకొన్నారు!
ఆ గృహస్తు,గృహిణిల కన్నులు కలిసే తీరుతెన్నులు వన్నెచిన్నెలు ఇవన్న మాట 
అందుకే అన్నారు కదా, పెద్దాయన, "కళ్ళుంటే చూసీ !" అని.
  దంపతులకు, ఒక నజరానా ఇవ్వద్దూ మరి!
అందుకే , నాలుగు అక్షరాలతో బాటు, ఒక అందమైన శబ్దావరణం దంపతుల పేరిట మనందరికీ.
Jampala' Woods in Summer  30-9--08 Photo :Me
అరుణ గారి పేరిట పెద్ద కప్పు వేడి వేడి కాఫీ కూడా మరిచిపోకండేం!
అంతెందుకు,
అసలుసిసలు గొంతులోనే నాలుగు మాటలూ  వినండి.చూడండి.తరిచండి.
ఇల్లుఇల్లాలితో పిల్లాపాపలతో , మీ ఇంట శీతాకాలం సెలవలు హాయిగా గడపండి!
Stopping by woods On a snowy evening

*** 
***
ఫ్రాస్ట్ గారు నా పిల్ల చేష్టను మన్నింతురు గాక!
***

 (శ్రీమతి అరుణజంపాల  డా జంపాల చౌదరి దంపతులకు ఆప్యాయంగా ...ధన్యవాదాలతో)
***
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 21, 2013

ఇదుగోండిదుగోండి ...

 ప్రభవ బడి...!!!




If you can't open the above link,please try the following  in YOUTUBE.

prabhava_playschool14-04-2012

బాపు గారికి ధన్యవాదాలతో
చంద్ర లత 

*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 14, 2013

అనగనగనగనగా .......!!!

అమ్మలగన్న అయ్యల్లారా..
అయ్యలపెంచే అమ్మల్లారా..
మీరీ కథను చెప్పారా?
నచ్చండి నచ్చకపొండి.
కథలు 
వినగా వినగా..
చదవగా చదవగా..
చెప్పగా చెప్పగా..
అడపాదడపా కుసింత ...
రాయగా రాయగా..
నాకు బాగా నచ్చేసిన కథ ఒకటుంది.
తామెచ్చిందే అండపిండబ్రహ్మాండం కనుక ఆ కథ తెలియని వారు ఎవరు చెప్మా అనుకునేదాన్ని. అమాయకంగా.
పిల్లలని కదిలించి చూడగా చూడగా ..
హార్నీ.. ఈ కథేంటి ? ఇలాంటి ఏ కథా తెలియదు పొమ్మన్నారు .

కథాకథనం అంటే అదీ.
కథాముంగిట్లోకి ఆహ్వానిస్తున్నట్లు మొదటి వాక్యం.
ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ పోయే మొదటి పేరా.
చల్లగాలికి కదలాడి పోయే మేఘాల్లా అల్లనమెల్లన చల్లగా సాగేకథనపు  నడక .
గిర్రున తిరిగే మలుపు. ఆకాశం నుండి కడలి వైపు వేగంగా సాగే వడివడి నదీ గమనపు ఒరవడి.
ఇక, చిరాఖరకు చమక్కు మనిపిణ్చే మెరుపు ముగింపు.
 వ్యాకరణబద్దం. అలంకారికనిబద్దం.కథన చట్రం. సునిశిత హాస్యం.వ్యంగ్యాస్త్రం. వ్యవహారశైలి.లోకరీతి.జీవిత నీతి
కథంటే ఇలా ఉండాలి సుమా ! అనిపించే ఒకానొక కథ.
సరే మరి.
ఇలాంటి కథ మన తెలుగులో ఎక్కడుందీ ఈవిడ మరీను అని మీరు పేజీ మడతేసేముందు .. కాస్తాగండి సోదరసోదరీమణులారా..
అచ్చంగా మన తేట తేనియల తెలుగులో స్వచ్చంగా సాగే ఈ కథ...
పిల్లలకు చెప్పని ఆమ్మానాన్నలు అవ్వాతాతలు పంతుళ్ళు పంతులమ్మలూ ఉంటారనీ ... 
ఇళ్ళూ బడులూ ఉంటాయని నాకూ తెలియదంటే నమ్మండి.
ఎప్పుడు పిల్లలని కలిసినా మొదట ఈ కథ తెలుసా అంటూ మొదలెట్టి, ఈ కథను చెప్పడంతో ముగించాల్సి రావడమే  నా ప్రత్యక్ష అనుభవం.
ఒక చోటా.. ఒక పూటా.. ?!?
ఎచ్చోట కథ గురించి మాట్లాడవలసి వచ్చినా ఇదే పరిస్థితి ని ఎదుర్కోవలసి వచ్చింది. అమ్మానాన్నలవంకా... పంతుళ్ళుపంతులమ్మల వంక తెల్లబోయి చూసేదాన్ని మొదట్లో.
పాపం.. వారికి ఎవరూ ఈ కథ చెప్పలేదు మరి ! వాళ్ళ పిల్లలకు వాళ్ళెలాగ చెప్పగలరు?
కదండీ!
రాను రాను పిల్లలకు కథలు చెప్పేవారు కరువైపోతున్నారు సుమీ! 
ఇది, అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక!  
మూఢుల్ని రాజ్యాభిషిక్తుల్ని చేసిన పంచతంత్ర పుట్టిన భూమి మనది !
అక్కలారా అన్నలారా.. 
ఈ చల్లటి వేళ, మీ పిల్లలని మీ వెచ్చటి ఒడిలో కూర్చుండబెట్టుకొని.. 
ముద్దారగా ఒక కథ చెప్పేసేయండి.
నన్ను తలుచుకొంటూ!
ఇంతకీ ఆ కథేంటంటారా?
ఆగండాగండి.
అదే నేను చెప్పొచ్చేది.
"అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజున్నాడంట! ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు కొడుకులూ యేటికి వెళ్ళారంట............."
"ఓసోస్ ! ఇదే నా! ఏం కథో అనుకున్నాం మీ ఉపోద్ఘాతం చదివేసి!" అని గొణుక్కోకండి మాహానుభావులారా ..మహాతల్లులారా..
అవును గదా మరి ,
"నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా...కుట్టనా?"
***
( తెలుగులో పేరాగ్రాఫు అంటే పరిచ్చేదము,ఖండిక అట. దానికన్నా పేరా నే సులువుగా ఉందని అలాగే ఉంచేసా. )

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 24, 2013

సజల నయనాలతో.

Sri Kotapati Murahari Rao garu, 
నాన్న గారు తరుచూ అంటూ ఉండే వారు.
కొందరిని చూసి ఎలా జీవించాలో నేర్చుకోవాలి. 
మరికొందరిని చూసి ఎలా జీవించకూడదో!

మంచికీ చెడుకి నడుమ ఉండే ఆ పారదర్శక  పరిధిని ,
పరిమితులను అర్ధం చేసుకోవడంలోనే జీవితం ఆవిష్కరించబడుతుంది కదా...?
ఆ పరిమితులను అధిగమించే ప్రయత్నమే ,
ఆ ప్రమేయాలను ఎదురొడ్డి నిలబడే పోరాటమే కదా...
జీవితం.

మంచి ని పెంచుకోమన్నారు ,
చిన్న చిన్న సంతోషాలతో జీవన  వైవిధ్యాన్ని  ఆనందించడం  ఎలానో జీవించి చూపారు.
అందరిలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది.  దానిని పచ్చ బరిచేందుకు ప్రయత్నించ మన్నారు.
 ఆ ప్రయత్నాలలోనే , ఆ ప్రయాసలలోనే ,
Rishi Valley School, Dr.KumaraSwamy, Dr.Radhika Hegberger ,
Raghuveeraa Reddy garu, Kotapati  Murahari Rao garu and me.

















కొద్దో గొప్పో చెడును కూదా
భరాయించేస్తూ,
చీకటిని అంగీకరించేస్తూ,
కాపట్యాన్ని క్షమించేస్తూ  ...
మిరుమిట్లు గొలిపే వెలుగు సత్యాలకు గుడ్డి వాళ్ళయినట్లయ్యింది.

స్థితిగతులేమిటో తెలుసుకొని మెసలమన్నారు.
ఇవాళ్టి  స్థితేమిటి ? ఎటు వైపు గమనగతి సాగుతోంది? తెలివిడి తో మెలగమన్నారు.

చిన్న గీత ముందు పెద్దగీత  ... చిన్నకష్టాల ముందు పెద్ద కష్టాలు.!

అయ్యో తండ్రీ,!
కష్టాలకు సుఖాలకు చిన్నాపెద్దలుంటాయా?

అయ్యో నాన్నా !
తప్పొప్పులకు తగ్గొగ్గులు ఉంటాయా ?

జీవితం పట్ల
బోలెడంత నమ్మకంతో...
నిలదొక్కుకొని  నిలబడేందుకు...
తిన్ననైన తోవలో సాగేందుకు..
ప్రయత్నం చేస్తూనే ఉంటాము.
మీ స్పూర్తి   .... మీ మూర్తిమత్వమూ
మా తోడురాగా.

సజల నయనాలతో...
సజీవ జ్ఞాపకాలతో !
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 22, 2013

సన్ను ... మూను...కుసింత పెట్రోల్ !!!

 ఇవ్వాళ  మా  బుజ్జి పిల్లలకు సూర్యుడి పాఠం చెప్పబూనాను.
మా కోసమేనా అన్నట్లు  ,
పొద్దుటే Young World ముఖ చిత్రం.
భూమి నుంచి మంగళ గ్రహానికి పంపిన ఉపగ్రహ చిత్రం .  
దాని తోక వైపు నుంచి!
మామూలుగా మాట్లాడుకొంటూ ,
పాఠాలాడుకొంటాం కదా
అలాగే  అడిగాను
మొన్న మన వూరి నుంచి పంపిన రాకెట్టు  
అకాశంలో పై పైకి పోతూ పోతూ ఉంది కదా ,
Mangalyaan ! BY Md.Tasneem (3yrsOld)












మరి రాకెట్టు లో పెట్రోల్ అయిపోతే ?  “  అని.
" మరి మన కార్లో స్కూటర్లో పెట్రోల్ పోసుకొంటాం  కదా అప్పుడప్పుడు ,
ఇప్పుడా రాకెట్టులో పెట్రోల్ ఎవరు పోస్తారు ?"అని.
ఇక, మా చిట్టిబుర్రలు చకచకలాడి గబగబ చెప్పారు.
తలకొక సమాధానం వచ్చేసింది.
ముందే  బోలెడంత పెట్రోల్  పోసేసి పంపామని , కనిష్క అంటే,
మేఘాల మీద నిల్చుని పెట్రోల్ పోస్తానని  అక్షర అంది. 
Mangalyaan , Akshara ( 3yrs Old)











పక్షి లాగా ఎగెరెళ్ళి పెట్రోల్ పోసేసి తిరిగొస్తామని. హృతికేశ్ అన్నాడు.
ఇంకో రాకెట్లో ఎగెరెళ్ళి కుసింత పెట్రోల్ వంపేసి వస్తామని , ఆదిత్య అంటే..
వాన నీళ్ళు పోసినట్టుగా ఆకాశంలో పెట్రోలు వానలు  పడుతాయని, గుణ అన్నాడు.
ఒక పైప్ పెట్టి పంపామనిఆకాశంలో అక్కడక్కడ పెట్రోల్ షాపులు ఉంటాయని.డబ్బులిచ్చేస్తే 
ఆ పైప్ లో  పెట్రోల్ పోస్తారని. అన్విత అంది.
ఇలా తలా ఒక మాట.
భలేగా చెప్పారు.
నేనన్నాను కదా.
అవేవి కావుసూర్యుడు పోస్తాడన్నాను!









వెంటనే అందరూ అంగీకరించేసారు?  కానీ ఎలా?
ఏముందీ ..
అప్పుడు నేనా ఉపగ్రహం బొమ్మను , దాని తోక మీద ఉన్న అద్దాల పలకలను చూపించాను.
అవి సూర్యఫలకాలు (" సోలార్ ప్యానెల్స్ " )
అప్పటికే , మా పిల్లలకు సూర్యుడి శక్తి (energy) కాంతి ( light)  ..
ఇలాంటి పదాల పరిచయం అయిపోయింది.
ఇక ఇప్పుడు వాళ్ళకి ఒక విషయం అర్ధమై పోయింది .
ఆఖరికి మనం పంపిన ఉపగ్రహానికి కూడా శక్తి నిచ్చేది సూర్యుడే... అని.
వినదగునెవ్వరు చెప్పిన ...విని ఊరుకోవడానికి వాళ్ళేమీ "నిశ్శబ్దం!" చట్రంలో  పెరుగుతూ ఉండే అలాంటి ఇలాంటి పిల్లలు కారు కదా!
అక్షర చటుక్కున అడిగింది.
 “” అందరికీ ఎనెర్జీ సన్ను కదా ఇస్తాడు. మరి మూన్ ఎందుకు సన్ను రాగానే వెళ్ళి నిద్దర పోతాడు ? మూను కి ఎనెర్జీ ఎవ్వరిస్తారు? మూను కి ఎనెర్జీ లేక పోతే  స్ట్రాంగ్ గా అవ్వడు కదా? నేను కూడా పొద్దున్నే సన్ను రాగానే నిద్దర లేస్తా. మూనుకి ఎనెర్జీ ఎట్లా? చిన్నగానే అయిపోతాడా ? పెద్దగా  అయిపోడా ?   "
***
ఇక, ప్రశ్నలు కొనసాగుతూనే పోయాయి.
ఊపిరాడకుండా.
సమాధానం కోసం ఆగకుండా.
జవాబులు ఏమైనా న్నాయా ?
***
కార్తీక పౌర్ణమి అందాలను ఆనందించేప్పుడు .. 
మా బడి పిల్లలకు జవాబులేమైనా దొరుకుతాయేమో చూడండి మరి !
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 17, 2013

చినుకులా రాలి













మా పిల్లలకు నచ్చినవీ...
మా పిల్లలు మెచ్చినవీ...
కొన్ని వాన చినుకులు!
అన్నట్లు ,
కొన్ని రచనలు స్వయంగా వారు చేసినవే !

బుడుగో బుడుగో

అప్పుడు వచ్చే వర్షం


వర్షమై రావమ్మ

http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_22.html

వర్షాలమ్మా వర్షాలు

http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_19.html

వర్షపు చినుకా!

http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_17.html


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 14, 2013

కొత్తగూడెం ఫర్మానా !

ఉండబ్బా! కాస్త ఈ బొమ్మేసి వస్తా !  
నవంబరు నెల రాగానే ,..
 ఎక్కడెక్కడి పిల్లలు ...
ఆ పిల్లలను వెన్నంటి ఉండే అమ్మానాన్నలు, పంతుళ్ళు పంతులమ్మలూ, బడులూ సంస్థలు ...
బోలెడంత హడావుడిగా "కళ కళలాడుతూ" ఉంటారు.
బ్రష్షులు కడిగేస్తూ.  పెన్సిళ్ళు చెక్కేస్తూ.రంగులు కలిపేస్తూ. కాగితాలు పులిమేస్తూ
అంతేనా, పాటలు పాడేస్తూ. ఆటలు ఆడేస్తూ.
నాట్యాలు చేసేస్తూ.నాటకాలు ఆడేస్తూ. సినిమాలు చూసేస్తూ.
బహుమతులు సాధిస్తూ. కానుకలు పోగేస్తూ.
చేయ గలిగిన వారికి చేయగలిగినంత !
అవునండి.
పిల్లలపండుగ రోజులివి!
ఏడాదంతా ఏమరుపాటుగా ఉన్నా , అంతోఇంతో పిల్లలలోని సృజనశీలతను గుర్తించాలనీ,
ప్రోత్సహించాలనీ, గౌరవించాలనీ....
 ఎందరో అనుకొనే రోజులివే.
సరే, ఆ విషయం అలా ఉంచేసేస్తే,
మా చిన్నతనాన మా వూల్లో రాములవారి పెళ్ళి జరిగేది. ప్రతి  వేసంకాలం.
వూరు వూరంతా నడుం బింగేది.
చెరువు గట్టున ఖాళీ స్థలంలో పందిళ్ళు వెలిసేవి.
గుంజలు ఇచ్చేవారు గుంజలు ఇస్తే,వాసాలు తెచ్చేవారు వాసాలు తెచ్చేవారు.
తాటాకులు కొట్టుకొచ్చేవారు తమ పొలం గట్లెమీది చెట్లు కొట్టుకొచ్చేవారు.పురికొసల దగ్గర నుంచి దబ్బనం దాకా ఎవరో పిలిచి చెప్పినట్లు ఎవరిపాటి వారు ఎవరు తీసుకురాగలిగింది వారువెంటపెట్టుకుని వచ్చారు.
 పాలుపెరుగు , ఉప్పు పప్పు , పెరట్లో కాసిన కాయగూర, పొలాన పండిన కొత్త పంటా,
ఎవరికి తోచినంత వారు తెచ్చి వంట పందిట్లో చాప మీద గుమ్మరించే వారు.
గరిటె తిప్పినమ్మ గరిటె తిప్పతే, అన్నం వార్చే పెద్దమనిషి అన్నం వార్చేవాడు. ఇక అమ్మలక్కల సంగతి  చెప్పక్కరలేదు. సందడే సందడి !
కత్తిపీట చేతపట్టుకొని ఒకరొస్తే, గుమ్మడికాయ మోసుకొంటూ మరొకరు వచ్చేవారు.  కూర్చునే పీటలు ,పరుచుకొనే వెదురు చాపల దగ్గర నుంచి వండే కాగుల దగ్గరనుంచి వడ్డించే విస్తరి దాకా ..ఎసట్లో బియ్యం నుంచి వండి వరిగడ్డీ పై వార్చిన వేడి వేది అన్నపురాశుల దాకా, పరమాన్నం నుంచి గారెలు పూర్ణాలదాకా .... వడపప్పు ,చలిమిడి  కొబ్బరి ముక్కలతో పాటు సిద్ధం చేసి ఉంచి, పానకం బిందెల దాకా.. అబ్బో..చెపుతూ పోతుంటే రామాయణమై పోయేట్టుంది!
ఇక, ఎవరైనా కాస్త  ఏమరుపాటుగా ఉంటే,
 “ ఒరేయ్ , ఆ వాగొడ్డు చిట్టెమ్మ గారి చిన్నబ్బాయ్ కనబడలేదేట్రా... ఊళ్ళో ఉన్నాడా? ఎళ్ళి ..ఇట్టా కేకేసుకురా!"
అంతే...!
ఇక  అతను రాకుండా ఎక్కడికి పోతాడు?
ఇక అత్తాకోడళ్ళ వ్యహారాలు  కూడా చూడాల్సిందే,
“ అక్కాయ్ మరే... మన కాలువ గట్టు శేషాయమ్మ చిన్న కోడలిని చూశా...బీరకాయ చేదన్నా చూడకుండానే , పచ్చడి నూరేసిందంటగా!" బుగ్గలు నొక్కుకొంటూ ఒకావిడ ఉవాచ.
" అయినాగానీ  ఆమ్మాయ్ ..అట్టాగేనంటే పులుసులోకి ముక్కలు కోసేది ?"”
కొత్త కోడలిగారికి ట్యుటోరియల్ ప్రారంభం!
కావిడి భుజాన వేసుకొని కాలువ నీళ్ళు తెచ్చి పోసేవాళ్ళు పోస్తుండగా, పానకం , వడపప్పు కొబ్బరిముక్కలను అల్లరిపిల్లల బారి నుండి కాపాడే వారు కాపాడుతూ ఉండే వారు.
ఊరబంతులు. వంటలు వడ్డనలు .
ఎంతో సరదాగా ఉండేది.
ఎవరికి వారే వాళ్ళింట్లో అమ్మాయి పెళ్ళా అన్నంత హడావుడి. సంబరం. సంతోషం.
అదండీ దేవుడి పెళ్ళికి ఊరంతా సందడి!.
ఇదంతా మీకు అభూతకల్పనలాగానో .. ఏ "రైతుకుటుంబం"" పల్లెటూరి పిల్ల" తరహా పాత సినిమా క్లిప్పింగ్ లాగానో అగుపడవచ్చు బహుశా!
అందులోనూ ఈ మధ్యనే వీధివీధిలో వినాయకచవితి పందిళ్ళు సృష్టించిన  అర్హ్ద శబ్దకాలుష్యాల వడదెబ్బ నంచి ఇంకా తేరుకోక పోతిమి!
ఇచ్చిన చందాలు  పారుతోన్న నీళ్ళలోకి విసిరేసిన చిల్లరనాణాల్లా ఎటుబోయాయో!
                

  బాలోత్సవ్ లో బొజ్జగణపయ్య ఊరేగింపు
రికార్డు డ్యాన్సులు .. సినిమాపాటలు , మందులచిందులు ,వగైరాల మధ్య పాపం ఆ బొజ్జ గణపయ్యే బిక్కచచ్చిఫోయి,కిమ్మనకుండా వూరిచివరి కంపుచెరువులో మునిగిపోయాడు!పోన్లేండి ఎవరి పుణ్యాన వారు !
ఇంతకీ, ఈ పిల్లల పండుగ పూట నేను చెప్పొచ్చేదేంటంటే..
అచ్చంగా మా చిన్నతనాన మేమెరిగిన ఆ అచ్చమైన పల్లెల్లో రైతుల సంస్కృతి లోని నిబద్దత, ఉమ్మడి భావన, సమిష్టి కృషి, క్రమశిక్షణ, మర్యాద, మనిషుల పట్ల గౌరవం ఇవీ అవీ ఇంకెన్నో ఒక్క చోట కుప్పజేసి చూసినట్లయ్యైంది. మరుగై పోయిన ఆ వ్యవసాయ సంస్కృతి మళ్ళీ కనబడింది. మన కొత్తగూడెంలో!బొగ్గు గనుల్లో పుట్టిన విద్యుత్ తేజం ...ఏమేరుగనంట్లు రాష్ట్రమంతా విస్తరిస్తొంది! 
కాదు కాదు ... రాష్ట్రాన్నంతా తనలోకి సమీకృతం జేసుకొంది
!ఒకటా రెండా ఇది ఇరవై రెండేళ్ళ సంస్కృతి!
 ఇంతటి మహత్కార్యానికి మూలకర్త డా.రమేశ్ బాబు గారు  . వారుఎప్పుడు మైకు ముందుకు  వచ్చినా అమ్మో మరొక ఉపన్యాసమేమో అని అనుకుంటామా, ఆయన ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఒక కథ చెప్పడం మొదలెడతారు!
 పిల్లలని గౌరవించడం, ఆప్యాయంగా చూసుకోవడం ఆయన లోని పసితనాని పచ్చబరచి ఉంచాయేమో !
డా.నరేంద్ర గారు,శర్మ గారు, ఒకరా ఇద్దరా .. ఆ వూరు వూరంతా నడుం బిగించి అక్కడ నిలబడతారు.
ప్రతి ఇల్లూ వచ్చిన అథిథులను అక్కున చేచుకొంది.
మాధవరావు గారు నడుం బిగించి , వచ్చిన ప్రతి బిడ్డకు వారి వెంట ఉన్న పెద్దలకు ,వేడి వేది కమ్మటి భోజనం వడ్డిస్తూ ఉంటారు.
 అలాగని వారేదో పాకశాస్థ్ర నిపుణులనుకొనేరు. వారొక బాధ్యత గల బిజీ  చార్టెడ్ అకౌంటంట్ !
 రమేశ్ గారేమో శస్త్రవైద్య నిపుణులు.నరేంద్రగారు ప్రముఖ వైద్యులు.
ప్రతి వారి వారి రంగాల్లో తల మునకలయ్యేంత  పనుల్లోమునిగిపోయే వారే!
అన్ని ఊళ్లలాగానే కొత్త గూడెం లోనూ ఒక ఆఫిసర్స్ క్లబ్ ఉండడం ,
ఆ వూరి పెద్దమనుషూలంతా చేరి పేకముక్కలు కలపడం ,
అది కుటుంబాలపై చీకట్లను గుమ్మరించడమూ ...
మామూలుగానే జరుగుతూ ఉండేది. 
అక్కడున్న టెన్నిస్ ,షటిల్ కోర్టులతో పాటు, మంచోచెడో  అనేక మంది  మగవాళ్ళంతా ఒక చోట చేరేవారు. ఈ  నేపథ్యంలో   డా.వాసిరెడ్డి రమేశ్ గారు  ఆ క్లబ్ కు సెక్రటరీగా  ఎంపిక కావడం ,వారిలో ఒక ఆలోచన రావడం. , వారు సభ్యులందరినీ  నచ్చజెప్పి,  పేకాటలో వచ్చిన వార్షిక ఆదాయంలో  కొంత పిల్లలకై వెచ్చిచేట్టుగా అందరినీ వప్పించడమూ.. ఆ పై అంచలంచెలుగా  క్లబ్ ప్రాంగణం.... ఈ నాడు సుమారు పదమూడు వేల మంది పిల్లలు వారి అమ్మనాన్నలు ఉపాధ్యాయులు కళకళలాడుతూ తిరుగాడిన , ఒక అద్బుత  కళాక్షేత్రంగా  రూపొందడం .. ఇదంతా జగమెరిగిన  సత్యం!
   ఆట విడుపు
అందుకేనండీ , వేమన్న ఘంటకొట్టి మరీ చెప్పింది! 
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని. 
ఎవరు ఎలాంటి మార్పుకు స్పూర్తి అవుతారో ...
ఎలాంటి ఉదాహరణలుగా నిలబడుతారో ..!
వారి సంస్కారానికి  ఇలాంటి కార్యక్రమాలొక ఒక ప్రముఖ  ప్రకటనే కదా!
డా. వాసిరెడ్డి రమేశ్  గారి కీ వారి బృందానికి జేజేలు. 
మాధవ రావు గారికి ధన్యవాదాలు.
అన్నదాతా సుఖీభవ అన్నట్లు.                                                                                                                              
కొత్తగూడెం వాసులందరికీ ...నమస్సులు.
ఇది మీ సభ్యతా సంస్కృతి.!
పదికాలల పాటు పచ్చగా సాగాలని కోరుకొంటూ...
పిల్లలపండుగ శుభాకాంక్షలు.
**
 ఏమండోయ్ ! వినబడుతోందా?

అయ్యలారా...
అన్నలారా..
మరి మీరిది విన్నారా?
మీ వూరి క్లబ్బు ను ఏమి చేయదలుచుకొన్నారు?
తరతరాల బూజు దులపడానికి నడుం బిగించ గలరా మహాశయులారా....?!?
అదే మన కొత్తగూడెం వాసులు మనకు పంపుతున్నా ఫర్మానా !
వేలాది చిట్టిచేతులలో వారు పెట్టి పంపిన నిమంత్రణ్ ! 
తరువాయి కార్యక్రమం మీ ఇంటినుంచే ప్రత్యక్ష ప్రసారం!  మీరే కర్తా కర్మా క్రియా ! 
మరొకమారు ,పిల్లలపండుగ జేజేలు!
ఊరుకేంచొచ్చినా ! 



రండి రండి రండి! దయ చేయండి!
                                                తమరి రాక మాకెంతో ఆనందం సుమండీ! 
Add caption
ఏం చేద్దామబ్బా ?
 





                                                 
రిషీవ్యాలీ పల్లెబడి పిల్లల తోలుబొమ్మలాట  



రిషీవ్యాలీ పల్లెబడి పిల్లలతో ఉపాధ్యాయులతో
,డా.వాసిరెడ్డి రమేశ్ గారు, ప్రఖ్యాత సినిమా దర్శకులు బి.నర్సింగ్ రావు గారు,వారి శ్రీమతి. 
బాలోత్సవ్ 201 ముఖ్య అతిధి చిన్నారి  రచయిత్రి నిధి ప్రకాష్.
ప్రకృతి ప్రేమికులు రాయి వెంకటప్ప గారి ఔషధ మొక్కల ప్రదర్షన , పంపిణీ.
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.