Dec 14, 2013

అనగనగనగనగా .......!!!

అమ్మలగన్న అయ్యల్లారా..
అయ్యలపెంచే అమ్మల్లారా..
మీరీ కథను చెప్పారా?
నచ్చండి నచ్చకపొండి.
కథలు 
వినగా వినగా..
చదవగా చదవగా..
చెప్పగా చెప్పగా..
అడపాదడపా కుసింత ...
రాయగా రాయగా..
నాకు బాగా నచ్చేసిన కథ ఒకటుంది.
తామెచ్చిందే అండపిండబ్రహ్మాండం కనుక ఆ కథ తెలియని వారు ఎవరు చెప్మా అనుకునేదాన్ని. అమాయకంగా.
పిల్లలని కదిలించి చూడగా చూడగా ..
హార్నీ.. ఈ కథేంటి ? ఇలాంటి ఏ కథా తెలియదు పొమ్మన్నారు .

కథాకథనం అంటే అదీ.
కథాముంగిట్లోకి ఆహ్వానిస్తున్నట్లు మొదటి వాక్యం.
ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ పోయే మొదటి పేరా.
చల్లగాలికి కదలాడి పోయే మేఘాల్లా అల్లనమెల్లన చల్లగా సాగేకథనపు  నడక .
గిర్రున తిరిగే మలుపు. ఆకాశం నుండి కడలి వైపు వేగంగా సాగే వడివడి నదీ గమనపు ఒరవడి.
ఇక, చిరాఖరకు చమక్కు మనిపిణ్చే మెరుపు ముగింపు.
 వ్యాకరణబద్దం. అలంకారికనిబద్దం.కథన చట్రం. సునిశిత హాస్యం.వ్యంగ్యాస్త్రం. వ్యవహారశైలి.లోకరీతి.జీవిత నీతి
కథంటే ఇలా ఉండాలి సుమా ! అనిపించే ఒకానొక కథ.
సరే మరి.
ఇలాంటి కథ మన తెలుగులో ఎక్కడుందీ ఈవిడ మరీను అని మీరు పేజీ మడతేసేముందు .. కాస్తాగండి సోదరసోదరీమణులారా..
అచ్చంగా మన తేట తేనియల తెలుగులో స్వచ్చంగా సాగే ఈ కథ...
పిల్లలకు చెప్పని ఆమ్మానాన్నలు అవ్వాతాతలు పంతుళ్ళు పంతులమ్మలూ ఉంటారనీ ... 
ఇళ్ళూ బడులూ ఉంటాయని నాకూ తెలియదంటే నమ్మండి.
ఎప్పుడు పిల్లలని కలిసినా మొదట ఈ కథ తెలుసా అంటూ మొదలెట్టి, ఈ కథను చెప్పడంతో ముగించాల్సి రావడమే  నా ప్రత్యక్ష అనుభవం.
ఒక చోటా.. ఒక పూటా.. ?!?
ఎచ్చోట కథ గురించి మాట్లాడవలసి వచ్చినా ఇదే పరిస్థితి ని ఎదుర్కోవలసి వచ్చింది. అమ్మానాన్నలవంకా... పంతుళ్ళుపంతులమ్మల వంక తెల్లబోయి చూసేదాన్ని మొదట్లో.
పాపం.. వారికి ఎవరూ ఈ కథ చెప్పలేదు మరి ! వాళ్ళ పిల్లలకు వాళ్ళెలాగ చెప్పగలరు?
కదండీ!
రాను రాను పిల్లలకు కథలు చెప్పేవారు కరువైపోతున్నారు సుమీ! 
ఇది, అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక!  
మూఢుల్ని రాజ్యాభిషిక్తుల్ని చేసిన పంచతంత్ర పుట్టిన భూమి మనది !
అక్కలారా అన్నలారా.. 
ఈ చల్లటి వేళ, మీ పిల్లలని మీ వెచ్చటి ఒడిలో కూర్చుండబెట్టుకొని.. 
ముద్దారగా ఒక కథ చెప్పేసేయండి.
నన్ను తలుచుకొంటూ!
ఇంతకీ ఆ కథేంటంటారా?
ఆగండాగండి.
అదే నేను చెప్పొచ్చేది.
"అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజున్నాడంట! ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు కొడుకులూ యేటికి వెళ్ళారంట............."
"ఓసోస్ ! ఇదే నా! ఏం కథో అనుకున్నాం మీ ఉపోద్ఘాతం చదివేసి!" అని గొణుక్కోకండి మాహానుభావులారా ..మహాతల్లులారా..
అవును గదా మరి ,
"నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా...కుట్టనా?"
***
( తెలుగులో పేరాగ్రాఫు అంటే పరిచ్చేదము,ఖండిక అట. దానికన్నా పేరా నే సులువుగా ఉందని అలాగే ఉంచేసా. )

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment