Dec 22, 2013

ఒకానొక నిశ్శబ్ద శబ్దావరణం !

Jampala' Woods , Photo Aruna Jampala 18.12.2013
తోపు ఎవరిదో నాకు తెలుసనే అనుకుంటా.
అతని ఇల్లు పల్లెలోనే ఉంది కదా.
అతని తోపంతా మంచుతో నిండిపోవడాన్ని చూస్తున్నా.
నేనిక్కడ ఆగడం అతను చూడలేడు.

చిన్నప్పుడు గూడవల్లి వెళ్ళాలంటే , ఏ పెళ్ళికో పేరంటానికో.
అప్పట్లో అన్నీ వేసంకాలం పెళ్ళిళ్ళు.ఆ ప్రయాణాలన్నీ చాలా మట్టుకు వేసంకాలంలోనే.
" దేశం వెళుతున్నామోచ్! " అని బయలుదేరేవాళ్ళం.
గ్రంథాలయం వీధిలో చిట్ట చివరి ఇల్లు మాది. ఇంటి ముందు కొబ్బరి చెట్ల వరుస. వాటిని అల్లుకొని గుత్తులు గుత్తులుగా వేళ్ళాడే రాధామనోహరాలు. వాటి మొదట్లో సరిగ్గా వేసవిలోనే గుబాళించే దొంతరమల్లి.
Winter Morning by Aruna Jampala 18.12.2013
ఎప్పటికీ కట్టడం పూర్తి కాని ఇటుకల ప్రహరీగోడ వారగా  కనకాంబరాలు,నిత్యమల్లి. కొబ్బరిచెట్ల ముందుగా సగర్వంగా పలకరించే పురి. ఆ పక్కనే  నాన్నగారు మద్రాసు  నుంచి తెచ్చి మరీ నాటిన ,మా తాతయ్య లాంటి , పెద్ద పొగడచెట్టు.
ఎండా..చెమట ,వళ్ళంతా జిడ్డు
చిర చిర మంటూ.
అయినా , ఎప్పుడెప్పుడు గూడవల్లికి  వెళదామా అని అనుకొనేవాళ్ళం అంటే, అది ఖచ్చితంగా అక్కడ చేసిపెట్టే అప్పచ్చులకోసమో పాల తాలికలు, కొబ్బరి బూరెలు, పాలకోవాలు, అరిసెలు ,తపాల చెక్కల కోసమో  కాదు.
మంచు వెన్నెల By Dr.Chowdary Jampala 14-12-2013
ఎందుకంటే,గూడవల్లంటే మా ఇంటి పిల్లలందరికీ నాతో బాటూ వచ్చే పచ్చటి జ్ఞాపకం . ఆ ఇంటి వెనకాల తాటితోపు. 
ఆ పక్కనే ఉన్న మామిడి చెట్లు.సపోటాలు.రాతిఉసిరి.
చింత చెట్టు దాని కింది పెద్దపుట్ట.
 తోపంతా గజిబిజి గా పాకిన గురివింద తీగలు.  ఎర్రగా పండి గుత్తులు గుత్తులుగా వేళ్ళాడుతూ పిల్లలని తెగ ఊరించే వంకర టింకరల సీమ చింతకాయలు. చెట్ల మొదట్లో పాతేసిన త్యాగలు.  గడ్డివాములో మాగేసిన ఈతకాయలు, సపోటాలు.
ఇవండీ మా సెలవల  నెలవులు.
ఆ  మామిడి కొమ్మల మీద కోతికొమ్మచ్చులు ఆడుతోంటే , చెట్ల కింద చాపలు పరుచుకొని కారప్పూస నములుతూ... చదివిన చందమామలు మళ్ళీ చదువుతూ.. కసరు మామిడి పిందెలని ఉప్పూకారంతో కర కర  నమిలేస్తూ ...
ఎన్నడూ కనబడని చింతచెట్టు కింది పుట్టలోనినాగుపాము గురించి కథలు చెప్పుకొంటూ ...ఎప్పుడూ వినబడే పేరుతెలియని గువ్వల వివిధ భారతిని వింటూ..
తాటిముంజెలు ,కొబ్బరిబోండాలు ,సపోటాలు, ఈత కాయలవంతుల కోసం  పిల్లలం జుట్టూ జుట్టూ పట్టుకొంటూ...ఉండగా ,
 అసలా వేసవి వేడి ,చెమట, జిడ్డు ఎటు పోయేవో !
నిజమే, ఆ కాలంలో మా తాతలు  ఇంటి వెనకాల తోపులు పెంచారు కాబట్టి మా చిన్నతనం అలా గడిచింది !
అనకూడదు కానీ, సరిగ్గా అలాంటి   పెరటితోపు  మళ్ళీ చూడడానికే వెళ్లానా అన్నట్లు , "దేశానికి వెళ్ళానోచ్ !"
అక్షరాలా మన అరుణ గారి పెరట్లో ఉంది అలాంటి అందమైన పచ్చటితోపు.
 మన  మన దేశాన చెట్లన్నీ మనలాగానే విశాల హృదయాలతో భాసిల్లుతుంటాయ్! 
Jampala Woods in Summer  30-9--08 Photo :Me
కాబట్టి ,చక్కగా గుమ్మటాల్లా కొమ్మలతో రెమ్మలతో ,హాయిగా ఎగిరి దూకి కోతికొమ్మచ్చులు ఆడుకొనేంత అనువుగా ఉంటే,
అరుణగారి తోపులోఆ చికాగోచెట్లు సూదంటు ఆకులతో కొమ్మలతో,
ఎవరో నిలబెట్టిన గాలిగోపురాల్లాంటి ఆకాశహర్మ్యాలు !
 ఏమో అనుకుంటాం కానీ, అవి మన హిమాలయ దేవదారు గారి అప్పచెల్లెళ్ళే  కదండీ!
హాయిగా వారింట అతిథి మర్యాదల్లో మునిగితేలుతూ , ప్రతి ఉదయం అరుణ గారు ఆప్యాయంగా  అందించే వెచ్చటి కాఫీ తో పాటూ, వారి వంటింటి వసరా లో నిల్చుని,ఆ కొయ్య చేపట్టును ఆనుకొని ,అరుణగారి తోపు పచ్చదనాన్ని   ఆస్వాదిస్తుంటే ,
ఆహా !
బృందావనమది అందరిదీ అనుకొన్నారు కాబోలు! జంపాల గారు , వెన్నెల్లో తడుస్తూ మంచులో మునకలేస్తోన్న వారి పెరటితోపు చిత్రాలను మనందరితో పంచు కొంటే, తెలిమంచు తెరలలో దోబూచులాడుతూ, దూది మేఘాలపై ఉదయభానుడు  గీస్తోన్న వెలుగు చిత్రాలను అరుణ గారు పంచుకొన్నారు!
ఆ గృహస్తు,గృహిణిల కన్నులు కలిసే తీరుతెన్నులు వన్నెచిన్నెలు ఇవన్న మాట 
అందుకే అన్నారు కదా, పెద్దాయన, "కళ్ళుంటే చూసీ !" అని.
  దంపతులకు, ఒక నజరానా ఇవ్వద్దూ మరి!
అందుకే , నాలుగు అక్షరాలతో బాటు, ఒక అందమైన శబ్దావరణం దంపతుల పేరిట మనందరికీ.
Jampala' Woods in Summer  30-9--08 Photo :Me
అరుణ గారి పేరిట పెద్ద కప్పు వేడి వేడి కాఫీ కూడా మరిచిపోకండేం!
అంతెందుకు,
అసలుసిసలు గొంతులోనే నాలుగు మాటలూ  వినండి.చూడండి.తరిచండి.
ఇల్లుఇల్లాలితో పిల్లాపాపలతో , మీ ఇంట శీతాకాలం సెలవలు హాయిగా గడపండి!
Stopping by woods On a snowy evening

*** 
***
ఫ్రాస్ట్ గారు నా పిల్ల చేష్టను మన్నింతురు గాక!
***

 (శ్రీమతి అరుణజంపాల  డా జంపాల చౌదరి దంపతులకు ఆప్యాయంగా ...ధన్యవాదాలతో)
***
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

2 comments:

  1. Different topic. I heard that a slab with an inscription was found near in the drainage somewhere in your street. It contained an inscription about the origins of Gudavalli. Apparently some soldiers around 15th century going back from a war decided that it was suitable place to settle down. I think that my sister in law who is from Gudavalli told me that ews.

    ReplyDelete
  2. Nanna garu often used to talk about this inscription/s. With the help of his friend and scholar Sri Gadiyaram Ramakrishna Sarma garu , he tried to transcript the inscription/s. Even though that copy is not available, he spoke about these so often that I know what he understood:-)
    Gudavalli has two names .One Kumadavalli ,Buddhist origin ,means abode of red lotus. And, later "gooDu palli" as Portugese ships built a tall pillar with a "gooDu" to light torches for their sail ships.May be much earlier too So, the historians turn to pick the best ! :-)

    ReplyDelete