Jan 2, 2014

నడిచే పువ్వులకొరడా

సత్యవతి గారు అనగానే   చప్పున గుర్తొచ్చేవి.. 
వారి గల గల నవ్వు..గిరజాల జుట్టు ..
పొగడపూలు ..గోదావరి ..గోళీసోడా ..జున్ను ముక్కలు ..పొగాకుకాడలు .. అన్నెందుకు మూర్తీ భవించిన పసితనం ..స్నేహం .
మొదటి సారి దాదాపు పదిహేనేళ్ళ క్రితం  అస్మిత వారి కార్యక్రమంలో మద్రాసులో కలవడం.
ఈ సంతోషక్షణాల్ని మాకిచ్చిన సత్యవతిగారికి
అరవయ్యవ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
23-11-2007 , Writer's Trip to Talakona ,
Organised by Bhoomika .
At V.Pratima's home ,Naidupeta, Nellore.
వారి పరిచయం ఎలాంటి  శషభిషలు లేకుండా హాయిగా జరిగింది. అక్కడికి వచ్చిన పిన్నాపెద్దలందరితోనూ ఎలాంటి అరమరికలు లేకుండా స్నేహాన్ని  పంచేస్తూ పోయారావిడ
బిడియపడుతూ ఒక పక్కగా ఒదిగొదిగి కూర్చున్న నన్నూ ఇట్టే నలుగురిలోకి లాక్కొచ్చేసారు. నవ్విస్తూ.
నిప్పులపై నడుస్తూ జీవిత సహచరుడిని ఎలా కలుసుకొన్నారో ఆవిడ చెప్పిన తీరుకి పడీ పడీ నవ్వాల్సిందేఅప్పటినుంచే ఆవిడనిసంబరాల పాపాయిపిలుచుకోసాగాను !
స్నేహానికి వయస్సుతో ప్రమేయం లేదనడానికి సత్యగారే నిలువెత్తు నిదర్శనం.
దరిమిలా ఎప్పుడు సామాజిక విషయాలపై మాట్లాడుకోవాలన్నా ఒక మిత్రురాలిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.
అంతదాకా ఎందుకు . వారి పేరును ఇంగ్లీషులో ఎలా రాయాలో అడగండి.
ఎక్కడా (H) హెచ్ లు లేని సత్యవతిని!అంటారు పకపకలాడుతూ.
నిజమే.వారు హెచ్చులొచ్చులు లేని సత్యవతి గారు !
సత్యవతి అరవై మల్లెలెత్తు ...కాదు కాదు అరవై పొగడపూల ఎత్తు అదీ కాదు అరవై మొగలిపూరేకుల ఎత్తు.. అబ్బే ... అదీ కాదు అరవిచ్చిన అరవై  తామరల ఎత్తు !
అరవైయవ పుట్టినరోజు జేజేలు సంబరాల పాపాయి!
మనసారా!
***
నాస్తికుల కళాదృష్టి ని చిన్నప్పటి నుంచి దగ్గరగా చూస్తూ పెరిగాను కదా.పాతవన్నీ రోత అని తోసిపుచ్చడం నేను ఎరుగుదు.
బహూశా అన్ని సమాజాల్లాగానే మన సమాజంలోనూ మతానికీ సంస్కృతికి మధ్య గల భేదాన్ని గుర్తించడంలో అందరితో పాటు నాస్తికులూ తరుచూ పొరపాటు పడుతూ ఉంటారని గ్రహించాను. మనిషిలోని కళాదృష్టికి ప్రకృతి ప్రేమకూ శాస్త్రీయ దృష్టికి మధ్యన ఒక అయోమయం ఉన్నదన్నది మనం ఒప్పుకోవాలి.
 ఉదాహరణకి మల్లెల మాలల గురించి మాట్లాడడం భావుకుల జాబితాలో పడి పోతుంది. సమాజం గురించి మాట్లాడే వారు సన్నజాజులు, పొగడపూలు ,జలపాతాలు ఇలాంటి సుందరమనోహర దృశ్యాల గురించి మాట్లాడారంటే ,వారిని సందేహంగా  చూస్తాం. ఇలాంటి పడికట్టు అభిప్రాయాలు మన నాస్తిక హేతువాద ప్రపంచాల్లో బోలెడు ఉన్నాయి.
కష్టాల కొలిమిలో భగభగలాడుతున్నా పూమొగ్గలాగ నిలబడడం ఎలాగన్నది సత్యగారిని చూసి నేర్వాలి.
రహస్యం ఏమీ లేదు. జీవితం పట్ల అపారమైన ప్రేమ, విశ్వాసం . అంతులేని సానుకూల దృక్పథం .
రాను రాను వస్తులోకంగా వినిమయ ప్రపంచంగా మారిపోతూన్న మన సామాజిక దృక్ప్థాలలో, మానవ సంబంధాలన్నీ లావాదేవీలుగా , ప్లాస్టిక్ మొక్కలుగా కృత్రిమ జీవవిస్ధనాల్లోకి ఇరుక్కొనే సంఘర్షణల్లో పడి మనిషివిచ్చిన్నమయిపోతూ ఉన్నప్పుడు, 
ప్రకృతి లో భాగమైన మనిషి ప్రకృతినుంచే పొందవలసిన స్వాంతననను, ఓదార్పును, ప్రేరణనూ , ఉత్తేజాన్ని..
సత్యవతిగారు జీవించి చూపుతున్నారు. 
మనం వారినుంచి అందిపుచ్చుకోవాల్సింది అదే.జీవితం అన్నది ఎక్కడో లేదు.జీవించవలసింది ఎప్పుడో కాదు.  
 ప్రతిక్షణం. ప్రతి చోట.
జీవించండి. జీవించనివ్వండి.
అందుచేతనే , నేను ఆప్యాయంగా పిలుచుకొనే సెత్తెమ్మ గోరు .. ఒక చేత కొరడాను మరొక చేత పువ్వులను పట్టుకొని నడుస్తారు
నడిపిస్తారు
నడిచే పువ్వులకొరడా మన సెత్తెమ్మ!
సత్యవతి గారి నుంచి నేను  నేర్చుకొంది అదే. ప్రకృతిలో భాగమైన మనం ప్రకృతి లోని ప్రతి చిన్న అంశాన్ని ఆనందిచగలగడం
మన భారతీయ సౌందర్యశాస్త్రజ్ఞులు   ప్రస్తావించినట్లుగా "సత్యం శివం సుందరం
ప్రకృతి లోని జీవం  సత్యమూ .సుందరమూ. అది నిత్యమూ .నిరంతరమూ.
సత్యవతి గారు జీవిత మర్మాన్ని ఎరిగిన వారు. అందుచేత తను జీవిస్తూ జీవితసౌరభాన్ని పదిమందికి పంచాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారిలోని బుద్ధభావన ,ప్రకృతిప్రేమ , సాంఘిక ధర్మం  , సత్యనిరతి , ధర్మాబిలాష నూరేళ్ళు పచ్చగా ఎదగాలని ..
మా బోటి వాండ్లకు బాటగా బాసటగా నిలవాలని మరొక మారు కోరుకొంటున్నా.
ఆత్మీయంగా.
***
Related Link :  

తమరూ తామరలూ http://chandralata.blogspot.in/2011/08/blog-post_07.html


 ***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment