Aug 23, 2011

షోరాపూర్ కీ రాణీ

బహుశా ఆమె  తన ఏడేళ్ళ బిడ్డను పరాధీనం కాకుండా చేసి ఉంటే ,
మరో ఝాన్సి కీ రాణి అయి ఉండేదేమో..

బహుశా అతను పట్టుబడకుండా ఉంటే ,
మరో తాంతియా తోపే అయి ఉండే వాడేమో..

అతనిలోకి దూసుకుపోయిన ఆ తూటా ,
 యాదృచ్చికం కాదేమో....

జాతకాలు, మూఢనమ్మకాలు,అంధవిశ్వాసాలు...
ఆనాటి  అరాచకప్రభుతలో ..
పరప్రభుస్వామ్యాలకు రాచబాట వేసాయేమో....'

మీరే  స్వయం గా చదివి చూడ మనవి.

http://pustakam.net/?p=7990
***
ఒక్కోసారి ఊహిస్తే వింతగా తోస్తుంది.
ఏడాది పొడవునా ఎండ. చెమట.వేడిమి.ఉడక.ఉక్కబోత.
చిరచిర.గరగర.
అలాంటి ఈ ట్రంక్ రోడ్డు మీద ఆ దేశంకాని దేశం నుంచి వచ్చిన వాళ్ళు,
ఎర్రటి అంగీలు నల్లటి పంట్లాము తొడుక్కొని ..తోలు బూట్లలో పాదాలను బంధించి...
గుర్రాలపై ఎలా ఈ దండుబాటపై ఎలా ఊరేగే వారబ్బా...ఈ ఉడకకు ఊపిరే ఆడదే.. ఉక్కిరిబిక్కిరి అవరా మరి?” ..
అని.
మరి రాజ్యం వీరభోజ్యం అన్నారు కదా...
వీరుల వీరత్వం గురించి పక్కనబెట్టండి.
హంగు ఆర్భాటం గురించి.....
......మిగిలింది  పుస్తకం.నెట్  లోనేనండి.....




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 17, 2011

కుట్టనా...కుట్టనా...?!?

మొన్న పంద్రాగష్టున అన్ని ఛానెళ్ళతో పాటు ఓ జాతీయ ఛానెల్  వారు, పిల్లలకు జాతీయ గీతాల పోటీలు పెట్టారు. ముద్దుముద్దుగా ముచ్చటగా వాళ్ళు పాడేసారు. మనమేమో వినేసాం.,సారీ, చూసేసాం.

అక్కడికి నేను మాత్రం  తక్కువ తిన్నానేంటి?
రిమోట్ సవరించి  టకటకా బటన్లపై సరిగమలు నొక్కుతూ పోయా..
 ఇక్కడో పాట అక్కడో ఆట ..ఇక్కడో కవాతు అక్కడో కత్రినా..
మధ్యలో ఎక్కడి నుంచి  వచ్చాడబ్బా ... ఈ బోసి నవ్వుల తాతాజీ!

అదేనండి మరి నేను చెప్ప బోయేది.. మన అన్నాజీ గురించి.
అది అన్నా గారికి అందుతోన్న పాపులారిటీ కి ఒక చిన్న ఉదాహరణన్న మాట!
"ఫూలో సితారోకా సబ్ కా కహనా హై... లాఖో హజారో మే హమారీ అన్నా హై...!"అంటూ వందలాది మంది ప్రేక్షకులతో.. ఆయన గొంతు కలిపారు చూడండి.. సారీ సారీ.. వందలాది వేలాది లక్షలాది ..మంది ఆయన తో గొంతు కలుపుతున్నారు చూడండి ..ఎంత చూడ ముచ్చటగా కన్నుల పండువ గా ఉన్నదో కదా?

అరరే..మన్నించండి. ఇంకా రాఖీ పాట నన్నొదిలినట్టు లేదు.కలం సవరించుకో బోతూ గొంతు సవరించుకొన్నా ..తప్పు నాది కాదండి.అదో దేవానందం!

చిన్ని గొంతులు అంత ఆర్ద్రతతో .. "  ఓ నా దేశ ప్రజలారా..మీ కళ్ళను కాస్తంత చెమ్మగిల్ల నివ్వండి..."
(ఓ మేరే వతన్ కే లోగొన్..జర ఆంఖో మే భర్ లో పానీ..)
అంటూ హృద్యంగా పాడుతుంటే.. మరి గుండె చెమ్మగిల్లదా చెప్పండి?

అది సరే గానీండి...
ఎవరికి వాళ్ళం మన పాటికి మనం హాయిగా ఉద్యోగం సద్యోగం చేసుకొంటూ .. జీతం గీతం తీసుకొంటూ.. వ్యాపారంవ్యవహారం సాగిస్తూ ..ఆపై తృణమూఫణమూ సమర్పించుకొంటూ ,ఎవరిపాటికి వాళ్ళం బాగానే ఉన్నామే !

మరి ఈ పెద్దాయనకి మన గీతాల గురించెందుకు? పై రాబడులు ఆదాయప్రదానాలు ఎందుకు?
ధనమూలం ఇదం జగత్తు అని పెద్దలే కదా అన్నారు. నీతో అవినీతో ..చేతిలో చమురుంటే కదా ..నాలుగు దీపాలు వెలిగేది? అంతెందుకు ఏ అన్నయ్య నడిగినా చెపుతాడుకదా .. దీపమున్నప్పుడే ఇల్లు చక్క దిద్దుకోవాలని!

మరి మన అన్నాజీ చెప్పేదేమిటి?
ఒక దీపం వెలిగించడానికి కోట్లాది ఇళ్ళళ్ళో దీపాలు ఆర్పొద్దని!

ప్రజాధనానికి హక్కుదారులు ప్రజలే.
ప్రజాధనం ఆదాయప్రదానాలపై జావాబుదారితనం తప్పనిసరి.
అంతెందుకు?  మన రాందాసు గారినే అడిగి చూడండి.. "ఎవడబ్బ సొమ్మని.." ఆ దేవదేవుడినే కడిగి..'పాడే'సాడు!
ప్రజాధనమా మజాకా మరి !
మన సొమ్ము బాగోగులు మనం కాకపోతే ఎవరు చూసుకొంటారు చెప్పండి?

మనమేమైనా, నేలమాళిగల్లో నాగబంధాల్లో దాచి ఉంచుతున్నామా చెప్పండి. ఎప్పటికైనా ఎవరైనా బయటకు తీయడానికి.. వంగి వంగి వినయంగా..దండాలు పెడుతూ ..పదవులూపలహారాలు చేస్తూ.. అందంగా అనుకూలంగా  అందిన అధికారాల్లో మడిచి ముడిచి .. విదేశీ స్వదేశీ .. .ఇందుకాదందుకాదన్నట్టుగా
 ...చేతయిన చోటల్లా ...భద్రం చేసుకొంటంటిమి!

అయితే మాత్రం..
చూస్తూ ఊరుకొంటారటండి..!

సొమ్ములు పోనాయండి..
అందులోనూ.. పెజాసోమ్యం..లో !!! 

అదండి విషయం.

కాకపోతే, ఎవరి బంగారుపుట్టలో వేలు పెడితే ,
ఎవరు ఊరుకొంటారు చెప్పండి!
కుట్టరా మరి!

***
అయితే మాత్రం..
నిజాయితీ గల ప్రయత్నాలకు ..
మనమూ ఒక అక్షరం అందిస్తే ..పోయేదేముంది..
అవినీతి తప్ప!

అడుగడుగులో అడుగు కలుపుదాం...
ముందుకే సాగుదాం..
అమ్మల్లారా, అయ్యాల్లారా.. అన్నల్లారా చెల్లెల్లారా..
ఒక్కసారి పిడికిలి బిగించి గట్టిగా అనండి...
***
అన్నాజీ ,
జై హింద్!
మేరా భారత్ మహాన్!
***

DSCN6258.JPG


"అన్నా కు, అన్నా వెంట నడిచిన కోట్లాది బారతీయులకు నా అభినందనలు."
 అని అంటూ సత్యవతి  కొండవీటి గారు 
 కొండమల్లెల నడుమ అమర్చిన 
 అనారుపూల గుచ్చాన్ని పంపారు.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 7, 2011

తమరూ తామరలూ

ఒక్క సారి ఊహించండి.
మన భాగ్యనగరం లో...
అందునా బేగం పేటలో ...ఒక చిన్న నీటి కొలను ..అది తేట నీరుదే అనుకుందాం.
అందులో అపుడే పూసిన తామర పూవు.
అవునండి. అదే ...
మన లచ్చిందేవమ్మ చక్కగా సింగారించుకొని  బాసింపట్ట వేసుక్కూచుంటుందే ...
అచ్చంగా అదే రంగు తామర పూవు పూసిందనుకోండి.
పూసీ పూయగానే చూసి ఊరుకొనే వారెవరు చెప్మా! 'అని తరువాత హాశ్చిర్య పోదురు గానీ, ముందు నా మాటినండీ తమరు ..
ఆ కొలను లోని తామర పూవును కొనగోట కోసి..ఛ .. ఇది అసలు సిసలుకాబోదు కదూ.. కొనగోటి తో తామర పూవెల కోస్తారు మరీ చిత్రం కాకపోతేను?
బురద నీట్లో మునిగి ,నీటి పాచును జమ్మిపొదల్నిదాటుకొంటూ..నీటిమధ్యలోకెళ్ళి.. రెండు చేతుల్తో  తామర తూడును పట్టి బలంగా లాగితేనో ...కొడవలితో .. పోనీండి పట్నంవాళ్ళు కాబోలు.. చాకు తో చటుక్కున గాటు పెడితేనో గాని ..ఓ పట్టాన పూవు తూడును వదిలి ..చేతికి రాదయ్యే...!
సరే లెద్దూ..
అష్ట కష్టాలు పడి.. కష్టనష్టాలు పడి.. తిరిగొద్దామంటే,
నేనున్ననంటూ  ...
ఏ చిరు చేపో కప్ప పిల్లో .. కాలిని వేలిని తాకి గిలిగింతలు పెట్టబోతే ,
జలగో నీటి పామో అనుకొని ...చిన్నదో పెద్దదో గెంతేసి... భయంతో కెవ్వున కేకేసి...బురదలో బోర్లా పడబోతూ.. తట్టు కొని నిలబడి...తామర తూడుల్లెమ్మని తేరుకొని.. ఊపిరి బిగబెట్టి ..ఒడ్డుకొచ్చి పడ్డానికి అదేమైనా మా వూరి చెరువటండీ!
భాగ్యనగరం ఇంటి పెరటిలో బుజ్జి నీటి కొలనైతే!
అయితే మాత్రం.. ఎక్కడి బేగంపేట మరెక్కడి బాగ్ లింగం పల్లి ..
అక్కడ నుంచి ఇక్కడకు .ఎన్ని మెలికల రోడ్లు ...
ఎంత ట్రాఫిక్ .. ఎంత మంది జనం...ఎంత పొగ ..దుమ్ము ..
ఒంటిచేత్తో లాఘవంగా వాహనాన్ని లాగించేసినా ఉదయం పూట ..అందునా బడులు ఆఫీసుల గందరగోళంలో ..వంటరి ప్రయాణం మాట అటుంచి..
తెల్లవారడంతో పూచిన పూవును ..కొలను నుంచి కోసిన క్షణం నుంచీ..
ఆ సూరీడి వేడిమి నుంచి దాచేస్తూ..
వాలిపోక మునుపే ..
సోలిపోక మునుపే  ..
అపురూపంగా అందిచగలిగారంటే ..
అది మరెవరూ..మనసెరిగిన ..మంచి స్నేహితురాలు కాక!
అర్ధమయి పోయింది కదా..
ఆకస్మాత్తుగా ఒక తాజా తామర ...అందునా మన నగరం నడిబొడ్డులో ..

ఆప్యాయంగా  అందించిన ఆ స్నేహితురాలు ..నన్నెంత ఆశ్చర్యాందానుభూతులలో
ముంచేసిందో..ఒక్కసారిగా ఎన్నెన్ని జ్ఞాపకాలు ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరి చేశాయో !

ఆ స్నేహితురాలేవరంటారా?
ఇంకెవరు?
 మన సత్య గారే.
మరేనండి..

" భూమిక "సంపాదకులు కొండవీటి సత్యవతి గారే.
సంపాదకులు రచయితల మైత్రి ఇలా కూడా ఉండొచ్చునమ్మోయ్ !అంతే కాదు క్రమం తప్పకుండా ప్రతి కొత్త ఏడాదికీ ఆవిడ పంపే పొగడపూలు, బ్రహ్మికమలాలు పూసీ పూయగానే ..ఏమండొయ్ మాఇంటికి రారండోయ్ పూలు పూచాయండోయ్ ..అంటూ చేసే హడావుడి..

పాపికొండలకు వెళుతూ దారంతా కొంటూ వెళ్ళిన మొగలి పూవులు ...గోదారి గట్టంట  పోగేసుకొచ్చిన వెదురు పూలు ..
ఒక్కటేమిటి ఈ జాబితా కి అంతేది! అదుపేది!
ఆ మాటకి వస్తే ,దొరికితే ఇప్ప పూలైనా ...మనకి వోకే !
ఇంతటి సంతోషాన్ని పంచిన సత్యాజి అలా ..మరింత సంతోషం పంచుతూనే పోవాలని..
వారి స్నేహసౌరభాలు కలకాలం నిలిచే వెలకట్టలేని అపురూప బహుమానాలనీ ..వేరే చెప్పక్కర లేదు కదా.!
ఆ ఆప్యాయతను  నేనుచేసుకొని.. ఆ  తామరను మీతో ను పంచుకొంటున్నా..!
ఎంతైనా మనం మనం స్నేహితులం కదా...!
అందులో ను సత్యగారికి ఈ మాట  తెలిస్తే ఇంకెంత సంబపడిపోతారో..!
అవునండి .
పంచుకొంటే పెరిగేది స్నేహము.
అది సత్యమూ.నిత్యమూ.
***
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ...
మిత్రులారా...
ఇవ్వదలుకొన్నారే అనుకోండీ..
ఏ షరాబు విలువలు కట్టలేని అపురూప బహుమతులందించడి మీ స్నేహితులకి..
ఈ స్నేహితుల పండుగ రోజున!
ఆ బహుమతి ని డబ్బుదస్కం తో మాత్రం అస్సలు తూచకూడండొయ్!
అదొక్కటే షరతు!
మీకు ఓకే నా !
*
ఆలోచించండి . అందించండి.
మన సత్య గారి లాగా..!
**
స్నేహితుల పండగ జేజేలు .
మీ అందరికీ.
***
తామరతంపరలా స్నేహబంధాలు వర్దిల్లు గాక!
తథాస్తు !!!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 3, 2011

అదే “మో” , కానీ …

అదేమో ???
అదే...
“మో” !!!
*** 
మహీధర “కొల్లాయిగట్టితేనేమి ?http://ukcatalogue.oup.com/product/9780198077374.do  ” మో ఆంగ్లీకరణతో మన ముందుకు వచ్చే  రోజు దగ్గరలో నే ఉందని భావిస్తూ , ఈ లోగా, వారి అనువాద శైలిని మీరు ఆస్వాదించండి .

http://pustakam.net/?p=7872 

మో గారికి గౌరవంతో .
అభిమానం తో.
వారీ అనువాదాన్ని  ఏనాటికీ అచ్చులో చూడలేరు కదా ...
అన్న దుఃఖం తో.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 2, 2011

పని... మర్యాద...అతను !

నాలుగునాళ్ళ నాటి మాట.
పెద్దా చిన్నా చితక  సామాను తో సహా
అలా  రైలు  దిగాలని నిలబడ్డానో లేదో ,  పిలవకనే ...
ఇలా ప్రత్యక్షమయి సామాను ను చనువుగా అందుకొని ప్లాట్ ఫాం మీద పెట్టేసి , కులాసాగా నిలబడి.. ఆ పై, అమాంతంగా నెత్తికెక్కించు కోబోయాడొకతను .
"అయ్యా బాబూ కాస్తాగు.." అని  అతను అడిగిన దానికి నేను ఇద్దామనుకొన్న దానికి సరితూగడంతో .. అలాగే లెమ్మనుకొన్నా.
సరే, చిన్నా చితక సామాను నేనే పట్టుకొని, ఒక పెద్ద చక్రాల బ్యాగును మరొక సూట్ కేసు అతనికి చూపించాను.
మా వూరి కొత్త ప్లాట్ ఫాం చక్రాల సామాను ను లాక్కెళ్ళను భలే వీలుగా కట్టారులెండి. ఆసుపత్రుల్లో ఉంటాయే అలాంటి  పేద్ద మెలికల రాంపు కూడా ఉంది.
కనుక, పెద్ద బ్యాగు మరో సూట్ కేసు.
చక్రాల సామాను ను చక్కా చులాక్కా లాక్కును పోవచ్చు. పని నేనూ చేయచ్చును .కానీ , అతను చేయనిచ్చేట్టు లేడు.
ఒప్పుకోనంటే  ఒప్పుకోనంటుంటే ఏం చేస్తాం చెప్పండి?ఏం చేయాలి చెప్మా ? అన్న ఆలోచనలో పడక మునుపే, 
అతను సామాను వంకే కన్నార్పకుండా  చూస్తూ ,తన ఎర్ర చొక్కా చివర్లను మారు ధీమా గా దులుపుకొని ,ముంజేతి ఇత్తడి బిళ్ళను సవరించుకో సాగాడు.
అందవలసిన సమాధానం అందించేసాడతను
మౌనం గానే.  
అందులోను, భుజాన ,చేతుల్లోను చిన్న చిన్న సామాను ఎలాగు ఉన్నాయి కదా.
అతనితో చెప్పాను.
అవి రెండు చక్రాల సామాను అలా లాక్కుని వెళ్లచ్చు లెమ్మని.
అతను మందస్మిత వదనంతో , విలాసంగా , మారు తన తలపాగా దులిపి కట్టుకొని , సామాను నెత్తికెక్కించుకొన్నాడు.
సామాను బరువునే కాదు చక్రాల బరువును  నవ్వుతూ తలకెత్తున్నాడతను !
అది అనవసరమని గట్టిగా వారించ బోయినా , సులువైన మార్గం సూచించ బోయినా .. అతను చెవిన బెట్ట లేదు సరికదా... పైనుంచి నవ్వుతూనే నిరాకరించాడు.
"నా పని నేను చేస్తేనే మర్యాద" అతను అన్నాడు," అడిగి తీసుకొన్న మొత్తానికి న్యాయం చేయాలి  కదమ్మా!" పై వడివడిగా ముందుకెళ్ళి పోసాగాడు.
తెల్లవారే జ్ఞానోదయం ఏమైనా  కలిగిందా ..అని  అరక్షణం అయోమయంలో పడి ..తేరుకొని..
అతని వెనక పరుగు పెట్టాను...
నా చిన్నా చితకా సామాను తో సహా !
మర్యాదగా!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.