Dec 15, 2009

కొంగలలో కెల్ల


"కొంగలలో కెల్ల ఏ కొంగ మేలు ?"

అంటే మీరెవరూ చెప్పలేరేమో ..కానీ...

మా కొంగే మేలని మేము ఈ బొమ్మ సాక్షిగా చెప్పేయగలం!

నిజమండీ.. మా కొలనుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి..
వెచ్చదనంలో సేదదీరి..సంతానం పెంపొందించుకొనే ..
అనేకానేక కొంగజాతులపక్షులతో
కొలను మడవనం కడలీతీరం నీలాకాశం
కళకళాడే రోజులివి.
ఆ కొంగల సొగసు సొబగు చూడ తరమా!

*
కొంగల్లారా కొంగల్లారా..
మీకు కావలిసినన్ని చేపలు దొరికాయా?కడుపు నిండిందా?
అసలు,మడచెట్ల మాటు దొరికింది కదా? మీ సరాగాలకు..!
మీ పిల్లలకు గూడు ..మీకు నిలకడైన నీడా ...అన్నీ సౌఖ్యమే ..కదా?
అరరే..! అదేమిటీ..అక్కడ ఎవరో ..నలుగురట... మిమ్మల్ని మట్టుపెట్టారట!
హాయిగా గాలిలో రెక్కలల్లార్చుతున్న మిమ్మల్ని ...పిల్లలకు ఒక చెపను ముక్కున బట్టి గక్కున పైకెగిరిన మిమ్మల్ని..ఆకాశవీధిలో విహరించి కొమ్మపై కులాసాగా వాలిన మిమ్మల్ని..ఎక్కుపెట్టారట !

ఇంతకన్నా ఘోరం ఉంటుందా?
మీరు ఒదిలిన ఊపిరి మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మమ్మల్ని మన్నించండమ్మా..!
మళ్ళీ ఏడాది రావడం మానుకునేరు..! మరో చోటు వెతక కండమ్మా! మీరు రాలేని మా వూరు..అది వూరేనా? *
ఎప్పుడయ్యా మారతారు మీరు? మన అతిథులు వారు! శ్రీ శ్రీ శ్రీమాన్ కొంగ గారు! సకుటుంబ సపరివార సమేతంగా, సైబేరియా నుంచి విచ్చేసినారు!! * ఆ నలుగురిని నాలుగునాళ్ళు ఎక్కడో ఒక చోట బంధించి ..నాలుగు మాటలు అంటించి ..
తిప్పి పంపుతారేమో ! అయినా,మన కన్నా ముందే ,
మన అతిథులను ఆ కొలను ఆహ్వానించినదన్న మాట !
ఆ నలుగురి తలలలోకి ఆమాట ఎలాగ ఎక్కించడం?
అదుగో ఎవరో అంటున్నారు..వాళ్ళు మన వాళ్ళు కారు.పొరుగు వారు. అలాగా? మన పొరుగువారు మన అతిథులను గాయపరిచే ముందుగా ,
వారు మన గూటిలో మన కొలను నీటిలో ..మన కడలి తీరంలో...
మన చెట్ల కొమ్మల గుబుర్లలో... అన్నెందుకు..
మన పరిరక్షణలోఉన్నారన్న భావన
ఎందుకు కలిగించలేక పోయాం? వాటి రెక్కను తాకితే, మన గుండె విలవిలలాడి పోతుందని
వారెందుకు గ్రహించలేదంటారు? ఒక బిష్నోయి కృష్ణజింక ను కళ్ళల్లో పెట్టుకున్నట్లు,
మనం మన అతిథులను కనుపాపలలో దాచుకొన్నామా?దాచుకోగలిగామా? అదే , మనం వేసుకోవాల్సిన ప్రశ్న.

*
వీలుచేసుని మా వూరికి రండి.
మా అతిథులను ..వారి ముద్దుముచ్చట్లను .. విన్యాసాలనూ విలాసాలను
కనులారా చూసి వెళ్ళండి.మనసారా మధురమైన జ్ఞాపకాలు దాచుకెళ్ళండి. మా అతిథుల అలకను తీర్చి వెళ్ళండి. * ఫోటో లో ఉన్నది. పులికాట్ సరస్సులో అతిథి పక్షులతో పాటూ ..
ఆడుతూ పాడుతూ తిరిగె మా కొలను కొంగ. *
చిన్నప్పుడు నెహ్రూ గారి మాటగా విన్నానొక మాట. Shoot with the camera not with the gun అని.
మీ కెమేరా తదితర సామాగ్రి తెచ్చుకోవడం మరిచిపోయేరు సుమా!

4 comments:

 1. hmmm బాగుంది బాగుంది మీ కొంగల కథనం.
  నాలాగే మీకూ పశువులు,పక్షులు, చెట్తుచేమలతో మాట్లాడే అలవాటుందన్నమాట
  కంగ్రాట్స్..

  ReplyDelete
 2. అయితే,మీరు కూడా మా జాతి వారేనన్నమాట!
  సంతోషం.
  మరి ఎప్పుడు వస్తున్నారు...పులికాట్ కొలనుకు ?
  చాలా బావుంటుంది.

  ReplyDelete
 3. బాగుంది చంద్రలత గారూ.. తేలి నీలాపురం లో కొంగలకి కూడా సమస్య రాబోతోంది కదా.. నాకెందుకో మీరు ఒక నవల ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తోంది..

  ReplyDelete
 4. మురళి గారు,
  అహహా..అలాంటి ప్రమాదం లో మిమ్మల్ని ఇప్పుడిప్పుడే పడేయనని మీకు హామీ ఇస్తున్నా! :-)

  మీ అభిప్రాయాలకు సూచనలకు ..
  అనేక ధన్యవాదాలు.

  ఇక, మీరు మా వూరు ఎప్పుడు వస్తున్నారు?
  మా కొలనులో సోయగాలు కొన్నాళ్ళే !

  ReplyDelete