Nov 4, 2009

దోవ చూపే బోయడు

పట్టాభి ఏకబిగిన మాట్లాడడం ప్రారంభించాడు.

అక్షత కొట్టడం కూడా మరిచి మౌనంగా పట్టాభి మాటలు వింటోంది.

అతనలా మాట్లాడం ఇదే మొదటి సారి మరి!

నేనప్పుడు చాలా చిన్న వాణ్ణి.అవ్వగారిల్లు ఏటికి ఆ తట్టు.రాకపోకలకు ఏరు దాటాలి.

ఒకసారి అమ్మ పుట్టింటినుంచి అత్తింటికి బయలుదేరింది. మేనాలో.

పల్లకిని మోసే బోయీలు కాక పల్లకీ ముందు ఒక బోయి పరిగెత్తేవాడు.

దారి చూపుతూ.దారి చేస్తూ.

అది మంచి ఎండల కాలం.

పొద్దు పొడిచిన వెంటనే బయలు దేరినా ఏటి దగ్గరికి వెచ్చే సరికే ఎండ బారెడయ్యింది.

సాంగ్యాలు తెస్తున్న వారి సవారి బండ్లు చుట్టు బాటను పట్టాయి.ఆడవారి పల్లకీలు అడ్డదారిని పట్టాయి.

వడ గాలి.ఉడక .ఉబ్బరం.

పల్లకీ మోసే వారి భారమైన నడక.

అమ్మ బాలెంత. యశోద పసిగుడ్డు.

దారి చూపే బోయి నడి పొద్దు లోపల ఊరికి చేరాలని ఉరుకులు పరుగులు పెడుతున్నాడు.

నీరు దాటి.ఏరు దాటి. గట్టు దాటి.గుట్ట దాటి.

రేగడి ఇసుక,రాళ్ళురప్పలు, మెట్టలుపల్లలు,చెట్లూచేమలు, పొలాలు పొలిమేరలు.

అహోం... అహోం... హోం..

గస పెడుతూ .చెమట్లు గక్కుతూ...జెముళ్ళు చెక్కుతూ...తుమ్మలు తొక్కుతూ.

వాడిని అందుకోను పల్లకీ మోసే బోయీలు..పదాలు అల్లుతూ కదాలు సాగుతూ.

"పాల్కీ అట్ల ఆపి ఆనపబుర్రలన్నా జుర్రినవారు కారు"అమ్మ వాపోయింది.

ఆత్రంలో ఆమె మాట ఎవరూ చెవిన బెట్ట లేదు. ముందు ఉరికే వానికి మోతబోయీలకూ పంతం ముదిరింది. పరుగుల పందెం పెట్టినట్లుగా. వారి దూకుడు చూసి ముందు బోయి మరింత ఉరుకు.

దోవ చూపే బోయడు చూస్తుండగానే ఊరి పొలిమేర దాటినాడు.సత్రం దాటినాడు.మాలక్ష్మమ్మ చెట్టు దాటినాడు.చెరువుగట్టు దాటినాడు.బంగ్లాతోట దాటినాడు. మన దర్వాజా ముందుకు వచ్చి గడపలో బొక్క బోర్లా పడినాడు.

వెనుకనే ఒక్కో పల్లకీ వచ్హ్చి మెల్లిగా ఆగింది.

ఊరిముత్తైదువలు అమ్మను చుట్టు ముట్టారు.ఎర్రనీళ్ళూ తీసినారు. ఎండుమిరపకాయలు తీసినారు.టెంకాయలు పగల గొట్టినారు.వార పోసినారు. కడవల కొద్దీ నీరు పారినా బోర్లాబొక్క పడ్డ బోయీ మరి లేవలేదు.

కడవల్లో నీరు కడుపు చేర లేదు.

దుత్తలో మజ్జిగ నీళ్ళను పుక్కిలి పట్టలేదు.ఆనప బుర్ర ఆవంతైనా పెదవి తడపలేదు.

గుక్క తిరగని బోయడు తిరిగి లేవ లేదు.

అమ్మ గుండె పగిలి పోయింది.

మళ్ళీ జన్మలొ మేనా ఎక్కలేదు!”

అక్షత నిశ్చేశ్టురాలైయింది. గొంతు పెగల్చుకొని ఎట్లో అడిగింది. "మామా...ఇదంతా..."

"నిజమే!"

అక్షత నోట మాట రాలేదు.

<"దృశ్యాదృశ్యం" నవల నుంచి>

5 comments:

  1. bagundandi...good work

    ReplyDelete
  2. ధన్యవాదాలండి.

    ReplyDelete
  3. ఈ దృశ్యం నాకు బాగా గుర్తుంది.

    ReplyDelete
  4. ఎలాగంటారు?
    తెలుసుకోవాలని.

    ReplyDelete
  5. చంద్ర లత గారు,
    కుశలమని తలుస్తాను. ఈ మధ్య జన్మభూమిలో జరుగుతున్న వింతల్లో, గనుల మాఫియా మమ్మల్ని కలవరపరుస్తోంది. కోట్లాది సంవత్సరాలుగా ప్రకృతి జీవచరాలకు ఇచ్చిన సంపద కొద్ది మంది స్వార్థ పరుల చేతుల్లోకి వెళుతుంటే, చీకటి సామ్రాజ్యాలను స్థాపించుకొని ప్రజలను దోపిడీ చేయడానికి ఉపయోగపడుతుంటే చూస్తూ ఊరికే ఉండ వలసినదేనా? మీలాంటి సామాజిక శాస్త్రవేత్తలు మార్పు కోసం కృషి చేయలేరా? ఇది మనందరి సమిష్టి బాధ్యత అని నేను తలుస్తాను. ఇనుప గనులైనా, చమురైనా ఎవరిచ్చారండీ వీళ్ళకీ అధికారం ప్రజల సొమ్మును దోపిడీ చేయటానికి? లేదా, తప్పంతా ప్రజలదే నంటారా, చూస్తూ చూస్తూ నేరస్తులకే వోట్లు వేసి వారిని అధికార పీఠంమీద కూర్చోపెట్టినందుకు ? విజ్ఞులు, మీరే నిర్ణయించాలి.

    ఈ రోజు ఈనాడు లో వచ్చిన వ్యాసం లింకు పొందు పరుస్తున్నాను.http://www.eenadu.net/htm/weekpanel1.asp
    భవదీయుడు,
    సునీల్ పూబోణి

    ReplyDelete