"మొక్కలు మనుషులతో మాట్లాడుతాయి. ఆ మాటలు వినగలిగిన వారు ఆ మొక్కలతో మమేకమైన వారు మాత్రమే."
ఈ మాటలు అనిన వారు అక్షరాలా హరిత విప్లవ పితామహుడు ..నార్మన్ డి. బోర్లాగ్.
మొక్కలతో మరింత సన్నిహితం గా ...మరిన్ని ఊసులు... పంచుకోవడానికి కాబోలు నిన్ననే మన లోకం నుంచి పయనమై పోయారు.
ప్రకృతిలో మమేకమై పోయారు.
ఓ పండుటాకులా.
భౌతికంగా,
ఇక మనకు లేరు.
గోధుమతో మొదలైన అన్ని పంటలకూ విస్తరించి... పిడికెడు మెతుకులు పట్టెడు పుట్టెడు గా .. ఇబ్బడి ముబ్బడి గా చేయగలిగే..అమాంతంగా అక్షయపాత్రలా మార్చేసే సూత్రాన్ని వారు ...మనకు అందించారు. మానవాళిని కరువుకాటకాల నుంచి ..ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన ఆర్ధిక సంక్షోభం నుంచి..ఆకలి చావుల నుంచి.. బయటపడేసిందండం లో సందేహం ఏమీ లేదు. హరిత విప్లవం.. ఒక్కసారిగా మార్చేసిన ప్రకృతి సహజత్వం.. పంటపొలాల్లో కృత్రిమరసాయనాల వెల్లువ..అవి మిగిల్చిన అవశేషాలు...సంక్షోభాలు...ఆ ప్రకృతి ఉనికినే ప్రమాదపు అంచులోకి నెట్టడం ... రైతుసంప్రదాయాలలో..రైతు కుటుంబాలలో సమూల మార్పును కలిగించడం... ఈ విప్లవానికి మరో వైపు.
కాగా,కీర్తి అపకీర్తి తనను కదిలించినా కుదిపివేసినా.. క్యాన్సర్ మహమ్మారి వారిని లోలోన కబళించి వేస్తున్నా..తను నమ్మిన బహుళార్ధ ప్రయోజం కోసం కడవరకూ జీవించిన శాస్త్రవేత్త..బోర్లాగ్.
*
అప్పటికి వచ్చిన వారెవరో తెలియదు.రూపురేఖల్లో మాటామన్ననల్లో మన తీరు కాదు.
తీర్చిన నిండైన విగ్రహం.మెడలో చెండు పూల దండ. పెదవులపై చెరగని చిరునవ్వు.
మా పొలాల్లో తిరుగుతుంటే పిల్లలం వింత పడుతూ..దూరంగా గెంతుతూ దుముకుతూ వెనకెనకే..వెళుతూ. మా వూరికి తార్రోడ్డు లేదు. మా పొలాలకి బండిబాట కూడ లేదు.గట్ల మీదే ప్రయాణం.అలవాటున పరుగు పరుగున.
అవి దివిసీమను అతలాకుతలం చేసిన తుఫాను తరువాతి పంటకాలం.
జడ్చర్ల జొన్నల్లో కంకులు వింత పోకడలు పోయాయి. శ్రీశైల సానువుల్లో వంకాయ వెర్రికాపు కాసింది. ఇవీ అవీ ... అన్నిటి వెనకా వున్న శాస్త్రీయ రహస్యాలు శోధించాడనికి.. తుఫాను తరువాతి పంట అధ్యయానానికి ..బోర్లాగ్ గారు వచ్చారనీ ..శ్రీ నీలం రాజు గంగాప్రసాద్ గారు వెంట పెట్టుకొని వచ్చారనీ ఆ తరువాత ఎప్పటికో తెలిసింది.
అవును .. మా పొలాల్లో వారు తిరుగాడారు.
ఒక చిన్న జ్ఞాపకం. అపురూప అనుభవం.
*
ఎంతని..?!?
పట్టుమని అర శతాబ్ద కాలం.
ఈ విశ్వకాలం లో ఎన్నో వంతనీ? ఇంతలో ఎంత మార్పు..ఎంత ప్రగతి..ఎంత ఉన్నతి.. వీటికి బీజం వేసి ..మానవ మనుగడలో సరికొత్త వ్యవసాయ చరిత్ర రాసి ... సరికొత్త సవాళ్ళను విసిరేసి..నిశ్శబ్దం గా కాలంలో కలిసి పోయిన ..
గోధుమతాతయ్యకు...
గోరంత నివాళి.
All rights @ writer.Title,labels, postings and related copyright reserved.
May his soul rest in peace !
ReplyDeleteబోర్లాగ్ కు నా నివాళి.
ReplyDelete