Sep 6, 2009

ఎక్కడి పిల్లలు అక్కడే... గప్ చుప్ ... !

హమ్మయ్య...! బళ్ళు తెరిచేశారు.. మా నందూ గాడిని బడికి పంపి హాయిగా ఊపిరి పీల్చుకొంటున్నా...!"

సిరి సోమవారం ఉదయాన్నే చిట్టిసందేశం పంపింది.

ఎండాకాలం సెలవలు అంటారే కానీ, ఎండలు తగ్గనే లేదు..బడులు తెరిచేశారు.

వానలకోసం బడులు ఆగుతాయా?

మాటకు మాటే చెప్పుకోవాలి..!

సిరి అంతలా బేజారెత్తిందంటే ఎత్తదూ మరి !

వాళ్ళబ్బాయి ,నందూ, రెణ్ణెళ్ళూ టివి... తప్పితే ప్లే స్టేషన్ ..లేదూ వీడియో కళ్ళు పత్తి కాయలయిపోయాయని సిరి ఫిర్యాదు..

“ అవి నీవు కొని తెచ్చుకొన్నవే తల్లీ .. అందామన్నా .. నలుగురితో పాటు నారాయణ చందమే గాని ,సిరిని మాత్రం ఏం అనగలం ? అందులోనూ , సిరి వాళ్ళాయన సిరికింజెప్పడు .మర్కెట్ లోని కొత్త వస్తువులన్నీ కొని ఇంట్లో పడేస్తుంటాడు.ఇప్పుడంటే ఆర్ధిక సంక్షోభం బెంబేలెత్తి కాస్తా ఆగాడు కాని.

సిరి ఏమి చేయ గలదనిపించింది వైపు.

నిజమే ,పిల్లలన్నాక టివి చూడకుండా , వీడియో గేంలు ,ప్లే స్టేషన్లు ఆడకుండా ఎట్లా, ఇప్పుడు ఆడక పోతే మరెప్పుడు ఆడతారు...అని మరో వైపు.

కాని వేసవి అంతా ఆటపాటల్లో అమ్మమ్మ గారింట్లోనో మామిడితోటల్లోనో ..తాటి తోపుల్లోనో పిల్లలు కేరింతలు కొడుతూ తిరిగే రోజులు మళ్ళీ రావు కదా..!!!

గడ్డివాముల్లో మాగేసుకొని తిన్న ఈతకాయలు,సపోటాలు .. పైనుంచి సీమ చింతకాయలు.అబ్బ!

ఇప్పుడేమో, వాములు లేవు తోటలూ లేవు.

నందూనీ అమ్మమ్మ గారింట్లో వదిలి రాకూడదూ.. మాటే అడిగా ఒకసారి.

హమ్మో ఇంకేమైనా ఉందా.. మా అన్నయ్య గారి పెద్దబ్బాయి ఆరో తరగతిలోకి వచ్చేసాడు.ఎంసెట్ రాయాలి చిన్నమ్మాయి అయిదు .ఆమె టార్గెట్ మెడిసిన్.వీడినీ వేసంకాలం శిబిరాల్లో వదిలేద్దును..ప్రశాంతంగా.వీడు ఎప్పుడు అయిదో తరగతికి వస్తాడో..

నిజమే నందూ ఇంకా ఆరేళ్ళు దాటినట్లు లేడు..! పాపం సిరి. !

వేసవి వచ్చిందంటే పిల్లలని పట్టుకొని బుద్ధివిచారం వివరం నేర్పే పని పెట్టుకొంటాం ఎవరమైనా.

ఫిల్లలు బుద్దిగా ఉండడం ఎంతో అవసరం

అందుకే వేసవి అంటే.... చదవడం. మరింత చదవడం.

వారి కోసం ఇప్పుడు బడులన్నీ వేసవిలోనే తెరిచేస్తున్నారు.లేదూ వారివే ఏవో ప్రత్యేక శిక్షణలు .

లెక్కలు. సైన్స్ . చాలు చాలు. తెలివి గల పిల్లలు తయారు..!

మా పక్కింట్లో మరో భారతం. మొన్న వేసవి నాటి మాట.

పిల్లలంతా చేరి బాల్కని లో క్రికెట్ ఆడి మా మా వీధి మధ్యాహ్నం నిద్రను చిటెకె లో మటుమాయం చేసేసారు.

వీధి లో క్రికెట్ ఆడదామంటే.. పక్కన దోసల బండి.. పక్కన ఆటో స్టాండ్ .

బజ్జీలు కిళ్ళీలు నిమ్మ సోడాబళ్ళు కొబ్బరిబోండాలు. .. పక్కనే పాత పేపర్ల చెత్తసేకరణ కేంద్రం. మరో పక్కన వాడిన సెలైన్ సీసాల తోపుడు బళ్ళు. మూల నుంచి మూలకు పరిగెట్టాలన్నా ఎగిరి దూకాలన్నా.. పిల్లలు అరివీర అభిమన్యులు అయితే తప్ప ఆటసాగదు. తీరు తెన్ను లేకుండా దూసుకు వచ్చే కార్లు మోటార్ సైకిళ్ళు..ఆటోలు... వాటిని చాకచక్యం గా తప్పించుకొంటూ బౌలింగ్ చేస్తుంటే సెంచురీలు కొడుతుంటే చూడ ముచ్చటగానే ఉంటుంది.

భళ్ళున శబ్దం.

శుభం..!

పిల్లలు పక్కింటి డాక్టరు గారి డిస్ ప్లే బోర్డు ఢామ్మంది. ఆయన మాత్రం తక్కువా కోతుల్ని తరిమి కొట్టే గాలి తుపాకి పట్టుకొచ్చారు.పిల్లలు పరుగో పరుగు. ఎక్కడో దూరంగా మళ్ళీ అరుపులు. గ్రౌండ్ లోకో వెళ్ళక ఏమిటా గోల...ఆయన విసుక్కున్నారు.

మా వూళ్ళో సూరీడు పొద్దెరగడు.ఎప్పుడూ మధ్యాహ్న భానుడే...! పిల్లలు ఎక్కడికి వెళతారు?

సరిగ్గా అందుకే సిరి నందూ ని చెవి మెలేసి ...వీధితలుపు తాళం బిగించి.. గదిలో కూలేసింది.

ఇక నందూ పని గుడుగుడు గుంజం. ఇంట్లోనే నందూ బౌలింగ్ వాల్ ప్రాక్టీస్ కొనసాగించాడు.వాడి నైపుణ్యం రోజురోజుకీ పెరిగి పోయింది. ట్యూబ్ లైట్లు రెండో మూడో పగిలిన మాట వాస్తవమే ..ఆలాగే టీపాయి మీది గాజుపలక.

మనలో మాట .. వాడేం చేస్తాడు చెప్పండి ? సాండ్ విచ్ చేయాలనుకొని జాం సీసాను.. ఆంలెట్లు వేయాలనుకొని కోడిగుడ్లను..రస్నా కలుపు కోవాలనుకోని గాజుగ్లాసును.. జార విడిచాడు . అంతే ..!

వేసం కాలం మధ్యాహ్నం కునుకు తీసే అలవాటు సిరిది. భళ్ళు భళ్ళు మన్న ప్రతీ సారీ ఉలుకులికి పడి లేచేది..

నిద్ర చెరుపు. పై నుంచి నేల తుడుపు...!

నడుం వాల్చిన పాపాన పోలేదు ..వేసవంతాను..మరి బడి తెరవగానే ఊపిరి పీల్చుకొందంటే పీల్చుకోదూ...?

మొదటి రోజు బడిలో వదిలీ వదల గానే టీచరు సైలెన్స్ అనడం ఆలస్యం .అంత అల్లరి ఎక్కడ మడిచి పెట్టాడో కానీ .. నందూ బుద్ధిగా తన చూపుడు వేలును పెదవులపై ఆనించేసాడట.. సిరి ఉత్సాహంగా చెప్పింది.

“ ఉదయం ఏడున్నరకి ఆటో ఎక్కించేశానా, ఇక సాయంత్రం ఆరున్నర దాకా దిగుల్లేదు..!

నిజమే , సిరి కి కాస్త వెసులుబాటు దొరికింది. హమ్మయ్య.

ఒక్క క్షణం .... ఏదో ఫోను.

ఇంకెవరు? అవని. అమెరికా నుంచి. అము గాడికి వేసవి సెలవులిచ్చారట..అబ్బబ్బ .. బళ్ళెప్పుడు తెరుస్తారో” అంటూ.

అమెరికా మనకన్నా విషయంలో వెనక బడి’ ఉన్నదో తెలిసి ... కడుంగడు సంతసించి ...అవని వాళ్ళింట్లో గడగడ గుడుగుడు వినడానికి చెవి ఒగ్గా.

ఉత్సాహం గా.

బళ్ళూ తెరిచే ...పిల్లలు భద్రం ..! ఎక్కడి పిల్లలు అక్కడే , గప్ చుప్ !!!

***

18-6-7 చంద్రలత


All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

2 comments:

  1. అమెరికా లో పిల్లలు మరీ ఇండియా లో అంత గోల లేదులెండి, బయట బాగా ఆడతారు, నీళ్ళల్లో కేరింతలు కొడతారు... కొంచం చల్ల బడీతే కాయలు పళ్ళు తెంపుకుని రావటానికి వెళతారు.... వేసవి మంచి ఆట విడుపు... ఒక జోక్ చెప్పనా మొన్న మా అక్క కూతురు ఎంత చిరాకు గా అడిగిందో ఏమిటో పిన్ని మీ అమెరికా వాళ్ళు బోట్ ఎక్కి అది 8 మైళ్ళు నడపటం కోసం 60 మైళ్ళు కార్ వేసుకుని వెళ్ళి ఒళ్ళు నొప్పులు తెచ్చుకున్నారా అస్సలు బుద్ది లేదు మీకు హాయి గా ఇంట్లో కూర్చోక అని ముద్దు ముద్దు గా తిట్టింది, నాకు నవ్వాలో ఏడ్వాలో అర్ధం కాలేదు.. అవును మన పిల్లలు ప్రకృతి దూరం గా ఆధునీకరణ కు దగ్గర గా... హ్మ్మ్ ... బై ది వే మీ బ్లాగ్ చాలా బాగుంది...

    ReplyDelete
  2. భావన గారు,
    నమస్కారం.
    నిజమే.
    అమెరికా నుంచి అన్నీ దిగుమతి చేసుకొంటున్నాం. ఒక్క పిల్లల విషయం తప్ప. బహుశా..అమెరికాకి ఎగుమతి చేయడానికి పిల్లలను కార్ఖానా చదువులు చదివించ వలసిందేనని అందరూ అంతో ఇంతో నమ్మడం చేత కావచ్చు.. మరో మాట మాట్లాడకుండా... ఆటాపాటా..అంతర్ధానం చేసేస్తున్నాం..చేతులారా.
    మడతపేజీ నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete

బుద్ధుడిమాట ఈ పూట