Sep 30, 2009

ఇది మొదలు కాదు.తుది కాదు.

ఇది మనకు తెలిసిన కథ.

తెలిసిన కథే కదా ..మళ్ళీ ఏం తెలుసు కోవాలని పాఠకుడు చదవాలో ... ఏం తెలియజేయాలని రచయిత భావించారో ..

స్వయంగా చదివితే గాని తెలియదు.

అంచెలంచెలుగా మన అంతరాంతరాల లోకి ఇంకిన ఇంకింప జేసిన ఈ నైచ్యం -

చర్చకు రావడం ఇది మొదలు కాదు. తుది కాదు.

కాలం బాటలో నలిగిన పగిలిన రగిలిన ఈ మానవ ధర్మపు చీకటి కోణాన్ని ...

రూపు మాపు మంచిసెబ్బర లేని ఈ దుర్భర ధర్మాన్ని-

మరోసారి లోతుగా బలంగా మన ముందుకు తెచ్చారు... శ్రీ కరణం బాలసుబ్రమణ్యం పిళ్ళై గారు తమ "చండాలుడు "నవలతో.

ఎందుకు అని ప్రశ్నించిన త్రిశంకుడికి ఎదురైన అనుభవమే ఈ నవల.

మనకు తెలుసు.

ప్రశ్నించడం మానవ సహజ లక్షణం.

ప్రశ్నలోంచి ప్రశ్న పుడుతుంది.

అజ్ఞత లోంచి విజ్ఞత కలుగుతుంది.

అణిచివేతకు అనేక రూపాలు.

ప్రశ్నను అణిచి వేయడం తో -ఆధిపత్యం నిలబడుతుంది.

తలెత్తిన ప్రశ్నను తుంచి వేయడంతో ..అహంభావం బలపడుతుంది.

అధికారం స్థిర పడుతుంది.

అణిచివేత ఎంత పురాతనమో తిరుగుబాటు అంత పురాతనమే.

"చొప్పదంటు ప్రశ్న" " కొంటె ప్రశ్న" అని లోలోన కొట్టి పారేస్తూనే ...

"చక్కని ప్రశ్న" అని పైపైన ప్రశంసిస్తూ .."మంచి ప్రశ్న అంటూ ప్రోత్సహిస్తూ...

ఆఖరికి..

"వితండ వాదమై పాషండ వాదమై ..అహంకారపు మాటలు,

హద్దు మీరిన చేష్టలు గా గర్హించ బడి..

చివరికి..

"పాషండుడు ..మ్లేచ్చుడు ..ఛండాలుడు "గా శపించ బడి..

"బాహ్యుడిగా" నెట్టి వేయ బడతాడు

నవలా నాయకుడు .

నెట్టిన వాడు బ్రహ్మర్షి ..కుల గురువు..వశిష్ఠుడు.

నెట్టి వేయ బడిన వాడు మహారాజు ..సూర్య వంశీయుడు..త్రిశంకుడు.

ఈ విపత్కర పరిస్థితి ని చక్క దిద్ద ప్రయత్నించిన వాడు ...విశ్వామిత్రుడు.

త్రిశంకుని అనుభవ క్రమాన్ని రచయిత ఎంతో హృద్యంగా చిత్రించారు.సహజం గా.

అధికారం దాని వలన కలిగిన భద్ర భావం ...ఒక్క మాటతో ముక్కలు ముక్కలుగా విడి పొవడము...

అప్పటి వరకు అన్నీ ఉన్నవాడు క్షణాల్లో ఏమీ లేని వాడై మిగలడము..

కుటుంబము, పరిజనం ,రాజ్యం తనవి అనుకున్నవి అన్నీ పరాయివి కావడము... తనే పరాయి వాడవ్వడమూ ...ఎంతో సూక్ష్మం గా సున్నితంగా చిత్రించారు.

విషాదానికి మూలమైన ధార్మిక వ్యవస్థను, దాని పరిరక్షకు లను తీవ్ర విమర్షనాత్మక దృష్టితో విశ్లేషించారు. అందుకు వారు ఎంపిక చేసుకున్న సాహితీ రూపం నవల.

నవల అంటేనే ఆధునికమైనదని భావన.

ఆలోచనలతో పాటు అనుభూతులను ..విశేషాలతో పాటు విశ్లేషణను ...నవ రస భరితంగా ప్రకటించ

గల వీలు ఉంటుంది. నవల కు గల ఈ స్వభావాన్ని ఎంతో సహజం గా తమ బలంగా మార్చుకొన్నారు శ్రీ బాల సుబ్రహ్మణ్యం పిళ్ళై గారు .

ఆధునికదృష్టి తో మరొ సారి తరతరాల అంతరాల మూలాల్లో కి వెళ్ళి... పేరుకు పోయిన మురికిని మకిలిని తొలిగించెదెలా అన్న ఒక ప్రశ్నను మనకు వేశారు

ఆనాటికి ఈనాటికి మనలో...

ఏదీ మార్పు ? ఏదీ స్వేఛ్ఛాలోచన . ?

ఇదీ ఈ నవల పూర్తి చెయగానే తొలిచి వేసే భావన.

" సర్వ ప్రకృతి పైన గుత్తాధిపత్యం సంపాదించించుకొన్నది ఈ నాగరిక సమాజం .అదే అణిచి వేత " అంటారు రచయిత..

అణిచి వేత లో మతం,రాజ్యం ,వ్యక్తి ,సమజం..లౌకికం పార లౌకికం ..ఇలా అనేక కోణాలలో నుంచి వారు వివరంగా విశ్లేషణ చేస్తారు.

శబలుడి పాత్ర ద్వారా రచయిత అంటారు..

"ఎంతైనా ప్రయోజనాన్ని బట్టే విలువలు"

ఇదీ ఈ నవల మనకు అందించే ఒక విషాద సత్యం.

రచయిత ఒక ఆశా వాదాన్ని ప్రకటిస్తూనే ... సందర్భాన్ని బట్టే పాత్రల ప్రవర్తనను చిత్రిస్తారు. త్రిశంకుదు తన పత్యక్ష అనుభవం తరువాత చేస్తాడన్నది మరోలా ..ఎలా రాయ గలరు ? అయితే ఏమి చేయ వచ్చునో సూచించి వుండ వచ్చునేమో.

అలాగే, ఏమీ చెయ లేని నిస్సహాయత ను శబలుదు మరొలా ప్రకటిస్తాదు.తన పరిస్తితి తనతోనే అంతమవ్వాలన్న బలమైన కోరికతో శబలుడు ఏకాకి గా ఉందాలని నిర్ణయించుకొంటాదు. ఇదొక నిరసన.

ఏ రచనకైనా పరిమితులు ఉంటాయి. రచనా పరిధి లోనే విశ్లేషణ సాగాలి.

రచయిత అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించక పోయినా..బాగా నలిగిన ఒక కథను నవ్య నూతనంగా మలిచిన తీరును ప్రశంస వలసిందే.

ఇది కేవలం కల్పనా సాహిత్యం కాదు.ఒక సామాజిక చర్చ.తాత్విక తిరుగుబాటు.

ఎలాంటి దాపరికం లేని ఒక హెచ్చరిక.

తెలుగు నవలలో ఇది ఒక మంచి ప్రయత్నం. విషయం ఒక సాహసం.

ఇంత సున్నితమైన అంశాన్ని మనసుకు హత్తు కొనే మాటలలొ పొందు పరచడము సామాన్యమైన విషయం కాదు.రచయిత భాషా ప్రవీణత,పాండిత్య ప్రతిభ,తార్కిక దృక్పథం ...అందుకు అంది వచ్చి ... నవల ఆద్యంతము పలకరిస్తాయి.

ఇది యధాలాపం గానో కాల క్షెపానికో చదవ వలసిన నవల కాదు."మొక్కుబడి"పాఠకులకు ఒక మొట్టికాయ."బహిష్కరణే తప్ప స్వీకరణ "తెలియని వ్యవస్థకు ధర్మానికి ఒక చెంప పెట్టు.

ఏమైనా, త్రిశంకు స్వర్గ ద్వారాలను మన కొరకు తెరిచి ఉంచారు రచయిత.ఒక్క మారు పర్యటించి రండి.

మన గురించి మనకు తెలియని విషయాలెన్నొ మనకు తెలుస్తాయి.

మన లోపాలు ,లొసుగులు ...మనలొని చీకట్లు..అధికారపు అహంకారాలు, కుట్రలు కుతంత్రాలు ..ఆ స్వార్ధ స్వభావాలు ..ఆ నడుమ నలిగిన మానవత.

తెలిసి కొంతా తెలియక కొంతా ..మన సాటి వారితో మనం ఎంత అమానవీయం గా ప్రవర్తిస్తూ వచ్చామో వస్తున్నామో

ఒక మారు పునరాలొచన చెసుకొనే సంధర్భం కలిగిస్తుంది ఈ నవల.

పుస్తకం మడిచేసాక ఒక్క మారైనా ఆలోచనలో పడితే రచయిత ప్రయత్నం ఫలించినట్లే.

ఒక పాఠకురాలిగా రచయిత కు ధన్యవాదాలు.

Sunday, November 18, 2007 -- Nellore

***

Chandaludu (chandala trisanku)navala ,sri balasubramanya pillai garu.

first print feb,2007 price :Rs65/-

address: karanam balasubramanyam pillai , 2-253-d-5-a society colony, madana palli -517325 , phone 08571- 220833

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 24, 2009

“ పిల్లవాండ్లకు చాలు ”

దశరా పండగొస్తుందంటే చాలు.

మా కిష్టప్పపంతులు ,ఆయన వెనకే మా పిల్లల రామదండూ తయారు.

సన్నటి కర్రొనొక దానిని బాగా వంచేసి పురికొసతో చివర చివర ముడేస్తే చాలు విల్లు తయారు. ఇక బాణాలకు ఏం కొదువ? అన్ని పుల్లలూ చివర్లు చెక్కి సిద్ధం చేసేసుకోవడమే.

తలా ఒక విల్లంబు చేతికి చిక్కినన్ని బాణాలు పట్టుకొని .. పైపంచో కండువానో వల్లె వేసుకొని జోలె కట్టుకొని ఊరంతా తిరుగుతూ... ఒక్కో గడపా ఎక్కీ దిగుతుంటే చూడాలి పిల్లల సరదా.

గొంతు చించుకొని "అయ్య వారికి చాలు అయిదు వరహాలు... పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు " అంటూ పాడుతుంటేనే నోరూరి పోయిది కాదూ ?

పైనుంచి, ప్రతి ఇంట్లోనూ పిండివంటలు.

వండుతూ.. వారుస్తూ.. వాసెనలు కడుతూ. కమ్మటి వాసనలు

పిల్లలు కనబడగానే .. తలో అరిసె ముక్కో తపాలాచెక్కో ..కారప్పూసో బెల్లప్పూసో .. అలా గుప్పిట్లో..పోసేవారు. ఒక మొట్టికాయ వేసి మరీ.

అలాగని తాయీలాలన్నీ ఉత్తిత్తునే ఇచ్చే వారు కాదండీ.. మా చేత ముప్పై నాలుగు పద్యాలు అపజెప్పించుకొని.. శ్లోకాలు ఎక్కాలు ముక్కు బట్టి పిండుకొని.. చెవి నులిమి ..వీపు విమానం మోత మోగించి .. మరీ ఇచ్చే వారు.

పాపం ...మా పంతులు.

తనే ఏదో పేద్ద పరీక్ష రాస్తున్నట్లు!!!

బిక్క చచ్చి పోయే వారు.

మేము ఏం ఘనకార్యం వెలగ బెడతామేమో ననీ.. ఒక బెత్తాం చేతిలో పట్టుక తిరగక తప్పేది కాదు ..వారికి!

అయితే ,కళ్ళురిమినా పళ్ళు పటపటలాడించినా , పూట అదిరేవారు ఎవరు? బెదిరే వారెవరు ?

అంతవరకు బాగానే ఉండేది కాని, ఒక మారు మా కాలువ గట్టు నరసయ్య గారి కొత్తల్లుడు అన్నారు కదా... ఇంకా పాత చింత కాయ పచ్చడి పద్యాలెంటయ్యా పంతులూ ” అని.

ఊరికి అల్లుడయ్యే ఉక్రోషం ఆపుకొని మా పంతులు సమాధానం చెప్పేలోపునే.. మా సరళ, అదేనండీ ఏడాదే కర్నూలు కాన్వెంటులో చేరిందే తను, గడ గడా బి సి డి లు...వన్ టూ బకుల్ మై షూ లు ... అప్ప జెప్పేసింది..!

హమ్మయ్య గండం గట్టెక్కింది అనుకున్నామా... తరువాత చూడాలి మా తిప్పలు.

ఆంగ్ల వాచకం మా బడిలోకి వచ్చి బైఠాయించింది. సరళ మాకు పంతులమ్మ అయి కూర్చుంది.

గోడ కుర్చీలే వేయించిందా ముక్కు చెంపలే వేయించిందా.. అది వేరే విషయం.

పండగ నాలుగు నాళ్ళ ముచ్చటే లెమ్మని మేమూ ఊరుకొన్నామనుకోండి..! ముందుంది ముసళ్ళ పండగ..సరళ సంగతి ఇక చూడాలి! అల్లుడు గారితో పాటూ..!

మా పంతులు ఇంటికి చేరే లొగానే.. బుడబుడ బుక్క మోగింది.

అంతే.. ఎక్కడ పిల్లలు అక్కడ మాయం..! బుడ బుక్కల వాని వెనక తోకల్లా వూరి మీదకు రెండో మారు. ..!!!

అది సరే కాని, ఇది చదివాక మీలో ఎవరికన్నా హాలోవిన్నూ ... ట్రిక్ ఆర్ ట్రీట్ ...గుర్తుకు వచ్చే ఉంటుంది .కదా? పిల్లలు కదా నాలుగు చాక్లెట్లు చేతిలో పెడితే సంబరంగా పోతారు అనుకుంటారేమో..!

మాకు మల్లే ఎవరిదైనా రామ దండు వాకిట్లోకి వచ్చి పప్పు బెల్లాలు పెట్టమంటే .. కసిరి పడేసేరు..!

పిల్లలు కదా వారికేం తెలుసు ?

పప్పుబెల్లాలు ప్రియమైపోయయనీ ..పండగ పూట కూడా ఆచి తూచి వాడుకోవాలనీ..!


All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.