అనుకొంటాం.
గుప్పెడన్ని అక్షరాల్ని చేతబట్టుకొని ఆకాశమంతా చుక్కలు పెట్టి ముగ్గులేసి రంగవల్లులు దిద్దగలమని..!
కానీ,
అపురూపమైన క్షణాలను అక్షరబద్దం చేయడం అంత సులువు కాదు.
కొన్నాళ్ళ నాటి సంగతి.
ఒక జాతీయ సాహితీ సదస్సు.
అల్లంత దూరాన..
తెలుగు వారు.
ఒక పక్కగా...
వరసలో ముందుకు సాగుతూ..
అందరితో పాటూ నేను.
అప్పటికే పరిచయమైన నవనీతదేబ్ సేన్ గారు చనువుగా నా చేయి పట్టుకొని పక్కకు లాగారు.
మరింత చనువుగా .. నా చేతిని మరొకరి చేతిలో పెట్టారు.
బిడియ పడుతూ చూద్దును కదా..
అక్షరాలా ..
మహాశ్వేతాదేవి గారు!
రుఢాలి, అనిందో ,శనిచరి, ఛోటా ముంఢా .. ఊహు ...ఆ క్షణాన ఎవరూ జ్ఞాపకం రాలేదు.
ఎవరిదీ అడవి .. అన్న ప్రశ్న కు ఊసే లేదు.
బషాయ్ టు డు .. ప్రస్తావనే లేదు.
చిన్నఅమ్మమ్మనో పెద్దమేనత్తనో కలిసినంత ఆప్యాయంగా... సహజంగా.. సరదాగా... నవనీత గారితో కలిపేసి మరీ ... కబుర్లాడేసారు.నిర్వాసితుల గురించి ప్రకృతి గురించి అప్పటి నా అధ్యయనాన్నిఆలోచనలను ప్రశ్నించారు.
వేదిక మీదకు వారిని ఆహ్వానించాక కానీ నా చేయి ఇంకా వారి గుప్పిటనే ఉన్నదన్న స్పృహ కలగలేదు.
వెళుతూ వెళుతూ ..
శిరసు ను తాకి భుజాన తట్టి... చేతిలో చేతిని నొక్కిపట్టి..
" మీ తరం మీద ఎంతో నమ్మకం నిలుపుతున్నాం..! " అంటూ సాగిపోయారు.
వారి మెత్తని చేతి వెచ్చదనం ..ఇంకా నన్ను ఆవరించే ఉన్నది.
వారి బెంగాలి నేతచీర కమ్మని పరిమళం నన్నింకా విడవ లేదు.
వారి మృదు సంభాషణ, సరదా కబుర్లు, పసి నవ్వులు, గంభీర ఉపన్యాసం..ఇప్పుడే విన్నట్లుగా ఉన్నది.
వారు చూపిన ఆదరణ ..ప్రకటించిన నమ్మకం.. అనుక్షణం వెన్నాడుతూనే ఉన్నాయి.
వారు నడిచిన తోవ... నిలిచిన వేదిక.. పలికిన మాట...రాసిన అక్షరం.. నిత్యం పలకరిస్తూనే ఉన్నాయి.
నా కెమేరా ... భధ్రంగా... నా చేతి సంచిలో.
ఆ అపురూప క్షణాలు...
మరింత భద్రంగా..
నాలో.
*
(22 Feb,2001, National Seminar , Indian Women’s Writing at the Turn of the Century,
Kendra Sahitya Academy, New Delhi)
All rights reserved @writer. Title,labels,postings and related copyright reserved.