Aug 3, 2014

పరిచిన మెట్లు

పిల్లలింకా బడికి రాలేదు.
పంతుళ్ళు బడికి రాలేదు.
ఇప్పుడో అప్పుడో  వస్తారు కాబోలు.



పిల్లల కోసం పరిచిన మెట్లు
పక్కకు తొలిగాయేం ?
నిన్న మలిగిన రాత్రి
వాన కురిసిన ఆనవాళ్ళు లేవే !
ఏ కట్టు తప్పిన పసరం
ఎడా పెడా నడిచెళ్ళిందో !





పిల్లలింకా బడికి రాలేదు.
పంతుళ్ళు బడికి రాలేదు.
ఇప్పుడో అప్పుడో  వస్తారు


కొత్తగా చేరిన బుజ్జి పిల్లలు
తిన్నగా పలకయినా పట్టలేరు.
బలపం చేతికిస్తే
ముక్కలుచేద్దామా గుటుక్కుమనిపిద్దామా
అన్న సందిగ్దంలో తడిచిన ముఖాలు!


ఉప్మా తయారంటే ,
తల్లెలెక్కడో తెలియని పసితనం.
అదాటున వచ్చిపడే సెలవు
గుప్పెడు మెతుకులకా ?
గుక్కెడు  అక్షరాలకా ?


అయినా,
గుట్టలెక్కి పుట్టలు దాటి
పొలం గట్ల మీదుగా నడిచొచ్చే
ఆ చిట్టి పాదాలకు ఈ మెట్లొక లెక్కా..?






ఎవరు చెప్పేరని ,
ఈ మెట్లకు మట్టి మెత్తుతున్నావు తల్లీ?
                                                                అన్నట్టు,
అది మిత్రవనం వాకిలి కదూ...?
అందుకేనా మరి ?

పిల్లలింకా బడికి రాలేదు.
పంతుళ్ళు బడికి రాలేదు.
ఇప్పుడో అప్పుడో  వస్తారు

అందాకా సెలవా  !

***
చిన్నారి పొన్నారి స్నేహితులందరికీ ..
జేజేలు!

***
 "మిత్రవనం" ఉపాధ్యాయులు శ్రీ రాము, రమేశ్ గార్లకు, రిషీవ్యాలీ పల్లెబడి, అధ్యాపకురాలు శ్రీమతి సుశీల గారికి ధన్య వాదాలతో ...

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

3 comments:

  1. 18, 20 ఏళ్ల క్రితం పాఠశాలలో ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తుకువచ్చాయి......

    ReplyDelete
  2. ఇక్కడ బుడతల నవ్వులూ,బ్రతుకుల అగచాట్లూ ఉన్నాయి ,నాకు నచ్చే లోకమూ,నేను నిత్యము విహరించే వనమూ ఇదే మేడం.

    ReplyDelete
  3. Meaj madam...మీరు ఇక్కడ వర్క్ చేస్తారా?మిత్రవనం అంటే ఎక్కడ ?

    ReplyDelete