Aug 25, 2014

మూర్తిమత్వం అనంతమై...!


.
అప్పటికింకా వెలుగురేకలు పూర్తిగా విచ్చుకోలేదు. 
చేటంత చేమంతులు బద్దకంగా వళ్ళు విరుచుకొంటూ , తొలికిరణాల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాయి.
జనవరి చివరి... ఢిల్లీ రోజులవి.
ఫలహారశాలలో కాఫీ తేనీరులు దక్క,  మరే  ఫలహారాలు అప్పుడప్పుడే వడ్డించే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. 
ఇక చేసేదేమీ లేక , మరొక కప్పు తేనీరు నింపుకొని, కిటికీలోంచి చేమంతుల రేకులపై వాలుతోన్న పసుపువన్నెలు చూస్తూ ఉన్నా.
ఎప్పటినుండి గమనిస్తున్నారో నన్ను, ఎక్కడో మూలన కూర్చున్న పెద్దాయన ఒకరు , నెమ్మదిగా వచ్చి , మర్యాదా సరదా కలబోసిన గొంతుతో పలకరించారు. 
ఇడ్లీ మిస్స్ అవుతున్నారా?
“ అబ్బే , అలాంటిదేమీ” లేదన్నాను.   
రాత్రి అరకొర తిండి మిగిల్చిన ఆకలి ఛాయలు తప్ప, ఇడ్లీ పట్ల నాకు ఎలాంటి భ్రమలూ లేవు !
నన్ను చూడగానే దక్షిణాది వ్యక్తినని వారు కనిపెట్టేసారు.  నాకు వారు చెపితే కానీ తెలియ లేదు.
 వారెవరో తెలిసి పోయింది. నాలుగు మాటల్లోనే.
నాకు నచ్చిన “ శ్రాద్ధ్ ఘాట్ " సృజనకర్త.
అక్షరాలా యు. ఆర్ .అనంత మూర్తి గారు.

ఏదో ఒక అర్ధరాత్రి పూట , అలనాటి దూరదర్శన్ వారి ధర్మాన , అదాటుగా చూసిన సినిమా అది. 
"అందులోని పిల్లవాడు మీరేనా?” జంకూ గొంకూ లేకుండా అడిగేసా.
ఆయన నవ్వేసారు.
ఇప్పుడయితే అడగగలనా?

అక్క కథను ఆ పిల్లవాడి దృష్టితో చెప్పించడం  .. చాలా హృద్యంగా ఉంటుంది. పసితనం .అమాయకత్వం . 
ఆమె ఒక బాల్యవితంతువు. ఆమె తండ్రి సనాతనుడు.  పకృతిధర్మాలకు ఆచారవ్యవహారలకు నడుమ ఆమె . అందుకు అసాక్షీభూతం ఆ పసివాడు.
 ఇక , నానా పాటేకర్ నటన గురించి చెప్పేది ఏముంది? ఎన్నాళ్ళు వెంటాడిందో.
నిజానికి “సంస్కార” కూ నెల్లూరికి సంబంధం ఉన్నది. పఠాభి స్వర్ణలత గార్ల వలన.
"భవ" సంగతి సరేసరి.
అంతటి పెద్దమనిషి వచ్చి ,ఎదురుగ్గా  కూర్చుంటే ....కాళ్ళూ చేతులూ ఆడుతాయా? నాకు మాత్రం ఎలాంటి వెరుపూ కలగలేదు. స్నేహభరితమైన వారి చిరునవ్వే అందుకు కారణం కావచ్చు. వారి ముఖవర్చస్సు , తేట గా  మాట్లాడే నేర్పు. ఆ మాటల్లోని  తొణికే సునిశిత హాస్యం. ఎటువంటి వారినైనా , స్నేహంలో ముంచేస్తాయి.
పైనుంచి వారు , మన పొరుగు ప్రాంతం వారు కావడం ,
మన కథల్లోని మన జీవితాలు వారికి దగ్గరివి కావడం  నవల పట్ల వారికున్న ఇష్టం, నవలాకారుల పట్ల నమ్మకం . అవో ఇవో అన్నీనో ..కారణం ఏదైనా , వారి సంతోషంలో ప్రస్పుటంగా కనబడింది... ప్రాంతీయ భాషల్లో నవల ఇంకా పచ్చబడి ఉండడం.
నవల నిలబడాలనీ పదికాలలు పచ్చగా వర్ధిల్లాలనీ వారు ఎంత బలంగా చెప్పారో.

ఆ తరువాత,
చాణ్ణాళ్ళ తరువాత,
రావెల సోమయ్య గారి ఆహ్వానం. పఠాభి గారి గౌరవంగా సభ ఏర్పాటు చేస్తున్నట్లూ, అనంతమూర్తి గారు ముఖ్య అతిథి అయినట్లూ.
ఈ సారి కలిసినప్పుడు, చాలా మటుకు మా మాటలన్నీ JK గారి చుట్టూనే. 
బడిపిల్లలతో కథ రచన ముమ్మరం గా సాగుతున్న సమయం అది. ఆ వివరాలన్నీ ఎంతో ఇష్టంగా అడిగి తెలుసుకొన్నారు. ముఖ్యంగా, తెలుగులో ఈ ప్రయత్నం జరగడం పట్ల మరింత సంతోషపడ్డారు. ప్రాంతీయ భషలు కళకళలాడుతూ ఉండాలని వారి కోరిక. 
ఆ పై, నవలల గురించీ. మరెంత ఇష్టంగా మాట్లాడుకొన్నామో!
నాతో పాటు ఆ పూట , పెద్దలెందరో ఉన్నారు.
" మరి మనం ఒక ఫొటొ తీసుకొందామా?" నవ్వారాయన.
బహుషా అంతకు మునుపు మాట మాత్రం అనుకోలేదు కదా.. మాటలతో గడిచిపోయింది అప్పటి సమయం. అంతే కాదు., మా శిరీష నూ ఆట పట్టించారు.
 "ఈ నవలా రచయిత్రితో నా ఫోటో బ్రహ్మాండంగా రావాలి సుమా !" అంటూ.

అదీ, వారితో గడిపిన కొద్దిపాటి సమయం.
ఒక నవలారచయిత వ్యక్తిగా ఎంతగా ఎదగవలసివున్నదో ,తెలియచెప్పకనే చెప్పారు. విజ్ఞత వినమ్రత కలగల్సిన వారి ప్రవర్తనతో .ఆఖరి వరకూ.
"మార్క్సూ జిడ్డు కృష్ణమూర్తి కలగలిసిన మార్గం నాది " అని సౌమ్యంగానే చెప్పారు. సంస్కృత ,కన్నడ,ఆంగ్ల  భాషల్లో లోతైన అధ్యనం చేసి,ప్రపంచ సాహిత్యాన్ని ఔపాసన పట్టి,ఆంగ్లోపన్యాసకుడి పనిచేస్తూ ...  మాతృభాషకే మాణిక్యాలను అమర్చిన ఆయన బహుముఖ ప్రజ్ఞను గురించి ప్రత్యేకించి చెప్పవలసింది ఏముంది? జ్ఞానపీఠం ఆయనకు ఇచ్చి, భారతీయులం మనని మనం గౌరవించుకొన్నాం !

మనిషి పట్ల వారికెంత విశ్వాసమో. మానవధర్మం పట్ల ఎంత గౌరవమో. మానవ సంబంధాల పట్ల ఎంత ఆప్యాయతో  !

వారి ఊపిరి అనంత వాయువుల్లో మమేకవచ్చు గాక !
వారి మూర్తిమత్వం అనంతమై భాసిల్లును గాక !
వారికి, 
ఎంతో ఆప్యాయంగా వీడ్కోలు. 

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment: