Nov 5, 2013

“ చీకటివెలుగుల రంగేళీ... ”

10.9.1990
"అదేంటి దీపావళి వెళ్ళాక.. తీరిగ్గా పాడుతుందీవిడ "అని అనుకుంటున్నారా మీరు ?
పరవా లేదు లేండి. నేనేమీ అనుకోను.
అయినా ,అనుకున్న వారికి అనుకున్నంత !
ఒక్కోసారి , 
ఏదైనా అనుకున్నామనుకోండి..
అంతో ఇంతో జరిగేదాకా ఊరకుండలేం కదా..!
ఆ తలపు  వండ్రగిపిట్టలా మనను తొలిచేస్తూ వుంటుంది .
 ఒకానొక రోజు నాకెందుకో మా బుజ్జితల్లితో ఫోటో తీసుకోవాలని బుద్ధి పుట్టింది!
అలా ఇలా కాదండి.
అసలు సిసలు నలుపుతెలుపు ఫోటో !
మనుషులన్నాక ఇలాంటి చిన్న చిన్న అచ్చటముచ్చటలు ఉండక పోతాయా? 
అప్పటికి నెల్లూరు తూర్పెటో పడమర ఎటో తెలియదు నాకు.
గాంధి బొమ్మ  దగ్గర నుంచి తిన్నగా నడుచుకొంటూ వెళితే , వరసగా దుకాణాలు.అదేనండి, కాపు వీధి అంగళ్ళు. 
ఒక్కో అంగడి దాటుకొంటూ వెళ్ళామా..సీమా సెంటర్, ఆ పై లస్సి  సెంటర్,.. ఇంకాస్త ముందుకెళితే నర్తకి సెంటర్. ఈ మాత్రం పరిసర జ్ఞానం నాకు అబ్బింది,.సినిమాల పుణ్యాన అనుకొనేరు.
 కాలు కదిలించాలంటే, అప్పట్లో మరీను, అలా  వీధుల్లో విహరంచడమే అన్న మాట. ఇక, ఈ వూరి వారంతా వారి వారి శక్త్ కొద్దీ చిన్నపెద్దా గుంపులు తయారు చేసుకొని , వీధి మధ్యలో నిలబడి మరీ...విరివిగా కబుర్లను పోగేస్తూ ఉంటారని వినికిడి.
నెల్లూరు పురవీధుల్లో ఒక ప్రముఖమైన వార్త వ్యాప్తిలో ఉన్నది.
ఎంతటి రహస్యంగా నైనా.. . ఈ సెంటర్ లలో ఏదో ఒక దాంట్లో నిలబడి , దారి పక్కని  బండిపై , కారం దోస కరకర లాడిస్తోనో.. కాఫీ చప్పరిస్తూనో ..గొణిగినా..గుస గుస లాడినా...చాలు. ఆ వార్త సాయంకాలపు సముద్రపు గాలిలా  జిల్లా అంతా  వ్యాపించేస్తుందనీ తెల్లారే పాటికి.
అందుచేత , నెల్లూరీయులు బోలెడంత డబ్బు ఆదా చేసుకంటారనిన్నీ.. .మరొక చోట ప్రచారమాధ్యమాలపై వెచ్చించేదంత . !
సరే, ఆ సంగతి అలా ఉంచండి.
అలా , నాకు ఒక ఫొటో తీసుకోవాలని అనిపించడం ఏమిటి ..గబ గబ  వంట చెసుకొనుకొని.. కుంకుడు కాయలు నానేసి ...మా అమ్మాయికి తలకు పోసి, , అమ్మాయి కి నీలం రంగు బుట్ట చేతుల కొత్త గౌను తొడిగాను. 
పొద్దు బారెడడయ్యింది
.మా అమ్మాయేమో , కళ్ళకు కాటుక దిద్దనియ్యలా. జుట్టు లో దువ్వెన పెట్ట నిచ్చింది కాదు. 
కళ్ళల్లో పడ్డ కుంకుడురసం ప్రభావం ఏమో , ఒక్క పెట్టున ఏడుపు 
గుక్క పట్టుద్దేమోనని. కిక్కురుమనకుండా..ఆమె కాళ్లకు తొడగాల్సిన మేజోళ్ళు మాట పక్కన పెట్టేసి, ఆవిడ సరంజామానంతా  ఒక బుట్టలో పెట్టుకొన్నా. మరో జత గౌన్లు ,పాల సీసా,ఆడించి నవ్వించడానికి  ఆవిడ గారి గిలకలు వగైరాలు  సర్దుకొన్నా.
నేనేమో , పసిడి పచ్చ రంగు ఖాదీ సిల్కు చీరను , ముదురాకు పచ్చ జాకెట్టును  జతచేసుకొనే సరికి, పొద్దు తెగ పెరిగిపోతోంది.  అక్కడికీ , ఆకుపచ్చ పూలగాజులు వేసుకొందామనుకొని తీసి పెట్టడడం వీలవలా
బాగానే ఉంది. మరి ఎక్కడికని వెళ్ళాలి..?
మా ఇంటి పెద్దమనుషులు నా కన్నా వూరు కొత్త జేసిన వారు !
ఎండ, వేడి మరింత పెరిగి పోయాయి. పైనుంచి ,అనుకొన్న కార్యక్రమం ముగించి వచ్చి , పాపకు భోజనం పెట్టాలి కదా?
పక్కింటి పార్వతి ఆ మధ్య ఒక రోజు ఆ దారిన వెళుతోంటే అన్న మాటలు గుర్తొచ్చాయి. 
రాజనాల నుంచి రమణా రెడ్డి గారి వరకు .. వాణీశ్రీ  నుంచి చిరంజీవి వరకు అందరి ఫోటోలు తీసిన ఏకైక స్టూడియో “ మై స్టూడియో ” అనీ.
ఇందుమూలంగా నాకు తెలిసిందేమిటంటే , ఆ స్టూడియో చరితాత్మకమైనదనీ.
ఆ పార్వతి తోడొస్తుందేమో నని కేకేసా. అప్పటికే బడికెళ్ళి పోయింది. 
పాపని భుజానేసుకొని, బుట్టని చేతబట్టుకొని రిక్షా ని కేకేసా.
చెప్పగానే తెలుసు తీసుకుపోతానులెమ్మని భరోసా ఇచ్చేసిన పెద్దమనిషి రిక్షానే ఎక్కా.
ఇక మా అమ్మాయి, తలారా స్నానం చేసి ఉంది కదా ...అలవాటు ప్రకారం నిద్రలో మునగ బోయింది.
ఆ పై  ఆమె నిద్ర లేచేది మధ్యహ్నం ఒంటి గంటకే. ఈ నడుమ ఎంత హడావుడి జరిగినా ,ఆమెని
కదిలించడం ఎవరి తరం  కాదు
 మా నెల్లూరు రిక్షాల గురించి చెప్పుకోవాలి. 
అటూ ఇటూ ఆరేడు అంగుళాలు ఉండదు సీటు. ఎట్లా కూర్చుంటాం పిల్లల్నెత్తుకొని? 
అప్పటికి ఆటోలన్న ఆలోచనే లేదు.  
అయిందేమో అయిద్ది లెమ్మని  ముందుకెళ్ళాం. ఓ పక్క నిద్ర  నిద్ర ముంచుకొస్తున్న మా అమ్మాయి ముఖాన్ని నా భుజాన  వాల్చేస్తోంది ! 
రిక్షా కుదుపులు.. వళ్ళంతా చెమట్లు .. ఉప్పుగాలి ...  గాలిలో తేమ...చిర చిర .
ఇంతా జేసి, మా ఇంటి నుంచి  గాంధీ బొమ్మను దాటి. పట్టుమని పది నిమిషాలు సాగిందో  లేదో , ఠకామని  
ఒక్క కుదుపుతో రిక్షా ఆపి ,దిగమన్నట్టుగా గంట కొట్టాడు. 
 పాపను ఎత్తుకొని దిగి చూస్తే ఎక్కడా స్టూడియో ఉన్న ఆనవాళ్ళు కనబడలా. 
 నడి వీధి లో నిలబడి ఉన్నా.    నన్ను వదిలేసి ఆ రిక్షా పెద్దమనిషి చక్కా పోయారు! 
పాప ను భుజాన, బుట్టను చేతిలో పట్టుకొని..మనుషుల గుంపుల్లో ..  చుట్టూ వెతుకుతూ నడుస్తూ పోయా. 
సీమా సెంటరు కు చివర లస్సి సెంటర్ కు మొదట్లో ఒక మిద్దె మీద ఒక ఫొటొ స్టూడియో ఉన్న ఆనవాళ్ళు!
హమ్మయ్య! 
 గబ గబవెళ్ళ బోతే  ,అడ్డంగా దూసుకొస్తోన్న వాహనాలు.ఈ హడావుడికి  మా అమ్మాయి భయంతో కరుచుకు పోయి  , పంచకల్యాణి ని ఎక్కి నట్టు నన్ను తన కాళ్ళతో అదిమి పట్టుకొంది.
 తలలోంచి చెమట్లు ..ముఖాన విరుచుకు పడుతున్న ఎండ .  వళ్ళంతా జిడ్డు.
 తీరా అక్కడికి వెళితే పైకి ఎక్కడానికి మనిషి పట్టేంత సందున్న నిలువుమెట్లు.. పైకి ఎలా ఎక్కానో..!
సవారి చేస్తున్న చిట్టిరాణీ గారిని జారుతున్న బుట్టను ...ఎలా సమ తూకం వేసుకొన్నానో ..గుర్తు లేదు కానీ.. 
పైకి చేరుకొన్నా. 
హమ్మయ్య!
తీరా అక్కడికి వెళితే అక్కడ ఎవరూ ఉన్న అలికిడే లేదు.
ఊసురో మంటూ .. నిలబడి పోయా.అక్కడి ఇరుకుకుగది ..ముందున్న అద్దాల్లోంచి   సావిత్రి  వాణిశ్రీ  లతో పాటు .. ఆర్ .నాగేశ్వర రావు ఫోటోలు !    మేము తప్ప మరో పురుగు లేదక్కడ! బిక్కు బిక్కు మంటూ .. ఎవరైనా వస్తారేమో నని కాసేపు దిక్కులు చూసా.
మా అమ్మాయికిక చిరాకు ఆపై , నిద్ర ముంచుకొచ్చేసాయి.
పై నుంచి, చెమట .జిడ్డు.   
ఇంత ప్రయాసకోర్చింది  వొట్టిదేనా ....తెగ నిట్టూర్చా.
వేచి ఉండేనత స్థలం లేదక్కడ. సన్నని బాల్కనీ . ఇక ఇంటి ముఖం పట్టబోయే క్షణాన ,
మా అమ్మాయిమణి ఇక నా జుట్టుపీకి ,బయటకు పోదాం పదమని చూపిస్తూ ...ఏడొన్నొక్క రాగం తీయబోయింది. ఆవిడ గారి నిర్వాకం పుణ్యాన ఆ  ఎవరో మెట్లెక్కి  వచ్చారు. 
విషయం తెలుసుకొని స్టూడియో మనిషిని పిలుచుకొని వచ్చారు .
 ఇక మా అమ్మాయి భీష్మించేసింది. 
ముఖం బిగబెట్టి, నిద్ర ఆపుకొని , పంచకల్యాణిని డొక్కలో నాలుగు తన్నులు తన్ని...!!!
అతను ఒక్క మాటా  నాన్చకుండా  ..నేరుగా అన్నాడు..
" పాపను ఫోటొ తీయాలా ? మేం తీయలేం ! మా దగ్గర కలర్ కెమేరా లేదమ్మా.. "
"మీరే తీయ గలరు..అలా .. " సావిత్రి ని  వాణీశ్రీ ని చూపిస్తూ అన్నా. 
"అట్లాగా?" చిన్నగా నవ్వాడాయన.
" ఇప్పుడెవరికి కావాలమ్మా అదీ..? ఎవరైనా పాస్ పోర్ట్ ఫోటులు తీయించుకొంటారు  పరీక్షల ముందు. అంతే! "
""నాకు కావాలి. "
"పాపవా?"
మొహమాటంగా తలూపా. అమ్మలు పాపల కోసమే వస్తారు  కాబోలు !
నేనూ తీసుకొంటానని చెప్పలేక పోయాను. బిడియంగా నిల్చున్నా.
అక్కడున్న పౌడరూ , దువ్వెన ఏవీ మా అమ్మాయి అంటుకోనివ్వలా. 
పై నుంచి లైట్లన్నీ వెలగడం. కెమెరాలపై నల్లబట్టలు ! మా అమ్మాయి నన్ను మరింత అంటుకు  పోయింది .
"పద బయటికి" అంటూ మెట్ల వైపు చూయించేసింది. 
అక్కడున్న చెక్క కుర్చీ మీద కూర్చోపెడదామంటే ,కూర్చుంటేగా!
సరిగ్గా అప్పుడే, 
"అమ్మో ..అట్లా కాదు కానీ..మీరూ వచ్చి నిల్చోండి ! మా స్టూడియో లో ఇదే ఆఖరు నలుపు తెలుపు చిత్రం! " ఆయన ఏ భావం లేని గొంతుతో అన్నారు.
మా అమ్మాయి విజయోత్సాహంతో తలెత్తిచూసింది.
" మీరు కాస్త పాపను చూడ్డం మానేసి , ఇటు చూడండమ్మా" 
ఆయన తన సహజ గంభీర ధోరణిలోఅన్నారు.
కెమేరా  క్లిక్ మనింది.
వారం తరువాత ,ఇదుగోండి ఇలా మా చేతికొచ్చింది!
నిజమే, మాకూ అదే ఆఖరు నలుపు తెలుపు ఫోటో .అందులోనూ స్టూడియో లో. మళ్ళీ  " మై స్టూడియో "లేదు.నలుపు తెలుపు చిత్రమూ లేదు. !
ఇంతకీ ,మా అమ్మాయిమణి నిజంగానే మారాం చేసిందా?  తనతోకలిసి ఫోటో తీసుకోవాలన్న  నా మనసు లో మాట తెలిసిపోయిందా? 
ఏమో !
అప్పుడూ ఇప్పుడూ .... 
ఆఖరికి నాకు నచ్చినట్లు గానే చేస్తుంది.
అలా హఠం వేస్తూనే ! 
***
ఆమె బాటంతా చీకటులెరుగని వెలుగులతో నిండాలని అనుకోవడం.
అమ్మ గానూ!
స్నేహంగానూ! !
మా ఇంటి చిట్టి డాక్టరమ్మకు పుట్టిన రోజు జేజేలు!
***
అవునండీ ! 
నిదానించి చూస్తే ,నలుపు తెలుపు చిత్రాల వెనుక ఎన్నెన్ని వన్నెలు దాగున్నాయో  కదా ?
అందుకే కదా ...
జీవిత చిత్రం చీకటివెలుగుల రంగేళీ అన్నదీ ఆ సినీ కవి ! 
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

6 comments:

  1. chiranjeevi bhavya ki puttina roju jejelu ~~ tatayya

    ReplyDelete
  2. akka,
    inta kammaga telugu ni ela vaddistunnavu...
    na peru srikant..appudappudu ni madata pegini thiragestuntanu..

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ..
      మీ అభిమానానికి ధన్యవాదాలు.
      ఇంతకీ, ఆ రహస్యమేంటో మీకు తెలిసినట్లయ్తే నా చెప్మా!:-)
      శుభాకాంక్షలు.

      Delete
  3. చిట్టితల్లి చంకన చిట్టిపాప ! చంద్రలతా , మీ నలుపు తెలుపు చిత్రం వెనకున్న వన్నెచిన్నెల కథ బావుంది. మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు !

    ReplyDelete
  4. @Susee and N

    agalaxmi
    మీ అభిమానమే ఆమెకు ఆశీస్సులు.
    ధన్యవాదాలు.
    ఆమె చేయవలసిన ప్రయాణం ఎంతో ఉంది కదా?
    కాకుంటే ,పంచకల్యాణి తోడుంది !:-)

    ReplyDelete
  5. చిట్టి డాక్టరమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    ReplyDelete