Oct 22, 2013

ఫోటో పండగన్న మాట!

4th class 1977-78  Bharatheeya Vidya Nikethan, Mahaboob Nagar
L to R : Vinita, Maruthi,Nirmala,SudhaAruna, Me, Geetha, Rathi
Standing Exactly behind me : Raghu , Right to him, Ravikanth 
then, Ramesh,Srinivas and the Vijayabhaskar (The Last Boy on the LEFT)
Our Social Teacher and Class Teacher  Sri RamaKrishna Reddy garu
మా బళ్ళో ఫోటో అంటే మా అందరికీ పండగన్న మాట!
ఎవరి టీచర్లు వారికి చకచకా "చక్కటి ఫోటో ఎలా తీయించుకొన వలెను ?" అని పాఠాలు చెప్పేవారన్న మాట.
ఎక్కువ గా ఎలా నవ్వ కూడదు .. తక్కువగా ఎలా నవ్వ కూడదు.. ఎలా నిటారుగా నిలబడాలి ..ఎలా వంగి పోకూడదు... గడ్డం వంచాలా పైకెత్తాలా ... కళ్ళార్పాలా ఆర్పకూడదా ... ఫోటో తీసినంతసేపూ నోటికి తాళం ఎలా వేయాలి ...ఇలా ఎన్నెన్నో  బోధనలన్న మాట!
యూనీఫాం పెళ పెళ లాడుతూ  ఉండాలనీ .. కాలి జోళ్ళు తళ తళా మెరవాలని మా పిల్లలందరికీ ఉత్తర్వులు.
పంతులు గారు ఇచ్చిన ఆ  ఫోటో నియమావళిని తీసుకెళ్లి అమ్మ కివ్వడం ఆలస్యం ..
ఇక ఇంట్లో ఆరంభం.
నాకున్న బడిబట్టల్లో మంచి జతను తీసి , తళతళలాడేలా ఉతికేసి..దానికి సబ్బు అరిగేదాకా  నురగలు తెప్పించింది మేమే ననుకోండి.. ఆ పై రాణీపాల్ లో ... అప్పుడే వార్చిన  వేడి వేడి గంజిలో ముంచెత్తి...ఆపై మధ్యాహ్నం ఎండలో ఆరేసి .. కాకో పిచ్చుకో పాడ చేయ కుండా .. కాపలా కూర్చుని.. ఆరీ ఆర గానే .. మడతేసుకొని.. వీధి చివర  ఇస్త్రీ పెట్టె దగ్గరికి పరుగో పరుగు.
అక్కడేమో అప్పటికే బారులు తీరిన మిత్ర మండలి.
" ఇచ్చేసి పోమ్మా  చేసేసి పెడతాం" అంటే ఊరుకొనే రకాలమా .. మేమూ.. పనేదో కానిచ్చే దాకా .. బొగ్గుల కుంపటి పక్కనే మిడి గుడ్లతో ఎదురుచూపులు. చెవిలో జొరీగల్లా మేం పెట్టే పోరు భరించ లేక ..తటాలున నీళ్ళు చిలకరించేసి గబ గబా పెట్టిని రుద్దేసి .. మా బట్టల జత మా చేతిలో పెట్టేసి ..  డబ్బులడిగితే.. "నాన్న గారి ఖాతాలో రాసుకోండి.." అని ధీమా గా   చెప్పేసి తుర్రుమనడమే  !
" సరే పిల్లలెమ్మని ఊరుకొంటున్నానంటే"
"మా బడిలో ఫోటో తీస్తున్నారు తెలుసా! మరి నా డ్రెస్స్ బాగా  లేక పోతే  మీ వెంకటి  ఏమిస్త్రీ చేశాడని అందరూ నవ్వరూ..? "
అవ్ మల్ల ! అంతే , మన పని అయిపోవడం ఏమిటి.. చక్కగా చాచిన రెండు చేతుల మీద .. వేడి వేడి దోస వడ్డించినట్లు ఇస్త్రీ చేసిన యూనిఫాం ను వడ్డించడమేమీ .. అన్నీ క్షణాల్లో జరిగి ఫొవాల్సిందేవీధిలో అలా తోమిన బట్టల్ని తీసుకెళుతుంటే మహా రాజసంగా ఉండేదిలే. దారిపొడువునా అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ ..
 “జెండాపండగ కాదు.. మా బళ్ళో ఫోటో తీస్తారు రేపు!” చెపుతూ ...
అడుగులో అడుగేస్తూ సాధ్యమైనంత నిదానంగా ... వాకిట్లో  అడుగు పెట్టామా .. అమ్మ  గొంతు  ఆమడ దూరానికే .
"నీకేం చెప్పాను , దండెం మీద బట్టలు తీసి మడతేసి పరుపు కింద పెట్ట మంటినా .. ఎటెళ్ళావ్ ..? "
అని అమ్మ కేకేస్తూ ఉంటే.. ముసి ముసి నవ్వులతో .. చక్కగా తోమిన బట్టల్ని చేతిలో పెట్టేయడమే!
ఇక, బూట్లనేమో వాక్ష్ పాలీషుతో తళతళ లాడించి .. మేజోళ్ళనీ బాగా ఉతుక్కుని ...బొటనవేలు దగ్గర చిరుగు లు గట్రా ఉంటే కుట్టించుకొని .. రిబ్బన్లని చక్కగా ఉతికి మడతేసుకి పరుపుకింద పెట్తుకొని..
 అన్నింటినీ రాత్రే తలగడ దగ్గర పెట్టుకొని .. ఒక చేయి వాటి మీద వేసి మరీ పడుకొనే వారం.
ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా. ప్పుడెప్పుడు బడికెళ్ళి ఫోటో తీయించుకోవడమా అని!
 "తొందరగా నిద్ర పోండి. లేకుంటే రేపు ఫోటో లో సరిగ్గా పడరు.! “
అమ్మ హెచ్చరిక .
మా భారతీయ విద్యానికేతన్ ఎదురుగా షాబుద్ధీన్ బంగ్లా. పావురాల నెలవు. ఆ ఇంటి ముంగిట కాంపౌండ్ చుట్టూ అశోక చెట్ల వరుస. పచ్చిక తివాచీ మధ్యలో  ఫౌంటైన్లు . అవి ఎప్పుడూ నీళ్ళు చిమ్మడం జ్ఞాపకం లేదనుకోండి.
ఇక, ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనాలు తినేది అశోక చెట్ల కిందేఅన్నాలు తినడం ఆలస్యం పావురాళ్ళ వద్దకు వెళ్లే వాళ్లం. చెట్ల వరుసల నడుమ చోరాట , కుంటాట ఆడుకొనేవారం. చెట్ల కింద కూర్చుని కథలు చెప్పుకొనే వారం.
  ఇంట్లోని మనుషులెవరూ మాకు కనబడే వారు కారు. మమ్మల్ని పలకరించే వారు కారు . అక్కడెవరూ లేనట్టూ అదంతా మారాజ్యం అన్నట్లూ పిల్లలం తిరుగాడే వారం. మమ్మల్ని దారిలో పెట్టడానికా అన్నట్లు బడి గంట గణ గణ మోగేది.
సరే, షాబుద్ధీన్ గారి ముంగిట అశోక చెట్ల ముందు... మా తరగతి అబ్బాయిలు బుద్ధిమంతులుకదా ..
చెప్పగానే చెట్ల కింద వరసగా కుర్చీలు వేసేసారుఇక ఒక్కో తరగతి లో హాజరయిన పిల్లల  ప్రకారం ఆ అమరిక ను మార్చుతూ పోయారు.
 మా తరగతిలో రోజు అపర్ణ రాలేదు. శశికిరణ్ ఇంకా మా బడిలో చేరలేదు.
విజిల్ వేయడం ఆలస్యం అందరం వరసగా కూర్చున్నాం. అబ్బాయిలు గబ గబా  బెంచీలు ఎక్కేసారు. వాళ్ళ కాళ్ళజోళ్ళతొ సహా
"ఇటు చూడండి అటు చూడండి. గడ్డంపైకెత్తండి . కళ్ళు దించండి." ఇక ,ఫోటోగ్రాఫరు గారి ఉత్తర్వులు.మాటి మాటికీ కెమెరా మీద వేసిన నల్లబట్టలో నుంచి ముఖం బయటకు పెడుతూ.
 చేతులు ఎలా పెట్టలో నుంచి ఎంత మోతాదులో నవ్వాలో వరకు ..ఆయన గారు ఆయన అసిస్టెంట్లు చెపుతూ ఉండగా .. కదలకమెదలక .. నవ్వులుచిందిస్తూ .. ఎండలో నానుతూ .. ఇదుగోండి ఇలా అందరం.
ఎండ వెలుగు సరిచూసుకొని మమ్మల్ని చక్కగా ఫోటో తీసేసరికి  మధ్యాహ్నం వేళయ్యింది.
మరో రెండు వారాలకు పసుపుపచ్చ అట్ట మీద అంటించి,   
ఇదుగోండి.. ఫోటో చేతిలో పెట్టారా ... ఇక ఏడుపొక్కటే తక్కువ.
అపర్ణ లేదని కాదు.  
ఫోటో తీసే రోజున మా అమ్మ  చిలక్కి చెప్పినట్లు ఏం చెప్పింది? నూనె రాసి బిగించి రెండు జళ్ళేస్తు న్నంత  సేపు చెప్పిందా లేదా .. రిబ్బన్లు ముడేసినప్పుడూ చెప్పింది.మరిచి పోతాననుకొని మొట్టికాయ వేసి మరీ గట్టిగా చెప్పింది. ఒక జడ ముందుకు మరోటి వెనక్కు వేసుకోమని.  నేనెలా మర్చిపోయాను..?
గుర్తొచ్చింది.
పూట బళ్ళో అడుగు పెట్టగానే మా పంతులమ్మ చివాట్లు.. “ తెల్ల జాకెట్టు వేసుకు రమ్మంటే , దాని మీద ఆ  గులాబి పువ్వేంటి ?”అని
పాపం ..మా అమ్మ!
 అప్పుడే మ్యాటీ బట్టముక్కను పాలియస్టర్ మీద టాకాలు వేసి పువ్వు కుట్టాక,  దారాలు లాగేయడం అనే కళను నేర్చు కొంటోంది. ఖాళీగా కనబడింది నా  బడి జాకెట్టేగా !  చక్కగా గులాబి పువ్వు కుట్టేసింది!
ఆకులతో సహా. ఎరుపూ పచ్చ దారాలతో.
మరి మీకు పువ్వు కనబడుతోందా?
ఏది ఏమైనా రోజు మా అమ్మ ఫోటో చూసి ఎన్ని మొట్టికాయలేసిందంటే , తరువాత ఫోటోలన్నిటిలో నా రెండు జళ్ళూ బుద్ధిగా ముందుకు వాలి ఉంటాయన్న మాట !
ఎన్నడూ రెండు కాళ్ళూ కుదురుగా ఒక చోట పెట్టిన పాపాన పోని మా తరగతి అల్లరి అబ్బాయిలు ముఖ్యంగా, రఘూ.. రవికాంత్ .. ఇంత బుద్ధిగా నిల్చున్నారంటే ,అందునా  ఫోటో తీసినంతసేపూ తిన్నగా నిలబడ్డారంటే ... నాకయితే ఇప్పటికీ నమ్మశక్యం కావట్లేదు!
నమ్మక తప్పదండోయ్!
ఇప్పటికి పాతికేళ్ళకు పైగా బెంచీ మీద అలా నిల్చునే ఉన్నారు !
ఏం అల్లరి చేసి ఉంటారు చెప్మా ?
***
 చిన్ననాటి మంచి మిత్రులు రఘు రవికాంత్ అపర్ణ శ్రీలత లను  తిరిగి కలుసుకొన్న సంతోష సమయాన ..    ఒక పచ్చటి జ్ఞాపకం. 
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 21, 2013

మరొక ఆత్మీయ కోణం

కాంతమ్మ గారి ఎలిజీలోని జ్ఞాపకాల తడి నన్ను తాకింది. 
నా నోట మాట మెదలలేదసలు. ఆ పూట ఆ సదస్సులో సాగుతోన్న అనేక కోణాల్లో ఇమడని మరొక ఆత్మీయ కోణం. 
దాంపత్య బంధం. 
హృద్యమైనదీ. 
ఆర్ద్రమైందీ. 
అనంతమైనదీ.
"కాంతిపుంజాలను వెతుక్కుంటూ"

http://pustakam.net/?p=15668



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 19, 2013

సరసపు పల్లెపాటగా














జానపదం జానపదమే.  
                                                      
కొత్తగా కొంటెగా...
ఘాటుగా నాటుగా...
మోటుగా చాటుగా ..
తేటగా  సూటిగా..

సరసపు పల్లెపాటగా ..


నాజూకు దిద్దుకొని..
నాణెంపులద్దుకొని..
నాజూకై నాగరికమై 

మధుర గళాల 

వయ్యరాల తొణికిసలాటలా ..

నటీనట నటనల 

సరాగాల సయ్యాటలా..

ఇలా..

http://www.youtube.com/watch?v=R_W3jXoJn9s

ఆకులు పోకొలియ్యకురా
నా నోరంతెర్రగ చేయకురా

ఆకులు పోకా తెచ్చెదెనే
నీ నోరెంతెర్రగ చేసెదనే

జాజికాయ జాపత్తిరియ్యకురా
నా నోరంత గమ గమ చెయ్యకురా

జాజికాయ జాపత్తిరిచ్చెదెనే
నీ నోరంత గమగమ చేసెదెనే

ఉసికె బొమ్మరిల్లు గట్టకురా
నన్నూరికి దూరం ఉంచకురా

ఉసికె బొమ్మరిల్లు గట్టెదెనే
నిన్నూరికి దూరం ఉంచెదనే

మాటికి ముఖము చూడకురా
నా మనసును పాడు చేయకురా

మాటికి ముఖము చూచెదెనే
నీ మనసును పాడు చేసెదెనే
***
(సంపాదకులు: డా.బిరుదరాజు రామరాజు గారు)

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 14, 2013

కిం కర్తవ్యం !?!

అనుకోకుండా ఒక కథ చదివాను.
ఇప్పటికే ఆ కథ  బోలెడంత ప్రాచుర్యాన్ని పొంది ఉన్నది.
ఆ కథకుడిని ఓ.హెన్రీ ...మాంటో.... ఫాల్కనర్  తదితరుల సరసన కూర్చుండబెట్టింది.
ఆ కథనం తెలుగులో జరిగింది  కనుక, మీకూ నాకూ ఆ కథతో ఒక చిన్నపాటి సంబంధం కుదిరింది.
కథ, కథకుడు, కథనం ... దేశకాలసీమితమైనవనీ ...ఆయా పరిమితులను అవగాహన చేసుకొంటూ .. కథావిమర్ష చేయ తగుననీ .. విశ్వసించే వారిలో మన వల్లంపాటి గారు ఒకరు.
మన బోటి మామూలు పాఠకులం కథావిమర్ష లాంటి భారీ ప్రయత్నాలను చేయగలవారం కాదు కనుక , ఆ కథను గురించి తోచిన తాజామాటలేవో చెప్పుకొందాం.
ఇంతకీ ఆ కథలో ప్రధాన పాత్రలు రెండు.
 కథకుడు. అతని పాఠకురాలు.
పరోక్ష పాత్రలు మరో రెండు .. ఆ పాఠకురాలి భర్తా , ఆమె కొడుకు.
ఇది , ఈ నాటి సమాజంలో సాంకేతిక జ్ఞానాన్ని పరికరాల్ని అడ్డుపెట్టుకొని విజృంభిస్తోన్న విశృంఖల జీవన శైలి పై గురి పెట్టినది.
కథనం చాలా సాఫీ గా సాగింది. ఒడిదుడుకులు లేవనే చెప్పాలి. అప్పుడప్పుడు , కొన్ని పదాలు కటువుగా తాకినా.. కొన్ని వాక్యాలు పటుకుమన్నా.
ఆ పాఠకురాలికి మన కథకుడి మీద అపారమైన గౌరవం. అతని కథలు ఆమె కు "యాంటి  డిప్రెసంట్లు" అతనిలో తన తమ్ముడు కనబడతాడామెకి. తెలుగు కథకులు పుస్తకాలు అచ్చేసుకోలేని అభాగ్యదామోదరులని  ఆమెకు కొండంతజాలి. అందుకే, అలా మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలిగిన మంచి పుస్తకాలను అచ్చు వేయమని , ఓ చక్కటి చెక్కు కూడా రాసిస్తుంది.
కథకుడికి సహజంగా ఉన్న సానుభూతితో పాటు, ఈ చెక్కుబంధం మరింత బాధ్యతగా ఆమె మాటలు వినేట్టు చేస్తుది.
ఆ కథకుడితో బాటు మనమూ వింటాం.అతని కళ్ళతో ఆమె ఆహార్య అహార వ్యవహారాల గురించి తెలుసుకొంటాం.
ఇక, ఆమె ఒక బాధితురాలు. ఆమె భర్త విశృంఖల అనైతిక శృంగారజీవితం ,ఆమే కుటుంబ జీవీతంలోని హింస, ఆమె కొడుకు మానసిక వేదన ..అన్నీ చక్కగా రిపోర్ట్ చేయబడ్డాయి. ఓ.హెన్రీ తరహా చమక్కు ముగింపు కూడా ఇవ్వబడింది. 
ఇక్కడ వచ్చిన చిక్కేమిటండీ అంటే, మనం తెలుగు పాఠకులం అక్కడితో  విని ఊరుకొనే రకాలం కాదు. ఆ కథకుడిలాగా. సరిగ్గా, ఇలాంటి , సంఘంటలకు కథకుడు ఇచ్చే  "నిర్ణయాలపై మనకొక  అంచనా  ఉంటుంది “.కిం కర్తవ్యం ?” అనుకొంటూ కథకుడు మనకు చూపించే కర్తవ్య మార్గం వైపే మన చూపులన్నీ
కొద్ది మంది కథకులు చెప్పకనే చెప్పగల నేర్పరులు.మరికొందతు తేటతెల్లంగా చెప్పేస్తారు. కొందరు సూచనప్రాయంగా ఇంకొందరు స్పూర్తిప్రేరకంగా .. ఏదో ఒక రూపేణా తమ పాత్రల భవితవ్యాన్ని పాఠకులకు స్పురింపజేసేలా చూస్తారు.
ఇది పొరలుపొరలుగా విచ్చుకొనే మంచి కథాకథన లక్షణం. ప్రతీ పలుకులోనూ గాఢత ..ఆర్ద్రత..సౌమ్యత లను  .. ఒలికించడంలోనే రచయిత బాధ్యత  ఏ పాటిదో తెలియవస్తుంది.    
కాగా, ఈ కథకుడి నిర్ణయం చిత్రంగా ఉన్నది. ఆమె అతనిపై చూపిన అపారమైన నమ్మకం, ఆమె అతనిలో పొందాలనుకొన్న సోదరబాంధవ్యం...ఆ చిత్రహింస నుంచి ఆమెకు ముక్తిని కలిగించే మార్గాన్ని చూపగలండన్న విశ్వాసం ... ఏమీ చేయ కుండా నిలబడినప్పుడు... కసాయి వాడి వెంట గొర్రెలా ఈడ్చుకుపోబోతున్నాప్పుడూ.. అతనిని  వెనకడుగు వేయించిన ఆలోచనలేవీ?
అదీ ఆ కథలోనే లభ్యం. ఆమె ఉన్నత కుటుంబానికి చెందిన స్త్రీ. తోచినంత చెక్కు రాసి ఇవ్వగలిగిన స్వతంత్రం ఆమెకు ఉన్నది.నచ్చిన చోట కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోగల వెసులుబాటు దొరికింది.  తాత్కాలికంగా నైనా.
ఆమె రెండు విషయాలనుగ్రహించింది. ఆమె భర్త నేర ప్రవర్తన. రుజువులు సేకరించింది. రెండవది , తన విముక్తి. మార్గాలను తెలుకున్నది.
 అందుకు ,కథకుడికి గల శక్తిని కూడా ఆమె గ్రహించింది. మీడియా ముందుకు రావడానికి , తన భర్తను ఎండకట్టడానికి సంసిద్ధమయ్యింది. ఒక వుద్యమం చేయమంటుంది. చివరకు మళ్ళీ తన కత్తులపంజరానికి తిరిగి తీసుకు పోబడుతుంది.
ఇక పోతే, ఆమె సెల్ ఫోన్ నుంచి అన్ని కదలికలూ , నియత్రించబడినట్లుగా మనకు తేటతెల్లం చేస్తాడు ఆమె భర్త.ఆమె కొడుకు చిన్నవయస్సులో తండ్రి దురాగతాలకు సాక్షీభూతం.
సరే ,వీటన్నిటి వెనుక ఉన్నది ఒకటే.  మనిషి .  మనిషిలోని జంతుప్రవృత్తి.
నిజమే.  మనం జంతువులం .  నిరంతరం మనకై మనం ఈ "మనిషి " అనే జీవిని సృజియించుకొంటూ ఉంటాం .
మన సహజ జంతునైజం మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఇది మానవులుగా మనల్ని మనం మలుచుకొనే ప్రక్రియలో అనునిత్యం జరిగే సంఘర్షణ.  ఎదురొడ్డి నిలబడగలిగిన వారే కదా మనుషులు. ఆడైనా .మగైనా. పిల్లలైనా. పెద్దలైనా.
ఇక పోతే, ఈ కథలో అన్ని ఆలోచించగలిగిన ఆమె, విడాకుల వంటి నాగరీకవీడ్కోలునే కోరుకుంటుంది. అదీ వీలుపడనివ్వరు. ఆమెను ఒక మతిభ్రమణకు లోనయిన స్త్రీగా చిత్రించే ప్రయత్నం జరుగుతుంది.   
 హింసలలో కెల్ల ఏ హింస దుర్భరం అంటూ మనం అనుకోలేము.రూపాలు వేరైన ఎన్నయినా హింస హింసే. హెచ్చొచ్చులు లేవిక్కడ. నిత్యం రగిలే అగ్నిగుండం లాంటి చిత్రహింస లోనుంచి ఆమె బయట పడాలని ప్రయత్నిస్తోంది.
ఇక, సాధరణ పాఠకులుగా మనం ఎంత హింస ఎలా జరింది అని తెలుసు కొని ఊరుకోకుండా , ఆ హింస ను ఎలా ఎదుర్కోగలగాలి, ఎలా రూపుమాపాలి, ఎలా సుహృద్భావ వాతావరణం నెలకొల్పుకోగలగాలి ... ఎలా మరలా ఆ తల్లీ బిడ్డలు ఒక సాధారణ జీవితం జీవించగలగాలి, ఎలా వారి మానవ గౌరవం నిలబెట్టబడుతుంది.. మొదలగు అనేకానేక అంశాలు ... అత్యవసరంగా ప్రశ్నార్ధకాలై నిలబడతాయి.
ఇక, రెండు ముఖ్య విషయాలు ఆ కథకుడి నుంచి ఆశిస్తోంది..
ఒకటి ఆ పగటి నేరస్తుడికి పడే శిక్ష.
రెండొది, ఆ బాధితురాలికి ఆమె కొడుకుకీ అందవలసిన శారీరిక మానసిక చికిత్స.
మన భాగ్యనగరం లో ఇలాంటి తరహా వ్యవహారాల్ని చక్కబెట్టడానికి స్వచ్ఛందంగా వకాల్తా పుచ్చుకొన్న వారు సంస్థా గతమైన వారూ .. అనేకులు. వారెవరి ప్రస్తావనా రాలేదు. వారి కృషీ మన కథకుడికి ఆనలేదు. అందులోనూ ఇది భాగ్యనగరంలో పుట్టిన కథ.!
ముఖ్యంగా, ఆ కథకుడికి సోషల్ నెట్ వర్క్ లపై కూడా కొంత చిన్నచూపు . సరదాల చోట్లనీ. నిజమే సుమా అనిపిస్తుందే మో .అయితే , ఆ అవకాశాన్నే మనం ఇలాంటి సంధర్భాల్లో మనుషుల సహాయార్ధం ఎలా వినియోగించుకొవచ్చునో ఆ మాట మాత్రం ప్రస్తావన లేదు.  
కాలక్షేప కూటములే బలమైన సంఘటిత శక్తులు కాగలవు. అవసరమైనపుడల్లా. ఇది కూడా ముఖ్యం.  
అన్నట్లు, ఆ కథారచయత ఇవన్నీ ఎరగని వారు కారు. ఇంకెన్నో కూడా తెలిసిన వారు. అయితే, అన్ని అంశాలనూ ఒక్క కథలో అమర్చడం ఎలా అని తాత్సారం చేశారేరేమో. 
సరిగ్గా అక్కడే కదా రచయిత చాతుర్యం ,రచనా కౌశలం బయటపడేది ?
 ఆయా కథకు తగ్గంత పాళ్ళలో "కిం కర్తవ్యం"అన్న ప్రశ్న కు సమాధానమూ కోరుకొంటే పాథకులుగా
 అది మన తప్పు కాదు కదా?
అలాగే,  కథలోని పాఠకురాలి సాంఘిక నేపథ్యానికో ,కులానికో మతానికో , ప్రాంతానికో  పరిమితమైన హింస కాదు కదా ఇది? ఇది సార్వజనీనమైన సమస్య. ఒక అపురూప మానవ సంబంధాన్ని మూలంగా చేసుకొని,నిత్యం తొలిచివేస్తోన్న చిత్రహింస.  
అయితే, ఈ కథలు నీతి కథలని పరిచయబడ్డాయన్నది మరొక విషయం.
అలాగని కాకమ్మకథల పసిపాఠకులమూ కాము. నేతి నేతి నీతి అని వెతుక్కోవడానికి. కథల్లో నీతి నేతిబీరకాయల్లో నేతి  వంటిదని మనకు తెలియదూ.
అందుకే, మెరుపు ముగింపో కథనాల్లో తటాల్మనే వంపో కాదు కదా కథంటే !
కథంటే కథే.
మన కథ  ఓ.హెన్రీ దో చెకోవ్ దో మాంటో దో ఫాల్కనర్  దో  కానక్కరలేదు. మనదైతే చాలు.... !
అవన్ని వల్లంపాటి గారన్న ఆయా దేశకాలాలకు చెందినవి . మన కథలు మన దేశకాలాలకు.  ఓ.హెన్రీ ,చెకోవ్ తదితరుల  తరువాత కథ మరెంత దూరం ప్రయాణం చేసిందో ...!
కథకుడికి పాత్రపట్లా పాఠకుల పట్లా గౌరవం ఉంటే చాలు!! 
అదే  మానవ స్పృహను ఊపిరి నింపుతుంది. 
మనం తక్షణం ఆలోచించ వలసింది.
కిం కర్తవ్యం !?!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 9, 2013

When I was Just a Little Girl ..

                  (8-2-1979)
నా చిన్నప్పుడు.. "నేను బెద్దయ్యాకా.." అంటూ గోప్ప కలలు కన్న గుర్తులు లేవు కానీ...
ఈ పాట మాత్రం తెగ పాడేయడం గుర్తుంది.
పాట ఎవరు నేర్పారో సరిగ్గా జ్ఞాపకం లేదు.
మా బడి ప్రిన్సిపాల్ దుర్గాభక్తవత్సలం  గారా  లేక వారి చెల్లెలు చిత్రా గారా అని.
ఏమైనా అప్పుడు నేర్చుకొన్న ఆ పాట అప్పట్లో మా పాలమూరు కొండల్లో  కేరింతలతో గింగిరాలు కొట్టినా ..
నా చిట్టి బుర్రలో దూరి,   ఇప్పటి దాకా వదల లేదంటే నమ్మండి!
అందుకే, మా పిల్లలకూ నేర్పేసా...అచ్చంగా డోరిస్ డే గారిదే. ఆ పై మన భానుమతి గారిది కూడాను.
మా చిట్టిగళాలు ఇప్పుడు పొగతోటను హోరిత్తించేస్తున్నాయి !
మీరూ విని తరించండి ..
ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ..అనుకొంటూ.
ఇంతకీ , ఆ బొమ్మలో  ఉన్న అమ్మాయికీ  ఈ  లింకులకు ఉన్న లంకె ను మీరే గ్రహింతురు గాక!
                    
http://chandralata.blogspot.in/2010/02/blog-post_10.html

The future is not ours to see ...Doris Day
http://www.youtube.com/watch?v=MXQTWCTc0aI

భానుమతి గారి గళంలో విప్పుకొన్న భవిష్యత్తుగానం
http://www.youtube.com/watch?v=nUSLdY4mL4Q

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 8, 2013

డూ డూ... డూ డూ...!

కొబ్బరాకులు మసిబారి పోతున్నాయి. 
వరిచేలు బీటలు వారుతున్నాయి.
రాక పోకలు ఆగిపోయాయి.
రహదారులు బోసి పోయాయి.
గాలి వెలుతురు స్తంభించి పోయాయి.
ఇళ్ళు వాకిళ్ళు బోసిపోయాయి.

బడులు లేవు..పాఠాలు లేవు.
ఉద్యోగాలు లేవు. సద్యోగాలు లేవు. 
వ్యాపారాలు లేవు. వ్యవహారాలు లేవు.

జీతభత్యాలు చెల్లించాల్సిందీ..
ఆస్తినష్టాల్ని భరించాల్సిందీ..
సమిధలయ్యేదీ 

ప్రజా సమూహాలే కదా !

ఉద్వేగాలలో ఉద్రేకాలలో నలిగేది .
ఆవేశకావేశాల సెగల్లో పొగల్లో
ఆహుతులయ్యేదీ 

జనసామాన్యమే కదా..!

తమ శ్రేయస్సు తమ భవిష్యత్తు
ఆలోచించవలసిన అవసరాన్నే గుర్తించని ..
మంచీ చేడు మాటమంతి పట్టించుకోని...
డూ డూ బసవన్నలను 

అందలమెక్కించిన
ఒకేఒక
పాపానికి!

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 4, 2013

ఆ సబర్మతి ముని వాటికలో

నా జీవితమే నా సందేశం ...అన్న మహత్ముని వాక్యం కస్తూరి బాయి జీవితంతో ముడిపడి ఉంది.జీవన సహచరిగా జీవిత భాగ స్వామినిగా ..ఆమె నిశ్శబ్దం గా మహాత్ముని నేపథ్యమై నిలబడిన వైనం, ఆమె మొక్కవోని వ్యక్తిత్వం, ఆమె మూర్తిమత్వం , మనం జ్ఞాపకం చేసుకొనే ఒక సంధర్భం
 గాంధిజీ పుట్టిన రోజుకన్న మరొకటి ఏముంటుంది?
ఆ సబర్మతి ముని వాటికలో ఆతిదేయి ని పలకరిచే ఒక ప్రయత్నం.
 ఆ అమ్మానాన్నలకు మా బుజ్జిపిల్లల జోతలు.
ప్రభవ పిల్లలు తమకు తోచిన రీతిన "బాపు బాట"ను అవగాహన చేసుకొనే ప్రయత్నం ఇదీ.
మీరూ చూడండి. ఒక మారిలా.
http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_4.html

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 2, 2013

నీ బాటను నడిచే

సబర్మతి ఒడ్డున..
కస్తురి బా పక్కన...
బాపూజీ నీడన ...

Related Link:

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 1, 2013

అనగనగా రెండు పాటలు

ఇదేమో కుడిపక్కన  బుద్ధిగా కూర్చున్న పిల్లలకు.
http://www.youtube.com/watch?v=Z-DPXmPalf8

మరి ఇదేమో ఎడమ పక్కన  నక్కిన పెద్దలకి.
http://www.youtube.com/watch?v=DfdXEATOoy8

మరి మీకు నాకూ..?!?
రెండూను !!!

****

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.