కాసేపు తల బర బరా గోక్కుని,
ఆంధ్ర భారతిలోని తెలుగు నిఘంటువుల్ని చకచకా తిరగేసా!
హెల్మెట్ అంటే తెలుగులో ఏమిటి చెప్మా అని.
తెగ బారెడు మాటలు.
యధాప్రకారము శిరస్త్రాణం తో పాటు,
శిరః కవచము ,తలజీరా,ఇనుప కుళ్ళాయి , బొమిడకము, నలికాముకుటము మొదలగునవి వరసబెట్టాయి.
గూగులమ్మేమో ... తేటగా తేల్చి పడేసింది " ఇనుప టోపీ " అని. తలకు పెట్టుకొనే కవచం అని కూడా అందండోయ్!
తలవని భారాన్ని తలకెత్తుకొన్నానే అని తల బాదుకో బోయి,తమాయించుకొని , తటాలున తలపుల్లో మునిగా.
తలపాగా, తల తొడుగు, తల భద్ర , తల రక్ష ,తలచం ....
అబ్బబ్బో ... నా తల తిరిగిపోతోంది !
తెలుగండీ తెలుగు !
***
సురేశ్ కొలిచాల గారికి ధన్యవాదాలతో.
Suresh Kolichala My entries:
తలకాపు, తలోలిమి (ఓలము = cover, ప్రొటెక్షన్), తలజీర, తలతొడుగు, తలయుడుపు, గూడ, తలపొదుగు, తలచూడి, తలమఱుగు/వు, తలమాటు, తలమేగు
Chandra Latha Suresh Kolichala garu. ధన్యవాదాలు.
ఈ మధ్య తరుచు పత్రికల్లో పలకరించే మరో పదం... యూనిఫాం ... సమ దుస్తులు ,ఏక రూప దుస్తులు ... అంటూ. ప్రతి పదానికి అనువాదం చేయకుండా , సరి అయిన తెలుగు పదాన్ని ఎందుకు ప్రతిపాదించలేక పోతున్నారో తెలియడం లేదు. పోని.. ఈ రెండు మాటలు నలుగురి నోళ్ళల్లో నానుతున్నాయా అంటే అదీ లేదు. యూనిఫాం అంటారే కానీ ...ఆ రెండింటిలో ఏ పదమూ వాడరు.
ఒకే పత్రికలో ఒక సారి ... "ఏక దుస్తుల పంపిణీ " అని రాస్తారు. మరోసారి , "సమ దుస్తుల కొరత" అంటారు. నా బోటీ సామాన్య పాఠకులం ఏం జేస్తాం?" యూనిఫాం అని అనకూడదా నాయనా , ఎందుకొచ్చిన గందరగోళం ?" .. అని తేల్చేస్తాం. అదన్న మాట సంగతి!
పూర్వం కూడా సైనికుల కవాతుల్లో ఒకే రకం బట్టలు, ఆయుధాలు వేసుకొనే వారు కదా .. వారేమి అనే వారో ?
***
Chandra Latha మోటు పదాలని అనబడుతున్నవి తెలుగు పదాలనీ, హెల్మెట్ అన్న పదం ఎంత పరాయిదో శిరస్త్రాణమూ అంత పరాయిదేననీ... అచ్చమైన తెలుగు పదాలు అనేకం ఉన్నాయని ..మనం వాడుకలోకి తేవచ్చుననీ.. అనుకొంటూ ఈ చిన్ని అభిప్రాయం అచ్చేసాను.
మన హోసూరు తెలుగు ఉద్యమ మిత్రులు " చే పలుకి (Cell Phone) " మప్పిదాలు( Thanks )" మొదలయిన అనేకానేక పదాలను సహజంగా వాడేస్తున్నారు. బడిలో యూనిఫాం ఉండకూడదని భావించే వారిలో నేనూ ఒకరిని. పిల్లలలో అసమానతల పట్ల అవగాహన కలిగేలా, చేతనాభరితమైన చదువులు చెప్పగలిగినప్పుడు, చెప్పలేని మన చేతగానితనానికి ఒకే రకం ముసుగులేయడం దేనికి?
ఇది, మాటల చర్చ కాబట్టి, ఒక గట్టి పట్టుదలతో , మన తెలుగు ని మరింతగా మన తెలుగు గా మన పిల్లలకు అందించవచ్చు. తెలుగు అక్షరాల్లో ఇంగ్లీసు పదాలను రాయడం, ఇంగ్లీషు పదాలకు ప్రతి పద అనువాదం చేయడం ,సంస్కృతం పట్ల పెరిగే మోజే కానీ తరగని వ్యామోహం , తెలుగంటే ఎన్ని సంకృత పదాల సక్లిష్ట సమాసబూయిష్టమయితే అంత గొప్ప తెలుగన్న భావన లాంటి కొన్ని ... మన తెలుగు జాతి సహజలక్షణాలను సంస్కరించుకొంటే.... ఎంతో సరదాగా సంతోషంగా చేయవచ్చును. మిగిలిన భాషాసంబంధ విషయాలు... భాష పై పలువిధాలుగా కృషి చేస్తున్న విజ్ఞులు Suresh Kolichala garu , Nagaraju Pappu garu చెప్ప గలరు !
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment