Nov 22, 2010

రచనాపరిమితి

ఏ రచనకైనా పరిమితులు ఉంటాయి.
గ్రామీణజీవిత చిత్రణలో తెలుగు అన్వలకు ఉన్న పరిమితులు అలాంటివే.
సమకాలీన పరిస్థితులకు లోబడిన రచయిత వ్యక్తిగతాభిప్రాయాల ప్రభావం రచనపై ఉండకపోదు.
అందులోనూ సృజనాత్మక రచనలలోని కళాత్మకవిలువలు రచయిత వ్యక్తిగత ప్రతిభపై ఆధారపడిఉంటాయి.
ఎంత పరిణితి చెందిన వారని భావించిన వారి కైనా ఎంతో కొంత పరిమితి తప్పదన్నది వాస్తవం.
అలాగే ,
జీవితానికి ఒక నిర్దిష్ట రూపం లేదు.
ఏ సిద్ధాంతాలలోనూ క్రోడీకరించలేము. ఏ సూత్రాలలోనూ బంధించలేము. ఏ చట్రాలలోనూ బిగించలేము.
కానీ, నవలకు రూపం ఉన్నది.ప్రారంభం ఉన్నది.ముగింపు ఉన్నది. ప్రామాణికత ఉన్నది. నిబద్దత ఉంది. నియమమూ ఉంది.


 స హితమై , సహితమైనదే సాహిత్యం అని అంటారు.
ఉన్నత మానవ విలువలను ఆవిష్కరిణ్చే అవకాశం, నవరసాలనూ కళాత్మకంగా వ్యక్తపరచగలిగే వీలు,విస్తృతి నవలలో ఉన్నది.
అయితే, తెలుగు నవలాసాహిత్యాన్ని కొలిచే కొలబద్ద ,తూచే తూనిక రాయి అయిన "రాజకీయ సత్యం" నవలను ఓ సృజనాత్మక రచనగా స్వీకరించడానికి ,ఓ రసాత్మక స్థాయికి పరిణితి చెందడానికి , పెద్ద అడ్డంకి.
సృజనాత్మకత కన్నా రాజకీయదృక్పథానికి ,సామాజిక ఆర్ద్రత కన్నా సిద్ధాంత ప్రాతిపదికకూ , ప్రాధాన్యతనిస్తూ ,
రాజకీయసత్యాన్నే  సామాజిక సత్యంగా పరిగణించే అవాంఛనీయ సాంప్రదాయం సాహితీ ప్రపంచాన్ని శాసిస్తున్నది.
కేవలం రాజకీయదృక్పథాల ప్రకటనగా నవలను మలిచే ప్రయత్నంలో రచయిత మునిగి పోతే , సృజనాత్మకతకు మూలమైన కవితాసత్యాలు ,భావచైతన్యానికి బాట వేసే హేతుబద్ద సత్యాలు ,మరుగున పడే  అవకాశాలు లేకపోలేదు.
ఇక, రసాత్మకతకు తావు లేని ఆ రచన రాజకీయ కరపత్రంలా దిగజారే ప్రమాదంలో కూడా అపుడప్పుడు పడకా పోలేదు.
ఏ రచనా రచయిత రచిండంతోనే పూర్తి కాదు. 
పాఠకుని అభిప్రాయంతో అది సంపూర్ణమవుతుంది.
అదుచేత, 
ఏ రచనైనా పాఠకునికి   ఓ పరిచయమూ ఓ ప్రారంభం మాత్రమే.
***

 (ప్రపంచ తెలుగు సమాఖ్య వారి ప్రత్యేక అనుబంధం కొరకు వ్రాసిన(28-10-4) వ్యాసం లోంచి ఇంకొంత )

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment