నవంబరు నెల వచ్చిందంటే చాలు .
పిల్లలు తయారు.
పిల్లల పండుగకు సిద్దమవుతూ.
బడిలోనో మరోచోటో పిల్లల కళానైపుణ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశం తో అనేకానేక కార్యక్రమాలు నిర్వహింబడతాయి.
కొన్ని అధికారహోదాతో . మరికొన్ని స్వచ్చందంగా.
ఆ బాలల బాబాయి,జవహర్ లాల్ నెహ్రూ కు నివాళిగా.
వీటన్నిటికీ మాధ్యమంగా ఇప్పుడు మరొక వేదిక పిల్లలకు అనునిత్యం లభ్యమవుతూ ఉన్నది.
అది , మిరుమెట్లు గొలిపే టివి తెర.
అందులోను , ఇప్పుడు పండగలన్నీ మనం జరుపుకొనేది టివి తెరలపైననే కదా!
అందుకు పిల్లల పండగ మినహాయింపు కాబోదు.
*
" చిత్తి చిలకమ్మా.."
ఇంటికెవరైనా అతిథులు రాగానే మనమేం చేస్తాం?
మన పిల్లలని పిలిచి వాళ్ళు నేర్చిన పద్యాన్నో పాటనో వినిపించిమంటాం.
పిల్లలు " చిత్తి చిలకమ్మా అమ్మ కొత్తిందా.." అంటూనో "తింకిల్ తింకిల్ లితిల్ స్తార్.."అంటూను ముద్దుముద్దుగా పలికే పలుకులకు మురిసి పోతాం. పుత్రోత్సాహంతో పొంగి పోతాం.
ఇక, బడిలో వేశాక వాళ్ళు రోజూ ఇంటికి తీసుకు వచ్చే ముచ్చట్లన్నీ మురిపాలుగా దిద్దుకొంటూ,మనం సంతోషించడమే కాక , బంధుమిత్రులనదరితో అపంచుకొని ,అమ్మనాన్నలుగా తరించిపోతుంటాం.
ఇంట్లో తాతయ్యలూ అమ్మమ్మలూ నాయనమ్మలూ ఉన్నట్లయితే ,ఇక ఆ సంబరం చెప్పక్కర లేదు.
ఇదుగోండి సరిగ్గా అక్కడే , మన పిల్లల కళాప్రదర్షన ప్రారంభమవుతుంది.
వారి కళను నలుగురి ముందు ప్రదర్షించాలనీ , వారి మెప్పును పొందాలని అనుకోవడం , ఎంత సహజంగా మొదలవుతుంది కదా!
అయితే, తమ పిల్లల ప్రదర్షనను లక్షలాదిమంది ప్రేక్షకులు చూడాలని ఏ అమ్మానాన్నలకు కోరిక
ఉండదు? ఆ సహజమైన కోరికే , ఈ నాటి పిల్లల " రియాల్టీ షో " లకు మూలధనం !
***
బడిలోని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ,
అప్పుడు వెన్ను తట్టిన ఉపాధ్యాయుని ప్రోత్సాహం, తరగతిలోని స్నేహితులతో పంచుకొన్న అమూల్యమైన అనుభవం అందరికీ ఓ చక్కటి జ్ఞాపకం.నిజానికి, ప్రత్యేక సంధర్భాలలో ,జాతీయ దినోత్సవాల్లో , పాఠశాల వార్షికోత్సవాల్లో ,పిల్లలి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్షించడం ఆనవాయితీ.
ఇలాంటి ప్రత్యేక సంధర్భాల కోసం ,పాఠాల మధ్యలో విరామాలు తీసుకొని ,వంతులు వేసుకొని మరీ పంతుళ్ళు నేర్పే కొత్త కొత్త కార్యక్రమాలకోసం , అందరం ఎదురు చూస్తుంటాం.
లెక్కల మాష్టారు పద్యాలు పాడుతుంటే, తెలుగు టీచరు ఆంగ్లంలో డైలాగులు వల్లిస్తుంటే..నవ్వుతూ .సంతోషంగా సిద్దమవుతుంటాం.
దేశభక్తి, జాతీయభావన ,సుహృద్భావం, చైతన్యం, చదువు , మంచి నడవడిక ,క్రమశిక్షణ , సౌజన్యం, ప్రకృతి,మంచీ మర్యాదా..
ఇవన్నీ , అప్పటి పిల్లల సాంస్కృతిక కార్యక్రమమాలలోని ప్రధాన అంశాలు.
అందుకే తెలుగు బాలసాహిత్యం లోని ,గేయాలు ,పాటలు, నాటికలు ,ఏకపాత్రాభినయాలు ,బుర్రక్థలు,హరికథలు ..అన్నీ కూడా ,ఎంతో శ్రద్ధగా ,పిల్లల భావచైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినవి.
ప్రతి మాట ,ఆలోచన , సన్నివేశం,సంభాషణ ...రచించడంలో వారు తీసుకొన్న జాగ్రత్త ,చూపిన మెళుకువలు , ఇప్పుడు తరిచి చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో!ఒక వ్యక్తినో రచననో పిల్లలకు పరిచయం చేసేటప్పుడు ,వారు పాటించిన ప్రమాణాలు మనకు విస్మయం కలిగిస్తాయి.
తెలుగువారి సంస్కృతీసాంప్రదాయాల్లో ప్రధాన భాగమై వెలుగొందిన బాలానందం నుంచి బాలల అకాడెమీ ,బాలభవన్ల వరకూ ,బాలల కళాప్రదర్షనకై ఉద్దేశించిన రచనల ఎంపికలో మెళుకువ వహించడం మనకు తెలుసు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, ఒక పింగాణీ కప్పునో సబ్బుపెట్టెనో బహుమతులుగా పొంది, చప్పట్లతో సంబరపడితూ ,ఇంటికి చేరే వాళ్ళం.ఇరుగుపొరుగుకు చూపించి సంబరపడిపోయే వాళ్ళం కూడా.
ఉపాద్యాయుల సృజనాత్మకతకు ,కళాభిరుచికీ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఒక ప్రకటనలా ఉండేవి.
అమ్మానాన్నల ప్రమేయం దాదాపుగా లేనట్టే. పిల్లల్ని చూసి మురిసిపోవడం తప్ప.
ఇవన్నీ, మన బాల్యం గడప లోని పచ్చటి జ్ఞాపకాలు.
***
‘నిజ ప్రదర్షన "( రియాల్టీ షో )" లలోని , వాస్తవమేమిటో,
గత జూన్ నెల "ఆట" వ్యవహారం, విడ మరిచి చెప్పిందికదా? ఆందోళనలో పడవేసిన అభం శుభం తెలియని బాలిక ఆత్మహత్యాయత్నం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తే,ఆంధ్రప్రదేశ్ బాల సంగం, ఐద్వా తదితర స్వచ్చందసంస్థలు తీవ్రంగా స్పందించి మానవహక్కుల కమిషన్ వద్దకు వ్యవహారాన్ని చేర్చాయి. అనేక మంది తల్లిడండ్రులు వారితో పాటు నడిచారు.
జస్టిస్ సుదర్షన్ రెడ్డిగారు అంతే తీవ్రంగా ప్రతిస్పందిచారు. ఆ రియాల్టీ షో ను వెంటనే ఆపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. .
కాగా,
ఆ సంధర్భంలో జస్టిస్ సుదర్షన్ రెడ్డిగారు ఇలా వ్యాఖ్యానించారు,"
"పిల్లల ఆరోగ్యాన్ని చదువును ఇలాంటి ప్రదర్షనలు పాడుచేస్తున్నాయి. అమ్మానాన్నలు ఇలాంటి కార్యక్రమాలకు పిల్లలు పంపడానికి వ్యతిరేకించాలి . సినిమాపాటలకు పిల్లలు చేస్తున్న డాన్సులు అశ్లీల భంగిమలతో అభ్యంతరకరంగా ఉన్నాయి."
కొద్దిమంది అమ్మానాన్నలే ఆ ఆటలను వెనకేసుకొచ్చారు.కాగా, న్యాయపరమైన పోరాటం ఇప్పుడు హైకోర్టు వరకు వచ్చింది.
నిజమే .ఈ నిజ ప్రదర్షనలలో అందులో పాల్గొన్న వారికి , వారిలోని నైపుణ్యాన్ని లక్షలాది మంది ప్రేక్షల ముందు ప్రదర్షించే వేదికలను అందిస్తాయి. కీర్తినీ,డబ్బును , ప్రతిష్టాత్మకమైన సంస్థలతో పని చేసే అవకాశాన్ని, నిపుణులతో శిక్షణలో మెళుకువలు నేర్చుకొనే అవకాశాన్ని , ప్రముఖవ్యక్తులతో సన్నిహితంగా మెలగగలిగే అవకాశాన్ని ఇస్తాయి. నలుగురి దృష్టిలోకి రావడం వలన , సినిమా ,టివి తదితర రంగాలలోకి ప్రవేశించదలచిన వారికి , ఆ దరిమిలా ఆయా రంగాలనే వృత్తిగా మలుకోదలిచిన వారికీ, వాకిళ్ళు తెరుస్తాయి.
ప్రదర్షనకారులలో విశ్వాసం ఇనుమడించడం, నలుగురితో మెలగడం ,తమ కళను మెరుగులు దిద్దుకోగలగడం ,ప్రదర్షనలో మెళుకువలు నేర్చుకోవడం , సమయ పాలన ,సరికొత్త పరిచయాలు, స్నేహాలు ..ఇవన్నీ సుగుణాలుగా చెప్పుకొంటే,
మరోవైపు అలాంటి కార్యక్రమాలు మితిమీరి... విచ్చలవిడిగా మారి...జుగుప్సాకరంగా తయారయ్యి...అందరికీ అభ్యంతరకరమై కూర్చున్నాయి!
తిరస్కృతి వికృతి
నిజ ప్రదర్షనలలో అభినయిస్తున్న పిల్లలకు నిజానికి , ఆయా పాటల్లోని శృంగారం కానీ అశ్లీలత గానీ ,ఆయా మాటలల అర్ధం పర్ధం గానీ ,లోతుపాతులు గానీ తెలియదు. తెలిసినట్లు నటించాల్సి వస్తుంది. నటనలోనే జీవించాల్సి వస్తుంది. నిజమేమో అన్నంత సహజంగా.
వారితో జంటగా నర్తించే కళాకారులు ,మాస్టర్లు... పెద్దవాళ్ళు కావడం , వీరికి ఆయా పాటల లోగుట్టులన్నీ తెలవడం మనం గుర్తించాలి. వారు తెలిసి చేస్తున్నారు. పిల్లలకు తెలియక చేస్తున్నారు.వారి అమ్మానాన్నలకు తెలిసి ఊరకుంటున్నారు.
ఎంపిక చేసుకొనే పాట , నృత్యాన్ని మలిచే తీరు ,వేసుకొనే బట్టలు ,చేసుకొనే అలంకరణ, చేయ వలసిన వేదిక ... వీటన్నిటి ఎంపికలోను పిల్లల ప్రమేయం ఏమీ లేదు. వాటి నిర్ణయాలు ఆయా పెద్దలు చేస్తారు.
ఇక ,ఎంపిక చేసిన పిల్లలను గుంపుగా ఒక చోట చేర్చి ,కలివిడిగానో విడివిడిగానో .ఆయా అవసరాల్ని బట్టి ,ప్రదర్షనకు ముందు ప్రత్యేక శిక్షణను ఇస్తారు. ఆ శిక్షణా వ్యవహారాన్ని వివరిస్తూ ,అచ్యుత్ రావు గారు,ఆంధ్రప్రదేశ్ బాలసంఘం ,అధ్యక్షులు, ఇలా అన్నారు,పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను ఎక్కడపడితే అక్కడ అభ్యంతరకరీతిలో తాకడం,అశ్లీల భంగిమలను అభినయాన్ని నేర్పడం , పెద్దల మధ్య దొర్లే "పెద్దల మాటల"కు పిల్లలు శ్రోతలు కావడం, గెలవడంకోసం విపరీతమైన వత్తిడికి గురిచేయడం ..వంటివి తీవ్ర అభ్యంతరకరం."
నిజానికి, ఈ పిల్లలకు తమ ప్రదర్షనను ఎంతమంది చూస్తున్నరో ,దానికి స్పందన ఏమిటో ,ఒక వాస్తవ అవగాహన ఉండదు. అదంతా కాల్పనిక గణాంకం. పిల్లల అంచనాకు అందనిది.
సినిమా పాటల అశ్లీలతను అందరం గర్హించాం .అయితే, అంతే అభ్యంతరకరమైనది, సంస్కృతి పేరుతో జానపదం పేరుతో పిల్లలకు నేర్పుతున్న , పూనకాలు,చేతబళ్ళు ,వీరంగాలు ,మూఢాచారాలు, జానపద శృంగారాలు!
ఇది తెరవెనుక భాగోతం కాగా, తెరకెక్కేది
పిల్లల శిక్షణ ముగిసి వేదికపై ప్రదర్షనకు వచ్చినపుడు ,కొందరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే
వారి వ్యాఖ్యానాలలోని దురుసుతనం ఒక్కో మారు పిల్లలు తట్టుకొనేట్టుగా ఉండవు. ఓటమినీ ,తిరస్కృతిని తట్టుకోనేంత శక్తి , విమర్షలోని తీవ్రతను సంభాళించుకొనే పరిణితీ ,మంచీచెడును విశ్లేషించుకొనే వివేచన పిల్లలకు అప్పుడె ఎలా వస్తుంది? తిరస్కారం వారిని నిరాశకు గురి చేస్తుంది.ఆ దరిమిలా ,కుంగుబాటు ( డిప్రెషన్) కు .
ఇక, ఆకస్మికంగా వచ్చే కీర్తి ,తద్వారా లభించే ప్రతిష్ట ..పిల్లలను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.అవి , ఒక్కసారిగా తొలగిపోయినప్పుడు లేదా చేజారినప్పుడు , ఆ తిరస్కృతిని తట్టుకోగల ..పరిణితి వారికి వుండదు.
దానికి తోడు, పెద్దల నుంచి నిరసన, వత్తిడి,క్రమశిక్షణాచర్యలు(పనిష్మెంట్) తోడయితే , తీవ్రమైన నిరాశానిస్పృహలు తప్పవు .ఆత్మహత్యాయత్నాలు తప్పవు.అందుకు సజీవ ఉదాహరణ మన తెలుగునాటే ఉండడం మనం సిగ్గు పడాలి.
ఇంతా చేసి వీరంతా పట్టుమని పదేళ్ళయినా నిండని పసిబిడ్డలు!
కెమేరా ముందు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోనే ,బాల కళాకారులు ఒక పరిమితమైన అసహజ ప్రవర్తనను నేర్వాల్సి ఉంటుంది. రాను రాను ఈ అసహజప్రవర్తనే వారి సహజప్రవర్తన అయి పోతుంది
.ఈ కార్యక్రమాల అనంతరం ,తిరిగి తమ ఈడు పిల్లలతొ వారు మెలగ వలసి వచ్చినప్పుడు ,వీరి ప్రవర్తన వింత గానే ఉంటుంది.
కాగా , వారితో పాటే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఇతర పిల్లలతో వారి ప్రవర్తన మరింత తీవ్రం .
స్నేహసంబంధాల మాటే లేదు. పైనుంచి , పోటీ దార్లుగా, కక్షదార్లుగా ఎదురుబొదురుగా నిలబెడతారు.ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకోనేట్లు , ఆ ద్వేషాన్ని కోపాన్ని ప్రదర్షించేట్టు .. రెచ్చకొడతారు.
తమ చేతిలోనిది దోచుకొనే దుర్మార్గుల్లా భావించడానికి తప్ప , వారిలోని నైపుణ్యాన్ని మెచ్చుకొనే సుహృద్భావనకు అవకాశమే లేదు.
పగ, కక్ష,ద్వేషం ,పోటీ,గెలుపుకీ కుట్ర,కుతంత్రం ,హేళన చేయడం,కించపరచడం..
ఇవన్నీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేర్పవలసిన గుణాలు కానే కావు !
సభ్యసాజికులకు అబ్బవలసిన లక్షణాలూ కావు!
అమ్మా నాన్నలు :
తమ పిల్లలను ఇలాంటి నిజ ప్రదర్షనలలో నిలబెట్టడానికి ,ఎవరికి వారికో కారణం ఉంటుందేమో కానీ, ప్రధానంగా కనబడెది , గెలుచుకొనే డబ్బు ,పేరుప్రతిష్ట,ఆ పై అందే అవకాశాలు.
వారి పిల్లల ప్రతిభపై వారికి ఉన్న మితి మీరిన అంచనాలు , బహుమతి గెలుపుకై విపరీతమైన నమ్మకాన్ని పెంచుతాయి.ఆశలను పెంచుకొంటున్నారు.
తమ బిడ్డల సామర్ధ్యాన్ని ,నైపుణ్యాన్ని వాస్తవాన్ని మించి ఊహిస్తూ ఉన్న వారి అంచనాలను చేరుకోనప్పుడు , వారి నిరాశ ఆగ్రహమవ్వడం ఖాయం!
ఇక, వారు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం , అలా తీవ్రమైన శారీరక ,మానసిక వత్తిళ్ళకు పిల్లలను గురిచేయడం తప్పదు.
"నీపై ఎన్ని ఆశలు పెట్టుకొన్నాను. అన్నీ మట్టి మట్టిపాలు చేశావ్!" లాంటి శాపనార్ధాల ప్రభావం ఒక బిడ్డ జీవిత కాలం!
కాగా, నిజప్రదర్షనల నిర్వాహకులు ఇప్పిణ్చే ప్రత్యేక శిక్షల కాలం బిడ్డలను తల్లిదడ్రుల నుణ్చి, సహోదరులనుంచి ,తోటి స్నేహితూల నుంచి వారిని వేరు చేస్తుంది.
వంటరితనం ,శిక్షణ వత్తిడి ఖచ్చితంగా వారిపై ప్రభావం చూపుతుంది. మానవసంబంధాలలోని మార్దవాన్ని అవగతం చేసుకోవ్ల్సిన బాల్యం , అయోమయంలో పడుతుంది
.పెద్దల్లా అభినయిస్తూ తమని తాము పెద్దల్లా భావించడం మొదలు పెడతారనడంలో సందేహం లేదు.
పిల్లలను ఎవరు ఎక్కడ తాకినా తప్పులేదు.పిల్లలముందు ఎలాంటి మాటలు మాట్లాడినా తప్పుకాదు . అన్నది ఈ శిక్షణ,ప్రదర్షన సర్వసాధారణ సత్యాలుగా ద లక్షలాది మంది ప్రేక్షకుల ముందు నిలుపుతున్నాయి.
ఆ ప్రేక్షకులలో బాల ప్రేక్షకులు ఉన్నారు!
ఇంట్లో కూర్చుని ఈ నిజప్రదర్షనలు తిలకిస్తున్న అమ్మనాన్నలు అలవోకగా అనేమాట్లు ఇలా ఉంటాయి," నువ్వూ ఉన్నావ్ ఎందుకు ? చూడు ! ఆ పిల్లల్ని చూశైనా నేర్చుకో !"
వారి బిడ్డకు ఆ కళపై ఆసక్తి ఉన్నదో లేదో ,వారు అరక్షణం కూడా ఆలోచించరు. "ప్రముఖపిల్లల" అమ్మానాన్నలు గా ఉండాలన్నది వారి బలమైన కోరిక !
అనుభవం కొశం తమ పిల్లల్ని ఇలాంటి కార్యక్రమాలకు పంపే అమ్మానాన్నలు ఆలోచించాలి , వారు తమ పిల్లలకు ఎలాంటి అనుభవం ఇస్తున్నారు?
సహజంగా వికసించినవలసిన బాల్యాన్ని అయోమయంలోకి నెట్టేసే ,ఇలాంటి అనుభవం పిల్లలకు ఇవ్వకపోతేనే మంచిది.
పిల్లలే ఎందుకు?
ఇవ్వాల్టి వినిమయ ప్రపంచం గురి ,లక్ష్యం .. పిల్లలే!
వస్తువు కొనుగోలు పై నిర్ణయాన్ని ప్రభావితం చేయగల శక్తి ఈనాడు పిల్లలకే ఉన్నది. గారాలు పోయో ,ముద్దారగ అడిగో ..అలా కుదరక పోతే , ఏడ్చి ,అలిగి ,గొడవపెట్టో .. అనుకున్నది సాధించే కళ పిల్లలకు ఉంటుంది.
పరిమిత కుటుంబాలలో పిల్లల మాటే చెల్లుబాటు కావడం మనమెరిగిందే.
ఇవ్వాళ కాకపోతే రేపు వారనుకొన్నది కొనుగోలు చేయించడం పిల్లలకు వెన్నతో పెట్టిన విద్య.
కొనవలసిన వస్తువుల జాబితాలను పిల్లలు తమ ఇంటి టివి తెర మీద నుంచే ,తయారు చేయడం మొదలెడతారు. బడిలోనూ ఇతరత్రా ,ఒకరినుంచి ఒకరికి ,ఈ వార్త చేరుతుంది.
ఒక బ్రాండ్ నిలదొక్కుకోవాంటె పిల్లలో ప్రాచారం కావడం కన్నా బ్రహ్మాండమైన మార్గం మరోటి లేదు.
ఎందుకంటే, ఈ పిల్లలే పెరిగి పెద్దయ్యి ఆ బ్రాండ్ కు విధేయ వినియోగదారులవుతారు. దానాదీనా, నేటి పిల్లలే భావి వినియోగదారులు!
అందుకై, పిల్లలకు "రోల్ మోడల్స్"(మాదిరి నమూనాలు" తయారు చేయడం, బాల తారలను ( చైల్డ్ సెలబ్రిటీ) లను తయారు చేయడం, వారిని ఆపై ఆయా వస్తువులకు "బ్రాండ్ అంబాస్సడర్లుగా " మలచడం ,వారు బాల ప్రేక్షకుల ను ప్రభావితం చేయడం , ఇదంతా సహజ పరిణామం.
నిజానికి ఇవన్నీ చెప్పడానికి మనం మార్కెట్ రంగ నిపుణులం కానక్కర లేదు.
కాస్త కళ్ళు తెరిచి చూస్తే చాలు !
టిఆర్పి రేటింగ్ ల కన్నా బాల్యం ఖరీదైనదని టివీ ఛానెళ్ళ వారు ,
పిల్లలు తెచ్చే డబ్బు ,కీర్తి కన్నా వారికి తాము పణ్చే ఆప్యతానురాగాలే తమ మాన్వసంబంధానికి మూలమన్న విచక్షణ కలిగిన అమ్మానాన్నలు ,
ఎక్కడ పసితనం పదిలంగా ఉంటుందో అక్కడ మానవ సంస్కారం పచ్చగా ఉంటుందని విశ్వసించే సామాజికులూ..
ఉంటే తప్ప ..
ఇలాంటి వికృతాలకు తెర పడవ్ !
లేకుంటే, మన పిల్లలు గెలిచినా ఓడినా ,
మనం మాత్రం దారుణం గా ఓడుతాం!
సాంస్కృతిక కార్యక్రమాల పేరిట మన పిల్లలపై ఇంత బాహాటం గా జరిగుతోన్న అత్యాచారాన్ని ,హింసను తొలగించే ఒక కార్యాచరణ ప్రణాళికను పాటించకుండా ,
పిల్లలపండుగను ఎలా జరుపుకుంటాం?
అది అర్ధ రహితం !
(ఈరోజు సాక్షి ఆదివారం అనుబంధం "ఫన్ డే " లో ప్రత్యేక వ్యాసం" శీర్షిక న ప్రచురితం.)
All rights @ writer. Title,labels, postings and related copyright reserved