నోరారా పలకరించాలన్నా..
నోరూరించేలా కబుర్లాడాలన్నా..
నోరెత్తి అరవాలన్నా..
అమ్మ పలుకు పలికితేనే ముద్దు!
ఎటొచ్చి, ఈ నాటి బళ్ళలో ఇరుక్కొని , నానాటికీ చిక్కి పొతున్న మన మాతృభాష మాటెత్తామా ...
ఇక అంతే!
దుమారం రేగుతుంది!
ఆవేశం పోటేత్తుతుంది!
అది అటు తిరిగి ఇటు తిరిగి... పిల్లల మీదకు వచ్చి వాలుతుంది!
అలాంటప్పుడే , పిల్లల నోట తెలుగు పలికించాలని ,పిల్లల చేత తెలుగు గిలికించాలనీ ...
తపనతో తాపత్రయంతో ఉపన్యాసాలు ఒలికించేస్తాం!
అనర్ఘళంగా. ఆగ్రహోద్రకాలతో. ఆవేశకావేషాలతో.
సరిగ్గా అలాంటి గొప్ప తాపత్రయపు నేపథ్యంలో నుంచే ,మన నోట ఆశువుగా కొన్ని వాక్యాలు దొర్లి పోతూ ఉంటాయి.ఎవరైనా పిల్లలు తెలుగు మాట్లాడుతుంటే ,
అలవాటో పొరబాటో ఏమరుపాటో ...
ఒక ఇంగ్లీషు పదం తొణికిందనుకోండి .ఏం చేయాలి?
"హేళన చేయండి!"
"ఆపు అపు అని అరవండి!"
"ఆపే దాకా కేకలు వేయండి!"
అంతటితో ఆగని ఆత్రుత మరో వాక్యం చేరుస్తుంది.
"చెంప మీద కొట్టండి!"
ఇంకా ఆవేశం వస్తే, మరో వాక్యం తయార్ !
"చెప్పుతో కొట్టండి!"
ఆగండాగండి.
ఇంత విడ్డూరంగా ఎవరు మాట్లాడుతాం? అనుకునేరు!
అలా మాట్లాడే భాషాభిమానులు కోకొల్లలు!
ఆ నోటితో నే అడక్కుండానే అమ్మలకూ ఒక ఉచిత సలహా వచ్చి వాలిపోతుంది!
"అమ్మలారా... మీరు అన్నం పెట్టక మాడ్చైనా , అలిగయినా అనుకున్నది సాధించాలి!"
"భయపెట్టయినా బెదిరించైనా ..పిల్లలతో తెలుగు మాట్లాడించాలి!"
బావుందండి.
ఇదన్న మాట విషయం!
నిజమే .
ఏ విషయాన్నైనా నయానా భయానా చెప్పమన్నారు కదా పెద్దలెపుడో!
అయినా, అనునయంగా చెప్పడాన్ని ముందుంచారెందుకంటారు?
బహుశా నయానా పిల్లలకూ, ఆ తరువాతి పదం మిగిలిన వారందరికీ అయుంటుందని నా అనుమానం!
ఎందుకంటారా?
ముద్దారగ నేర్పిన ముద్దు బిడ్డలు నేర్వగలేని విద్య కలదే ?అన్నరొక పెద్దలు ఎప్పుడో!
అందుకని ,ఇప్పటి పిల్లలతో సన్నిహితంగా కాసేపు గడిపి ,ఆపై మెల్లిగా అడిగి చూడండి. తెలుగు మాట్లాడడానికి ,వాడుకకు వారికున్న సాధకబాధకాలేమిటో!
మొదటి జవాబు:
ఎవరితో మాట్లాడాలి ?
అమ్మతోనా?నాన్నతోనా?టీచర్లతోనా?స్నేహితులతోనా?
తరువాతి జవాబు:
ఎక్కడ మాట్లాడాలి?
ఇంట్లోనా?బడిలోనా? బజారులోనా? షాపింగ్ మాల్ లోనా?
ఆ పై జవాబు:
ఎందుకు మాట్లాడాలి?
మీకు చిర్రెత్తుకొస్తుందని నాకు తెలిసి పోయింది
జవాబులంటూ ..ప్రశ్నలు గుప్పిస్తున్నానని !
కదూ?
నిజమండి.
ఒకమారు తెలుగులో కథలు రాయించే ప్రయత్నం లో ఉండగా ,
ఒక విద్యార్థిని అన్ని ప్రశ్నలను ఇమిడ్చి ఒకే ఒక సూటి ప్రశ్న వేసింది.
"అక్కా, అసలు నేనెందుకు తెలుగు నేర్చుకోవాలి? మా ఇంట్లో మా అమ్మమ్మ తరం వారే ,తెలుగులో మాట్లాడరు.తెలుగు పత్రికలు చదవరు. తెలుగు సినిమాలు ,ఛానెళ్ళు చూడరు. ఎవరైనా ఇంటికి చుట్టాలొస్తే తెలుగులో పలకరించ బోతే , మా ఇంగ్లీషు ప్రావీణ్యతను పరీక్షకు పెడతారు. అటు ఇటైనా ,మాకు మా బడికీ , అక్షింతలు ! షాపింగ్ కు వెళితే ,అక్కడా ఇంగ్లీషుతో పనయి పోతుంది. ఇక, నేనంటూ తెలుగులో మాట్లాడేది మా ఇంటి పని మనుషులతో , డ్రైవర్ తోనూ. ఆ మాత్రం తెలుగు నాకు వచ్చు. అంతకు మించిన తెలుగు నాకెందుకు ?"
నిజమే మరి.
మేమేమో తీరిగ్గా కూర్చోబెట్టి ..ఏకంగా తెలుగులో కథలు రాయమంటిమి!
ఆ అమ్మాయి మాటల్లో నిజం ఉంది.నిజాయితీ ఉంది.
వాటికి మనం ఇచ్చే జవాబుల్లోనే ,మన భాష మనుగడ ఉంది!
ఏమంటారు?
మరి అరుదయిపోబోతున్న అంతరించిపోబోతున్న ..ఒక అద్బుత భాషకు వారసుల్లా...అందరిలోనూ తెలుగభిమానం అంతో ఇంతో పెల్లుబుకుతున్నదన్నది సత్యమే!
అది వీరాభిమానంగా విరుచుకు పడుతున్నదండం అంతే సహజం.
కాస్త నిదానించి చూద్దాం.
ఈ నాటి బడిపిల్లల్ని ఎవరినైనా పిలిచి కాసేపు తెలుగులో మాట్లాడమంటే , ఎంత లేదన్నా వాక్యానికోక ఇంగ్లీషుపదం దొర్లక తప్పదు!దానికి గల చారిత్రక కారణాలను పక్కకు బెట్టి,
మనం "హేళన చేసి ,భయ పెట్టి ,బెబేలు ఎత్తిస్తే.."..
ఆ పిల్లలకు తెలుగొస్తుందా?
అసలే పిల్లల్లో ఎన్నెన్ని అపనమ్మకాలో .
"మంచి తెలుగు మాకు రాదు. స్పెల్లింగులు రావు .చెప్పాలనుకొన్నది సరిగ్గా చెప్పలేము.భాష బాగా లేదు. వత్తులు గుణింతాలు తప్పుతాయి. మేం చెప్పేది మీకు అర్ధం కాదు..."
ఇలాంటి అనేక అపనమ్మకాలు వారి తెలుగు వాడుకం మీద వారికున్నాయి. వాటి నుంచి వారిని బయట పడేస్తే తప్ప ,భాష పట్ల వారికి అభిమానం కలుగుతుందా?
భాష పై ఆత్మీయ భావం కలగనిదే , ఆప్యాయత పెరుగుతుందా? గౌరవం కలుగుతుందా?
మన భాష మనకు మిగులుతుందా?
పిల్లల సందేహాలనూ సంశయాలనూ తీర్చకుండా ,సావధాన పరచకుండా,
భయభ్రాంతులతో భాషను బతికించాలంటే ,
తెలుగొస్తుందా?
***
విపులాచ పృధ్వీ!
అందులోను, మన తెలుగు నాట మనిషికో మాట. ఏ గూటికి ఆ చిలుక పలుకు!
పిల్లలందరినీ ఒక చోట చేర్చి భాషాబోధన చేసేటప్పుడు , మంచి తెలుగు అంటూ తత్తర పెట్టే బదులు ,పిల్లల మాటలను పిల్లలను చెప్పనిస్తే,
వారిలోని భావధారకు ఆలోచనాస్రవంతికి సృజనాత్మకతకూ..
అడ్డుపుల్ల పడదు కదా?
పైనుంచి,
ఆడుతూ పాడుతూ తెలుగు అదే వస్తుంది!
మనకు మల్లేనే !
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.