Dec 14, 2010

వీరి వీరి గుమ్మాడి !

"వీరి వీరి గుమ్మడి పండు..
వీని పేరేమి ?"
అమ్మ మాకు నేర్పిన ఆట అది.
మా తిరమల్దేవుని గుట్ట గేర్లో సందడిగా పిల్లలం ఆడుకొనే కుంటాటకు,చోరాటకు, లింగోచ్చకు  రైలాటకు..ఇది అప్పటి నుండి జత చేరింది.
మీరు ఆడే ఉంటారు కదా?
పిల్లలందరం బచ్చాలు వేసుకొని దొంగ ఎవరో తేల్చేసి ..అందరం గప్ చుప్ గా దాక్కోని..చూస్తుంటే , అమ్మ దొంగ కళ్ళు మూసి .. మాట అంటుండగా మాలో ఒకరం వెళ్ళి ముక్కు గిల్లేసి వచ్చేవారం. ఇక కళ్ళు తెరిచిన దొంగ అదెవరో కనుక్కోవాలి.ఇక, పిల్లల సందడే సందడి.
వీరి వీరి గుమ్మడి పండు..వీని పేరేమి ...అంటూ!
అనుకుంటాం కానీ , ఇది మూసిన కళ్ళు మూసి ఉండగానే మిగిలిన జ్ఞానేంద్రియాల సాయంతో ముక్కు గిల్లిన వారెవరో గ్రహించాలి. నిజం చెప్పాలంటే , నా మట్టుకునాకు, నా ముక్కే సాయానికి వచ్చేది!
 గిచ్చిన వారి అరచేతి వాసన బట్టి ..కదలికల సవ్వడి ...కొసవేళ్ళ స్పర్ష .. ఇలా మిగిలినవన్నీ తోడయ్యేవి.
ఇప్పుడు చెప్పండి.
"వీరి వీరి గుమ్మాడి  ..దీని పేరేమి?"



చప్పున చెప్పలేరా?
బాగా చూడండి.
ఇట్టే చెప్పేయ గలరు!



మొన్నీమధ్య కొండదారిలో వేగంగా మలుపు తిరుగుతుంటే, కళకళలాడుతూ నా కళ్ళ బడ్డాయి..
విరిసిన  పసుపుపచ్చపూలు.
కారు కిటికీలోంచి వేగంగా కదిలిపోతుంటే, ఉండబట్టలేక ఆగి చూద్దును కదా... 
దారి పక్కనంతా అల్లుకు పోయిన తీగ... విరబూసిన పూలు!


 అప్పటికింకా మంచుతెరలు వీడలేదు.మెల్లి మెల్లిగా సూరీడు దట్టమైన పొగమంచును దాటుకొంటూ ..ఒక్కో వెచ్చటి అడుగు వేస్తున్నాడు.
తీగ లాగుతూ డొంకంతా కదిలించేసా. అది చెరుకుతోటలోకి దారి తీసింది. ఎవరో రైతు గట్టు మీద వేసిన గుమ్మడి ..ఇలా దారంతా బంగరుపూలు పూయించేసిందన్న మాట!
అవునండీ,ఈ తెర మీద విరబూసింది ..అక్షరాలా ఆ గుమ్మడి పూవే!
ఆకుపచ్చని చేలగట్లమీద పొంగుబంగరు గుమ్మడి పూలు ఎంత సొగసుగా ఉన్నాయో కదా!
ఒక్క సారిగా గుర్తొచ్చింది.
పూసే కాలం వస్తే పూయవూ!
పండగనెల మొదలవ్వబోతోంది కదా!
ముచ్చటగా ముగ్గేసి... గొబ్బెమ్మను చేసి..పసుపుకుంకుమలతో సింగారించి...గుమ్మడి పూవు తురిమి ... బంతి చేమంతి పూలరేకులు చల్లి ..తమలపాకులో పంచదారో పటికబెల్లం ముక్కలో ఫలహారం పెట్టి ..మురిసిపోకుండా ఉండగలమా!
మొదటి రోజున ఒకటి, రెండో రోజున రెండు..పండగ నాటికి వాకిలంతా గొబ్బెమ్మలే!
ముత్యాల ముగ్గులన్నిటా బంగరుపూలు పూసేవి.వాకిట్లో విరిసిన ముద్ద బంతులతో చేమంతులతో పోటీలు పడుతూ
పొద్దుట గొబ్బెమ్మ కాస్తా ..సాయంకాలానికి గోడ మీద పిడకయ్యేది.భోగినాడు వెచ్చటి మంటయ్యేది.
"గుమ్మడి పువు మీద కుంకుమ పొడి ఛాయ  " అంటే బహుశా అదేనేమో.. శీతవేళల వెలుగు వెచ్చదనం కలగలిసి ..మన ఇంటి ముంగిట్లో మురిసేవేళ .వాకిట్లో వంటింట్లో ...అక్కడ ఇక్కడా అని లేకుండా.. సరిగ్గా సంక్రాంతి శోభ ..అదిగో అక్కడే మొదలయ్యేది.
చేలగట్ల మీది గుమ్మడిపూల  పలకరింపులతో  ..పకపకలతో... మొదలయ్యి .. .కొత్తబియ్యం పరమాన్నం , కమ్మటి గుమ్మడి కాయ కూరో పులుసో దప్పళంతోనో
పూర్తయ్యేది!
ఎప్పుడు  గుమ్మడి  కాయను కోయబోయినా పెద్దామ్మ ముక్తాయించేది...
కడివెడు గుమ్మడి కత్తి పీటకు లోకువని!
***
ఏడాదీ .. ఆ  పచ్చని బంగరు పూలు పూయవలసిన చేలగట్లు నీట మునిగి ఉన్నాయి
కల్లాం లోని కుప్పలువేసిన ధాన్యం తడిచి మొలకెత్తిపోయింది.కోతకు  దగ్గరపడిన వరి చేలల్లోనే చెదిరిపోయి ఉంది. త్వరలో మన నిలువునా నీట మునిగి ... తడిచి ముద్దయిన అన్నదాతల ఆక్రందనకు ఒక మార్గం దొరుకుతుందనీ.. 
సంక్రాంతి శోభ వారింట  చేరాలనీ ...బంగరుపూలు విరియాలనీ కోరుకొందాం!
షాపింగు మాల్స్ కూ రేడియో లకూ పరిమితమై పోక...
అహర్నిషలు టివి తెరలపైననే  కాక ...
చేలగట్లపై శోభిల్లే సంక్రాంతే సంక్రాంతి .
ఏమంటారు?
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 9, 2010

పాఠం వింటుంటే..!

పాఠాలు చెప్పేవాళ్ళంతా బుద్ధిగా పాఠం వింటుంటే..
వంచిన తల ఎత్తకుండా..చక చక వర్క్ షీట్లు పూర్తిచేస్తుంటే.. 
అడిగీ అడగక మునుపే ప్రశ్నలన్నిటికీ ..
ఉత్సాహంగా మేం ముందంటే మేం ముందని పోటీలు పడి మరీ.. సమాధానాలు చెపుతుంటే,
భలే ఉంటుంది కదా!


అంతే కాదండి..ఒకే వ్యవహారం లో ఉన్న వాళ్ళంత మొదటిసారిగా కలవడం, కొత్త స్నేహాలు ఏర్పరుచుకోవడం.. అనుభవాలు కలబోసుకోవడం... మరింత బావుంటుంది.
ఈ రోజటి , సూసన్ రస్సెల్ గారి ట్రినిటి కాలేజ్ లండన్ ( జి ఇ ఎస్ ఈ)  వర్క్ షాపు అచ్చం అలాగే ఉంది. కళకళ లాడుతూ .
అందులోను ,ఇది భాష ను నేర్పించడం అన్న మౌలిక భోధానంశానికి సంబంధించింది కనుక మరింత ఉత్తేజభరితంగా సాగింది.
సూసన్ గారు చాలా భిన్న నేపధ్యాలు కలిగిన వారికి ఒక విదేశీ భాషగా ఇంగ్లీషును నేర్పారు.అటు
అటు ఆస్ట్రేలియా నందలి వలస కార్మికులు ,శరణార్ధుల నుండి   ,బోస్నియా యుద్ధ భూమిలో క్షతగాత్రులకు, మిత్రసైన్యాల వరకు. హంగేరీ, స్వీడెన్ లతో పాటు  చైనాలోను భాషాభోధన చేశారు.  
అటు ఆస్ట్రేలియా నందలి వలస కార్మికులు ,శరణార్ధుల నుండి   ,బోస్నియా యుద్ధ భూమిలో క్షతగాత్రులకు, మిత్రసైన్యాల వరకు. హంగేరీ, స్వీడెన్ లతో పాటు చైనాలోను భాషాభోధన చేశారు.  పాఠశాలల నుండి శరణార్థుల శిబిరాల వరకు వారి పాఠాలు విస్తరించాయి.

లాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి విదేశీభాషగా ఇంగ్లీషు భాషాబోధనలలో PhD అధ్యనం చేశారు.
 ఇక వారి అనుభవాలను తెలుసుకొని, మా సందేహాలను జోడించి ,సందడి  సందడిగా.. రోజంతా... 
అధ్యాపనలో సంతోషసంబరాలు...సాధకబాధకాలు  కలబోసుకొన్నాం !



వారి భాషాబోధనమెళుకువల సారాంశం ఒకటే,


ఏదైనా విషయం మీద విద్యార్థులు మాట్లాడుతుంటే ,వారిని మాట్లాడనివ్వండి.వారిని ఆపకండి. వారి తప్పులు ఎత్తి చూపకండి.మాట్లాడం పూర్తి కాకమునుపే సరిదిద్దకండి.

 మొదట,  వారి భావ వ్యక్తీకరణ ఒక సహజ ప్రకటన గా ఉండేట్టుగా ప్రోత్సహించండి. తమ భాషావినియోగంపై విశ్వాసం కలగనీయండి.ఆపై భావవ్యక్తీకరణలో స్పష్టత ,ఆ తరువాత  , దోషరహితం చేసుకోవడం ఎలాగో నేర్పించండి.
తమ భావాన్ని మరింత బాగా ఎలా వ్యక్తపరుచుకోవచ్చునో  వారిని స్వయంగా తెలుసుకోనివ్వండి.
స్వయంగా సరిదిద్దుకోనివ్వండి "
**
వింటున్నారా?

ఇవన్నీ  ఏ భాషాబోధనకైనా ఒక మంచి సూచనేగా?

గమనించగలరు.

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 2, 2010

ఆ...! అంటే , తెలుగొస్తుందా?

నోరారా పలకరించాలన్నా..
నోరూరించేలా కబుర్లాడాలన్నా..
నోరెత్తి అరవాలన్నా..
అమ్మ పలుకు పలికితేనే ముద్దు!

ఎటొచ్చి, ఈ నాటి బళ్ళలో ఇరుక్కొని , నానాటికీ చిక్కి పొతున్న మన మాతృభాష మాటెత్తామా ... 
ఇక అంతే!
దుమారం రేగుతుంది!
ఆవేశం పోటేత్తుతుంది!
అది అటు తిరిగి ఇటు తిరిగి... పిల్లల మీదకు వచ్చి వాలుతుంది!

అలాంటప్పుడే , పిల్లల నోట తెలుగు పలికించాలని ,పిల్లల చేత తెలుగు  గిలికించాలనీ   ...
తపనతో తాపత్రయంతో ఉపన్యాసాలు ఒలికించేస్తాం!
అనర్ఘళంగా. ఆగ్రహోద్రకాలతో. ఆవేశకావేషాలతో.

సరిగ్గా అలాంటి  గొప్ప తాపత్రయపు నేపథ్యంలో నుంచే ,మన నోట ఆశువుగా కొన్ని వాక్యాలు దొర్లి పోతూ ఉంటాయి.ఎవరైనా పిల్లలు  తెలుగు మాట్లాడుతుంటే ,
అలవాటో పొరబాటో ఏమరుపాటో ...
ఒక ఇంగ్లీషు పదం తొణికిందనుకోండి .ఏం చేయాలి?
"హేళన చేయండి!"
"ఆపు అపు అని అరవండి!"
"ఆపే దాకా కేకలు వేయండి!"
అంతటితో ఆగని ఆత్రుత మరో వాక్యం చేరుస్తుంది.
"చెంప మీద కొట్టండి!"
ఇంకా ఆవేశం వస్తే, మరో వాక్యం తయార్ !
"చెప్పుతో కొట్టండి!"
ఆగండాగండి.
ఇంత విడ్డూరంగా ఎవరు మాట్లాడుతాం? అనుకునేరు!
అలా మాట్లాడే భాషాభిమానులు కోకొల్లలు!
ఆ నోటితో నే అడక్కుండానే అమ్మలకూ ఒక ఉచిత సలహా వచ్చి వాలిపోతుంది!
"అమ్మలారా... మీరు అన్నం పెట్టక మాడ్చైనా , అలిగయినా  అనుకున్నది సాధించాలి!"
"భయపెట్టయినా బెదిరించైనా ..పిల్లలతో తెలుగు మాట్లాడించాలి!"
బావుందండి.
ఇదన్న మాట విషయం!
నిజమే .
ఏ విషయాన్నైనా  నయానా భయానా చెప్పమన్నారు కదా పెద్దలెపుడో!
అయినా, అనునయంగా చెప్పడాన్ని ముందుంచారెందుకంటారు?
బహుశా నయానా పిల్లలకూ, ఆ తరువాతి పదం మిగిలిన వారందరికీ అయుంటుందని నా అనుమానం!
ఎందుకంటారా?
ముద్దారగ నేర్పిన ముద్దు బిడ్డలు నేర్వగలేని విద్య కలదే ?అన్నరొక పెద్దలు ఎప్పుడో!
అందుకని ,ఇప్పటి పిల్లలతో సన్నిహితంగా కాసేపు గడిపి ,ఆపై మెల్లిగా అడిగి చూడండి. తెలుగు మాట్లాడడానికి ,వాడుకకు వారికున్న సాధకబాధకాలేమిటో!

మొదటి జవాబు:
ఎవరితో మాట్లాడాలి ?
అమ్మతోనా?నాన్నతోనా?టీచర్లతోనా?స్నేహితులతోనా?
తరువాతి జవాబు:
ఎక్కడ మాట్లాడాలి?
ఇంట్లోనా?బడిలోనా? బజారులోనా? షాపింగ్ మాల్ లోనా?
ఆ పై జవాబు:
ఎందుకు మాట్లాడాలి?

మీకు చిర్రెత్తుకొస్తుందని నాకు తెలిసి పోయింది
జవాబులంటూ ..ప్రశ్నలు గుప్పిస్తున్నానని !
కదూ?

నిజమండి.
ఒకమారు తెలుగులో కథలు రాయించే ప్రయత్నం లో ఉండగా ,
ఒక విద్యార్థిని అన్ని ప్రశ్నలను ఇమిడ్చి ఒకే ఒక సూటి ప్రశ్న వేసింది.
"అక్కా, అసలు నేనెందుకు తెలుగు నేర్చుకోవాలి? మా ఇంట్లో మా అమ్మమ్మ తరం వారే ,తెలుగులో మాట్లాడరు.తెలుగు పత్రికలు చదవరు. తెలుగు సినిమాలు ,ఛానెళ్ళు  చూడరు. ఎవరైనా ఇంటికి చుట్టాలొస్తే తెలుగులో పలకరించ బోతే , మా ఇంగ్లీషు ప్రావీణ్యతను పరీక్షకు పెడతారు. అటు ఇటైనా ,మాకు మా బడికీ , అక్షింతలు ! షాపింగ్ కు వెళితే ,అక్కడా ఇంగ్లీషుతో పనయి పోతుంది. ఇక, నేనంటూ తెలుగులో మాట్లాడేది మా ఇంటి పని మనుషులతో ,  డ్రైవర్ తోనూ. ఆ మాత్రం తెలుగు నాకు వచ్చు. అంతకు మించిన తెలుగు నాకెందుకు ?"

నిజమే మరి.
మేమేమో తీరిగ్గా కూర్చోబెట్టి ..ఏకంగా తెలుగులో కథలు రాయమంటిమి!
ఆ అమ్మాయి మాటల్లో నిజం ఉంది.నిజాయితీ ఉంది.
వాటికి మనం ఇచ్చే జవాబుల్లోనే ,మన భాష మనుగడ ఉంది!
ఏమంటారు?

మరి అరుదయిపోబోతున్న అంతరించిపోబోతున్న ..ఒక అద్బుత భాషకు వారసుల్లా...అందరిలోనూ తెలుగభిమానం అంతో ఇంతో పెల్లుబుకుతున్నదన్నది సత్యమే!
అది వీరాభిమానంగా విరుచుకు పడుతున్నదండం అంతే సహజం.

కాస్త నిదానించి చూద్దాం.

ఈ నాటి బడిపిల్లల్ని ఎవరినైనా పిలిచి కాసేపు తెలుగులో మాట్లాడమంటే , ఎంత లేదన్నా వాక్యానికోక ఇంగ్లీషుపదం దొర్లక తప్పదు!దానికి గల చారిత్రక కారణాలను పక్కకు బెట్టి, 
మనం "హేళన చేసి ,భయ పెట్టి ,బెబేలు ఎత్తిస్తే.."..
ఆ పిల్లలకు తెలుగొస్తుందా?

అసలే పిల్లల్లో ఎన్నెన్ని అపనమ్మకాలో .
"మంచి తెలుగు మాకు రాదు. స్పెల్లింగులు రావు .చెప్పాలనుకొన్నది సరిగ్గా చెప్పలేము.భాష బాగా లేదు.  వత్తులు గుణింతాలు తప్పుతాయి. మేం చెప్పేది మీకు అర్ధం కాదు..."
ఇలాంటి అనేక అపనమ్మకాలు వారి తెలుగు వాడుకం మీద వారికున్నాయి. వాటి నుంచి వారిని బయట పడేస్తే తప్ప ,భాష పట్ల వారికి అభిమానం కలుగుతుందా?
భాష పై ఆత్మీయ భావం కలగనిదే , ఆప్యాయత పెరుగుతుందా? గౌరవం కలుగుతుందా?
మన భాష మనకు మిగులుతుందా?
పిల్లల సందేహాలనూ సంశయాలనూ తీర్చకుండా  ,సావధాన పరచకుండా,
భయభ్రాంతులతో భాషను బతికించాలంటే ,
తెలుగొస్తుందా?
***
విపులాచ పృధ్వీ!
అందులోను, మన తెలుగు నాట మనిషికో మాట. ఏ గూటికి ఆ చిలుక పలుకు!
పిల్లలందరినీ ఒక చోట చేర్చి భాషాబోధన  చేసేటప్పుడు , మంచి తెలుగు అంటూ తత్తర పెట్టే బదులు ,పిల్లల మాటలను పిల్లలను చెప్పనిస్తే,
వారిలోని భావధారకు ఆలోచనాస్రవంతికి సృజనాత్మకతకూ..
అడ్డుపుల్ల పడదు కదా?
పైనుంచి,
ఆడుతూ పాడుతూ తెలుగు అదే వస్తుంది!
మనకు మల్లేనే !
***

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.