Sep 23, 2012

" చేనేత వారం ! "

                        
అగ్గి పెట్టెలో  అమరిన ఆరు గజాల చీరలు నేసిన మగ్గం మనది.  ఆ   మగ్గం పై విరిసిన పూలతరంగాలు, అందంగా కదలాడిన హంసల బారులు, ఆనందంగా పురి విప్పి ఆడిన నెమళ్ళు  , విరగకాసిన మామిడి పిందెలు ...    
ఒకటా రెండా ..వేలాది ఏళ్ళుగా ...అన్నీ మనవే.
ఆ నూలు బట్టల మెత్తదనం , పట్టు వస్త్రాల మేళవం, జలతారు చీరల సోయగం , డాబుసరి పంచల ఆర్భాటం...
ఎంతని చెప్పినా తనివి తీరేనా? సొంపు  సొబగు   సోయగం    సౌందర్యం  ... అన్నిటినీ కలనేసిన హస్తకళా కౌశలం !
అదీ మన వారసత్వం.
పొత్తిళ్ళలో కళ్ళు తెరిచిన నాటి నుంచి , అమ్మ కుచ్చిళ్లలో దోబూచులాడం ,ఆమె కొంగు పట్టుకు వేళ్ళడం, నాన్న పైపంచను వల్లెవాటు వేసుకొని వంటలు చేయడం, తలపాగా చుట్టి ఉత్తిత్తి మీసాలు మెలేయడం ...
ఇలాంటివెన్నెన్నో మన  చిన్నతనపు జ్ఞాపకాల పేటికలో భద్రంగా ఒదిగిన మధుర క్షణాలు
స్వయంగా రాట్నం పై  వడికిన నూలుతో నేసిన కొల్లాయి గట్టిన బాపు చూపిన స్వతంత్ర భావన , స్వాలంబన  ..ఉత్తేజమై ..ఉవ్వెత్త్త్తున ముంచెత్తిన ఉద్యమ తరంగమై ...
మనలను మన ఉనికిని గుర్తించేలా చేసింది. మన మూలాల్ని తడిమిచూపింది.మన కర్తవ్యాన్ని తట్టి లేపింది.
సామ్రాజ్య వాదానికి తెరదింపింది.. మన ఇంటింట తిరిగిన  రాట్నమే కదా ! లెక్కకు మిక్కిలి తుపాకీ తూటాలను నిబ్బరంగా  నిశ్శబ్దంగా  నిలువరించిందీ ఆ నూలు కండెలే కదా ?

మరి , వారసత్వ  సిరిసంపదను మన పిల్లలకు మనం అప్పజెప్పవద్దూ?
శ్రమైక జీవన సౌదర్యానికి జేజేలు పలకొద్దూ?
దిశగా ఒక చిన్న అడుగు మన ప్రభవ లో  " చేనేత వారం ! "

మీరిప్పుడైనా మీ పిల్లల బట్టల అరలోకి చూడాలి  . 
మరి ,వాటిలో చేనేత వస్త్రాలు ఉన్నట్టేనా?

గ్లాస్కో జుబ్బా,పట్టు పావడా ,ఖాదీ లాల్చీ,నూలు గౌను .. ఏదైనా కావచ్చు.
వారం పాటు మన పిల్లలతో పాటు మనమూ ,   అమ్మానాన్నలం... ఉపాధ్యాయులం
చేనేతను ధరిద్దాం !    

బాపూజిని స్మరిద్దాం!       
***
Also,     "Handloom Week  !"                                                                                              
http://prabhavabooks.blogspot.in/



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

2 comments:

  1. చేనేత బట్టలు ఉన్నంత హాయిగా ఇంకేవీ ఉండవు అనటంలో అతిశయోక్తి లేదు. మా రాజమహేంద్రవరంలో చేనేత బజార్ ఉంది. ఈ వారం ఇంకా ఎన్నో రకాలతో అందంగా ముస్తాబవుతుంది.

    ReplyDelete
  2. అయితే మీరూనూ మాతో పాటే ఈ వారమూ చేనేతే ధరిస్తున్నారన్న మాట!:-)
    ధన్యవాదాలండీ.
    పిల్లల వకాల్తన నేనూ:-))

    ReplyDelete