Mar 7, 2011

నిశ్చయముగ నిర్భయముగ 1


మా ఇంటి పుస్తకాల అరలో శ్రీశ్రీ గారు, చలం గారు లేరని నేను గ్రహించేటప్పటికే, నేను  సాహిత్య విద్యార్ధిని. అందులోను ఆంగ్లసాహిత్యం. కొద్దిపాటి రచనలు కూడా అచ్చయ్యాయి 
"ఏమిటీ ? మహాప్రస్థానం" చదవకుండా కథలు రాసేస్తున్నారా? అందులోని ప్రతి అక్షరం నాకు కంఠోపాఠం!"
అంటూ అత్మీయ సాహితీ మిత్రులొకరు కళ్ళర్రజేసి, ఆశ్చర్యపోయి ,ఆ పై జాలి కురిపించారు. ఆ పై , మెత్తగా హెచ్చరిక చేశారు.
దడ పుట్టి బిక్కచచ్చి , వారి ఎదుటినుచి మాయమయ్యా.
సరిగ్గా, అప్పుడు మహాప్రస్థానం" నా చేతిలో ప్రత్యక్షం అయ్యింది. ఆత్రంగా పుస్తకం తిరగేస్తే , అందులో నాకు తెలియనివి ఏవీ లేవు.  ఆ ,రెండు అట్టల మధ్య శ్రీశ్రీ గారి సంతకం తో చదవడం తప్ప.
అవన్నీ శ్రీ శ్రీ విరచితం అని మాత్రమే నేనప్పుడు గ్రహించిన సత్యం!
ఇందుమూలముగా యావత్ పాఠక లోకం గ్రహించవలసినది ఏమనగా,
శ్రీశ్రీ గారనగానే
"ఓహో " కారాలు చేసేవారు ఎలాగు
శ్రీశ్రీగారిని వదిలి ఉండలేరు.
"ఊహు" కారాలు చేసేవారు ఎలాగైనా
శ్రీశ్రీగారిని వదుల్చుకోలేరు!
అంతలా ,శ్రీశ్రీ గారు మన అంతరాంతరాల్లోకి అంతర్లీనమైపోయి ఉన్నారు.
మన తెలుగు మాటలో పాటలో,
తిరుగుబాటులో ,పోరుబాటలో,
ఆలోచనలో ఆవేశంలో ఆశయాలలో ఆచరణల్లో .
***
  అలముకొన్న చీకటిలో అలమటించే వేళల......ఏడవకేడవకేడవకండి ..అంటూ ధైర్యం నింపినా,
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అంటూ ... .కన్నీటిధారలు తుడిచే వేళయినా ,
చీకటి మూసిన ఏకాంతంలో ...తోడుగా నిలిచే పలుకైనా,
సందేహమో సంశయమో పట్టి నిలిపేస్తే, పదండి ముందుకు త్రోసుకు త్రోసుకు ..అంటూ మన సంకోచాలను బద్దలు చేసి ,కొరడా ఝుళిపించే వేళయినా  ..
అందుగలడు ఇందులేడని ...
కళ్ళురుముతూ కదం  తొక్కుతూ .. పెనుగాలిలా  పెకలిస్తూ . స్వాతంత్రం ,సమభావం ,సౌభ్రాతృత్వం  సౌహార్ధం పునాదులై నిర్మించిన ఆ మరో ప్రపంచం తల వాకిట నిలిచి,
సిరిసిరి నవ్వులు రువ్వుతూ .
మెరుపు మెరిస్తే వానకురిస్తే హరివిల్లు విరిస్తే చాలు.  ముసిముసి నవ్వుల తాతయ్య గారు తయారు !
సబ్బుబిళ్ళను అరగదీసేప్పుడో ..అగ్గిపుల్లను గీచి పారేసేప్పుడో...దారికడ్డంగా అరటితొక్కను విసిరిపారేసేప్పుడో.. శ్రీశ్రీ మాష్టారు మనల్ని పలకరించ కుండా ఉంటారా ... ?
మీరే చెప్పండి !
***
"గోరా"మయమైన నాస్తికపదప్రపంచంలో పెరుగుతోన్న నాకు, "భజ గోవిందం భజగోవిందం " లోని స్వరధుని  ఎగిసిన మంటల "మరో ప్రపంచం " మూలమైన నడకకు దుడుకుకు కరుకుకు  అమరిపోయిన , ఆ రచనా సాంకేతికాల రహస్యం అబ్బుర పరిచింది.
"జగన్నాథ రధ చక్రాల" పై మొయిల్దారి బయిల్దేరి ....భూమిపై దిగి..ఏడవకేడవకండేవంకండని.."నిటాలాగ్ని" రగిలించ వచ్చునో తెలిసింది.
ఒక రచనా సాంకేతిక రహస్యం ఎన్ని  సంశయాల్ని  పటాపంచలు చేసిందో.
ఆలోచనలను ఎంత స్పష్టంగా సులువుగా తేటగా సూటిగా బలంగా చెప్పవచ్చునో,  ప్రతిపదం వివరించాయి..
అంతే కాక, ,ప్రపంచసాహిత్య అనువాదాలు ,పరిచయాలు, ఉటకింపులు...విశ్వసాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన అవసరాన్ని విడమరిచి భోదించాయి.
"ఆః !" అంటూ లోకం రీతిని తేలికగా విప్పిజూపితే,
"పల్లెటూళ్ళో తల్లి కేదో /పాడుకలలో పేగుకదిలింది.." అంటూ గుండె కలుక్కు మనిపించాయి.
"గది లోపల చినుకుల వలె చీకట్లు " ఒక రసాత్మకమైన వాక్యం కావ్యం ఎలా అవుతుందో చూడమంది.
పదాల విరుపు మెరుపు చెరుపు...కొంగొత్త పదాలను ఎలా ప్రభవింప చేస్తాయో...
సరికొత్త అర్ధాలను ఎలా అద్దుతాయో... ఆ పద నిర్మాణాలలో తూగు లయ ధ్వని ,స్వరధుని ...
భావవ్యక్తీకరణకు ఎంతటి ప్రభావ మాధ్యమాలో తెలియపరిచాయి.
అవును.
మును ముందుకు సాగి పోయేందుకు ..నిశ్చయాన్ని కలిగించేదీ..నిర్భయాన్ని నింపి ఉంచేది..
అదే  సిరి సిరి సిరాచుక్కల తోడు గా నడిచే నడక..
తనతోనే ఆగకూడకూడదని...తన వద్దనే ఆగకూడదన్నదేగా....
ఆయన మనలను పదేపదే చేసిన హెచ్చరిక !
ధ్వంసరచన చేసి నిలిచిపోమన్నాడా ? మరోప్రపంచం నిలబెట్టమన లేదూ ?
నియతృత్వం ఏ రూపంలో రెక్కలు విప్పినా దానిని నిలువరించమన లేదూ?
దౌర్జన్యం ఏ వైపున మొలకెత్తినా , నిలువునా పెకలించి వేయమన లేదూ?
సిరి సిరి దివిటీల వెలుగు బాటలో ..
మనం సైతం ..
అంతో ఇంతో ఎంతో....
ముందుకు సాగుదాం.
ఇంకేం?
పదండి ముందుకు ! పదండి త్రోసుకు !
నిశ్చయముగ. .నిర్భయముగ.
***
(శ్రీ శ్రీ సాహిత్యనిధి 101 వ సంచికలో ప్రచురణ కాబోతన్నది.త్వరలో)
20-2-2011

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. Chandralata Garu! Good. Sri Sri ni kalabosi mammalni ragulkolpi malli pustakaala ara lonchi Sri Sri ni teesukonela chesaaru. Aayana rachanalloni chala bhaavalanu ade aavesham to chepparu. Dhanyavaadaalu.
    Raja
    gksraja.blogspot.com

    ReplyDelete