Jun 20, 2009

@అమ్మమ్మ

@అమ్మమ్మ

పెద్దపాపక్క చిన్నమనవరాలిని చూడడానికి వెళదామని అనుకుంటూనే ఉన్నా.

పూటకి పూట .

ఏదో పని కాని పని. మరేదో తీరిక లేని వ్యవహారం.

నా శ్రమ తప్పించడానికా అన్నట్లు ,తనే మా ఇంట్లో గడపడానికి వస్తున్నట్లుగా ఇవ్వాళ పొద్దుటే ఫోను.

సంజాయిషీలు సమర్ధనలు తయారు చేసుకొనే లోగానే పెద్దపాపక్క మా ఇంట్లో అడుగు పెట్టింది.

అయినా నసిగా.. "అసలే మార్చి నెల లెక్కలు . పై ఏప్రిల్ ఎన్నికలు ...వద్దామని అనుకొంటూనే ..వీలు కాక ..."

“నువ్వు ప్రత్యేకంగా చెప్పాలట్రా నందూ... అవని నాతో చెప్పట్లేదూ నువ్వెంత పనివత్తిడిలో ఉన్నావో .. అయినా మమ్మల్ని తలుచుకొంటు న్నావ్ ..అది చాలదూ.. "

గుమ్మంలో నిల్చుని ముసిముసి నవ్వులు నవ్వుతున్న అవనికి ఒక ధన్యవాదాల సైగ విసిరేసి..అక్క చేతిలో సామాను అందుకొన్నా.అవని పాపను అందుకోబోయింది.

"హమ్మో "అక్క చిత్రంగా ఒక కేక పెట్టినంతపని చేసింది. అవని అదిరిపోయింది.

అక్క పాపను గుండెలకు హత్తుకొని గబ గబ లోపలికి నడిచింది. అవని నా ముఖం లోకి అయోమయంగా చూసింది. నాకు అర్ధం కాలేదు.ఏమిటీ వింత అనుకొంటూ ..

ప్రయాణం చేసి వచ్చారుగా. అలసి పోయి ఉంటారు. పాప స్నానం చేశాక ఆడిద్దాం లే..అన్నం వడ్డిద్దాం .పద.”

మాట మార్చి అవనితో సహా వంటింటి వైపు నడవబోయా.

" కాస్త ఆగండి. ముందు వారికి గది అదీ చూపించి.. పాపకి ఏమేమి కావాలో కనుక్కొని..."

“ అక్క కు తెలియని ఇల్లా ..నువ్వు పద ..నాకు ఆకలి వేస్తోంది .." అక్క ప్రవర్తన నాకు మింగుడు పడలేదు. కానీ , మాట నుంచి అవనిని ఏమార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నానో కూడా తెలియదు.

"అది సరే కాని, అన్నయ్య గారు రాలేదేమండీ... "అవని గొణిగింది.

"నేరుగా పెళ్ళి వారింటికి వెళ్ళారు"సమాధానం అక్క నుంచి వచ్చింది.

అంతే..! అవని బుద్ధిగా వడ్డన కు మళ్ళింది.

మా గుసగుసలు అక్క చెవిన ఎలా పడ్డాయన్నది అవని కి అర్ధం కాలేదు మరి.

పిలుపుకి పెద్దపాపక్క మాకు అక్కే కానీ వరసకు మేనత్త.

సరిగ్గా దేశ స్వాతంత్ర్యం వచ్చిన రోజున పుట్టిందని మా తాతయ్య ఆమెకుస్వరాజ్యలక్ష్మి” అని పేరు పెట్టాడు.మా రాయుడు మామయ్య కాస్తా ఆమెనురాజ్యం’ చేశాడు.అటు ఇటు మూడు తరాల్లో పుట్టిన మొదటి ఆడపిల్ల కావడంతో పెద్దపాప గానే స్థిరపడి పోయింది.

పిల్లాజెల్లా ఒక గూటిలో చేరి ..ఒక ముఠాలాగ తిరుగుతూ పెరిగిన మా చిన్నతనంలో ,బాబాయిలతో గొంతు కలిపి పెద్దపాపక్క అంటూ మొదలెట్టిన పిలుపు అలవాటయిపోయింది. ఇప్పుడు పెద్దపాపక్క కు అరవై ఏళ్ళు వచ్చినా అమ్మమ్మ అయినా మాకు అలవాటు పోలేదు.

పెద్దపాపక్క పిల్లలిద్దరూ చక్కగా చదువుకొని అమెరికా చేరిపోయారు. చెరొక చోట అమరిపోయారు.ఒకరు ఉత్తరాన మరొకరు దక్షిణాన.ఒకరు హిమపాతం మరొకరు మండుటెండ అన్న మాట!

పెద్దపాపక్క చిన్న కొడుకు రంగ తో నా బాల్యం ,బడి,ఆటాపాటలు ముడి పడిపోయి ఉన్నాయి.ముఖ్యంగా రంగడి జ్ఞాపకం రాగానే ఎండాకాలం సెలవలు గుర్తుకొస్తాయి.

అమ్మమ్మగారిల్లని రంగడి అల్లరి పనులన్నీ చెల్లిపోయేవి.ఇక, మా పిల్ల చేష్టలేమో పెద్దపాపక్క కొంగున దాచుకొనేది.కోతి కొమ్మచ్హ్చులతో పిందే పట్టిన మామిడికొమ్మలు విరగ కొట్టినా ...బిళ్ళంగోడి జోరులో నిండు కడవలు పగలగొట్టినా..నేనున్నానంటూ మమ్మల్ని వెనకేసుకొచ్చేది.

పళ్ళు పులిసి పోతాయని మామిడి ముక్కలకు అద్దుకోమని తనే ఉప్పూ కారం అందించేది.చల్లని తాటి ముంజెలు ,పండిన సీమచింత కాయలు,తంపెట వేసిన వేరిశనక్కాయలు మాకోసం సదా సిధ్ధం చేసి ఉంచేది.గడ్డివాములో మాగేసిన సపోటాకాయలు వెతుకుతూ రంగడి చెల్లెలు ,సరస్వతి, తన కాలి పట్టా కాస్తా జారేసుకుంది.

అంతే ! తాతయ్య మన్నూ మిన్నూ ఏకం చేయడం ఖాయం అని బెదిరి పొయింది.తిన్నగా వెళ్ళి చావిట్లో మొచ్చు మీద కోళ్ళ గంప కప్పుకొని దాక్కుంది.అందరూ వూరూ వాడా తోటా తోపూ ఏకం చేసి వెతుకుతూంటే, పెద్దపాపక్క తాపీగా వెళ్ళి ,సరస్వతి చెవి మెలిపెట్టి మరీ ..మొచ్చు కిందికి లాక్కొచ్చింది !

అవును మరి, ఎప్పుడు మేము దాగుడు మూతలు ఆడాలన్నా పెద్దపాపక్కే దాపులు చూపించేది!

మేం చేసే నిర్వాకాలకు నాన్న కళ్ళెం వేయ బోతే తనే వెనకేసుకొచ్చేది," ఊరుకో అన్నాయ్ , పిల్లలు కాకపోతే నువ్వూ నేనూ అల్లరి చేస్తావేమిటీ ? వయసుకు ముచ్చట కానీ !"

ఇక ఆరు బయట చుక్కలవెలుగు లో కొబ్బరి చెట్ల కింద నులక మంచాలమీద చేరి ,పెద్దపాపక్క చెప్పే కథల్లోకి మాయమై పోయే వాళ్ళం.

ఇంతలో రాయుడు మామయ్య కి హైదరాబాదు లో వ్యాపారం స్థిరపడడంతో పెద్దపాపక్క నగరానికి కాపురానికి వెళ్ళింది.సెలవల్లో రాకపోకలు యధాప్రకారం జరిగాయి.కొంత కాలానికి పెద్ద చదువులకని ఒక్కొక్కరం పెద్దపాపక్క ఇంటికే చేరాం.ఉద్యోగాల్లో పనిపాటాల్లో చెరో దేశం పట్టాం.

పెద్దపాపక్క అనగానే జ్ఞాపకం వచ్చేది నదురు బెదురూ లేని చిరునవ్వు చెదరని ముఖం.

అలాంటి మనిషిలో ఇవ్వాళ నేను చూస్తోన్న బెరుకేమిటీ ? భయమేమిటీ? తడబాటేమిటీ ? నాకు ఏమీ అర్ధం కాలేదు.

"నాకు ఎప్పుడో అర్ధమై పోయింది " అవని గుసగుసలాడింది" మొన్నా మధ్యన మీ రాయుడి మామయ్యగారి తల్లిని పరామర్షించాడానికి వెళ్ళాం చూడండీ ...అప్పుడే నాకు అర్ధమైంది." అవని మరింత వివరం గా చెప్పింది.

"ఏం అర్ధమైంది ?" ఇక అడగక తప్పలేదు.

" భయం ! అంతా చిన్న పాప వలనే !"

"చిన్న పాప వలనా?" నాకు ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు !

..పాప వల్లే ! " అవని కొనసాగించింది," అరక్షణానికొక అమెరికా ఫోను .పాపం ..పెద్దపాపక్కని కుదురుగా కూర్చో నిస్తేనా?ఒకటే వత్తిడి!

"అమెరికా ఫోనేమిటీ అక్క వత్తిడి పడడేమిటీ .. నువ్వు మరీ..." నా మాట పూర్తి కానే లేదు అవని అందుకొంది.

" అవును మరి ! సరస్వతి నేరుగా మీ రాయుడు మామయ్యకే చేసేది"చూశావా నాన్నా అమ్మ ఎంత పని చేసిందో అంటూ"...ఇక, మీ మామయ్య సంగతి నేను మీకు నేను వేరుగా చెప్పాలా ?"

చెప్పక్కర లేదు.

రాజ్యం !” అని మామయ్య గుమ్మం దగ్గర ఒక కేక పెడితే చాలు ..గర్జనో గాండ్రింపో విన్న లేడి పిల్ల లాగా ఒక్క పరుగున వెళ్ళి ఆయన ముందు నిలబడేది.

మా రాయుడు మామయ్య ఏనాడు మా పెద్దపాపక్క ముఖాన వెలుగుల చిరునవ్వు చూసిన పాపాన పోలేదు.ఇక, ఆమె చలాకీ తనం ,హుషారుపాటలు,కమ్మని కబుర్లు వేటికీ ..మామయ్య నోచుకోలేదు.

ఆయన ధోరణి అంతేలెమ్మని అందరం రాజీ పడ్డాం.పడక తప్పదని మా నాయనమ్మ కళ్ళు తుడుచుకోని ముక్కు చీదేది. ఆడపిల్లని కన్నాక ఇలాంటివి భరించక తప్పుతుందా నాయినా" ఉండబట్టలేక అప్పుడప్పుడు వాపోయేది.

"నందూ " పెద్దపాపక్క పిలుపుతో లోకంలో పడ్డాను. "వెబ్ కాం ఒక సారి ఆన్ చేస్తావా? సరస్వతి లాగాన్ అవుతుందేమో.."

పల్లెటూరి పెద్దపాపక్క నోట సాఫ్ట్ వేర్ పదాలు వినడం చాలా తమాషాగా అనిపించింది.కానీ, ఆశ్చర్యం కలగ లేదు. పురుళ్ళు పుణ్యాలని అమెరికాకి వెళ్ళి వస్తూ నే ఉన్నందయ్యే.

అయితే అవని అన్నట్లుగా సరస్వతి ఫోన్ చేసిందన్న మాట !

"అలాగే అక్కా" బుధ్దిగా కంప్యూటర్ వైపు నడిచాను. మరు క్షణం లో సరస్వతీ వాళ్ళాయనా తెర మీద ప్రత్యక్షం అయ్యారు.

నాతో మాట్లాడుతున్నారన్న మాటే కాని వారి కళ్ళు నా చుట్టూ వెతుకుతున్నాయి.అయ్యో వాళ్ళు పాపను ఎంతగా మిస్ అవుతున్నారో ..ఉసూరు మనిపించింది. మా చిన్నారి ని బడికి పంపితేనే బోలెడంత దిగులుగా ఉంటుంది.ఇక ,బడి నుంచి తిరిగి రావడం లో ఒక నిమిషం అటూఇటూ అయితే అవని హడావుడి చెప్పక్కరలేదు.అలాంటిది వేలాది మైళ్ళదూరం బిడ్డను పంపిన వారు ఎంత బెంగ పడుతుంటారో ..!

రంగడు కూడా మరో కిటికీ లో నుంచి తొంగి చూశాడు.పెద్దపాపక్క కుటుంబం అంతా తెర కెక్కారు !

అప్పటి వరకు ఆర్ధిక పతనాల గురించి ..నూతన అధినేతల గురించి.. జీతభత్యాలపై పరిమితుల గురించి కబుర్లాడుకొంటున్న మేము , సరస్వతి పెట్టిన చిన్నపాటి కేకతో లోకంలో పడ్డాం.

వెనక్కి తిరిగి చూద్దును కదా...అప్పుడే ,పెద్దపాపక్క స్ట్రోలర్ తెచ్చి ఆపింది.

పెద్దపాపక్క పెంపకం చిట్టి పాప ముఖంలో స్పష్టంగా కనబడుతున్నది.

నిశ్చింత.నిబ్బరం.

నిద్రలోనే పాల నవ్వు పాప ముఖాన సన్నని అలలా కదలాడింది.

ప్రశాంతతకు ఎక్కడ భంగం జరుగుతుందో అన్నట్లుగా, నాకు తెలియ కుండానే ఎప్పుడో వాల్యూం తగ్గించాను.

"నందూ.." పెద్దపాపక్క మెల్లిగా గొణిగింది"వెబ్ క్యాం సరిగ్గానే ఉందంటావా? చిట్టి ముఖం వాళ్ళకి స్పష్టం గా కనబడుతుందంటావా?"

పాప ముఖాన వెలుతురు పడేట్లు లైట్లు సరిచేసి ,వెబ్ క్యాం అమర్చా.పాప ముఖం స్పష్టంగా తెర మీద కనబడసాగింది.ఒక కిటికీలో సరస్వతి మరో దాంట్లో వాళ్ళాయన.ఇంకో వైపు నుంచి రంగ.

తెర మీద సరస్వతి వింత హావ భావాలు చూశాక గుర్తొచ్చింది..నేను వాల్యూం తగ్గించిన సంగతి.అరరే.మరిచిపోయా. అలా వాల్యూం పెంచానో లేదో ..సరస్వతి మాటల వెల్లువ.

దడ దడ దబ దబ. " ఎన్ని సార్లు చెప్పాను నీకు ..పాపని అలా నిర్లక్ష్యం గా వదిలేయద్దని .! ఏదో గత్యంతరం లేక అక్కడకి పంపానే అనుకో ..చూడు..!అలా చూడు పాప ముఖం !" తెర మీది అందరి ముఖాలు ముడుచుకొన్నాయి. "అది కాదమ్మా.." పెద్దపాపక్క ఏదో చెప్పబోయింది.

“చూడు రంగన్నా ..ఎడం చెవి తమ్మె మీద ! హా ! "

దోమ కాటు..! అమ్మా ..ఇరవై నాలుగు గంటలూ టీవీ సీరియళ్ళలో మునిగి ఉండక పోతే,పాప బాగోగులు చూసుకోవద్దూ? బిడ్డను అప్పజెప్పారనే అన్న బాధ్యత లేక పోతే ఎలా..?"రంగడు తన చెల్లెలికి గొంతు కలిపాడు. " ! బావ గారు ఏమనుకొంటారు అన్న ఇంగితం లేక పోతే ఎట్లా..? ఇన్నేళ్ళోచ్చినా..?"

"ఇట్స్ ఓకే...! రంగా..మామయ్య గారు ఎప్పుడో చెప్పారు.. మనమే.." ఔదార్యం ప్రకటించాడు సరస్వతి వాళ్ళాయన.

నిన్నెందుకు నాన్న తో హోటల్ లో ఉండకుండా నందూ ఇంటికి వెళ్ళమన్నదీ ..”

పెద్ద పాపక్క నోట మాట పెగలడం లేదు.కళ్ళమ్మట బొటబొట నీళ్ళు.

ఇక చూడలేక గది నుంచి బయటకు నడిచా.

మనిషంటూ ఉన్నాక దోమంటూ కుట్టకపోతుందా.. అందులోను మన దేశాన..!ఇందులో పాపక్క నేరమో ఘోరమో ఏముందో నాకయితే అర్ధం కాలేదు ఒక పట్టాన.

మా రాయుడు మామయ్య ఎప్పుడో తన చతుర్ముఖపారాయణం మునిగి తేలుతూ ఉంటాడు. ఆయనకు పిల్లపాపలతో గడిపే దురలవాటు లేదు .అయినా, ఆయన పిల్లలిద్దరు ఆయన ద్వారానే పెద్దపాపక్క కదలికలను అదుపు చేయడం చిత్రం . ఇది కార్పోరేట్ గ్లోబల్ హ్యూమన్ మానేజ్ మెంట్ కాబోలు !

“ఇప్పుడేం చూశారూ ? మీ రంగడి కొడుకుని పంపారే అప్పుడు చూడాల్సింది. రోజూ ఇలాగే ! వాళ్ళు పంపిన గ్యాప్ చొక్కా కాకుండా గ్లాస్కో జుబ్బా వేసిందట..అనకూడదు కానీ, మీ రంగడిది ఎంత రాద్దాంతమో ! ఇక్కడ ఉన్నా అమెరికాలో పెరిగినట్లు పెరగాలంటారు. బావుంది! "

ఎందుకింత వత్తిడి? అక్కనే అక్కడికి తీసుకెళితే పోయేది కదా...!" అసహనంగా అన్నా.

"అది మరీ దుర్మార్గం. వయసులో వాళ్ళిద్దరూ చెరొకచోట..పై నుంచి భాష , మనుషులు, వెసులుబాటు లేని ఇంటిపని , వంటరితనం..అదొక దుర్బరం."అవని పెదవి విరిచింది.

నిజమే," ఇద్దరూ వెళ్ళాల్సింది.."

"మీ రాయుడు మామయ్యా .. ? " అవని నిట్టూర్చింది.

అదీ నిజమే . అవని ఒక్క మాటా అనలేదు కానీ , మా పెద్దపాపక్క ఇక్కడ కూడా ఒంటరిదే..!

“వళ్ళు మండుతుంది! రంగడినీ సరస్వతినీ నాలుగు దులిపేసి వస్తా..!" వేగంగా గదిలోకి వెళ్ళబోయా.

అవని నా మోచేతిని పట్టి అమాంతంగా ఆవలికి లాక్కెళ్ళింది. " ఘనకార్యం మాత్రం చేయకండి!సరిగా అలాంటి ఉత్సాహం చూపించాడు మా పెదనాన్న. మా శ్రీకాంత్ అన్నయ్య చిన్నపిల్లాడిని పంపినప్పుడూ ఇంతే ..ఆంధ్రాలో ఉన్నా అమెరికాలో పెరిగినట్లు వాళ్ళ కొడుకు పెరగాలంటారు.వాడేమో ఆరు నెలల పసిగుడ్డు.నళిని వదిన రెసిడెన్శీ చేస్తోందప్పుడు. తనకి మనిషి సాయం కావాలి. నిజమే. పెదనాన్నకి బై పాస్ అయ్యి ఆర్నెల్లు.పెద్దమ్మకి మెనోపాజ్ దశ.కీళ్ళనొప్పులు. పైనుంచి షుగరు.

శుభోదయాన అన్నయ్యకి ఖరాఖండిగా చెప్పేశాడు పెదనాన్న.."మీ పిల్లాడిని మీరు తీసుకెళ్ళి పెంచు కోండి ..మీ అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం "అనీ. ఇప్పటికి ఆరేళ్ళు !వాళ్ళమధ్య మాటపట్టింపులు వచ్చి.రాకపోకలు నిలిచిపోయి.పెదనాన్నా పెద్దమ్మా ఎంత కుమిలిపోతున్నారో.

"ఏదో పరిస్థితి అర్ధం చేసుకొంటాడనీ మరో మార్గం ఆలోచించుకొంటారనీ అన్నానే కానీ ..ఇలా జరుగుతుందనుకోలేదమ్మా" పెదనాన్న కంటతడి పెట్టారు."మంచో చెడో ..వాడిని కని పెంచాం కదమ్మా..ఒక మాటతో తెగతెంపులు చేసుకొన్నాడే.." అవని గొంతు బొంగురు పోయింది.

“ఏదో పెద్దాళ్ళం.పిల్లల అవసరాలకు అక్కరకు రాక పోతే ఎలారా నందూ?" పెద్దపాపక్క ఎప్పుడువచ్చిందో కానీ నా వెనకాల నుంచి నెమ్మదిగా అంది.” పిల్లల కోపాలదేం కానీ..."

మళ్ళీ సమర్ధింపు ఒకటి ! నాకు చిర్రెత్తుకొచ్చిన మాట నిజం.

"అక్కడ కెళ్ళినప్పుడు చూశా కదరా.. బేబీ సిట్టర్లతో ఇబ్బందులు..! "

అక్కడి బేబీ సిట్టర్ ని ఇలా కేమేరాలతో మామయ్యలతో మానిటర్ చేస్తారో లేదో నాకేం తెలుసు ???

“ నా మానాన నన్ను వదిలేస్తే నా మనవరాలిని నేను పెంచుకోనూ..?” అక్క గొంతు ఒణికింది, “ నేను అమ్మమ్మను... రా... నందూ..అమ్మమ్మని !"

ఒక్క మాటన్నా అక్కని మరింత బాధ పెట్టినట్లే. మౌనంగా గదిలోకి వెళ్ళా.

కోపం తమాయించుకొని , తాపీగా వెబ్ క్యాం వైర్లన్నీ చుట్ట చుట్టి పక్కన పడేశా.

"సారీ ..సరస్వతీ ...లైన్ డిస్కనెక్ట్ అయ్యింది !" వాయిస్ మెయిల్ పెట్టేసా. అలాగే రంగడికీ.

నా గొంతులో తొణికిన ధ్వని వారికి చేరిందో లేదో కానీ .. నేను మాత్రం తేలిక పడ్డా.

మళ్ళీ కనెక్ట్ చేసే లోగా.. వారికి తెలియచెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అమ్మమ్మ గారింట వారు గడిపిన రోజులు ఒకమారు గుర్తు చేయాల్సి ఉంది.

బడి నుంచి ఎప్పుడు వచ్చిందో మా చిన్నారి నవ్వులు వినబడ్డాయి.

చూద్దును కదా.. పెద్దపాపక్క కాళ్ళ మీద చిట్టిని పడుకో పెట్టుకొని నలుగు పెడుతోంది. సున్నిపిండి గిన్నెతో చిన్నారి.నీళ్ళచెంబుతో అవని .చెరో పక్క నిలబడి ఉన్నారు.పాప కేరింతలు కొడుతోంది.

సాయంత్రం....

పాప వంటి మీది మీగడ కమ్మదనం జుట్టులోనుంచి సాంబ్రాణీ సువాసన .. మళ్ళీ మా పెద్దపాపక్క మా కళ్ళ ముందుకొచ్చినట్లయ్యింది. కళకళలాడుతూ.

.

*** 26-4-2009 ***

Published in Eenadu sunday magazine , కథ * ఈనాడు ఆదివారం 24-5-2009

All rights reserved @ writer.Title,labels ,postings and related copyright @ writer.


No comments:

Post a Comment