Jun 27, 2009

మానవ ప్రగతి / మహిళ . ప్రకృతి

మానవ ప్రగతి - మహిళ . ప్రకృతి

maanava pragati divided by mahiLa dot prakRti

పెద్దలందరికి నమస్కారం.

ఇంత మంది నిపుణులు నిష్ణాతులు సమవేశ మైన వేదిక మీదకు నన్ను ఆహ్వానించారంటే ,

బహుశా పల్లెలతో నాకున్న సజీవ సంబంధమే కారణం కావచ్చు.

ఎంతో ఆదరం తో నన్ను ఆహ్వానించిన Dr కాత్యాయని గారికి ధన్యవాదాలు.

నాకున్న పరిమితులలోనే, నాకు తెలిసిన చిన్న విషయాలను కొన్ని మీతో పంచుకొనే ప్రయత్నం చేస్తాను.

***

మానవ ప్రగతి గురించి మాట్లాడ వలసినప్పుడల్లా...

మన శాస్త్రీయ ప్రగతి గురించి.. సాంకేతిక విజయాల గురించి ... మనం ఎంతో సంతోషంతో మాట్లాడు కొంటాం.

ఒక్క రవ్వ అతిశయం తో కూడా మాట్లాడుకోగలం.

మానవ ప్రగతి గురించి చర్చించ వలసి నప్పుడల్లా...

ఆర్ధిక స్థిరత గురించి...సామాజిక భద్రత గురించి ... వివరం గానే చర్చించుకొంటాం.

ఒకింత తీవ్ర స్థాయి లోనే విశ్లేషించుకో గలం.

మహిళల గురించి మాట్లాడ వలసి వచ్చినా.. .చర్చించ వలసి వచ్చినా..అంతే.

ప్రకృతి గురించి కూడా అంతే.

మానవ ప్రగతి ని మహిళ తోనూ ప్రకృతి తోనూ భాగించే ప్రయత్నం నాటి సమావేశం లో జరుగుతున్నది.

ఇది ఎంతో ప్రత్యేకమైన విషయం .

ఎందుచేతనంటే ... మానవ ప్రగతి, మహిళ ,ప్రకృతి .. మూడు అంశాలు వేటికవే విడి విడి గా ఆలోచించ వలసిన విషయాలు కావు. అవినాభావమైన విషయాలు. విడదీయలేన0తగా ఒక దానిలో ఒకటి అల్లుకుపోయిన విషయాలు.

అందుకే,

మూడింటికి నడుమన ఉన్న సంబంధం విభాజ్యమైనది కాదు. భాగఫలం ఏదైనా సమావేశం

సశేషం కాగలదని మనం ఆశిద్దాం.

ఇంతటి ముఖ్యమైన సమావేశం లో, విషయం పై నాకు తెలిసిన కొన్ని విషయాలను

మీ వంటి పెద్దలు విజ్ఞుల ముందు పంచుకొనే అవకాశం ఇచ్చి నందుకు

మరొక్క మారు మీ అందరికి నా ధన్యవాదాలు.

*

మధ్య తరుచు గా వింటున్నాం ..పతాక శీర్షికలలో చదువుతున్నాం.

" ఫలాన ప్రాజెక్టుకు పర్యావరణ అడ్డంకులు తొలగి పోయాయి"

"ఫలాన ప్రగతి కార్యక్రమానికి పర్యావరణ ఉద్యమకారులు అడ్డుపడుతున్నారు"

"పర్యావరణ ఉద్యమాలు దేశ ప్రగతి ని అడ్డుకొనేందుకు విదేశీ శక్తులు పరోక్షం గా పన్నిన కుట్రలు"

మరో వైపున ...

మనలో బోలెడంత పర్యావరణ స్పృహ ... . ముఖ్యం గా పిల్లల పా ఠాల్లో పెద్దల మాటల్లో.

ఇవన్నీఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందో మీకు అర్ధమై ఉంటుంది.

పర్యావరణాన్ని గురించి ..మాట్లాడాలంటే మనలో కలిగే ద్వైదీ భావం ఇదీ.

ఎవరికైనా... ఆర్దిక పరమైన ప్రగతి కనబడేంతగా

ఆర్ధిక ప్రగతి బాటలో కొల్పోయిన ప్రాకృతిక సంపద కనబడదు.

లాభనష్టాల బేరీజులో ఆర్ధిక లాభాల వెలుగుల మిరుమిట్ల లో ప్రాకృతిక నష్టాల చీకటి కంటికి ఆనదు.

భారీ జలాశయం కలిగించే ఉద్వేగం ముందు, మడుగున దాగిన లక్షలాది ఎకరాల అడవి , అందులొనే నిక్షిప్తమై కనుమరుగైన అమూల్య జీవ సంపద సహజం గానే గుర్తుకు రావు .

""ప్రగతి పథం లో ధృఢం గా స్థిరం గా ధైర్యం గా అడుగు వెయాలన్న దేశ సంకల్పానికి ఇది చిహ్నం !" భాక్రా నంగల్ ప్రారంభోత్సవ సమయంలో నెహ్రూ లో కలిగిన ఉద్వేగమే ఎవరికైనా కలుగుతుంది.

పర్యావరణ ఉద్యమకారులను ప్రగతి నిరోధక శక్తులుగా భావించే వారున్నారంటే ..వారిని మనం తేలికగానే అర్ధం చేసుకోవచ్చు.వారిలోని భయాన్ని అభద్రత నూ కూడా.

అన్నెందుకు,

ఆర్ధిక ప్రగతే మానవ ప్రగతి అన్న భావం అటూ ఇటుగా మనందరిలో.. నాటుకు పోయి ఉన్నది.

మానవులలో ప్రకృతి సహజం గా అబ్బిన ఆలోచన అనుభూతి .. తదుపరి నిర్మించుకొంటూ వచ్చిన శాస్త్రం.. శాస్త్రం తో సాధించిన సాంకేతిక విజయాలు.. సాంకేతిక నైపుణ్యం కలిగించిన ఆర్ధిక స్థిరత..ఇదీ మనం గర్వించే మానవ ప్రగతి పథం.

నిప్పు నుండి నెలవంక దాకా మన గుప్పిటలో ఉన్నవి. నేల నుంచి నింగి దాక మన ఆధీనం లో ఉన్నవి.

మనం సృష్టించుకొన్నవి కొన్ని ... ప్రతిసృష్టించుకొన్నవి మరిన్ని.

సృష్టి కి ప్రతిసృష్టి కి మూలం ఒక్కటే.. అనాది గా మనవునికి ప్రకృతితో జరుగుతోన్న పోరాటం.ఒక ఆధిపత్యపోరు.

సంస్కృతి లోనైనా ప్రకృతి స్త్రీ. పురుషుడు,<శివుడు>, ఆమె భర్త.

నది,<గంగ>, స్త్రీ . శివుడు ఆమె ను సిగను బంధించిన వాడు.ఆమె విభుడు.

ఒక విధం గా, మనిషి ప్రకృతి పై సాధించ దలచిన అదుపు కు ఆధిపత్యానికి ఇది ఒక దృష్టాంతం.

ప్రకృతిలోని సకల చరాచర జీవ రాశి లో ఒకరమైన మనం

ప్రకృతి నుంచి నేర్చుకున్న ఒక్కో పాఠం తో మన ప్రగతికి బాటలు వేసుకొన్నాం.

“నాగరికత కన్నా ముందు అక్కడ అరణ్యం ఉంది. నాగరికత అబ్బిన తరువాత ఎడారి మిగిలింది.”అని అంటారు షథోబ్రియో

ప్రకృతి ని అనుకరిస్తూ అనుసరిస్తూ మనం నిర్మించుకొంటూ వచ్చిన మనవ ప్రగతి తో , మనం ప్రకృతినే మన అదుపు లోకి తీసుకొవాలనుకొంటున్నాం.

ప్రకృతి వనరులను మనకు అనువైన రీతిలో

మలుచు కోవాలని ..ఉపయోగించుకోవాలని అనుకొంటున్నాం.

ప్రకృతి వనరుల పై ఆధార పడి మనం మన ప్రగతి ని నిర్మించుకొంటూ వచ్చామో - ప్రకృతి వనరులను పదిల పరుచుకోలేని పరిస్థితులో పడి పోవడమే మన ముందున్న విషాదం.

మధ్య జరిగిన యుధ్ధాలన్నీ మాటకు వస్తే మనం ఎరిగిన యుధ్ధాలన్నీ ...ప్రకృతి వనరుల కోసం జరిగిన వే నన్నది ...సత్యం. మొదట ప్రకృతితో యుధ్ధం చేశాం.ఇప్పుడు జరుగుతున్నది ప్రకృతి వనరుల కోసం.ఇది మానవ ప్రగతి అయితే ..మనం ఎలాంటి ప్రగతిని కోరుకుంటున్నామో ..జాగ్రత్తగా ఆలోచించాలి. petro war" లు నేర్పించిన గుణ పాఠాలను మనం ఎలా మరిచి పోగలం ?

ఇక పై, జరిగేది జరగబోయేది hydro war లే నని మనం గ్రహించాలి.మన వీధి కొళాయిల నుంచి అంతర్జాతీయ జల వివాదాల వరకు ..నీటి యుధ్ధాలే నిత్యకృత్యాలు కాబోతున్నయి.ఇది ప్రకృతి వనరులన్నిటి విషయం లోను ఒక అనివార్య పరిణామం కాబోతున్నది.అన్ని విధ్వంసాలకు విద్వేషాలకు అవాంఛనీయ వాస్తవం మూలం కాబోతున్నది.

అకటా ..ఎంత దయ లేని వారు ఆడవారు !

ప్రపంచ వ్యాప్త ప్రకృతి పరిరక్షకులలో పర్యా వరణ ఉద్యమ సారధులలో మహిళలదే ప్రముఖ పాత్ర అన్నది మనకు తెలుసు.

కొలరాడో నుంచి ప్రాచీమడి వరకు ... DDT

నుంచి కోకో కోలా వరకు ...మహిళలు దీక్షా దక్షతలతో దిగ్గజాలను ఢీ కొన్నారు.

ప్రగతి పేరిట శాస్త్రం పేరిట జరుగుతోన్న విచక్షాణారహిత దోపిడిని నిలదీసారు. నిలవరించారు.

ప్రతి ఆలోచనను పునరాలోచనకు పెట్టారు.

బలమైన ఉద్యమాలు గా మలిచారు.ప్రపంచ దృక్పధాన్ని ప్రశ్నించారు.ప్రత్యామ్నాయ విధానాలను ప్రత పాదించారు.

అణువు నుంచి అంతరిక్షం వరకు . జన్యువు నుంచి జీవ వైవిద్యం వరకు.

పర్యావరణ రక్షకులుగా స్త్రీలే ఎందుకు ప్రధాన పాత్ర వహిస్తున్నరు ?

ఇందుకు పెద్ద ఆలొచించలు లోతైన విశ్లేషణలు అక్కర లేదు.

ఇది చాలా సామాన్యమైన విషయం.

" అడవి ని నమ్ముకొన్నా కాయపండు దక్కే .. ఏటిని నమ్ముకొన్నా ..శాపా రొయ్య చిక్కే .ఎవసాయం ఎత్తు భారమై పోయినా గింజలు రాలినా రాలక పోయినా

ఎల్లబారిపొతన్నె... నీల్లు యాడకెల్లి తేవాల్నో తానాలు ఏడ ఆడాల్నో .. ఆడుపిల్లలు అడవిన బోయి పుల్ల పుడక ఏరుకొస్చాన్నే." అంటూ మల్లమ్మ వాపోతే..."పసులను యాడకు కొట్టాల్నో చేలను యట్ల తడపాల్నో.." సిధ్ధయ్య మనస్సులో మెదిలిన ఆలోచనలివి. "దృశ్యాదృశ్యం" లోని ముంపువాసుల మనోభావాలివి.

పొయ్యి లో కట్టెలు , పొయ్యి పై ఎసరు, ఎసట్లో బియ్యం ...ఇవీ స్త్రీల కనీస అవసరాలు. ఆమె కుటుంబ నిత్యావసరాలు

.మానవ మనుగడకే అత్యావసరాలు .

అందుకే, ఆమె జీవావరణాలను కాపాడలనుకొంటుంది.

తన వారందరిని కళకళలాడుతూ చూడాలను కొంటుంది.అది ఆమె కుటుంబానికే పరిమితం కాదు. వారిపై ఆధార పడిన గొడ్డూగోదను పశుపక్ష్యాదులను ...ఒక విధం గా చెప్పాలంటే ..తమ పై ఆధార పడిన సమస్త జీవ రాశిని ఆమె కాపాడాలనుకొంటుంది.

అమ్మకు తెలుసు. ప్రకృతి పచ్చగా ఉంటేనే మానవ మనుగడ చల్లగా సాగుతుందని.

"ఏటిలో చేప అడవిలో చింతాకు " కమ్మగా కడుపు నింపు తుంటే ..ఎవరన్నా ఆమె మాట కాదన గలరా?

అయ్యా ,ఇదంతా ఏదో ఆడ వారి వ్యవహారమా ?

ఎండ.. వాన... స్త్రీ పురుషులు ఇరువురిపై ఒకే రకంగా ప్రసరిస్తాయి. పిల్ల తెమ్మర ఒకే రకమైన భావనలు కలిగిస్తుంది. తూఫాను తాకిడి ఒకే విధమైన భయభ్రాంతులకు గురి చేస్తుంది.

మరొక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను.

మనకు తెలిసిన తాటకి రాముడి గురి0చి.

ఆమె అడివి కి సంరక్షకురాలు. వారు తమ కార్యసిద్ది కి అడవిని స్వంతం చేసు కోవాలనుకొంటారు.

ఆమె స్త్రీ. వారు పురుషులు.

ఆమె రాక్షసి . వారు జగద్రక్షకులు.

పర్యావరణ వేత్తలపై ప్రపంచ వ్యాప్తం గా ఈనాటికి ఉన్న భావన అదేనన్నది మీ కు సవినయం గా గుర్తు చేస్తున్నాను.

ఎందుకంటే, ప్రకృతి గురించి మాట్లాడడమంటే ... లక్షలాది కోట్ల ధనం తో ముడి పడిన వ్యవహారాలను సవాలు చేయడం .ఒక దెశ ఆర్దిక ప్రణళిక ను పరిస్థిని కుదిపివేసే ప్రభంజనం.

ప్రగతి నిరోధకులుగా ఎందుకు భవించ వలసి వస్తుందో ....అందుకు గల కారణాలు ఏమిటో ఆలోచిద్దాం.

ఒకటి,

బంగారు పుట్టలో వేలు పెట్టడం.

రాజకీయ నాయకులు ..కాంట్రాక్టర్లు ..అధికారులు అనే ఇనుప త్రికోణాన్ని ..దానికి అండదండ గా నిలిచే న్యాయ వ్యవస్థనీ... శాసనాధికారాన్ని ...ఎదురొడ్డి నిలవడం. పెట్టుబడి దారి వ్యవస్థ మూలాలు కుదపడం. ప్రపంచ ఆర్ధిక సంస్థల అంతరార్ధాలను బట్ట బయలు చేయడం..అది కూడా.. చిన్న చితక ..ఆడవాళ్ళై చేయడం..!

రెండోది...

ప్రత్యామ్న్యాయ మార్గం గా..

1.శాస్త్ర్హీయ ప్రగతి ని నిరసించడం.

2. మళ్ళీ వెనక్కు ..అన్న సూత్రాన్నిపాటించడం .

మనవ ప్రగతి అంటేనే ...పదండి ముందుకు ..అని మనం అందరం భావిస్తాం.

మరి .. బాంబులతో భారీ ఆనకట్టలను బద్దలు కొట్టంది ..అన్న నినాదం నిశ్చేస్టుల్ని చేయకుండా ఎలా ఉంటుంది ?

ఆవేశ కావేశాల నడుమ అసలు విషయం మరుగున పడుతుంది.

స్త్రీల మైనా.. పురుషుల మైనా.. మానవులుగా మనం ప్రకృతి పై చేస్తున్న దోపిడి దౌర్జన్యం .. అదీ పక్కన పడుతుంది.

“మళ్ళీ వెనక్కు “, “పదండి ముందుకు .”.. అన్న పరస్పర విరుద్ధ భావాల ఘర్షణ మూలంగా ఒక రకమైన శూన్యత ఏర్పడుతున్నది. అయోమయం తప్పడం లేదు.

ఇంతటి ముఖ్యమైన విషయాల లొని పతి అంశంలోనూ క్రియాశీలక విధనాల అన్వేషణ కు నిర్మాణాత్మక ఆచరణకు వీలు కలగడం లేదు.ఆలోచలన్నీ ఆవేశభరితమై ఒక సానుకూల దృక్పథం ఏర్పడడం లేదు.

మనలోని సంశయాలే మన ముందరి కాళ్ళ బంధాలు అవుతున్నాయి.

ప్రకృతిని అదుపులో పెట్టుకోవాలన్న ఆలోచన ఎంత పాతదో ప్రకృతిని పరిరక్షించుకోవాలన్న పోరాటం అంత పురాతనమైనది.

ప్రకృతి పై విచక్షణా రహితమైనటువంతి దోపిడి మానవ చరిత్ర లో మునుపెన్నడు లేనంతగా 20 శతాబ్దం లో జరిగింది.అందులోను భారత దేశం అనేక పర్యవరణ ఉద్యమాలకు పుట్టినిల్లు అయ్యింది.ప్రపంచం లోనే

మొట్టమొదటి సారిగా పర్యావరణ కారణం గా ఒక ఆనకట్ట, సైలెంట్ వ్యాలీ ప్రాజక్ట్ ను నిలిపి వే సింది...మన దేశం లోనె.

నీకో బిందె నాకో బిందె

ప్రగతి పేరిట జరిగిన విధ్వంసం గురించి ఎంత మాట్లాడినా తక్కువే.

ప్రకృతి వనరుల కోసం జరిగిన petro war ల లాంటి ప్రత్యక్ష యుద్ధాలు ఎంతటి దారుణ మారుణ కాండ ను సృష్టించాయో జన్యు గుత్తధిపత్యం కై జరిగిన " చట్ట బద్ద " కుతంత్రాలు అంతటి విధ్వంసాన్నికలగజేసాయి.

యుద్ధం ఏపాటిదైనా , దాని ప్రభావం స్త్రీ పురుషులు ఇరువురిపైనా పదుతుంది.స్త్రీలపై మరింత ఎక్కువగా. వారి శరీరమే యుద్ధరంగమవుతుంది.

అయిన వారిని పోగొట్టుకోవడం ,ఆకస్మత్తుగా వంటరి వారు ,సామాన్య భద్ర జీవితం లోంచి ఒక్కసారిగా భయానక వాతవరణం లోకి నెట్టి వేయ బడదం , పెచ్చరిల్లే విద్వేషం, హింస, అత్యాచారాలు,

వలసలు,శరణార్ధులుగా కాందిశీకులుగా జీవనంకొనసాగించ వలసి రావడం ..ఎంత ధుర్భరం !

మనం చూస్తూనే ఉన్నాం.

అయితే ప్రగతి పేరిట జరిగిన జరుగుతోన్న విద్వంసం వేరు.

నది విషయమే తీసుకొందాం.

జలావరణం కకావికలైనపుడూ,

కరువైనా ముంపైనా, నిర్వాసితులు కావడం , ఆ దరిమిలా తలెత్తే పరిస్థితుల

ప్రభవం పడెది మొదత మహిళల మీదా ..ఆ తరువాత కుటుంబం లోని బాలికల మీదా.

అభద్రత,ఆందోళన,భయం,అసంత్రుప్తి, వీటన్నిటితో కలగలిసిన అశాంతిని ప్రకటించుకోవడానికి పురుషులకు ఒక సులువైన మార్గం ఉంది. అది గృహహింస రూపం లోను మానసిక శరీరక వేధింపులతోను ప్రకటితమవుతుంది.

ఈ నేపథ్యం లో కనీస అవసారలను సమకూర్చే బాధ్యత నుండి

వివక్ష మొదలవుతుంది.

స్త్రీలు బాలికలపై నిర్లక్ష్యం మొదలవుతుంది.అణిచివేత పెరిగిపోతుంది. విద్య వైద్యం మొదలైన విషయాలు పెను భారమై పోతాయి. స్త్రీలు బాలికలే అన్ని భారాలను మోయవలసి వస్తుంది.

కేవలం భారీ ఆనకట్టల నిర్మాణం చేత నిర్వాసితులైన వారు మన దేశ జనాభాలో అయిదో వంతూ మంది ఉన్నారు.ఇంకా,పారిశ్రామిక వాడల నుంచి ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ వరకు ఎంత మంది నిర్వాసితులవుతున్నరన్నది మన అంచనాలకు అందదు.

చిత్తూరు జిల్లా కురవల కోట మందలం తో నాకు పరిచయం కలిగే నాటికి ,అక్కడ విపరీతమైన కరువు.పురుషులు సమీప పట్టణాలకు పొట్ట కూటి కోసం వలస వెళితే ,మహిళలు ,పిల్లలు అక్కడి జీవనాన్ని "నెట్టుకొస్తున్నారు".

వృద్ధుల సం రక్షణా భారం కూడా వారిదే.

ఒక్క పూట భొజనం కోసం బడిలో చేరిన పిల్లలే ఎక్కువ.

సెలవల తరువాత బడి తెరిచే నాటికి,అందులో 60% పిల్లలు తిరిగి రాలేదు.మేకలు కాస్తూ.. కంకర కొదుతూ...టమట సేద్యం చేస్తూ ..ఆ కొండలలో లోయలలో కబడుతూనే ఉండెవారు.

ప్రతి ఏడాదీ ఇదే వరస.

రాష్ట్ర విద్యా శాఖ వారి 2001 నివేదిక సెలవల తరువాత బడి తెరిచే నాటికి,అందులో 60% పిల్లలు తిరిగి రాలేదు.మేకలు కాస్తూ.. కంకర కొదుతూ...టమట సేద్యం చేస్తూ ..ఆ కొండలలో లోయలలో కబడుతూనే ఉండెవారు.

సెలవల తరువాత బడి తెరిచే నాటికి,అందులో 60% పిల్లలు తిరిగి రాలేదు.మేకలు కాస్తూ.. కంకర కొదుతూ...టమట సేద్యం చేస్తూ ..ఆ కొండలలో లోయలలో కబడుతూనే ఉండెవారు.

ప్రతి ఏడాదీ ఇదే వరస.

రాష్ట్ర విద్యా శాఖ వారి 2001 నివేదిక ప్రకారం,సుమారు 31,68,776 మంది పిల్లలి బడిలో చెర లేదు. పనిలో పడ్డారు. ఇది బాల పౌరులలో దాదాపు 63.58% అందులో బాలురు 48.5 % ఉండగా బాలికలు 51.5 %.

అధికార గణాంకాలను మించి వాస్తవ పరిస్తిలను మించి ఉంటాయన్నది జగమెరిగిన సత్యం.

ఇంటిపనులు, పిల్లల పెంపకం బాలికలే నిర్వర్తిస్తున్నరు.అది వారి స్వంత ఇల్లైనా కాకపోయినా.

బడిలో చేరని పిల్లలెందరో .బడిని వదిలేసే పిల్లలెందరో.

బాలురకు కొద్ది వెసులు బాటు కనబడినా ,బాలిక విషయం లోఅది స్థిరపడి పోయింది.

కురవలకోట లో గత అయిదారేళ్ళలో "గొప్ప " మార్పు ఏదీ నేను గమనించ లేదు.

అవిద్య ,బాల్య వివాహాలు,బాలికా వ్యభిచారం ..ప్రత్యక్షం గా పరోక్షం గా ..ఇంటా బయటా.. బాలికలపై మహిళలపై.. అణిచివేత ,అత్యాచారాలు ..కొనసాగుతూనే ఉన్నాయి.

సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ఉన్న.. మరింత దుర్భర పరిస్థితులున్న రాజస్తాన్ మరియు హిమలయ ప్రాంతాలలో ..ఒక ప్రత్నామ్నాయ మార్గాన్ని ఆచరిస్తున్నారు స్రీ బంకర్ రాయ్ గారు.

వారి Barefoot university నిర్వహించే బడి లోని పిల్లలు , బడి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు వారితో పాటు బిందెడు నీరు తీసుకెళ్ళ వచ్చును.

అప్పటి వరకు సుమారు 20 -40 మైళ్ళ దూరం నడిచి ,కేల్మ్ ఒక కడవ నీరు తేగలిగిన పిల్లలకు ఇది ఎంత వెసులుబాటో ఊహించగలరు.ఆ నీరు ప్రత్యామ్నాయ నీటి సం

రక్షణ ద్వారా అందించబడుతుంది.

ఆ బడిలో పిల్లలు నేర్చే పాఠాలు కూడా అవే .

ఇక, ఆ పిల్లలు ఎవరో మీరు ఊహించగలరు.

వారు బాలికలు.

హరిత విప్లవం సమయం లో ..విచక్షణా రహితం గా పొలాలలో గుమ్మరించిన రసాయనల అవశేషాలు ..చేలమట్టి నుంచి చనుబాల వరకు చూపిన దుష్ప్రభావాలు ..మనకు తెలిసినవే.

మరొక నిశ్శబ్ద ఘోరం జరుగుతున్నది.శరీరాలే పొలాలయినట్లు గుమ్మరిస్తున్న "ఔషధాల " దుష్ప్రభావాలు.

చిన్న చిన్న జబ్బులు ప్రాణాంతక Drug resistant జబ్బులు గా పరిణమించాయి.ఒకప్పటి భయానక typhoid ఇప్పుడు నిత్యసాదృశ్యమై పోయింది.

TB సీజనల్ గా పలకరిస్తోంటే ..టీకాలతో నివారించుకో గల "తట్టు " లాంటి జబ్బులు "epidemics" గా పరామర్శిస్తున్నాయి.

ఇక, రసాయన అవశేషాల ఫలితాలు GIT క్యాన్సర్ల రూపం లో కనబడుతున్నాయి.

కనీస వైద్యం అందుకోలేని పరిస్థితులలో అనేకులు ఉండగా ..జీవ వైవిధ్యాన్ని ఫణం గా పెట్టిన మన విచక్షణారహిత "ప్రగతి" ఫలితాలే కొత్త కొత్త "epidemicల విజృంభణలు.

మన విద్య వైద్యం ..అన్నీ నేరుగా మన జీవావరణ సం రక్షణలో ఉన్నయని మనం గ్రహించాలి.

ప్రకృతిని పరిరక్షించని శాస్త్రం శాస్త్రం కాదు. ప్రగతి ప్రగతి కాదు. అక్షరం అరణానికి రక్షణ కవచమై నిలవాలి.

పర్యావరణ ప్రధాన ఆర్ధిక విధానాలు,ధీర్ఘకాలిక ప్రణాళికలు లేకుండా నిర్మించుకొనే ..నిర్వచించుకొనే మానవ ప్రగతికి అర్ధం లేదు.

మన శాస్త్రీయ ప్రగతి ,సాంకేతిక నైపుణ్యం మన మనుగడను పచ్చబరిచి ఉంచాలి కాని ,ఎడారిని చేయ కూడదు.

ఒక ఆలోచన శాస్త్రీయమైనదైతే పునరాలోచన కూడా శాస్తీయమైనదే.

"ప్రశ్న నుంది ప్రశ్న ప్రభవించకున్నచో" ప్రగతి మార్గం అగమ్య గోచరం !

***

" ఈ ప్రకృతి పై కొద్ది మంది ఆధిపత్యం ఎంతో మందిని వారి అదుపులోకి తెస్తుంది అనివార్యం గా!" ( దృశ్యాదృశ్యం)

ప్రకృతి వనరులపై గుత్తాధిపత్యం కోసం ప్రత్యక్షం గాను పరోక్షం గాను ..ఇంటా బయటా ..జరుగుతోన్న కుట్రలను మనం ఇక నైనా గ్రహించ లేకపోతే ..నిలువరించే మ్మర్గం ఆలోచించ లేక పోతే ..పునరాలోచనతో పునర్నిర్మాణ ప్రణాలికను రచించ లేక పోతే...

మానవ ప్రగతి సంక్షోభం లో పడుతుంది.

మన జీవితము మధ్యప్రాచ్యమవుతుంది.

విపులచ పృధ్వీ.

జీవవరణ వైవిధ్య రక్షణలోనే మహిళకు భద్రత ఉన్నది.బాలిక కు భవిష్యత్తు ఉన్నది.

మహిళా ప్రగతే మానవ ప్రగతి.

ప్రకృతి భద్రతే మానవ భద్రత.

ప్రపంచవ్యాప్తంగా మహిళలు ముక్తకంఠంతో ఎలుగెత్తి ఎదురొడ్డీ పోరాడుతున్నదీ ... తమ ప్రాణాలనే పణంగా పెట్టినదీ ..పర్యావరణ మిత్రులుగా పరిణమించినదీ ..

అందుకే !

మనం చేయగలిగినది ఒక్కటే ...

వారితో చేయి కలపడం.

***

చంద్ర లత

19-3-2008

National Seminar on “Rural Women towards Human Development -Experiments and Experiences.

Organised by.: Centre for Women’s studies ,Kakatiya University,Warangal

All rights reserved @writer.Title, labels,postings and related copyright reserved.

Jun 20, 2009

@అమ్మమ్మ

@అమ్మమ్మ

పెద్దపాపక్క చిన్నమనవరాలిని చూడడానికి వెళదామని అనుకుంటూనే ఉన్నా.

పూటకి పూట .

ఏదో పని కాని పని. మరేదో తీరిక లేని వ్యవహారం.

నా శ్రమ తప్పించడానికా అన్నట్లు ,తనే మా ఇంట్లో గడపడానికి వస్తున్నట్లుగా ఇవ్వాళ పొద్దుటే ఫోను.

సంజాయిషీలు సమర్ధనలు తయారు చేసుకొనే లోగానే పెద్దపాపక్క మా ఇంట్లో అడుగు పెట్టింది.

అయినా నసిగా.. "అసలే మార్చి నెల లెక్కలు . పై ఏప్రిల్ ఎన్నికలు ...వద్దామని అనుకొంటూనే ..వీలు కాక ..."

“నువ్వు ప్రత్యేకంగా చెప్పాలట్రా నందూ... అవని నాతో చెప్పట్లేదూ నువ్వెంత పనివత్తిడిలో ఉన్నావో .. అయినా మమ్మల్ని తలుచుకొంటు న్నావ్ ..అది చాలదూ.. "

గుమ్మంలో నిల్చుని ముసిముసి నవ్వులు నవ్వుతున్న అవనికి ఒక ధన్యవాదాల సైగ విసిరేసి..అక్క చేతిలో సామాను అందుకొన్నా.అవని పాపను అందుకోబోయింది.

"హమ్మో "అక్క చిత్రంగా ఒక కేక పెట్టినంతపని చేసింది. అవని అదిరిపోయింది.

అక్క పాపను గుండెలకు హత్తుకొని గబ గబ లోపలికి నడిచింది. అవని నా ముఖం లోకి అయోమయంగా చూసింది. నాకు అర్ధం కాలేదు.ఏమిటీ వింత అనుకొంటూ ..

ప్రయాణం చేసి వచ్చారుగా. అలసి పోయి ఉంటారు. పాప స్నానం చేశాక ఆడిద్దాం లే..అన్నం వడ్డిద్దాం .పద.”

మాట మార్చి అవనితో సహా వంటింటి వైపు నడవబోయా.

" కాస్త ఆగండి. ముందు వారికి గది అదీ చూపించి.. పాపకి ఏమేమి కావాలో కనుక్కొని..."

“ అక్క కు తెలియని ఇల్లా ..నువ్వు పద ..నాకు ఆకలి వేస్తోంది .." అక్క ప్రవర్తన నాకు మింగుడు పడలేదు. కానీ , మాట నుంచి అవనిని ఏమార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నానో కూడా తెలియదు.

"అది సరే కాని, అన్నయ్య గారు రాలేదేమండీ... "అవని గొణిగింది.

"నేరుగా పెళ్ళి వారింటికి వెళ్ళారు"సమాధానం అక్క నుంచి వచ్చింది.

అంతే..! అవని బుద్ధిగా వడ్డన కు మళ్ళింది.

మా గుసగుసలు అక్క చెవిన ఎలా పడ్డాయన్నది అవని కి అర్ధం కాలేదు మరి.

పిలుపుకి పెద్దపాపక్క మాకు అక్కే కానీ వరసకు మేనత్త.

సరిగ్గా దేశ స్వాతంత్ర్యం వచ్చిన రోజున పుట్టిందని మా తాతయ్య ఆమెకుస్వరాజ్యలక్ష్మి” అని పేరు పెట్టాడు.మా రాయుడు మామయ్య కాస్తా ఆమెనురాజ్యం’ చేశాడు.అటు ఇటు మూడు తరాల్లో పుట్టిన మొదటి ఆడపిల్ల కావడంతో పెద్దపాప గానే స్థిరపడి పోయింది.

పిల్లాజెల్లా ఒక గూటిలో చేరి ..ఒక ముఠాలాగ తిరుగుతూ పెరిగిన మా చిన్నతనంలో ,బాబాయిలతో గొంతు కలిపి పెద్దపాపక్క అంటూ మొదలెట్టిన పిలుపు అలవాటయిపోయింది. ఇప్పుడు పెద్దపాపక్క కు అరవై ఏళ్ళు వచ్చినా అమ్మమ్మ అయినా మాకు అలవాటు పోలేదు.

పెద్దపాపక్క పిల్లలిద్దరూ చక్కగా చదువుకొని అమెరికా చేరిపోయారు. చెరొక చోట అమరిపోయారు.ఒకరు ఉత్తరాన మరొకరు దక్షిణాన.ఒకరు హిమపాతం మరొకరు మండుటెండ అన్న మాట!

పెద్దపాపక్క చిన్న కొడుకు రంగ తో నా బాల్యం ,బడి,ఆటాపాటలు ముడి పడిపోయి ఉన్నాయి.ముఖ్యంగా రంగడి జ్ఞాపకం రాగానే ఎండాకాలం సెలవలు గుర్తుకొస్తాయి.

అమ్మమ్మగారిల్లని రంగడి అల్లరి పనులన్నీ చెల్లిపోయేవి.ఇక, మా పిల్ల చేష్టలేమో పెద్దపాపక్క కొంగున దాచుకొనేది.కోతి కొమ్మచ్హ్చులతో పిందే పట్టిన మామిడికొమ్మలు విరగ కొట్టినా ...బిళ్ళంగోడి జోరులో నిండు కడవలు పగలగొట్టినా..నేనున్నానంటూ మమ్మల్ని వెనకేసుకొచ్చేది.

పళ్ళు పులిసి పోతాయని మామిడి ముక్కలకు అద్దుకోమని తనే ఉప్పూ కారం అందించేది.చల్లని తాటి ముంజెలు ,పండిన సీమచింత కాయలు,తంపెట వేసిన వేరిశనక్కాయలు మాకోసం సదా సిధ్ధం చేసి ఉంచేది.గడ్డివాములో మాగేసిన సపోటాకాయలు వెతుకుతూ రంగడి చెల్లెలు ,సరస్వతి, తన కాలి పట్టా కాస్తా జారేసుకుంది.

అంతే ! తాతయ్య మన్నూ మిన్నూ ఏకం చేయడం ఖాయం అని బెదిరి పొయింది.తిన్నగా వెళ్ళి చావిట్లో మొచ్చు మీద కోళ్ళ గంప కప్పుకొని దాక్కుంది.అందరూ వూరూ వాడా తోటా తోపూ ఏకం చేసి వెతుకుతూంటే, పెద్దపాపక్క తాపీగా వెళ్ళి ,సరస్వతి చెవి మెలిపెట్టి మరీ ..మొచ్చు కిందికి లాక్కొచ్చింది !

అవును మరి, ఎప్పుడు మేము దాగుడు మూతలు ఆడాలన్నా పెద్దపాపక్కే దాపులు చూపించేది!

మేం చేసే నిర్వాకాలకు నాన్న కళ్ళెం వేయ బోతే తనే వెనకేసుకొచ్చేది," ఊరుకో అన్నాయ్ , పిల్లలు కాకపోతే నువ్వూ నేనూ అల్లరి చేస్తావేమిటీ ? వయసుకు ముచ్చట కానీ !"

ఇక ఆరు బయట చుక్కలవెలుగు లో కొబ్బరి చెట్ల కింద నులక మంచాలమీద చేరి ,పెద్దపాపక్క చెప్పే కథల్లోకి మాయమై పోయే వాళ్ళం.

ఇంతలో రాయుడు మామయ్య కి హైదరాబాదు లో వ్యాపారం స్థిరపడడంతో పెద్దపాపక్క నగరానికి కాపురానికి వెళ్ళింది.సెలవల్లో రాకపోకలు యధాప్రకారం జరిగాయి.కొంత కాలానికి పెద్ద చదువులకని ఒక్కొక్కరం పెద్దపాపక్క ఇంటికే చేరాం.ఉద్యోగాల్లో పనిపాటాల్లో చెరో దేశం పట్టాం.

పెద్దపాపక్క అనగానే జ్ఞాపకం వచ్చేది నదురు బెదురూ లేని చిరునవ్వు చెదరని ముఖం.

అలాంటి మనిషిలో ఇవ్వాళ నేను చూస్తోన్న బెరుకేమిటీ ? భయమేమిటీ? తడబాటేమిటీ ? నాకు ఏమీ అర్ధం కాలేదు.

"నాకు ఎప్పుడో అర్ధమై పోయింది " అవని గుసగుసలాడింది" మొన్నా మధ్యన మీ రాయుడి మామయ్యగారి తల్లిని పరామర్షించాడానికి వెళ్ళాం చూడండీ ...అప్పుడే నాకు అర్ధమైంది." అవని మరింత వివరం గా చెప్పింది.

"ఏం అర్ధమైంది ?" ఇక అడగక తప్పలేదు.

" భయం ! అంతా చిన్న పాప వలనే !"

"చిన్న పాప వలనా?" నాకు ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు !

..పాప వల్లే ! " అవని కొనసాగించింది," అరక్షణానికొక అమెరికా ఫోను .పాపం ..పెద్దపాపక్కని కుదురుగా కూర్చో నిస్తేనా?ఒకటే వత్తిడి!

"అమెరికా ఫోనేమిటీ అక్క వత్తిడి పడడేమిటీ .. నువ్వు మరీ..." నా మాట పూర్తి కానే లేదు అవని అందుకొంది.

" అవును మరి ! సరస్వతి నేరుగా మీ రాయుడు మామయ్యకే చేసేది"చూశావా నాన్నా అమ్మ ఎంత పని చేసిందో అంటూ"...ఇక, మీ మామయ్య సంగతి నేను మీకు నేను వేరుగా చెప్పాలా ?"

చెప్పక్కర లేదు.

రాజ్యం !” అని మామయ్య గుమ్మం దగ్గర ఒక కేక పెడితే చాలు ..గర్జనో గాండ్రింపో విన్న లేడి పిల్ల లాగా ఒక్క పరుగున వెళ్ళి ఆయన ముందు నిలబడేది.

మా రాయుడు మామయ్య ఏనాడు మా పెద్దపాపక్క ముఖాన వెలుగుల చిరునవ్వు చూసిన పాపాన పోలేదు.ఇక, ఆమె చలాకీ తనం ,హుషారుపాటలు,కమ్మని కబుర్లు వేటికీ ..మామయ్య నోచుకోలేదు.

ఆయన ధోరణి అంతేలెమ్మని అందరం రాజీ పడ్డాం.పడక తప్పదని మా నాయనమ్మ కళ్ళు తుడుచుకోని ముక్కు చీదేది. ఆడపిల్లని కన్నాక ఇలాంటివి భరించక తప్పుతుందా నాయినా" ఉండబట్టలేక అప్పుడప్పుడు వాపోయేది.

"నందూ " పెద్దపాపక్క పిలుపుతో లోకంలో పడ్డాను. "వెబ్ కాం ఒక సారి ఆన్ చేస్తావా? సరస్వతి లాగాన్ అవుతుందేమో.."

పల్లెటూరి పెద్దపాపక్క నోట సాఫ్ట్ వేర్ పదాలు వినడం చాలా తమాషాగా అనిపించింది.కానీ, ఆశ్చర్యం కలగ లేదు. పురుళ్ళు పుణ్యాలని అమెరికాకి వెళ్ళి వస్తూ నే ఉన్నందయ్యే.

అయితే అవని అన్నట్లుగా సరస్వతి ఫోన్ చేసిందన్న మాట !

"అలాగే అక్కా" బుధ్దిగా కంప్యూటర్ వైపు నడిచాను. మరు క్షణం లో సరస్వతీ వాళ్ళాయనా తెర మీద ప్రత్యక్షం అయ్యారు.

నాతో మాట్లాడుతున్నారన్న మాటే కాని వారి కళ్ళు నా చుట్టూ వెతుకుతున్నాయి.అయ్యో వాళ్ళు పాపను ఎంతగా మిస్ అవుతున్నారో ..ఉసూరు మనిపించింది. మా చిన్నారి ని బడికి పంపితేనే బోలెడంత దిగులుగా ఉంటుంది.ఇక ,బడి నుంచి తిరిగి రావడం లో ఒక నిమిషం అటూఇటూ అయితే అవని హడావుడి చెప్పక్కరలేదు.అలాంటిది వేలాది మైళ్ళదూరం బిడ్డను పంపిన వారు ఎంత బెంగ పడుతుంటారో ..!

రంగడు కూడా మరో కిటికీ లో నుంచి తొంగి చూశాడు.పెద్దపాపక్క కుటుంబం అంతా తెర కెక్కారు !

అప్పటి వరకు ఆర్ధిక పతనాల గురించి ..నూతన అధినేతల గురించి.. జీతభత్యాలపై పరిమితుల గురించి కబుర్లాడుకొంటున్న మేము , సరస్వతి పెట్టిన చిన్నపాటి కేకతో లోకంలో పడ్డాం.

వెనక్కి తిరిగి చూద్దును కదా...అప్పుడే ,పెద్దపాపక్క స్ట్రోలర్ తెచ్చి ఆపింది.

పెద్దపాపక్క పెంపకం చిట్టి పాప ముఖంలో స్పష్టంగా కనబడుతున్నది.

నిశ్చింత.నిబ్బరం.

నిద్రలోనే పాల నవ్వు పాప ముఖాన సన్నని అలలా కదలాడింది.

ప్రశాంతతకు ఎక్కడ భంగం జరుగుతుందో అన్నట్లుగా, నాకు తెలియ కుండానే ఎప్పుడో వాల్యూం తగ్గించాను.

"నందూ.." పెద్దపాపక్క మెల్లిగా గొణిగింది"వెబ్ క్యాం సరిగ్గానే ఉందంటావా? చిట్టి ముఖం వాళ్ళకి స్పష్టం గా కనబడుతుందంటావా?"

పాప ముఖాన వెలుతురు పడేట్లు లైట్లు సరిచేసి ,వెబ్ క్యాం అమర్చా.పాప ముఖం స్పష్టంగా తెర మీద కనబడసాగింది.ఒక కిటికీలో సరస్వతి మరో దాంట్లో వాళ్ళాయన.ఇంకో వైపు నుంచి రంగ.

తెర మీద సరస్వతి వింత హావ భావాలు చూశాక గుర్తొచ్చింది..నేను వాల్యూం తగ్గించిన సంగతి.అరరే.మరిచిపోయా. అలా వాల్యూం పెంచానో లేదో ..సరస్వతి మాటల వెల్లువ.

దడ దడ దబ దబ. " ఎన్ని సార్లు చెప్పాను నీకు ..పాపని అలా నిర్లక్ష్యం గా వదిలేయద్దని .! ఏదో గత్యంతరం లేక అక్కడకి పంపానే అనుకో ..చూడు..!అలా చూడు పాప ముఖం !" తెర మీది అందరి ముఖాలు ముడుచుకొన్నాయి. "అది కాదమ్మా.." పెద్దపాపక్క ఏదో చెప్పబోయింది.

“చూడు రంగన్నా ..ఎడం చెవి తమ్మె మీద ! హా ! "

దోమ కాటు..! అమ్మా ..ఇరవై నాలుగు గంటలూ టీవీ సీరియళ్ళలో మునిగి ఉండక పోతే,పాప బాగోగులు చూసుకోవద్దూ? బిడ్డను అప్పజెప్పారనే అన్న బాధ్యత లేక పోతే ఎలా..?"రంగడు తన చెల్లెలికి గొంతు కలిపాడు. " ! బావ గారు ఏమనుకొంటారు అన్న ఇంగితం లేక పోతే ఎట్లా..? ఇన్నేళ్ళోచ్చినా..?"

"ఇట్స్ ఓకే...! రంగా..మామయ్య గారు ఎప్పుడో చెప్పారు.. మనమే.." ఔదార్యం ప్రకటించాడు సరస్వతి వాళ్ళాయన.

నిన్నెందుకు నాన్న తో హోటల్ లో ఉండకుండా నందూ ఇంటికి వెళ్ళమన్నదీ ..”

పెద్ద పాపక్క నోట మాట పెగలడం లేదు.కళ్ళమ్మట బొటబొట నీళ్ళు.

ఇక చూడలేక గది నుంచి బయటకు నడిచా.

మనిషంటూ ఉన్నాక దోమంటూ కుట్టకపోతుందా.. అందులోను మన దేశాన..!ఇందులో పాపక్క నేరమో ఘోరమో ఏముందో నాకయితే అర్ధం కాలేదు ఒక పట్టాన.

మా రాయుడు మామయ్య ఎప్పుడో తన చతుర్ముఖపారాయణం మునిగి తేలుతూ ఉంటాడు. ఆయనకు పిల్లపాపలతో గడిపే దురలవాటు లేదు .అయినా, ఆయన పిల్లలిద్దరు ఆయన ద్వారానే పెద్దపాపక్క కదలికలను అదుపు చేయడం చిత్రం . ఇది కార్పోరేట్ గ్లోబల్ హ్యూమన్ మానేజ్ మెంట్ కాబోలు !

“ఇప్పుడేం చూశారూ ? మీ రంగడి కొడుకుని పంపారే అప్పుడు చూడాల్సింది. రోజూ ఇలాగే ! వాళ్ళు పంపిన గ్యాప్ చొక్కా కాకుండా గ్లాస్కో జుబ్బా వేసిందట..అనకూడదు కానీ, మీ రంగడిది ఎంత రాద్దాంతమో ! ఇక్కడ ఉన్నా అమెరికాలో పెరిగినట్లు పెరగాలంటారు. బావుంది! "

ఎందుకింత వత్తిడి? అక్కనే అక్కడికి తీసుకెళితే పోయేది కదా...!" అసహనంగా అన్నా.

"అది మరీ దుర్మార్గం. వయసులో వాళ్ళిద్దరూ చెరొకచోట..పై నుంచి భాష , మనుషులు, వెసులుబాటు లేని ఇంటిపని , వంటరితనం..అదొక దుర్బరం."అవని పెదవి విరిచింది.

నిజమే," ఇద్దరూ వెళ్ళాల్సింది.."

"మీ రాయుడు మామయ్యా .. ? " అవని నిట్టూర్చింది.

అదీ నిజమే . అవని ఒక్క మాటా అనలేదు కానీ , మా పెద్దపాపక్క ఇక్కడ కూడా ఒంటరిదే..!

“వళ్ళు మండుతుంది! రంగడినీ సరస్వతినీ నాలుగు దులిపేసి వస్తా..!" వేగంగా గదిలోకి వెళ్ళబోయా.

అవని నా మోచేతిని పట్టి అమాంతంగా ఆవలికి లాక్కెళ్ళింది. " ఘనకార్యం మాత్రం చేయకండి!సరిగా అలాంటి ఉత్సాహం చూపించాడు మా పెదనాన్న. మా శ్రీకాంత్ అన్నయ్య చిన్నపిల్లాడిని పంపినప్పుడూ ఇంతే ..ఆంధ్రాలో ఉన్నా అమెరికాలో పెరిగినట్లు వాళ్ళ కొడుకు పెరగాలంటారు.వాడేమో ఆరు నెలల పసిగుడ్డు.నళిని వదిన రెసిడెన్శీ చేస్తోందప్పుడు. తనకి మనిషి సాయం కావాలి. నిజమే. పెదనాన్నకి బై పాస్ అయ్యి ఆర్నెల్లు.పెద్దమ్మకి మెనోపాజ్ దశ.కీళ్ళనొప్పులు. పైనుంచి షుగరు.

శుభోదయాన అన్నయ్యకి ఖరాఖండిగా చెప్పేశాడు పెదనాన్న.."మీ పిల్లాడిని మీరు తీసుకెళ్ళి పెంచు కోండి ..మీ అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం "అనీ. ఇప్పటికి ఆరేళ్ళు !వాళ్ళమధ్య మాటపట్టింపులు వచ్చి.రాకపోకలు నిలిచిపోయి.పెదనాన్నా పెద్దమ్మా ఎంత కుమిలిపోతున్నారో.

"ఏదో పరిస్థితి అర్ధం చేసుకొంటాడనీ మరో మార్గం ఆలోచించుకొంటారనీ అన్నానే కానీ ..ఇలా జరుగుతుందనుకోలేదమ్మా" పెదనాన్న కంటతడి పెట్టారు."మంచో చెడో ..వాడిని కని పెంచాం కదమ్మా..ఒక మాటతో తెగతెంపులు చేసుకొన్నాడే.." అవని గొంతు బొంగురు పోయింది.

“ఏదో పెద్దాళ్ళం.పిల్లల అవసరాలకు అక్కరకు రాక పోతే ఎలారా నందూ?" పెద్దపాపక్క ఎప్పుడువచ్చిందో కానీ నా వెనకాల నుంచి నెమ్మదిగా అంది.” పిల్లల కోపాలదేం కానీ..."

మళ్ళీ సమర్ధింపు ఒకటి ! నాకు చిర్రెత్తుకొచ్చిన మాట నిజం.

"అక్కడ కెళ్ళినప్పుడు చూశా కదరా.. బేబీ సిట్టర్లతో ఇబ్బందులు..! "

అక్కడి బేబీ సిట్టర్ ని ఇలా కేమేరాలతో మామయ్యలతో మానిటర్ చేస్తారో లేదో నాకేం తెలుసు ???

“ నా మానాన నన్ను వదిలేస్తే నా మనవరాలిని నేను పెంచుకోనూ..?” అక్క గొంతు ఒణికింది, “ నేను అమ్మమ్మను... రా... నందూ..అమ్మమ్మని !"

ఒక్క మాటన్నా అక్కని మరింత బాధ పెట్టినట్లే. మౌనంగా గదిలోకి వెళ్ళా.

కోపం తమాయించుకొని , తాపీగా వెబ్ క్యాం వైర్లన్నీ చుట్ట చుట్టి పక్కన పడేశా.

"సారీ ..సరస్వతీ ...లైన్ డిస్కనెక్ట్ అయ్యింది !" వాయిస్ మెయిల్ పెట్టేసా. అలాగే రంగడికీ.

నా గొంతులో తొణికిన ధ్వని వారికి చేరిందో లేదో కానీ .. నేను మాత్రం తేలిక పడ్డా.

మళ్ళీ కనెక్ట్ చేసే లోగా.. వారికి తెలియచెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అమ్మమ్మ గారింట వారు గడిపిన రోజులు ఒకమారు గుర్తు చేయాల్సి ఉంది.

బడి నుంచి ఎప్పుడు వచ్చిందో మా చిన్నారి నవ్వులు వినబడ్డాయి.

చూద్దును కదా.. పెద్దపాపక్క కాళ్ళ మీద చిట్టిని పడుకో పెట్టుకొని నలుగు పెడుతోంది. సున్నిపిండి గిన్నెతో చిన్నారి.నీళ్ళచెంబుతో అవని .చెరో పక్క నిలబడి ఉన్నారు.పాప కేరింతలు కొడుతోంది.

సాయంత్రం....

పాప వంటి మీది మీగడ కమ్మదనం జుట్టులోనుంచి సాంబ్రాణీ సువాసన .. మళ్ళీ మా పెద్దపాపక్క మా కళ్ళ ముందుకొచ్చినట్లయ్యింది. కళకళలాడుతూ.

.

*** 26-4-2009 ***

Published in Eenadu sunday magazine , కథ * ఈనాడు ఆదివారం 24-5-2009

All rights reserved @ writer.Title,labels ,postings and related copyright @ writer.