Dec 14, 2015

వారింట పూచిన పూలు !

డాక్టర్ల ఇళ్ళంటే ,
ముఖ్యంగా మాబోటి చిన్నాచితక పట్టణాళ్ళో ,
ఎవరో నియంత్రించి నట్లు, మూసపోసినట్లు , 
ఒకేలా ఉంటాయి.
కింద ఒకటో రెండో అంతస్తులు ఆసుపత్రి .ఆ పైన మెట్లెక్కితే ఇల్లు.
 ఒక విధంగా, రోగులు, వారి బంధువులు ,పుట్టే బిడ్డలు, గిట్టే ఊపిరులు.నిలబడే ప్రాణాలు.నిలకడ లేని క్షణాలు. నమ్మకం. అపనమ్మకం.
ఒక వైపు ఆనందం, ఒక వైపు విషాదం. ఓ పక్క నిబ్బరం మరో పక్క నిస్పృహ .
 అటు జీవితం పట్ల చివరి ఆశ. ఇటు జీవితం చిగురించిన  సంబరం.
అనేకానేక భావోద్వేగాలు కిక్కిరిసిన ఆ జాగాల్లో... మేడ మెట్లెక్కిన నిశ్శబ్ద ఆవాసాల్లా ఉంటూ ఉంటాయి.ఆ ఇళ్ళు.
 ఇరుగు పొరుగు , ముంగిలి లోగిలి అన్నీ , ఆ ఇళ్ళ వాకిళ్ళలో   ఆగి , ఊరించే  జ్ఞాపకాలే.
వూళ్ళో ప్రతి ఒక్కరికీ , ఆ ఇంటి చిరునామా తెలిసే ఉంటుంది. వారికో,వారి బంధు మిత్రులకో ఎప్పుడో ఏదో
అవసరానబడి ఆ గడప తొక్కే వుంటారు.
అలాంటి ఒక ఇల్లే , కొత్త గూడెంలోని డా.శ్యామలాంబ ,డా .నరేంద్ర కుమార్ గార్లది.  వారి ఆసుపత్రి మిద్దె మీది ఇంటి లో ఉన్నంతలోనే, కాస్త చోటు చేసి, బోలెడు మొక్కలను ఆప్యాయం గా    పెంచుకొంటున్నారు.

ఒక చిన్న తూగుటుయ్యాల ,కొన్ని కుర్చీలు ఎప్పుడూ సిద్ధంగా వుంటాయి . అలసిన డాక్టర్ దంపతులు సేద తీరడానికే కాక ,వచ్చే పోయే అతిథులకోసం.
శ్రద్ధగా ఎంపిక చేసుకొన్న పుస్తకాల ఖజానాలో వేలు పెడితే, ఇక అంతే. ఆ ఉయ్యాల్లో కూర్చుని , నరేంద్ర గారి చేతి ఆకుపచ్చ తేనీరు చప్పరిస్తూ,శ్యామల గారి హిమాయల సానువుల్లో ని ,పూలలోయల సోయగాల ముచ్చట్లువింటూ, పుస్తకాల కబుర్లాడుతూ కూర్చుంటే,
రోగాలురొప్పులు మంత్రం  వేసినట్లు మాయమై పోవూ ?
మరో వైద్యం కావాలేంటి ? 


డా.శ్యామలాంబ, డా.నరేంద్ర కుమార్ దంపతులకు స్నేహంతో,అభిమానంతో.)










All rights @ writer. Title,labels, postings and related copyright reserved.