Mar 18, 2011

"బృందావనమది అందరిదీ"


"బృందావనమది అందరిదీ" అన్న పాటంటే ఎందుకో గానీ,
నాకు భలే నచ్చుతుంది.
నిజమే కదా 
అందములు అందరి ఆనందానికే కదా.
అందుకేనా?
 నాయకుడు తన నాయికను అందంగా ఆటపాట్టించాడే అనుకుందాం.  సున్నిత మనోహర సన్నివేశం మిగిల్చిన , అపురూప దృశ్యకావ్యం మాట కూడా అటుంచండి.
మన ముందున్నవి, బృందావనమూ, అందములు, ఆనందములు ..మాత్రమే నన్న మాట!
అదాటున  వాన కురిస్తే..అల్లంతలో  హరివిల్లు విరిస్తే ,  అందాన్ని చూసి పరవశించి పోని వాళ్ళం ఎవరం ఉంటాం చెప్పండి?
తా చూసిందే అందమని... పెద్దలెప్పుడో వ్రాక్కుచ్చారు కదా? మరి వారి మాట కూడా  చెవిన వెయ్యాల్సిందే!
 నేపథ్యంలో , బృందావనం అందరిది ఎలా అయిపోతుందబ్బా? అని  కంత్రి @ మంత్రి వ్యవహారాలు పతాకశీర్షికల్లో చూసి ముక్కున వేలేసుకోకుండా ఉండలేని కదా  మీబోటి నాబోటి వారం !
నిజమే నండి మరి  కాలంలో కాబట్టి బృందావనం  అందరిదై పోయింది కానీ ,  కంత్రుల మంత్రుల తంత్రుల కాలంలో అయితేనా ..?!?
చూశారా కాలమహిమ అంటే ఇదే
ఒక అందమైన పాట గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ  కూడా...ఎలా భూగోల లోకి 
బొక్క బోర్లా పడి పోతామో 
కదా?
అదలా ఉంచుదాం.
బృందావనం అందరిదే.
కళ అందరిదే.
శాస్త్రమూ అందరిదే.

ఒకసారి  పాటనే పలకరిద్దాం.
దాదుపుగా యభై ఏళ్ళ పైగా మనం అంతో ఇంతో ఎంతోకొంత ...  పాటపై మన భావోద్వేగాల పెట్టుబడిని పెట్టేసాం. ఆలోచన అనుభూతి మనతో పాటు స్థిరపడుతూ ధృవపడుతూ ధృఢపడుతూ  వస్తూ ఉన్నది .ఏళ్ళ తరబడి
రాగా రాగా   రాగము దానితో ముడిపడిన అనురాగమూ..మనలో భాగమై పోలేదు.
మన సామూహిక భావనలతో స్పందనలతో  నిర్మించుకొంటూ వచ్చిన అందమైన పార్శ్వం అది.
తుడిచిపెడితే పోయేదా?విడిచి పెడితే పోయేదా?

అంతెందుకు ,
గురజాడ మన అందరివాడే.గిరీశమూ అందరివాడే.
మిస్సమ్మ అందరిదే. మా వయ్యారి పాట అందరిదే  కథానాయకుడు నాయిక  పక్కనే ఉన్న అమాయిక.. వారందరినీ సృజించిన అనేకానేక మంది కళాప్రతిభ అందరిదే.
నిజమే కదా, అందములు మన అందరి ఆనందానికే గా!
ఆగండి మన కథానాయకుడు కనుబొమలెగరేస్తూ గడ్డం నొక్కు లోంచి  చిన్ని సవాలు విసురుతున్నాడు నాయిక వైపు..ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూడండి.
"గొవిందుడు అందరివాడేలే . ఎందుకు రాధా ఈసునసూయలు ...?"
అంటూ.  కాలం కాబట్టి  నాయిక నొసలు చిట్లించి వూరుకుంది కానీ,  కాలాన టపీమని అనేది కాదు.."
"  లెక్కన రాధ  అందరిదేగా...!"
  ఫళాన ఢామ్మని శబ్దం  మన పాలు !
కదండీ.
నిజమే .
 కళాకారుడు ఆలోచనాపరుడు నాయకుడు  ...కర్త కర్మ క్రియాశీలి .... పురుషుడు కాకుండా స్త్రీ అయినపుడు  మనం , ఆమె ఆలోచనా ,కళ ,ప్రతిభ, ప్రతిష్ట అన్నీ  అందరివీ ..మనం ఆమెను ఒక అపురూపసృజన గా  ప్రత్యేక వ్యక్తిగా స్వీకరించగలమా? ..ఈసునసూయలు లేకుండా ..  ఆదరించగలమా?
ఆమె స్వయం ప్రతిపత్తిని గౌరవించగలమా?
ఆమె ను ఆమెగా స్వీకరించగలమా?
ఆగండాగండి.
'ఆపండాపండి...ఆమె దేంటండీ పేద్ద గొప్ప! ఆమె అలా ఉన్నదంటే  , ఆమె భర్త ఎంత భరాయించి ఉంటాడు ?ఎంత నిభాయించి ఉంటాడు? ఎంత నిబ్బరించి ఉంటాడు?
అందుకే  ఆమె అతనిది మాత్రమే  అవుతుంది!అంతకు మించి ఆలోచించడం తప్పు కదండీఏ లెక్కన చూసినా ,ఆమె భర్తనే , గోప్ఫ!"

 లోలోనుంచి ఎక్కడో పొడుచుకొచ్చేస్తోన్నవి.. పోటానుపోటీగా .
బహుశా అవేనేమో ఈసునసూయలంటే !
ఈసునసూయలు కూడా సామూహిక భావనలే ,
అప్పుడప్పుడూ!
 లెక్కన !

 ***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Mar 7, 2011

నిశ్చయముగ నిర్భయముగ 1


మా ఇంటి పుస్తకాల అరలో శ్రీశ్రీ గారు, చలం గారు లేరని నేను గ్రహించేటప్పటికే, నేను  సాహిత్య విద్యార్ధిని. అందులోను ఆంగ్లసాహిత్యం. కొద్దిపాటి రచనలు కూడా అచ్చయ్యాయి 
"ఏమిటీ ? మహాప్రస్థానం" చదవకుండా కథలు రాసేస్తున్నారా? అందులోని ప్రతి అక్షరం నాకు కంఠోపాఠం!"
అంటూ అత్మీయ సాహితీ మిత్రులొకరు కళ్ళర్రజేసి, ఆశ్చర్యపోయి ,ఆ పై జాలి కురిపించారు. ఆ పై , మెత్తగా హెచ్చరిక చేశారు.
దడ పుట్టి బిక్కచచ్చి , వారి ఎదుటినుచి మాయమయ్యా.
సరిగ్గా, అప్పుడు మహాప్రస్థానం" నా చేతిలో ప్రత్యక్షం అయ్యింది. ఆత్రంగా పుస్తకం తిరగేస్తే , అందులో నాకు తెలియనివి ఏవీ లేవు.  ఆ ,రెండు అట్టల మధ్య శ్రీశ్రీ గారి సంతకం తో చదవడం తప్ప.
అవన్నీ శ్రీ శ్రీ విరచితం అని మాత్రమే నేనప్పుడు గ్రహించిన సత్యం!
ఇందుమూలముగా యావత్ పాఠక లోకం గ్రహించవలసినది ఏమనగా,
శ్రీశ్రీ గారనగానే
"ఓహో " కారాలు చేసేవారు ఎలాగు
శ్రీశ్రీగారిని వదిలి ఉండలేరు.
"ఊహు" కారాలు చేసేవారు ఎలాగైనా
శ్రీశ్రీగారిని వదుల్చుకోలేరు!
అంతలా ,శ్రీశ్రీ గారు మన అంతరాంతరాల్లోకి అంతర్లీనమైపోయి ఉన్నారు.
మన తెలుగు మాటలో పాటలో,
తిరుగుబాటులో ,పోరుబాటలో,
ఆలోచనలో ఆవేశంలో ఆశయాలలో ఆచరణల్లో .
***
  అలముకొన్న చీకటిలో అలమటించే వేళల......ఏడవకేడవకేడవకండి ..అంటూ ధైర్యం నింపినా,
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అంటూ ... .కన్నీటిధారలు తుడిచే వేళయినా ,
చీకటి మూసిన ఏకాంతంలో ...తోడుగా నిలిచే పలుకైనా,
సందేహమో సంశయమో పట్టి నిలిపేస్తే, పదండి ముందుకు త్రోసుకు త్రోసుకు ..అంటూ మన సంకోచాలను బద్దలు చేసి ,కొరడా ఝుళిపించే వేళయినా  ..
అందుగలడు ఇందులేడని ...
కళ్ళురుముతూ కదం  తొక్కుతూ .. పెనుగాలిలా  పెకలిస్తూ . స్వాతంత్రం ,సమభావం ,సౌభ్రాతృత్వం  సౌహార్ధం పునాదులై నిర్మించిన ఆ మరో ప్రపంచం తల వాకిట నిలిచి,
సిరిసిరి నవ్వులు రువ్వుతూ .
మెరుపు మెరిస్తే వానకురిస్తే హరివిల్లు విరిస్తే చాలు.  ముసిముసి నవ్వుల తాతయ్య గారు తయారు !
సబ్బుబిళ్ళను అరగదీసేప్పుడో ..అగ్గిపుల్లను గీచి పారేసేప్పుడో...దారికడ్డంగా అరటితొక్కను విసిరిపారేసేప్పుడో.. శ్రీశ్రీ మాష్టారు మనల్ని పలకరించ కుండా ఉంటారా ... ?
మీరే చెప్పండి !
***
"గోరా"మయమైన నాస్తికపదప్రపంచంలో పెరుగుతోన్న నాకు, "భజ గోవిందం భజగోవిందం " లోని స్వరధుని  ఎగిసిన మంటల "మరో ప్రపంచం " మూలమైన నడకకు దుడుకుకు కరుకుకు  అమరిపోయిన , ఆ రచనా సాంకేతికాల రహస్యం అబ్బుర పరిచింది.
"జగన్నాథ రధ చక్రాల" పై మొయిల్దారి బయిల్దేరి ....భూమిపై దిగి..ఏడవకేడవకండేవంకండని.."నిటాలాగ్ని" రగిలించ వచ్చునో తెలిసింది.
ఒక రచనా సాంకేతిక రహస్యం ఎన్ని  సంశయాల్ని  పటాపంచలు చేసిందో.
ఆలోచనలను ఎంత స్పష్టంగా సులువుగా తేటగా సూటిగా బలంగా చెప్పవచ్చునో,  ప్రతిపదం వివరించాయి..
అంతే కాక, ,ప్రపంచసాహిత్య అనువాదాలు ,పరిచయాలు, ఉటకింపులు...విశ్వసాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన అవసరాన్ని విడమరిచి భోదించాయి.
"ఆః !" అంటూ లోకం రీతిని తేలికగా విప్పిజూపితే,
"పల్లెటూళ్ళో తల్లి కేదో /పాడుకలలో పేగుకదిలింది.." అంటూ గుండె కలుక్కు మనిపించాయి.
"గది లోపల చినుకుల వలె చీకట్లు " ఒక రసాత్మకమైన వాక్యం కావ్యం ఎలా అవుతుందో చూడమంది.
పదాల విరుపు మెరుపు చెరుపు...కొంగొత్త పదాలను ఎలా ప్రభవింప చేస్తాయో...
సరికొత్త అర్ధాలను ఎలా అద్దుతాయో... ఆ పద నిర్మాణాలలో తూగు లయ ధ్వని ,స్వరధుని ...
భావవ్యక్తీకరణకు ఎంతటి ప్రభావ మాధ్యమాలో తెలియపరిచాయి.
అవును.
మును ముందుకు సాగి పోయేందుకు ..నిశ్చయాన్ని కలిగించేదీ..నిర్భయాన్ని నింపి ఉంచేది..
అదే  సిరి సిరి సిరాచుక్కల తోడు గా నడిచే నడక..
తనతోనే ఆగకూడకూడదని...తన వద్దనే ఆగకూడదన్నదేగా....
ఆయన మనలను పదేపదే చేసిన హెచ్చరిక !
ధ్వంసరచన చేసి నిలిచిపోమన్నాడా ? మరోప్రపంచం నిలబెట్టమన లేదూ ?
నియతృత్వం ఏ రూపంలో రెక్కలు విప్పినా దానిని నిలువరించమన లేదూ?
దౌర్జన్యం ఏ వైపున మొలకెత్తినా , నిలువునా పెకలించి వేయమన లేదూ?
సిరి సిరి దివిటీల వెలుగు బాటలో ..
మనం సైతం ..
అంతో ఇంతో ఎంతో....
ముందుకు సాగుదాం.
ఇంకేం?
పదండి ముందుకు ! పదండి త్రోసుకు !
నిశ్చయముగ. .నిర్భయముగ.
***
(శ్రీ శ్రీ సాహిత్యనిధి 101 వ సంచికలో ప్రచురణ కాబోతన్నది.త్వరలో)
20-2-2011

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Mar 3, 2011

నిశ్చయముగ నిర్భయముగ

పాలమూరులో మేము ... పనిగట్టుకొని ఎవరో నియమం ఏర్పరిచినట్లుగా,
క్రమం తప్పకుండా, ప్రతి ఆదివారం ...
ఉదయం కుంకుళ్ళతలంటు , మధ్యాహ్నం మంచి మసాలాభోజనం, ఆపై మ్యాట్నీ షో కు ప్రస్థానం.
అప్పుడు నాకు పదకొండేళ్ళు.మా చెల్లెలు ,కమల , నాకన్నా ఏడాదిన్నర చిన్నది.
సినిమా టిక్కెట్లు...బారానా(ముప్పావలా), రూపాయి ,రూపాయిన్నర.
 అమ్మ తలా రూపాయి ,మరో పదిపైసలు బటాణీలో పుట్నాలో కొనుక్కోమని ఇచ్చి పంపేది
మేము పరమబుద్ధి మంతుల్లా బారానా టిక్కెట్టు కొనుక్కొని ,మిగిలిన డబ్బుల్తో గోళీ సోడాలో, మిరపకాయబజ్జీలో ,ఇంకా మిగిలితే పిప్పర్మెంట్లో కొనుక్కునే వాళ్ళం.
తెరకు దగ్గరగా చతికిల బడి, మెడను నిక్కించి నిక్కించి చూసిన సినిమా .... సాయంకాలానికి
సహజంగానే తలనొప్పి వాయినమిచ్చి,ఇంటికి సాగనంపేది. ఆ సినిమాలో నచ్చిన మాటలు వల్లిస్తూ, పాటలు గునుస్తూ , గాలి పోసుకొంటూ ఇంటి దారి పట్టేవారం.
మళ్ళీ ఆదివారం మరో కొత్త సినిమా చూసే దాకా, ఆ మాటలు మా మధ్యనే చెమ్మచెక్కలాడేవి. ఆ పాటలు అల్లాబిల్లి తిరిగేవి..
ఆదివారం తరువాత ఆదివారం, సరిగ్గా ఇదే  తంతు.
అలాంటి ఒక ఆది వారం నాడు, నటరాజ్ టాకీసులో , మేము చూడబోయిన సినిమాలోని కథానాయకుడు అంతకు మునుపు చూసిన సినిమా హీరోల్లా  కత్తుల యుద్ధాలు, కార్ల చేజిగ్ లు లాంటి, హడావుడేం చేయకుండా , సూటిగా తేటగా ,మాటల్తో పాటల్తో ఆకట్టుకొన్నాడు.
పదే పదే "మహాకవి" అన్నాడంటూ అతను మాట్లాడిన మాటలు.., మాకెంత నచ్చాయో చెప్పలేం.
అలా ఆ మాటలతో పాటలతో  పాటు ఆ మహాకవిని ,..
 ఆ  మిట్టమధ్యాహ్నం  పూట ఆ "ఆకలి రాజ్యం(1981) లోంచి" అపురూపంగా అందుకొని,
  భద్రంగా మా వెంట తెచ్చుకొన్నాం.
 ఇకనేం ఉంది,?
మా ఇల్లు దద్దరిల్లి పోయింది.
మా అమ్మ వంటయ్యే లోగా , పలు మార్లు" సాపాటు ఎటూ లేదు "హోరెత్తిపోయేది. .
ఇక, అదే ఉత్సాహంలో ఆ మాటలకోసం,శ్రీశ్రీ  గారి పుస్తకం కోసం ,మాఇంటి పుస్తకాల గూడులో వెతికి చూడగా , అక్కడ, గురజాడ ,కందుకూరి ,జాషువా, తాపీ,కవిరాజు ,పోతన,తిక్కన, గోరా...లతో పాటు అనేకులు తమ రచనలతో బదులుపలికారు . కానీ,  శ్రీశ్రీ కనబడలేదు.
బడిలో "పాడవోయి భారతీయుడా "అంటూ పిల్లలమంతా ఎంతో ఇష్టంగా ఆట కట్టినా,
 "ఎవడువాడు ఎచటి వాడు "అంటూ ఉత్సాహంగా ఏకపాత్రాభినయం చేయబూనినా,
"ఎవరో వస్తారని ఏదో చేస్తారని" మా బడి బెంచీలపై దరువేసినా,"...
“కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుక తో వృద్ధులు "అని మా ఆరోతరగతి అబ్బాయిల్నిఅదను దొరికినప్పుడల్లా  ఆటపట్టించినా,....
"మనసున మనసై" అన్న మా ఆకాశవాణి పాటను అమ్మ తన్మయురాలై వింటున్నా,,,
 “నా హృదయంలో నిదురించే చెలి” అంటూ మా జనరంజని  చల్లని సాయంకాలాలు కూని రాగాలు తీసినా ,,,
అవన్నీ  శ్రీ శ్రీ గారు రాసినవని మాకేం తెలుసు?
అంతెందుకు ?
ఆ “ఆకలి రాజ్యం” ఆసాంతం , అందులోని కథానాయకుడు, కమల్ హాసన్, ధీటైన అభినయంతో,ఘాటైన వాచికంతో వల్లించిన  మహకవి మాటల ప్రవాహపు వొరవడిలో ,ఆ సాపాటు పాటకారి ఆచార్య ఆత్రేయ గారు తన కలాన్ని పరిగెత్తించక తప్పలేదు కదా!
ఆ వరసలోనే ,


కాస్త ముందూ వెనకగా  ,అటు మాభూమి ,ఇటు మాదాల గారు ,అంతలోనే టి. కృష్ణ గారు ,
నరసింగరావు గారు "రంగుల కలలకు "జజ్జనకపాడేసారు కదా.
అలా, సాపాటు పాటలు పాడుకొని సంతోషించే ఆ రోజుల్లో,
ఓ మధ్యాహ్నం లెక్కల తరగతి లో ,
తలలో తన్నుకులాడుతున్న నాలుగు ముక్కలు నోటు బుక్కులోకి ఉత్సాహంగా వొలికించేసా.
"నీతీ నీవెక్కడ?
నిజాయితీ నీవెక్కడ?
విరిగిన పేదల గోడల్లోనా?
పెరిగిన పెద్దల మేడల్లోనా?"
అంటూ పేజీలు నింపేసి  , తెగ బారెడు నిట్టూర్చా.
.పక్కనే కూర్చున్న మా అపర్ణ మంచిది కదా,  వెంటనే మాలెక్కల సారుకి చూపించడం.
లెక్కలు ఎగ్గొట్టి చేస్తోన్న ఘనకార్యానికి ఎక్కడ గోడకుర్చీ వేయిస్తారో అని నేను భయ పడుతుంటే,
భానుమూర్తి మాష్టారు కడుంగడు సంతోషించి,అందరికీ చదివి వినిపించడం.
 ఆ హుషారులో నేను నోటు బుక్కంతా ఆ తరహా చిట్టిరచనలు చేయడం.
కవిత్వం అంటే ఏమిటో ఇప్పటికీ తెలియక పోయినా,.. అప్పటి మా బడి లో తిరుగులేని కవయిత్రినై పోవడం  అప్పుడు భలే గా అనిపించింది..
అలా నేను సైతం కవితలు రాసానండోయ్ ! ..అని చెప్పగలిగానంటే,
ప్రత్యక్షంగా పరోక్షంగా నాలో ఆనాడు అక్షరాగ్ని రగిలించినదెవరంటారు?
నాకు తెలియని ఆనాటి నా పసి ఆవేశభరిత కవితల అజ్ఞాత గురువు గారు ఎవరో మీకు తెలిసిపోయిందిగా?
అక్షరాలా శ్రీ శ్రీ గారే!
***
(ఇంకా ఉన్నది)
20-2-2011
( శ్రీ శ్రీ సాహిత్యనిధి 101 వ సంచికలో ప్రచురణ కాబోతున్నది. త్వరలో. )


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.