Nov 19, 2010

తెలుగు నవల గుండె చప్పుడు

* గ్రామీణ జీవితం*
నూట పాతికేళ్ళ క్రితం సాంఘికప్రబంధంలా కళ్ళు తెరిచిన తెలుగు నవల ,
పల్లె సీమలో పుట్టి ,పంట చాళ్ళలో పెరిగి ,ఏటి గట్లపై నడిచి ,మడిచెక్క కై పోరాడి ,
పిడికెడు మట్టిని  గుండెకు అదుముకున్నది.

తెలుగు నవలానాయకుడు కాడిపట్టి పొలం దున్నుతూనే ఉన్నాడు.
తెలుగు నవలానాయిక నడుం బిగించి నాటు వేస్తూనే ఉన్నది.
తెలుగు నవలల పుటలు నారుమడి తడితో నిండిపోతూనే ఉన్నాయి.

గ్రామీణ జీవితమే ముఖ్యమైన తెలుగునవలల్లోని కథ, వస్తువు,వాతావరణం.

ధవళేశ్వరం అగ్రహారంలో పుట్టిన రాజశేఖరచరిత్రము (1878) నుండి  ముంపు గ్రామ
నేపధ్యమైన దృష్యాదృష్యం (2003) వరకు.
ఈ నడుమ గ్రామీణ జీవితంలో ని కాలానుగత పరిణామాలలోని వైవిధ్యం వలన తెలుగు నవలా వస్తువు విస్తృతమైంది.విపులమైంది.వివరమైంది.
ఆయా రచయితలకు వస్తువుతో ఉన్న సామీప్యత వలన అవగాహన వలన వారి రచనలలో పరిణితి ,గాఢత ,లోతు స్పష్టంగా ప్రకటితమైంది.
రచయితలకు గ్రామీణ జీవితంపై ఉన్న మమకారంతో పాటు ,
గ్రామం మిగిల్చిన తీపిజ్ఞాపకాలు ,చేదు అనుభవాలు వారి అనుభూతులను ఆలోచనలను మూర్తిమంతం చేసాయి.
తమ రచనలకు గ్రామీణ నేపధ్యాన్ని ఆయా రచయితలు ఎందుకు ఎంచుకొన్నారో , వారే చెప్పగలరు.
అయినా, గ్రామం వారిలో అంతర్భాగం కావడం వలనేమోనని అనిపించకపోదు.

ఇంతకూ-
గ్రామమంటే..?

ఊరా?అగ్రహారమా?పల్లా?పలా?పాలెమా? రేవా? దీవా? గూడెమా? గుట్టా?

గ్రామమంటే..?

పొలంపుట్రా? గొడ్డూగోదా?
కోనేటి మిట్టా? కాలువగట్టా?
పండిన పైరా? ఎండిన బోరా?
ఒంటిచెట్టు గుట్టా? యానాది మిట్టా?
దొరల గడీలా? చివరిగుడిసా?
శిఖంభూములా? ఖండిత ప్రాంతమా?

గ్రామమంటే..?

పాడిపంటలు,పండుగలూపబ్బాలు ,సంబరాలుసంతోషాలు ,పెళ్ళిళ్ళుపేరంటాలు ,ఆచారవ్యవహారాలు ,పంతాలుపట్టింపులు ,పెత్తనాలుదోపిడీలు,వర్ణాలు వర్గీకరణలూ,ముఠాలు ముట్టడులు, దౌర్జన్యాలు దౌష్ట్యాలు.

గ్రామమంటే..?

వైవిధ్యం.

ఆ వైవిధ్యం తోనే తెలుగు నవల నిండి ఉన్నది.
ఆ వైవిధ్యమే తెలుగు నవలకు నిండైన 
 రూపాన్ని ఇచ్చింది.
ఆ వైవిధాన్నే తెలుగునవల నిజాయితీగా ప్రకటించింది.

ప్రకటిస్తూనే ఉన్నది!

***

(ప్రపంచ తెలుగు సమాఖ్య వారి ప్రత్యేక అనుబంధం కొరకు వ్రాసిన(28-10-4) వ్యాసం లోంచి కొంత)



 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment