Showing posts with label కథ. Show all posts
Showing posts with label కథ. Show all posts

Sep 5, 2017

పెన్నేటి తీరాన పుట్టిన "దయ్యం"!

మనలో మాట! మడిసన్నాక కుసింత భయమూ ఉంటదండీ ! మన పంతులయ్య ఎన్ని పాఠాలు చెప్పినా, మడిసేగా! భయపడ్డాడు.మనలని భయపెట్టాడు. కూసేపు. అంతే!
ఈ రోజు పంతుళ్ళ పండగ కదా , ఈ పెన్నేటి తీరాన పుట్టిన "దయ్యం" కథ గురించి అందరితో పంచుకోవాలనిపించింది .

https://chandralathablog.wordpress.com/2017/09/05/%E0%B0%B8%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%82/



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jul 9, 2014

ఆ ఆరుగురు

ఎప్పుడు పడితే అప్పుడు
చెప్పాపెట్టకుండా
పెళ్ళున ఎండ కాస్తుండగానే
భళ్ళున విరుచుకు పడుతుందే
వాన...
అలా ఉదయన్నే ఊరి కేబుల్ తెరల మీద తీగలు తీగలుగా వ్యాపించింది...
వార్త.

అంతకు మునుపే నోటా నోటా తిరుగాడిన గాలికబురు, అలా ప్రాణం పోసుకొంది.
***
ఆ పై  ఆ ఆరుగురు"    కథను ఇక్కడ..చదవగలరు.
తానా పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..

http://patrika.tana.org/june-july2014/index.html

TANA Patrika - June-July issue




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 25, 2014

అమాయకత్వంలోంచి ...!!!

ఒక్కో సారి అంతే.
ఒక  గట్టి పట్టుబట్టి కూర్చున్నామా , ఆ పట్టుదలను ఇట్టే గట్టున పెట్టేయాల్సివస్తుంది.
ఎంతయినా మానవ మాత్రులం కదా!
ఈ వేసం కాలం సెలవల్లో ,బుద్ధిగా కూర్చుని చదువుకొందాం అనుకొన్నా.
అలాగే , నిద్రలో పడుతూ లేస్తూ చదువుకొంటూ ఉన్నానా,
Nagavva , Ari Vishvanathan PoodOTa Anna Mary
రమేశన్న ఆహ్వానం."అమ్మా మీరు హోసూరు రావాలని."
 చాలా వినయంగా రానన్నానా ,అప్పుడు వారొక రహస్యం చెప్పారు.
మా అయ్యవారు వారికుటుంబ సమేతంగా విచ్చేయువారని !
పంతులుగారే పయనమవుతోంటే, ఇక చదువెక్కడ..? కొండెక్కింది.
బుద్ధిగా ఒట్టుతీసి గట్టున పెట్టి, వచ్చేస్తానని గబుక్కున ఒప్పేసుకొన్నా.
 వూరక పిలవరు కదా మహానుభావులు !
ఒక పుస్తకం పంపించి , నాలుగు ముక్కలు మాట్లాడమన్నారు.
 మరీ మంచిది.రేపొద్దున వస్తినమ్మ పోతినమ్మ అనుకోకుండా..నాలో నాకు కుసింత మనశ్శాంతి.
తీరా ఆ పుస్తకం వచ్చాక చూస్తే ,అందులో పది పుస్తకాలున్నాయ్!
హోసూరు కతల పై  డా. రాయదుర్గం విజయ లక్ష్మి గారు చేసిన రేడియో ప్రసంగాలు.
ఒక్కో ప్రసంగ వ్యాసం చదువుతూ ఉంటే , ఆయా పుస్తకాలు నా కళ్ళ ముందు బొమ్మ కట్టాయి. మానవ మనుగడలోని మర్మాలనూ సంఘర్షణలనూ... నవ్వుతూనే నిలదొక్కుకొన్న విషాదభరిత జీవితాలను. జీవితగమనంలో మానుపు కున్న గాయాలను. ఆ మానవ స్పర్షే ముఖ్యంగా నన్ను ఆకర్షించింది .ఇక, అందులోని నుడి నానుడి ఎత్తుగడ కథాకథనాల సంగతి సరేసరి.
"ఇవి కథలా?  సామాన్య సమీకరణాలలో కాకపోవచ్చు." ఉమా మహేశ్వర రావు గారు అన్నారు. " కథలకన్నా జీవితం విస్తృతమైనదనీ లోతయినదనీ గాఢమైనదనీ, ఈ రచనలు సవినయంగా తెలియజేస్తాయి . దానికి అవసరమైన కథన విధానాలను అది వెతుక్కోనే క్రమంలో విరిసిన కథాసుమాలనీ" 
రమాసుందరి గారు పట్టుమని పంతొమ్మిదేళ్ళు లేని సుమ , పొయ్యిగడ్డను అడ్డుగా పెట్టుకొని ఆవిష్కరించిన జీవితం సుమ ప్రజ్ఞాపాటవాలతో పాటు బోలెడంత అమాయకత్వంలోంచి వొలికినదని వ్యాఖ్యానించారు.
నిజం.
ఆ పూట వెళ్ళగానే, అక్కా అని  నోరారా పలకరించి , ప్రతి అవసరాన్ని  కనిపెట్టుకొని ఉన్న్ అమరనారా బసవ రాజు గారు  కానీయండి , మునిరాజు గారు కానివ్వండీ , ఓట్ర పురుషోత్తం గారు కానివ్వండి .... ఆప్యాయత ఆర్తి లతో పాటు, అంతులేని నమ్మకాన్ని కలిగించారు.  మానవ జీవితం పట్ల ఆపేక్ష , మానవ సంబంధాల పట్ల మమకారం ఉన్నవారే కదా మంచి రచయితలుగా ఎదగ గలరు!
ఇక, నంద్యాల నారాయణ రెడ్డి గారి చెణుకుల గురించి చెప్పేది ఏముంది ? నవ్వుతూ నవ్విస్తూ ,  గుండె చెలమల్లోంచి కళ్ళల్లోకి నీళ్ళు చిప్పిల్లేలా చేయగల రచయిత.మానవ సంబంధాల పట్ల అంతులేని గౌరవం.
ఆ రాత్రి డా.అగరం వసంత్, నీలావతి గార్ల ఇంట బస. పాలపూరీలతో పాటు కమ్మని భోజనం. కబుర్లు.
పూదోట తోడికోడళ్ళు అన్నా మేరీ, శౌరీలు  గార్ల తరతరాల కబుర్లు. సుహాసిని ముక్తాయిపులు. అనూరాధ విదేశాల్లో తెలుగు వాళ్ళ కబుర్లు.
 ఇక, మరునాడు ఉదయాన్నే ,వసంత్ గారు సువాసనల ఆకుతోటకు నడక.దారిలో పందుల పెంపక కేంద్రం చూడడం.
కైవారం నారాయణ తాత మండపానికి వెళ్ళడం. అక్కడి స్థంభాలపై  శాశ్వతీ కరించ బడిన తెలుగు పలుకులను చూసి సంతోషం. 
మాతో జతచేరిన ఉడుముల పేట తెలుగు యువబృందం , కవిత వసంత్ దంపతులు , మీసాలు మెలేస్తూ..విశ్వ నాధ నాయకుడు.
ఇక, ఇరులదొడ్డికి ప్రయాణం. గద్దల బండను దాటి . వీరప్ప శివణ్ణ లు దారి చూపుతుండగా , నాగవ్వ ఇంటికి ప్రయాణం.
నారాయణ రెడ్డిగారి ఇరులదొడ్డికతలలో , నాగవ్వ, మోటన్నలు ప్రధాన పాత్రలు. ఆలమందలను మేపుకొంటూ, ఆ మేలగిరులకు చేరిన వైనం, అక్కడే నిలిచి ,కొండకొమ్మున ఒక వూరిని నిర్మించుకోవడం, ఇరుల ( సుగాలీలతో ) వారితో పరస్పర సహజీవనం.
నారాయణ రెడ్డి గారు తాము అడవిని చదును చేసి ,సాగు చేసిన భూమిని చూపిస్తున్నప్పుడు ,తన స్నేహితుడితో కలిసి తవ్వుకొన్న బావిని చూపిస్తున్నప్పుడు .. ఒంటరిగా ఓ బండమీద నిలబడి తప్పెటలు కొడుతూ ఏనుగులను తరిమి కొడుతూ ,పంటను కాపాడుకొన్న పోరాటాన్ని గురించి చెపుతున్నప్పుడు.. ప్రకృతితో మనిషి పోరాటంలా తోచింది.
పాండవ గవులు లో పార్థీవ శరీరాలను విడిచిపెట్టే వైనం , దయ్యాల కోనపై కమ్ముకొన్న భయాలు, దారి పక్కన తారస పడిన దేవకన్యతో పరాచికాలు ... ఒకటా రెండా అక్కడ ఏ రాయిని కదిలించినా కమ్మటి కబుర్లు.
కప్పిన నూలుకండువాలు. అక్కడ పూచిన గుబాళించే  పూలగుత్తులు. 
కమ్మని భోజనం .నాగవ్వ మోటన్నల ఆతిధ్యం ,సాయంకాలం సంగీత ఝరి,  
దక్షిణాదిన తెలుగు వారి  ఇబ్బందులు ఇక్కట్లు ఇష్టాఇష్టాలు.
 వెరసి హోసూరు కతల పండుగ!
మళ్ళెప్పుడు ఆహ్వానం వస్తుందబ్బా అని ఎదురు చూస్తూ,
అప్పటిదాకా తోడుగా పద్నాలుగు పుస్తకాలను తెచ్చుకొన్నా.

మరి మీరు ?
At the statue of KOdanda Ramayya garu

poddunnE poolu 

taaTibellam acculu 

poyogada katalu aavishkaraNa

porugu telugu batukulu aavishkaraNa.

sabha 


maa dakshinaadi gODu vinanDi

suvaasanala aakutOTa 

Dr. Agaram Vasanth ,Neelavathi gari vaakiTlO


gaddala banda 

maa vooLLO Telugu nErpanDee !



venakaala lOya deyyaalakOna

paandava gavulu

ententa ettO choosaaraa?

Otra Pushottam garu

irula paaTa 

raati kanche daaTu

dEva kanya tO paraachkaalu


sangeetham 




Related links: http://prabhavabooks.blogspot.in/2014/05/blog-post_24.html

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Feb 6, 2014

తొలికతలు ,ఒక ముచ్చట !

"అవును గదా,అమ్మలగన్న అమ్మ ఎవరూ అని కనిపెట్టే పని ఏ నరమానవుడికైన సాధ్యమయ్యేదేనా?" 
విషయమేంటో తేల్చుకొందామా? తెలుసుకొందామా?
ఇంకేం మరి ..తిన్నగా ప్రభవకొచ్చేయండి!
ఈ ఆదివారం ఉదయమే! 
మర్చిపోకండి!

http://prabhavabooks.blogspot.in/2014/02/blog-post.html

కతమ్మ వడిలో కాసేపు..!




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Feb 20, 2012

అవును కానీ

నిరక్షరాస్యులు,అవగాహన లేని వ్యవసాయదారులవద్దకు ఈ కథలోని అంశం తీసుకుని వెళ్ళ గల్గినట్లు వ్రాసి ఉంటే  ...
ఇది చైతన్యవంతమైన కథ అయి ఉండటానికి నూటికి నూరు శాతం అర్హత ఉన్న కథ. కానీ...., 

విశ్లేషకుల అభిప్రాయం మీరు స్వయాన ఇక్కడ చూడ వచ్చును.

http://vanajavanamali.blogspot.in/2012/01/3.html

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 11, 2010

పిల్లల కలాలు

క్రమం తప్పక ప్రతి ఏడాదీ కొత్తగూడెం క్లబ్ నిర్వహణలో జరిగే బాలోత్సవ్...ఒక పిల్లల పండగ.
అందులో కథ చెప్పడం,రాయడం, విశ్లేషించడం ఒక ముఖ్యమైన భాగం.

గతఏడాది జరిగిన కథారచన కు ముందు, పిల్లలతో .. వోల్గా, వాసిరెడ్డి నవీన్, శిరంషెట్టి కాంతారావు,అక్కినేని కుటుంబరావు,భగవాన్, చంద్రలత, ముళ్ళపూడి సుబ్బారావు  తదితరులు మట్లాడారు.
కథారచనలోని మెళుకువల గురించి.విషయనేపధ్యాల గురించి. భాష గురించి. అనేకానేకం.

సుమారు వందకు పైగా కథకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో కొన్ని రచనలను ఇకపై వరసగా మీరు చదవ వచ్చును.
 ఇవి పిల్లల రచనలు. మీ అభిప్రాయాలు సూచనలు వారిని కలాలను మెరుగు పరచడానికి ఎంతైనా మార్గదర్శకాలు కాగలవు.ధన్యవాదాలు.
అందులో ఈ అద్బుతశక్తులు

http://prabhavabooks.blogspot.com/2010/08/blog-post_11.html
అన్న  రచన మొదటిది .
వీటినీ, మరి కొన్ని చిట్టి రచనలనూ ఇక్కడ చదవ వచ్చును.
http://prabhavabooks.blogspot.com/


శిరంషెట్టి కాంతారావు,వాసిరెడ్డి నవీన్, వోల్గా, అక్కినేని కుటుంబరావు  గారలు  మరియు  చంద్రల


***
డా. వాసిరెడ్డి రమేష్ గారు మరియు ఇతర పిల్లల శ్రేయోభిలాషులు, కొత్తగూడెం క్లబ్,కొత్తగూడెం వారికి నమస్సులతో ***.

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jul 3, 2010

గుట్టెనుక 3

<<గుట్టెనుక1,2 చదివాక ,ఇక మిగిలినది>>
"పొద్దున్న వొచ్చాడు. కసువులు చిమ్మను పోయిన మనిషికి కంచెలో దాక్కోని కనబడ్డాడు. భయపడి కేకలు పెడతా వొచ్చింది. చూద్దుము కదా. ఇతను. మాసిన గడ్డము, చింపిరి జుట్టు, ఖైదీల బట్టలు .కాళ్ళకు చేతులకూ బేడీలు.పిల్లలు భయపడి పోయారు.ఎక్కడొళ్ళక్కడే ఉరుకులు బిత్తరపడి నిలువుగుడ్లేసారు. మేమే వచ్చి అందరినీ లోపలికి పంపాం.

"ఏమ్మా, ఎవరికైనా హాని జేసినాడామ్మా?" మాటలు కుక్కుకొంటూ మెల్లిగా అడిగాడు ఆదెయ్య.
"ఊహు, కానీ,ఉదయం నుంచీ అక్కడే ఉన్నాడు.ఉలుకు పలుకు లేదు. అతనికే ఏదన్నా హాని చేసుకొంటాడేమో నని ఇన్స్పెక్టర్ గారికి కబురు పెట్టం..వాళ్ళ మేనమామలొచ్చారు. పిల్లోడు సాక్ష్యం చెప్పినందుకు  వాడిని చంపే దానికే వొచ్చాడనీ.."
ఆదెయ్య ఉన్న చోటనే కుప్ప కూలిపోయాడు. "ఇందరి కళ్ళల్లో ఇంత కిరాతకుడై పోయినాడా నా బిడ్డ.."
"వాళ్ళు కేసులు కూడా పెట్టారు" ఇన్ స్పెక్టర్ అందించాడు.
"పిల్లవాడికీ అదే చెప్పారు"ఆయ్యవోరమ్మ అంది. “ఇలాంటివి బడి దాకా రాకూడదు . వచ్చింది. ఏమి చేయడమా అని?” ఆమె కాస్తాగి అంది, "చుట్టూ గుంపు చేరి పోయింది. తలకొక మాట.దానికి అడ్డూ అదుపు లేదు కదా?
వాళ్ళ మేన మామలూ ఎక్కడ విరుచుకుపడతారో.."ఆమె ఆగి,ఆదెయ్యతో మెల్లిగా అంది,"మీరొక సారి మాట్లాడి రండి.అసలు ఎందుకింత రిస్క్ తీసుకొన్నాడో.అతని ప్రాణానికే అపాయం కదా"
ఆదెయ్య ఇన్ స్పెక్టర్ వంక అనుమానంగా చూసాడు. అయ్యవోరమ్మ అప్పటికే ఏమి మాట్లాడి ఉందో కానీ , అతను మౌనంగా చూస్తూ ,వెళ్ళమన్నట్లు తలాడించాడు.
కంచె దగ్గరకు రాగానే ,ఆదెయ్య కడుపులో పేగులు మెలి తిరిగినట్లయ్యింది. ఎంత ముద్దుమురిపెంగా పెంచుకొన్న బిడ్డ..క్షణాళ్ళో బతుకు బుగ్గిపాలెయ్యనే, ఇంత మంది నడుమ హంతకుడిగా కిరాతకుడిగా.. ఆ ముళ్ళల్లో ఆ కంపల్లో ..పడి... ఆదెయ్య తువ్వాలును నోట్లోకి మరింత కుక్కుకున్నాడు. వణుకుతున్న కాళ్ళతో మెల్లిగా దగ్గరికెళ్ళాడు.
"ఏమిరా ఇట్టా జేస్తివి ?" మాట్లడాననుకొన్నాడు. మాట పెగలలేదు.
“బుడ్డొడికి ఒక మాట చెప్పిపోదామని వొచ్చినా నాయినా , నీ మాట చెవిన బెట్టలే .. మాటిమాటికీ ఆలోచిస్తాంటే ఒక్కో మాటా తెలిసొస్తాంది నాయినా, పోయినణ్ణాల్లూ  గొర్రెలదాటునబోయినాను. ఈ పొద్దు నిలబడి ఆలోచన జేస్తే, ఇనుకొనే దానికి ఎవరూ లేరు.చెప్పకుంటే ,ఆ బాధ తొలిచేస్తాంది ,నాయినా.” కొడుకు మెల్లిగా మాటలు కూర్చుకొంటా అన్నాడు.” ఆదెయ్యకు ఏమీ తోచలేదు. కంచెవైపుగా నడిచాడు. మాటన్నా స్పష్టంగా విందామని..
“ ఈ కొండలుబండలు పనికి మాలినావని ఎద్దేవాజేస్తిని .తాతలకాలం నాటివనీ తలనుబెట్టుకోవాలనీ నీవుజెప్పినా చెవిన బెట్టలే. అవిప్పుడు ఇనుమో బంగారమో ...కానీ ..మన బతుకులు బండలు జేసి అవి మట్టి పాలవుతున్యాయి.ఆ మట్టి ని సొమ్ము జేసుకొన్నోలు మహరాజుల వుతున్నారు. ఇక, ఆప తరం కాదు. కాపలా కాయల్సినోళ్ళే కండ్లళ్ళ కారం కొడుతున్నారు.కనురెప్పల్ని కత్తిరించుకుబోతున్నారు.భూదేవమ్మ పొదుగు కోసుకుపోతున్నారు,నాయినా, పట్టపగలు.నిలబడి అడిగే మొనగాడే లేకుండా బోతున్నాడు.నా బిడ్డకు వొట్టిపోయిన నేలను బండనూ కొండనూ ..ఇయ్యాల్సిందేనా ?"
"బుడ్డోడు వానికా గమనం ఏడుంటాదిరా? నాకూ నీకే ల్యాక పాయే.." ఆదెయ్య ఎలాగో గొంతు పెగల్చుకొన్నాడు.
"ఆళ్ళమ్మ నేరం ఏమీ లేదు. నేరం జేసినోన్ని నేను. నా తప్పు నేను అనుభవించాల్సిందే. నన్ను చేతకానోన్నిజేసిన కాలానిదే కనికరం లేదు. నాలాగా వాడు కారాదు నాయినా , ఎట్టా జేస్తావో.. ."
మాట మాటగా ఉండగానే అతని తల మీద బావ మరిది చేతి కర్ర విరిగింది.పోలీసులు చుట్టుముట్టారు.
ఆదెయ్యను పక్కకు నెట్టారు.
బుడ్డోడ్ని తండ్రి దగ్గరకు తీసుకువస్తోన్న అయ్యవారమ్మ ,అక్కడే ఆగిపోయింది.
 బుడ్డోడ్ని కళ్ళారా చూడకుండానే ,నోరారా పలకరించకుండానే, గుండెల్లో గుబులు పంచుకోకుండానే , అతన్ని పట్టుకువెళ్ళారు. రెట్టలు విరిచి జీపునెక్కిస్తుంటే కొడుకు దయనీయంగా అడిగాడు, ఆ ఒక్కమాట వానికి జెప్పు నాయినా ,ఏ పొద్దుకైనా !”
 జీపు లో  వెళుతున్న కొడుకు కన్నీళ్ళ నడుమ సాగనంపి వెను తిరిగిన ఆదెయ్య ను దాటుకొని ,సెల్లు టవర్ స్తంభాలను మోస్తున్న లారీ దాటి పోయింది.ఆ వెనుకే బుల్డొజరూ. కొండను తవ్వి తలకు పోసుకొనే పొక్రెయిన్లూ ట్రక్కులు.
 “ఏ ఒక్కమాట ? వాడంటే ఎవడు? ఒక్కడా? పదిమందా? ఏ పొద్దులోపల జెప్పలా?ఎవరికి జెప్పాలా? జెప్పు. నీ కొడుకు ఏమి రహస్యాలు జెప్పి పోయినాడు?” అక్కడ ఆగిన పోలీసులు ప్రశ్నలతో ఆదెయ్యను చుట్టుముట్టారు. అంతకన్నా కోపంగా కొడుకు బావమరుదులు బంధువులు ముసురుకొన్నారు.
కొండ మీద  ఎవరో పెట్టిన పొగ ఊరంతా కమ్మింది.ఉక్కిరిబిక్కిరి జేసింది.ఎక్కడి వారక్కడే ఆగి పోయారు.
ఆదెయ్య నిలువు గుడ్లేసుకొని కొడుకు మాటలు మననం చేసుకొన్నాడు. కొడుకు మాటలు అతనిలోకి ఇంకి పోయాయి. లోలోనకు ఇమిడిపోయాయి . అప్రయత్నంగా ఒక పదం అతని గొంతులో గుర గుర లాడింది.
"గుట్టెనుకా...."
<<<అయిపోయిందనే! >>>

సురభి పత్రిక ప్రారంభ సంచికలో ప్రచురితం. సంపాదకులకు ధన్యవాదాలతో.
______

1.టివి 2. రేడియో 3. రంగురెక్కల పురుగు


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jun 28, 2010

గుట్టెనుక 2

మాటే , తమ కోడలికి భూదేవమ్మ నయానా భయానా నచ్చ చెప్పి చూసింది. గుట్టుగా రట్టు కాకుండా అన్నీ చక్కబెట్టాలనీ చూసింది ఒంటి చేత్తో. అమ్మణ్ణి తప్పు కూడా ఏముంది?
 కొత్త మోజులోనేమి ,మంచి మనసుతోనేమి, మొదటంతా వీడు ఆ పిల్లను నెత్తిన బెట్టుకు గారాబం జేసే. వారమంతా పట్నాన ఏమి వొళ్ళు ఇరుసుకోనేటోడొ గానీ, శని వారం రాత్రికి గుట్టెడు ఆశలతో సంసారానికి తిరిగి వొచ్చేవాడు. ఆఖరి బండిలో.
కొంత కాలానికి, కోడలిని పట్నం తీసుకు బోయి కాపురం పెట్టాడు.భూదేవమ్మ పోయొచ్చి కతలుకతలుగా  చెప్పేది.
బొమ్మలపెట్టెలు<1>, మాటలపెట్టెల <2 >గురించి .అయ్యన్నీ సరేగానీ, ఇట్టా కొండగాలి పోసుకొనే తనకు , అగ్గిపెట్టిలాంటి కొంపల్లో బింగన్న<3 >లా కాళ్ళుచేతులు ముడుచుకు కూర్చోవడం మింగుడుపడక , తట్టు పోలేదు.
తన కొడుకు చేసే మొనగాడి పనేంటో  కళ్ళారా చూసి రావాలనీ తనకి మాత్రం గుండె కొట్టుకులాడలేదూ? కొడుకు పనిమంతుడు అయితే తండ్రికే కదా గర్వమూ గవురమూ !
అనుకుంటుండగానే, వాడి పనే , మూలన బడింది.
“సెల్లు ఫోనొచ్చింది. వైరులెస్సు వొచ్చింది. “అన్నాడు వాడు
“అవేమిరా “అని భూదేవమ్మ  అంటే ,”మీకు తెల్దు పోమ్మాఅనేవాడు.కానీ, వాటి దెబ్బ ఏంటో తమకే ముందు తెలిసి వొచ్చింది.
 చుట్టలు చుట్టలుగా కేబుల్ వైరు కొండచిలువ చుట్టుకున్నట్లు తమ వూరిని చుట్టేసింది.
 ఒక్కోడు ఇంటిముఖం బట్టాడు. వొచ్హినోడు వొచ్చాడా రానోడు అక్కడ తిప్పలు బడ్డడా ..ఎవరికి అనువైన పనిలోకి వాళ్ళు బోగా, కూసోని తీరుబడిగా కాపురం చేస్తున్న తన కోడలు లాంటొళ్ళు కష్టాన బడ్డారు. ఒక్కోడు ఒక్కో దిక్కు .ఒకరికి ఒకరు మాట సాయం చేసుకొనే సమయంకూడా దక్కలేదు.ఎవరికి వారు ఒంటరి వారయి పోయారు.
 పూట గడవని స్థితి.పరిస్థితి చేతిలో ఉండగానే ,తమ కొడుకు  భూదేవమ్మను పిలవనంపి కోడల్నీ బుడ్డొడ్నీ ఇంటికి పంపాడు. తెలివిగల బిడ్డ. వాడికి తోచినది చేసాడు. అయితే ఏమి ,సుఖాన నిలిచిన తోడు కష్టాన నిలవలేక పోయింది.  నునుపు బండల మీద  నడుస్తూ  నాజుకు పనులు చేసిన మనిషి  కొండపల్లెలో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
ఆమే తప్పేమీ లేదు. వారానికి ఒక మారు వచ్చే మగడు నెలకో రెన్నెళ్ళకో రాసాగాడు. ముద్దుమురిపెంగా పలకరించే వాడు కస్సుబుస్సు లాడగాడు.చీరారవికా పండూఫలము తెచ్చేవాడు పిడిగుద్దులు తెస్తు న్నాడు. ఎత్తిపొడుపులూ ఏడుపులు  .కాపురం కన్నీళ్ళపరమైంది. కరకరలు మెరమెరలు.  ఒకరంటే ఒకరికి కంటిలో నలుసు యవ్వారమైపోయింది. కన్నవారిగా చూస్తూ ఉండడమే కానీ, కల్పించుకొనే , వీలు లేకుండా బోయింది.
అట్టాంటిది, ఒకనాడు ఇద్దరూ గుట్టుగా కలిసివచ్చారు. వారితో పాటే ఒక పట్నం సారొచ్చాడు. మళ్ళీ వ్యవహారం సర్దుకొన్నట్లే తోచింది కొన్నాళ్ళు. దాచితే దాగే విషయం కాదు కదా .మా బోడికొండ వాలుచెలక ను గుట్టుగా వారికి బేరం పెట్టినట్లు తెలిసింది.గుండె చెరువయ్యింది.లబోదిబోమన్నాడు.
 “పనికి మాలిన కొండల్నీ బండల్నీ ఎన్నాళ్ళు పట్టుకు వేళ్ళాడుతాం?ఇదుగో సారోల్లు.మంచోల్లు. వాళ్ళేదో ముచ్చట పడుతున్నారు.మనకు మంచి బేరం చిక్కింది. దక్కిందే పరమాన్నం కదే నాయినా"  
 అవి పనికి కొండలూబండలూ కావురా భూదేవమ్మకు గుండెలురా..! పొదుగు నరుక్కుంటార్రా ?వాటిని పరాయిపాల్జేయకురా.." ఆదెయ్య ఆక్రోశించాడు.
ఆదెయ్య మాటలు గాలిలో తేలిపోయాయి. కాగితం మీది రాతలే నిలబడి పోయాయి. కుసింత చెలకముక్కా ,ఆ వెనుక బోడికొండా పరాయిపాలయ్యాయి.
అయినా, కొడుకు అనుకున్నది అమలు జేసుకున్నాడు
.వానచుక్క ముఖమెరిగి ఎన్నాళ్ళో.గొర్రెలబయలు తప్ప , ఆ కొండవాలున పిడికేడు పంట ఇంటికి మోసిన పాపాన బోలేదు. వాని మాటనే బోతేపోలా’ అనుకున్నారు తనూ భూదేవమ్మ.
మళ్ళీ మాములు రోజులు వచ్చినట్లు కనబడ్డాయి. కుసింత చెలకముక్కా , వెనుక బోడికొండా పరాయిపాలయ్యాయి.కానీ,కొడుకు సంసారం కుదుటబడ్డట్టే తొచింది.
బోడికొండ మీద టవర్ నిలపాలనీ ,తవ్వకాలు జరపాలనీ , పట్నం సారు రాకపోకలు ఎక్కువయ్యాయి. తన కొడుకును పని మీద పని మీదా పట్నం పంపుతూ ఉన్నాడు. కోడలు అతనికి దగ్గరయ్యింది. అది, ఏకంగా ఎవరికంట పడకూడదో , వారి కంటే పడింది.
ఆదెయ్య తల విదుల్చుకొన్నాడు.
 అందరం అనుకున్నాం . ఇలాంటిదేదో జరుగుతుందనీ.
అయినా , ఆపద రాకుండా ఆపలేక పోయాం.
ఆదెయ్య కంట్లో నీటిచెమ్మ. చేతిలోని కొడవలి ఖణేళ్ మంటూ బండ మీద పడింది. ఆదెయ్య గమనానికే రాలేదు.
"తాతా , ఈడున్నావా ..ఎతికెతికి వొచ్చా" ..వొగరుస్తా అన్నాడు కిష్టప్ప పెద్దకొడుకు ,
"దేనికిరా ?" ఆదెయ్య ఆరా తీశాడు, “ఇందాకడి నుంచి కేకేస్తంది నువ్వట్రా?"
" పెద్దయ్యోరమ్మ నిన్ను ఉన్నోన్ని ఉన్నట్టే ఎంటబెట్టుకు రమ్మంది .మామొచ్చాడు. జైలుకు బోతాంటే తప్పించుకున్నాడంట. బుడ్డోడ్నిచూడను బడికాడికొచ్చాడు”
ఆదెయ్య గుండె గుభేలంది. గొర్రెల్ని అదిలిణ్చడం మాని , బక్కటెద్దు పగ్గం వొదిలేసి , కిష్టప్ప పెద్దకొడుకు వెనక వడివడిగా అడుగులేసాడు. గుండె తపతప కొట్టుకొంటుంటే.
“బుడ్డోడ్ని పలకరిస్తే మక్కెలిరగతంతామని వాల్లమేనమామలొచ్చారు.  ఊల్లో వాల్లంతా దడిగట్టినారు.అయ్యవారమ్మ కు ఎటూ తోచక నిన్ను పిలవనంపింది.పద పద."
ఆదెయ్య గుండె మెలిపెట్టినట్లయ్యింది. కన్నబిడ్డను పలకరించు నోచని పాపాత్ముడైనాడమ్మా నా బిడ్డ!
తువ్వాలును నోట్లో కుక్కుకుంటా.. పరుగులు పెట్టాడు.కిష్టప్ప కొడుకు వయసుమీదుండే..వాడు బాణం లా దూసుకు పోయాడు.
ఒకే ఒక్క చెంపపెట్టు. గింగిరాలు తిరుగుతూ ఆమె నేలకొరిగింది. మళ్ళీ లేవలేదు. ఒక బొట్టు రక్తం చిందలేదు. ఒక్క నరం చిట్లలేదు. బతుకులు బండలయ్యాయి. వాడి కోపం ,ఆక్రోశం  వాడిని కబళించివేసింది. అంతా క్షణాల్లో.అందరం చూస్తుండగానే. . కోడలి ప్రాణాలు గాలిలోకలిసిపోయాయి. కొడుకు కటకటాల పాలయ్యాడు. బుడ్డోడు తండ్రి చేసిన పనికి ప్రత్యక్ష సాక్షి.
పట్నం సారు ఎటుబోయాడో కానీ, బుడ్డోడ్నికోడలి అన్నదమ్ములు చంకనబెట్టుకు పోయారు.
కొడుకును కోడలనీ మనవణ్ణీ పోగొట్టుకొని అనాథలయ్యారు తనూ భూదేవమ్మ.
ఆదెయ్య బడి దగ్గరికి వెళ్ళేసరికి , ఒక పక్క పోలీసులు ,మరోపక్క బుడ్డోడి మేనమావలు .వింతనుజూస్తా ఊరిజనం.
పడతా లేస్తా కొడుకు దగ్గరికి పోబోయాడు.
 చిన్నాయ్యవోరమ్మ మధ్యలోనే అడ్డొచ్చింది.పెద్ద అయ్యవోరమ్మ గదిలో కి తీసుకు వెళ్ళింది.అక్కడ  పంతుళ్ళు పంతులమ్మలు ఇన్స్పెక్టరు ..అందరూ ఉన్నారు.
"పొద్దున్న వొచ్చాడు. కసువులు చిమ్మను పోయిన మనిషికి కంచెలో దాక్కోని కనబడ్డాడు. భయపడి కేకలు పెడతా వొచ్చింది. చూద్దుము కదా. ఇతను. మాసిన గడ్డము, చింపిరి జుట్టు, ఖైదీల బట్టలు .కాళ్ళకు చేతులకూ బేడీలు.పిల్లలు భయపడి పోయారు.ఎక్కడొళ్ళక్కడే ఉరుకులు బిత్తరపడి నిలువుగుడ్లేసారు. మేమే వచ్చి అందరినీ లోపలికి పంపాం.
"ఏమ్మా, ఎవరికైనా హాని జేసినాడామ్మా?" మాటలు కుక్కుకొంటూ మెల్లిగా అడిగాడు ఆదెయ్య.
"ఊహు, కానీ,ఉదయం నుంచీ అక్కడే ఉన్నాడు.ఉలుకు పలుకు లేదు. అతనికే ఏదన్నా హాని చేసుకొంటాడేమో నని ఇన్స్పెక్టర్ గారికి కబురు పెట్టం..వాళ్ళ మేనమామలొచ్చారు. పిల్లోడు సాక్ష్యం చెప్పినందుకు  వాడిని చంపే దానికే వొచ్చాడనీ.."
ఆదెయ్య ఉన్న చోటనే కుప్ప కూలిపోయాడు. "ఇందరి కళ్ళల్లో ఇంత కిరాతకుడై పోయినాడా నా బిడ్డ.."

( "సురభి" ప్రారంభ సంచికలో ప్రచురితము)

<<<<సశేషం >>>>



 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jun 27, 2010

గుట్టెనుక 1

"గుట్టెనుక  దొంగల ముఠా  ...గజ్జెలమోనారే

 తరిమికొట్ట వొస్తవా చెల్లే ...గజ్జెలమోనారే "
ఆదెయ్య తన ఒక్కగానొక్క బక్కటెద్దును ముల్లుగర్రతో అదిలిస్తూ ,అడుగడుక్కో పదం పలుకుతూ ..మెల్లిగా నడుస్తున్నాడు. వెనకే, అటో అడుగూ ఇటో అడుగూ వేస్తూ గొర్రెల దాటు.
"  తాతా " ఎవరో పిలిచినట్లయ్యి, వెనక్కి తిరిగి చూశాడు.కనుచూపు ఆనే మేరలొ ఎవరూ లేరు.
ఎవరో పిలుస్తున్నారు.ఎవరినో మరి.
మునుపటి కాలంలో  కో  అంటే కోటి మంది ”. ఇప్పుడు గొంతు చించుకొన్నా బదులు పలికే దిక్కే లేదు.
"" మనిషి ఉన్నట్లుగానే ఆదెయ్య కేక వేశాడు.చుట్టూ ఉన్న కొండల్ని తాకి , ముసలి గొంతు మురిపెంగా తిరిగి వచ్చింది.
"ఈడ" ఆదెయ్య చుట్టూ చూశాడు.సరిగ్గా బోడికొండ మొదట్లో చిట్టికేసర చెటు మొదట్లో ఉన్నాడు."బోడికొండ
మొదట్లో కి రాండి " బిగ్గరగా కేకేసాడు.  గాలివాటున మాట ఎటు చేరిందో కానీ, మనిషి మాట మళ్ళా వినపడలేదు.
"అంతా ఇడ్డూరం.అసలు మనిషి మాటేనా తను మతి తప్పి ఇన్నాడా? ఆవంతన అరిచిన మనిషి అజాపజా లేడు!" ఆదెయ్య తన బక్కటెద్దుతో వాపోయాడు,"ఒరే సాంబా, చూడరా.. ఎట్టాంటి కాలం చూడాల్సి వొచ్చిందో ! కొండ మీద
కో అంటే కోటి మంది .ఇప్పుడు దిక్కుదెన్నూ లేదు.మాయదారి కాలం!" చెవి వెనకాల భద్రంగా దాచిన బీడీ ముక్కను తీసాడు.చివర కొరికి తుపుక్కున ఊశాడు.
ఆదెయ్య తోలుకొచ్చిన గొర్రెలు అటొకటి ఇటొకటి.తమ పనిలో తాము .తలలు వొంచుకొని .తపస్సు చేస్తున్నట్లుగా.
పగిలిన రాళ్ళ మధ్యన పచ్చిక పరక కోసం ఆత్రంగా వెతుకుతున్నాయి.ఆవురావురున దేవులాడుతూ.
"ట్.. ర్ర్.. ర్ర్.. హ్హె హ్హే.. "  ఆదెయ్య పలకరించాడు.
నింపాదిగా నిలబడ్డ గొర్రె ఒకటి మెడ నిక్క బొడిచి ,"మే" అంటూ బదులిచ్చింది.
"చూశా ... దాని వొయ్యారం!" ఆదెయ్య తెగ మురిసి పోయాడు.
ఎండలింకా ముదర లేదు. అయినా , పెద్దచెట్లన్నీ ఎండుముఖం పట్టాయి.ఆకులన్నీ రాలిపోతున్నాయి.గుట్టలన్నీ ఎండుటాకుల కుప్పల్లా ఉన్నాయి.
ముల్లుగర్ర చివరన వంకీలా కట్టిన పిడి లేని కొడవలిని ,రాతి మీద సాన బెట్ట సాగాడు.
కాగిన బండ.కరకర ఎండ.మొద్దు కొడవలి.
ఒక వింత ద్వని.ఆగి ఆగి. రాచి రాచి. కొండల్ని చుడుట్టూ.ఆదెయ్య చుట్టూ తిరుగుతోంది.
ఆదెయ్య బీడీని వెలిగించ కుండా ,చివరను నోట్లో ఆడిస్తూ ,గొణుగుతూ ,కొడవలి సాన పెడుతూ ఉన్నాడు.
కొండ వొడిలో ఒదిగిన ఒక్కో గుర్తూ ఆదెయ్యను ఆగి ఆగి పలకరించసాగింది.
కొండల్లోని డొంకలూ తోవలూ అన్నీ ఆదెయ్యకు తెలుసు. రాళ్ళూరప్పల్లో  ఎగురుతూ,  కోతి కొమ్మచ్చులు నేలాబండలు చిర్రాగోనెలు ఆడుతూ పెరిగాడు. కొండకి ఆవలి వైపున ఉన్న గంగానమ్మ సాక్షిగా భూదేవమ్మను పెళ్ళి చేసుకొచ్చాడు.
మంచైనా చెడైనా ,మాట రానీయకుండా, మాట పడకుండా,మాట అనకుండా సంసారం నెగ్గుకొచ్చాడు.
ఆ మాట కామాట , భూదేవమ్మ ఒద్దికగా కాపురాన్ని సర్దుకొచ్చింది.
 కొండ మీద కురిసే నాలుగు చుక్కలు భద్రం చేసుకొని జొన్నలో సజ్జలో మొక్కజొన్నలో తయిదలో ,మడిచెక్కలో చల్లుకొని ,సేద్యం చేసారు.
భూదేవమ్మ చెట్టూచేమా గుట్టు మట్టు ఎరిగిన మనిషి.ఏదో అట్టా జరిగిపోతా ఉంటే , నలుసుపడింది.కొడుకు.తెగ మురిసి పడింది.అమ్మ కదా?
నలుగురితో పాటు నారాయణా అనుకొని ,బడికి పంపారు,నాలుగు అక్షరం ముక్కలు ముక్కున పడితే ,మురిసిపోయారు.
చూస్తా ఉండగానే ,ఊరు ఊరంతా ..ఒకరి తరువాత ఒకరు  ..పట్నం దారి బట్టారు.ఒకడి తోక బట్టుకొని ఒకడు.గొర్రెలదాటున బడ్డారు. ఏం చేస్తారు? వాన కురిస్తే ఎవరన్నా ఆ మాట ఎత్తే వారేనా?
ఉరువేది? కరువు తప్ప.
ఏ తాతల కాలం నాటి వూరో ..ఏదో సుడిగాలిన బడ్డట్లు ,ఒక్క పెట్టున ఖాళీ.ఆ వడిలో తమ బిడ్డా.
"ఏందయ్యా దేశం కాని దేశంలో ఏం పని జేస్తాఉండావురా " అంటా,కడుపాతురానికి ఎన్నడ్నా భూదేవమ్మ ఆరాతీస్తే,"కేబుల్ పని " అనేవాడు. "అదేంటయ్యా" అంటే, "నీకు తెల్దు పోమ్మా “అనేవాడు.
. తెలుసుంటే, ఇక్కడిట్టా గుట్టాచెట్టు బట్టి ఇగ్గులాడే వాడా..అందరితో పాటు పడి తనూ పోయే వాడు కాడూ? ఆ నాజూకునాణెంపు పనులు మోటు మడుసులం మాకేం తెలుసు? ఆ మాటంటే ,భూదేవమ్మ మనసు కష్టపెట్టుకొంటది ఎందుకు లెమ్మని చూస్తా ఉండే వాడు.
ఏ కన్న్నీళ్ళు ఎన్ని కొంగుల్లో అదుముకొందో కానీ , తన ముందెప్పుడూ బయట పడిన జ్ఞాపకం లేదు.మేనకోడల్ని తెచ్చి వాడికి ముడేసింది. వాళ్ళకో బుడ్డోడు.
ఆదెయ్య ముక్కు ఎగబీల్చాడు. నానిన బీడీ ముక్కను నోట్లోనుంచి తీశాడు. కొనగోటితో విదిల్చాడు.మళ్ళీ నోట్లో పెట్టుకొన్నాడు.పొసగక, దానిని తీసి ,అగ్గిపుల్ల వెలిగించాడు.ఏమయిందో ఎమో బీడీ వెలిగించకుండానే ,అగ్గిపుల్లను ఆర్పేసి దూరంగా గిరాటేసాడు.మళ్ళీ తన గొర్రెల్ని ఒక మారు అదిలించాడు. కనుచూపు మేరా దృష్టి సారించాడు.
ఏది ఏమైనా బోడికొండ బోడికొండే !
సముద్రం ఒడ్డున బోర్లాబడ్డ శంఖం లా  ఎంత ముచ్చటగా ఉంటుందో.అదుగో అప్పాచెల్లేళ్ళ కొండలు .నీటికోసం వంగిన పిట్టల్లా ఎంతందంగా ఉన్నాయో !అప్పాచెల్లెళ్ళు ఒకదానితో ఒకటి కువకువలాడుతూ ముచ్చట్లాడుతూ ,ఏ పేరంటానికో పబ్బానికో ముస్తాబవుతున్నట్లుగా  ఎంత సొగసుగా ఉన్నాయో !   మభూదేవమ్మ వయసున ముడెసిన కొప్పులో ముడిచిన ముద్దబంతిలా. ఎంతయినా ఈ కొండాకోనా అందం చందం.
ఇంతలో ,కొండను చుట్టేస్తూ పొగ . సుడులు సుడులుగా గాలిలోకి తేలింది.
"అప్పుడే మొదలెట్టారూ!" గొణుక్కున్నాడు."ఆకులు నేల పడనీయరు.మంట ఎగదోస్తారు.  బూడిద తోసేసి ,నేల చదును చేసి,ఇన్ని ఇత్తులు చల్లుతారు.నీటి చుక్క కోసం మబ్బులెంక నోళ్ళెళ్ళబెట్టి కూసుంటారు.వాన బడిందా పరమాన్నం లేదా పస్తు.
అయినా ,ఈళ్ళకింత ఆత్రం ఎందుకుబట్టిందో ,శివరాత్రి సాగనియ్యరు.చెట్టుచేమా చూసుకోరు.మాడిన మాను మరలా చిగుర్చాలంటే ఎన్నికాలాలు పట్టుద్దో!పోయిన అడివి రమ్మంటే వొచ్చుద్దా ?ఆత్రగాడికి బుద్ది మట్టనీ..ఇట్టా అడ్డూ ఆపూ లేకుండా పోతంటే ,చివరాఖరికి మిగిలేదేంటనీ..?"ఆదెయ్య నిట్టూర్చాడు.
( "సురభి" ప్రారంభ సంచికలో ప్రచురితము)

<<<<సశేషం >>>>


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.