Showing posts with label చదువు. Show all posts
Showing posts with label చదువు. Show all posts

Oct 15, 2015

గండుచీమ ....పేద్ద లడ్డూ ...!

మా పిల్లల్లో సృజనాత్మకత పొంగి పొర్లు తోందంటే నమ్మండి !
మొన్నటికి మొన్న, ఇద్దరి పిల్లల పుట్టిన రోజులూ ఒక్క రొజే వచ్చాయి.రాక రాక.
ఇక, పిల్లలంతా చేరి , రెండు రెండు బొమ్మలు గీసేసి.చక చక రంగులు నింపుతున్నారు. చెరొకటి ఇవ్వడానికి.
 గదిలో ఓ పక్కగా , నేల  మీద తన మానాన తాను  చక చక వెళుతోన్న గండుచీమను చూసింది మన శరణి .
"ఆక్కా ! నేను  ఆ చీమ బొమ్మే వేస్తా !" వెలుగుతోన్న ముఖంతో చెప్పింది. ఆ గండు చీమ వంకే చూస్తూ.
 "బొమ్మ సరే, రంగులేం వేస్తావ్?"    
ఎన్ని రంగులేస్తే అంత సంతోషం కదా పిల్లలకి నలుపు కన్నా’, అని ఆరా తీసింది అక్క.
"నల్ల రంగు."
"నల్లగా ఉంటుంది పరవాలేదా? రంగులేం ఉండవ్!" అక్క హెచ్చరించింది.
"సరే!"
అప్పటికే  పిల్లలు సీతాకోకచిలుకల నుంచి పూల తోటల దాక అనేక బొమ్మలు గీసేసారు. శరణి కూడా నీలం రంగు ,ఎర్ర రంగు తూనీగల బొమ్మలు గీసింది. 
కాసేపు ఆ గండు చీమతో పాటు నేల మీద పాకి , ఓ చిరిగిన కాగతం ముక్కమీదకు దానిని ఎక్కించుకొని , తిరిగివచ్చింది శరణి.
 " చీమని అలా పట్టుకోవచ్చా?" అక్క అడిగింది.
" చీమ బొమ్మ రాదు కదా అక్కా ?" నింపాదిగా చెప్పింది.
అక్క చీమ ఉన్న కాగితం ముక్కని జాగ్రత్తగా నేల మీద పెట్టింది.
 చక చక వెళుతోన్న చీమను చూస్తూ ,శరణి గబ గబ  ఓ పెద్ద బొమ్మ గీసింది.

"చీమ చిన్నదిగా ఉంటుంది. ఇంత పెద్ద చీమ బొమ్మేసావే ? " అక్క అడిగింది.
లడ్డూ పెద్దగా ఉంటది కదా?” శరణి ఎదురు ప్రశ్న వేసింది.
లడ్డూనా ?”
" ఈ బొమ్మ ఇస్తే , ఆదిత్య , తస్నీం లడ్డూలు ఇస్తారు కదా?"
"అవును"
"చీమకు లడ్డూ ఇష్టం కదా? "
"అయితే?"
"నేను పేద్ద చీమయిపోతా.., పేద్ద లడ్డూ తినేస్తా!"  ముక్తాయించింది శరణి"చాలా లడ్డూలు తినేస్తా!"
అదండీ విషయం !


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

May 2, 2015

నలుపంటే... ???

బ్లాక్ అంటే... ???
"చీకటి" అన్నాడు రఘు.
"దయ్యం" అన్నాడు ధీరు.
"అమ్మో !నాకు భయ్యం!" అంది హంసిని.
"దెయ్యమూ రాక్షసులు ఏమీ ఉండవ్..!" తస్నీం అంది. 
"బ్లాక్ ఈజ్ డేంజరస్ .. నల్ల రంగు ను జాగ్రత్తగా వాడాలి !" అక్క అంది.
"సరే" అన్నారందరూ.
"బ్లాక్ ఈజ్ మ్యాజిక్!" మళ్ళీ అక్క అంది.
"అవును" అందరూ ఒప్పుకొన్నారు! 
నలుపులో దాగిన రంగులని ఆకారాలని చిత్రిక పడుతూ!
***
Greeshma Prabhava 2015
Interested ? Join us at Prabhava .







All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Apr 3, 2015

ఏవయితేనేం....?!?


                               ఇసుక ఉప్పు                              
సున్నం ముగ్గు

కాగితం ముక్క 
చెక్కిన తొక్క 

విరిసిన పూవు 
విరిగిన మేకు 

కొబ్బరి మట్ట  
చింపిరి బట్ట

రాలిన ఆకు 
ఎండిన తొడిమ 



ఏటి గులక 
దారం కండె 

వాడిన కప్పు 
కాగితం పళ్ళెం 

విరిగిన పుల్ల
దొరికిన గవ్వ

ఏవయితేనేం....
పిల్లల చేతిలో ...
మంత్రదండాలు ! 











All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 3, 2014

పరిచిన మెట్లు

పిల్లలింకా బడికి రాలేదు.
పంతుళ్ళు బడికి రాలేదు.
ఇప్పుడో అప్పుడో  వస్తారు కాబోలు.



పిల్లల కోసం పరిచిన మెట్లు
పక్కకు తొలిగాయేం ?
నిన్న మలిగిన రాత్రి
వాన కురిసిన ఆనవాళ్ళు లేవే !
ఏ కట్టు తప్పిన పసరం
ఎడా పెడా నడిచెళ్ళిందో !





పిల్లలింకా బడికి రాలేదు.
పంతుళ్ళు బడికి రాలేదు.
ఇప్పుడో అప్పుడో  వస్తారు


కొత్తగా చేరిన బుజ్జి పిల్లలు
తిన్నగా పలకయినా పట్టలేరు.
బలపం చేతికిస్తే
ముక్కలుచేద్దామా గుటుక్కుమనిపిద్దామా
అన్న సందిగ్దంలో తడిచిన ముఖాలు!


ఉప్మా తయారంటే ,
తల్లెలెక్కడో తెలియని పసితనం.
అదాటున వచ్చిపడే సెలవు
గుప్పెడు మెతుకులకా ?
గుక్కెడు  అక్షరాలకా ?


అయినా,
గుట్టలెక్కి పుట్టలు దాటి
పొలం గట్ల మీదుగా నడిచొచ్చే
ఆ చిట్టి పాదాలకు ఈ మెట్లొక లెక్కా..?






ఎవరు చెప్పేరని ,
ఈ మెట్లకు మట్టి మెత్తుతున్నావు తల్లీ?
                                                                అన్నట్టు,
అది మిత్రవనం వాకిలి కదూ...?
అందుకేనా మరి ?

పిల్లలింకా బడికి రాలేదు.
పంతుళ్ళు బడికి రాలేదు.
ఇప్పుడో అప్పుడో  వస్తారు

అందాకా సెలవా  !

***
చిన్నారి పొన్నారి స్నేహితులందరికీ ..
జేజేలు!

***
 "మిత్రవనం" ఉపాధ్యాయులు శ్రీ రాము, రమేశ్ గార్లకు, రిషీవ్యాలీ పల్లెబడి, అధ్యాపకురాలు శ్రీమతి సుశీల గారికి ధన్య వాదాలతో ...

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jan 15, 2014

డివ్వు డివ్వు డివ్వూ ... !


ఊళ్ళోకి బసవన్నొస్తే ఏం చేస్తారేం?
***
డివ్వు డివ్వు డివ్వూ ... 
డూ డూ డూ డూ బసవన్నా ..
దొడ్డాదొరండీ బసవన్నా
  
పైడి కొమ్ముల బసవన్నండీ .
పాల మెరుంగుల బసవన్నండీ 

బంగరుగిట్టల బసవన్నండీ ..
భాగ్యములిచ్చే బసవన్నండీ

విశ్వనాథుని వాహనమండీ ..
వెండి కొండపై విహారమండీ ..

డివ్వు డివ్వు డివ్వూ ...
కోటి లాభములు కలగాలండీ ..

కోటి వేల్పుల దయగలగాలి...

డివ్వు డివ్వు డివ్వూ ... 
డూ డూ డూ డూ బసవన్నా ..
దొడ్డాదొరండీ బసవన్నా..
***
ఊళ్ళోకి బసవన్నొస్తే ఏం చేస్తారేం?
పిల్లలు గుమిగూడి గెంతులేస్తూ 
వూరంతా సందడి చేసేస్తారు కదా.
అపుడైన ఇపుడైనా.
మరి ప్రభవ బళ్ళోకి బసవన్నలు రాగానే ...
పిల్లలేంచేసారంటే ..
కేరింతలు కొట్టారు. కేకలు వేసారు.
దూరంగా పరిగెత్తారు. దగ్గరికొచ్చి నిలబడ్డారు.
కొమ్ముల అందం చూశారు. మెడలో గంటలు సవరించారు.
చెవిలో రహస్యాలు చెప్పారు. చేతిలో చేయి వేసి కలిపారు.
ప్రభవ లో  బసవన్నల హడావుడి ..రంకెలు చిందులు ..ముగ్గుల నడుమ  గొబ్బిళ్ళ మధ్య  ..
 ఇలా సందడి సందడిగా సాగిన,
బడిలో బసవన్నల విహారం
చివరకు వేదికనెక్కింది!
కనుమ పండుగనాదు  వైనాలన్నీ కన్నులారా మీరే చూడండి!

 


 























అన్నదాతా సుఖీభవ ! 
                                   సంక్రాంతి శుభాకాంక్షలు ! 
Related Link: 
 గొబ్బిమాతల్లికి  చోటేది చెప్మా ?!?
http://prabhavabooks.blogspot.in/2014/01/blog-post.html

Feb 13, 2011

అనగా అనగా...ఒక కథ


రవీంద్రుని నూటయాభయ్యవ జయంతి ఉత్సవాల సంధర్భంగా ,
సంబరాలు జరుపుకుంటున్న మనం ,
ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకోవల్సిన విషయం ఒకటి ,
ఆయనలో నిండి ఉన్నది.
అది విశ్వకవికి పిల్లలతో ,పిల్లల కాల్పనిక ప్రపంచంతో ముడిపడిన బంధం.
శాంతినికేతనం పూదోటల్లో వెల్లివిరిసిన పిల్లల విద్యాప్రయత్నాల విశేషాలు మనకు  తెలిసినవే .
ఒకసారి విదేశీపర్యటనలో ఉన్నప్పుడు ,వారి తొమ్మిదేళ్ళ మనవరాలికి ,రవీంద్రులు ఒక ఉత్తరం రాశారు.

అందులో అంటారు కదా, 
"ఇక్కడ చాలా మంది నన్ను కలవడానికి వస్తున్నారు. నన్ను చుట్టేస్తున్నారు. 
నాకు ఎక్కడికైనా సంతోషంగా మాయమై పోవాలనిపిస్తుంది. నన్ను నీ బొమ్మల గూటిలో దాచిపెడతావా?"
( 8 మే,1930)
చిన్న పిల్లవాడిలా మరో చిన్నారిని అమాయకంగా అడిగిన ఆ ప్రశ్నలోని ..పదాల పసితనం వెనుక .. ఎంతటి లోతైన భావన దాగిఉన్నదో కదా!
విశ్వవిఖ్యాతిని చుట్టుముట్టిన కీర్తిప్రతిష్టలు ,ఉక్కిరిబిక్కిరి చేయబోగా ,ఆయన పసితనంలో తన పచ్చదనం వెతుక్కున్నారు.
పిల్లలలోకం తలుపులు తట్టి ..పిల్లలకోసం అనేక రచనలు చేశారు.
పిల్లల గురించి ఆయన రాసిన ఒక కథను ,శ్రీ మధురాంతకం రాజారాం గారు,నా మొదటి కథాసంకలనం "నేనొ నాన్ననవుతా"కు కస్తూరి తిలకం దిద్దుతూ ..ఇలా ప్రస్తావించారు.
"చదువులు నేర్చిన రామచిలక" అన్న పేరుతో రవీంద్ర కవి ఒక కథను రచించారు. ఒక రాజు గారు తన పెంపుడు చిలకకు పరిపూర్ణ పాండిత్యం అబ్బాలన్న కోరికతో శాస్త్రగ్రంథాలన్ని టికీ  రోటిలో వేసి ,దంచి ఆ కషాయాన్ని చిలక చేత త్రాగిస్తారు.
దాని గతి ఏమై ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
ప్రస్తుత సమాజంలో చాలా మంది తల్లిదడ్రులు తమ పిల్లలను జాతీయ -వీలయితే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతికెక్కాలన్న తపనతో ," చైల్డ్ ప్రాజిడీలు"గా మార్చే ప్రయత్నంలో ,పుస్తకాల బరువుతో ,కాన్వెంటు చదువులతో ,ట్యూషన్ పాఠాలతో ,దిగద్రొక్కి ,బాల్యజీవనంలోని ఆనందాలన్నిటినీ హరిస్తూ .పీల్చి పిప్పి చేస్తున్నారు .
ఇది ఆత్మహత్యాసదృశ్యమైన అపచారం.
అలాంటి వారికి ఘాటైన చురకలాంటి కథానిక ఒకటి సంపుటిలో ఉంది"
( మధురాంతకం రాజారాం,1 నవంబరు ,1996)
కథానికనే నేను ఇప్పుడు మీ ముందు చదవబోతున్నాను.
దీనిని ఆంధ్రజ్యోతి ఆదివారం "వారు నవంబరు 1996లో అచ్చు వేయగా,డా.CLL జయప్రద గారు ఆంగ్లంలోకి అనువదించగా,"సారస "సాహిత్యపత్రికలో అచ్చు వేశారు .
కథను మీ ముందు ఉంచే అవకాశం ఇచ్చిన ,కేంద్ర సాహిత్య అకాడెమి వారికి,లేఖిని అధ్యక్షులు డా.వాసాప్రభావతి గారికి,పొత్తురి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు.

***

 *అనగా అనగా *

2011 ఫిబ్రవరి 11,12 తేదీలలో రవీంద్ర భారతి ,హైదరాబాదు నందు కేంద్ర సాహిత్య ఆకడెమీ వారు నిర్వహించిన "విశ్వకవి రవీంద్రనాథ టాగూర్ 150వ జయంతి నివాళి ,అఖిలభారతి తెలుగు కథానికా రచయిత్రుల మహాసభ" లలో,

11 న చదివిన "అనగా అనగా " అన్న   కథను ఇప్పుడు ఇంగ్లీషులోనూ చదవవచ్చును.


http://chandralata.blogspot.com/2009/12/blog-post.html

ఇవి కూడా చూడవచ్చేమో ..
http://chandralata.blogspot.com/2009/07/blog-post.html
http://chandralata.blogspot.com/2009/07/being-famous.html
***
ఈ ఫోటో తీసిన స్నేహితురాలు కుప్పిలి పద్మగారికి  అభిమానాలు.
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Dec 9, 2010

పాఠం వింటుంటే..!

పాఠాలు చెప్పేవాళ్ళంతా బుద్ధిగా పాఠం వింటుంటే..
వంచిన తల ఎత్తకుండా..చక చక వర్క్ షీట్లు పూర్తిచేస్తుంటే.. 
అడిగీ అడగక మునుపే ప్రశ్నలన్నిటికీ ..
ఉత్సాహంగా మేం ముందంటే మేం ముందని పోటీలు పడి మరీ.. సమాధానాలు చెపుతుంటే,
భలే ఉంటుంది కదా!


అంతే కాదండి..ఒకే వ్యవహారం లో ఉన్న వాళ్ళంత మొదటిసారిగా కలవడం, కొత్త స్నేహాలు ఏర్పరుచుకోవడం.. అనుభవాలు కలబోసుకోవడం... మరింత బావుంటుంది.
ఈ రోజటి , సూసన్ రస్సెల్ గారి ట్రినిటి కాలేజ్ లండన్ ( జి ఇ ఎస్ ఈ)  వర్క్ షాపు అచ్చం అలాగే ఉంది. కళకళ లాడుతూ .
అందులోను ,ఇది భాష ను నేర్పించడం అన్న మౌలిక భోధానంశానికి సంబంధించింది కనుక మరింత ఉత్తేజభరితంగా సాగింది.
సూసన్ గారు చాలా భిన్న నేపధ్యాలు కలిగిన వారికి ఒక విదేశీ భాషగా ఇంగ్లీషును నేర్పారు.అటు
అటు ఆస్ట్రేలియా నందలి వలస కార్మికులు ,శరణార్ధుల నుండి   ,బోస్నియా యుద్ధ భూమిలో క్షతగాత్రులకు, మిత్రసైన్యాల వరకు. హంగేరీ, స్వీడెన్ లతో పాటు  చైనాలోను భాషాభోధన చేశారు.  
అటు ఆస్ట్రేలియా నందలి వలస కార్మికులు ,శరణార్ధుల నుండి   ,బోస్నియా యుద్ధ భూమిలో క్షతగాత్రులకు, మిత్రసైన్యాల వరకు. హంగేరీ, స్వీడెన్ లతో పాటు చైనాలోను భాషాభోధన చేశారు.  పాఠశాలల నుండి శరణార్థుల శిబిరాల వరకు వారి పాఠాలు విస్తరించాయి.

లాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి విదేశీభాషగా ఇంగ్లీషు భాషాబోధనలలో PhD అధ్యనం చేశారు.
 ఇక వారి అనుభవాలను తెలుసుకొని, మా సందేహాలను జోడించి ,సందడి  సందడిగా.. రోజంతా... 
అధ్యాపనలో సంతోషసంబరాలు...సాధకబాధకాలు  కలబోసుకొన్నాం !



వారి భాషాబోధనమెళుకువల సారాంశం ఒకటే,


ఏదైనా విషయం మీద విద్యార్థులు మాట్లాడుతుంటే ,వారిని మాట్లాడనివ్వండి.వారిని ఆపకండి. వారి తప్పులు ఎత్తి చూపకండి.మాట్లాడం పూర్తి కాకమునుపే సరిదిద్దకండి.

 మొదట,  వారి భావ వ్యక్తీకరణ ఒక సహజ ప్రకటన గా ఉండేట్టుగా ప్రోత్సహించండి. తమ భాషావినియోగంపై విశ్వాసం కలగనీయండి.ఆపై భావవ్యక్తీకరణలో స్పష్టత ,ఆ తరువాత  , దోషరహితం చేసుకోవడం ఎలాగో నేర్పించండి.
తమ భావాన్ని మరింత బాగా ఎలా వ్యక్తపరుచుకోవచ్చునో  వారిని స్వయంగా తెలుసుకోనివ్వండి.
స్వయంగా సరిదిద్దుకోనివ్వండి "
**
వింటున్నారా?

ఇవన్నీ  ఏ భాషాబోధనకైనా ఒక మంచి సూచనేగా?

గమనించగలరు.

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.