Nov 10, 2010

ఎక్కడ పిల్లలు గౌరవించబడతారో ..!

మీరు సరిగ్గానే చదివారండి.
అది  పిల్లల గారాబం కాదు,  పిల్లల గౌరవమే !


పెద్దలు మన్నించండి !
ముందుగా,
పిల్లలను గౌరవించండి !


అదేంటి ... మనం ఏం నేర్చాం? ఏం నేర్పుతాం?
పెద్దల్ని కదా గౌరవించాలి?
తప్పకుండా.
అలాగే గౌరవిద్దాం.
అంత కన్నా ముందుగా ,  పిల్లల్ని గౌరవిద్దాం.

పిల్లల్ని ప్రేమించాలి గానీ, గౌరవించడం ఏమిటీ.. మరీ ఈవిడ విడ్డూరంగా మాట్లాడుతోంది...
అని ఏ మూలైనా మీలో ఒక సందేహం మెదిలిందా?
ఒక్క నిమిషం.

మీ టివి తెరల మీది రియాల్టీ షో లనో , ఇప్పుడు సందుసందునా జరిగే పిల్లలపండుగ ,చాచాజీ పుట్టిన్రోజు వేడుకల్లో నో , పిల్లలు వేదికల మీదకు ప్రదర్షనలివ్వడానికో , బహుమతులు అందుకోవడానికో వెళుతుంటారు ..కదా ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి.
ఏమేం గుర్తొచ్చాయి...?
వేదిక మీద ఒకరో పలువురో పెద్దలు నిలబడి ఉంటారు. పిల్లల పేరు పిలవగానే పరిగెడుతూ ..మెట్లెక్కి .. వెలుగులో నడుస్తూ .. ఉత్సాహాన్ని అదుపుచేసుకొంటూ .. చకచకా వెళ్ళి, ఆ ముఖ్య అతిథి లేదా అతిథుల ముందు నిలబడ్తారు. బహుమతి అందుకొనే ముందో తరువాతో ...
పిల్లలు చటుక్కున వంగి వారి పాదాలను తమ మునివేళ్ళ తో తాకుతారు.
అబ్బ !
చూడండి... !
పిల్లల్ని అనవసరంగా ఆడి పోసుకొంటాం .కానీ ,వారికి పెద్దలంటే ఎంత గౌరవమో!
అదేం కాదు. వాళ్ళమ్మో నాన్నో టీచరో చెప్పి పంపుంటారు.. అని అంటారా?
చెప్పి పంపినా , నడుం, తల వంచి.... పాదాలంటి ప్రణమిల్లారంటే, ఆ పిల్లల్లో నూ ఆ సంస్కారభావం ఉన్నట్లే కదా!
సరే మంచిది.
 ఇక, మన ముఖ్యాతిథి/ థులు  ఏం చేస్తారు ?ఎలా స్పందిస్తారు?ఎలా పిల్లల ప్రణామాలకు బదులిస్తారు? కనీసం అభినందనో ఆశీర్వచనమో పలకనైనా పలుకుతారా?  తలెత్తి , ధిలాసాగా , విగ్రహాల్లా నిలబడి ..కాళ్ళు మొక్కించుకొంటారా?
అదండీ సంగతి!
 ఇంతకీ ఆ పిల్లలు ప్రకటిస్తున్న గౌరవం దేనికి ? కళకా? కళాకారుడికా? 

ఎందుకు కాళ్ళు మొక్కుతున్నారో వారికి తెలుసా? ఆ కళాకారుడో మరో ముఖ్యమైన వ్యక్తో , నిజంగా పిల్లలకు ఆదర్షప్రాయులు కాదగ్గవారేనా? అయితే , ఎలాంటి ఆదర్షం ? సభ్య సామాజికులకు గాని, జన సామాన్యానికి కానీ,వారి ఆలోచన  మార్గదర్షకత్వం అయ్యిందా? ఏ కొందరిచేతనో  లేదా అందరిచేతనో ఆచరించబడిందా?
అందులోనూ, ఇవ్వాళ్టి వేదికల మీది ముఖ్య అతిథుల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకొంటే అంత మంచిది కదా?

సూటిగా చెప్పుకోవాలంటే,
ఆ పెద్దల తమను తాము అతీంద్రులమని భావించుకోవడానికా? లోలోన  అంతో ఇంతో ఉన్న అహం మరో బారోమీటరు పొడవు పెరగడానికా?  
నాకయితే అర్ధం కాలేదు సుమండీ!

నయానో భయానో పిల్లలు పెద్దలకు తమ గౌరవం పాదాలంటి మరీ ప్రకటిస్తే ,  ఆయా పెద్దలా మర్యాద నిలబెట్టుకోగలుగుతున్నారా?
నిమ్మకు నీరెత్తినట్టు నిలబడి మొక్కించుకొనే వారు ఒకరైతే , "మొక్కడం వారి ధర్మం ! "అన్నట్టు వ్యవహరించే వారు ఇంకొందరు ! "మొక్కితే ఎంత మొక్కకుంటే ఎంత" అన్నట్టు ఉదాసీనంగా ఉండేవారు కొందరు.
మర్యాదకైనా పిల్లలను వారించేవారు కనబడరు కదా?
ఒకరిని చూసి మరొకరు .. ఎంత మొక్కించుకుంటే ,అంత పెద్ద మాష్టర్ ! అదన్న మాట !
ఇక టివీ తెరలా టీరే వేరు!
ఛానెళ్ళు వేరయినా  కార్యకలాపాలు ఒకటే!  పిల్లల్ని ఆ పెద్దలు చూసే తీరు ఒకటే! ముందేమొ మార్కులతో పాటు వంకరటింకర మాటలు , ఆపై సవినయ సాష్టాంగ స్వీకరణలు.అదీ సరిగ్గా ,బహుమతుల అనౌన్స్మెంట్ కు అటూ ఇటుగా!
ఆ వత్తిడి .ఆ హంగామాల్లో నలుగు తోన్న ఆ పిల్లల సంగతి ఏం చెప్పినా తక్కువే!
పాపమా పిల్లలు ఏం చేయగలరు, టపామని పాదాలంటక !
ఇప్పుడా సంస్కృతి  అన్ని వేదికలకూ పాకడమే విషాదం.

పిల్లలంటే వీసమెత్తు గౌరవం లేని పెద్దల పాదాలంటి ..
“మనసా వాచా కర్మణా ... నీ దాసానుదాసుండ “అనో ..
బాంచెన్ ..నీ కాల్మొక్తా.”. అనో ... స్పురించే...
ఒక తిరోగమన సంస్కృతికి మనల్ని తీసుకెళ్ళి నిలబెడుతుంది... ఇలాంటి  గౌరవరహితమైన గౌరవప్రకటన !

మనిషి మీద గౌరవం ప్రకటించడానికి గౌరవప్రదమైన మార్గాలెన్నో ఉన్నాయి !
ఆ వ్యక్తి ని స్పూర్థిగా , ప్రేరణగా ,మార్గదర్షకం గా , ఆదర్షంగా స్వీకరించడంకన్నా.. ఆ వ్యక్తి ఆలోచనల్లో ఏ ఒక్క దానినో ఆచరిచడం కన్నా మనం ప్రకటించే గౌరవం ఏముంటుంది ?

వ్యక్తి పూజ కు రోజులు చెల్లాయ్!
ఏనాడో !
ఆయా రంగాలలో ఆ పిల్లల ప్రతిభను ప్రోత్సహించడానికి నిర్మించిన వేదికలపై ,గౌరవం అందుకోవలసినది ఎవరంటారు ? 
ఒక చల్లని మాటతో వారిని పలకరించినా ,ఒక చిరునవ్వును వారిపై చిలకరించినా ..ఆ పిల్లలెంత సంబరపడతారో ! 


అందుకే ,


పిల్లల్ని గౌరవించండి!
వారి అభిప్రాయలనూ.వారి అనుభూతులనూ. వారి అవసరాలను.వారి అభిమానాలను.


పిల్లలను గౌరవిస్తూనే ఉండండి.

పిల్లల  సృజనను, ప్రతిభను ,కళను గౌరవించక పోతే ,
మనల్ని మనం అవమానించుకొన్నట్టే కదా?

ఎందుకంటే, 
ఎక్కడ పిల్లలు గౌరవించబడతారో , అక్కడ మానవ సంస్కారం మూర్తివంతవుతుంది !
పిల్లల పండుగ సార్ధకమవుతుంది!

***

ఈ మారు మొక్కేది ఎందుకో ...
తెలుసుకొని మొక్కండి!

మొక్కించే ముందు ..
ఓ మారు ఆలోచించి మొక్కించండి!!

మొక్కించుకొనేది ఎందుకో ...
తెలుసుకొని మరీ మొక్కించుకోండి !!!

****
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

4 comments:

  1. మీరు చెప్పింది నిజంగా నిజం.
    పెద్దవాళ్ళ కాళ్ళకు ప్రణమిల్లి పిల్లలు వారి వినయాన్ని ప్రదర్శిస్తుంటే, పెద్దలు మొద్దుల్లా నిలబడి వారి అవివేకాన్ని చూపెట్టుకుంటున్నారు.

    ReplyDelete
  2. Pillalu ekkada gouravinchabadataro..........'

    Pillalanu gouravinchalante peddalaki pillala gurinchii vaarinenduku gouravinchaalo ane vishayalu bhodinchalemo? Alochinchandi!

    ReplyDelete
  3. బావుందండీ మీ టపా ...టైటిల్ కూడా :)

    ReplyDelete
  4. పిల్లలను అభిమానించే ..గౌరవించే ..మీ అందరికీ .. మరో మారు ధన్యవాదాలు. చంద్రలత

    ReplyDelete