Feb 15, 2015

వినబోతూ రుచెందుకూ.. ?

మట్టిలో మాణిక్యాలు దొరుకుతాయి అన్న  మాట నిజమని  మరొక సారి నిరూపించింది క్రియ బాలోత్సవ్ 2015
 నక్కా అనిత ఆరో తరగతి అమ్మాయి . పురకట్ల పల్లి  జిల్లా ప్రజా పరిషత్ ఓరియెంటల్ హై స్కూల్  లో చదువుతోంది. వాళ్ళ అక్క మౌనిక ఈ ఏడాదే బడి వదిలి, కాలేజీలో చేరింది. అక్క నేర్పిన  పాటను అనిత హృద్యంగా పాడి , అందరినీ కొల్లగొట్టేసింది.
 "బువ్వ పెట్టి బుజ్జగించే ఆ తల్లి లాలనకు దూరామా..." అంటూ.
అనిత తండ్రి ,నక్కా వెంకట రత్నం ,ఒక తాపీ మేస్త్రి. తల్లి, నాగమణి ఒక దినసరి కూలీ. ముగ్గురూ ఆడపిల్లలు. "మరి చదివిస్తారా ? "
"ఆయ్  .. ఆళ్ళు సదుకుంటే సదివించేడవేనండీ.."అని అన్నారాయన. 
ఆ  పిల్లలకు శుభాన్ని కోరుకొంటూ..పరిచయం చేస్తున్నా... ఆ ప్రతిభ పది కాలాలు పదిలం పదిలం అనుకొంటూ.


వినబోతూ రుచెందుకూ.. ?
ఆ మాధుర్యాన్ని మీరే ఆస్వాదించండి. ఆ చిన్నారులిద్దరినీ ఆదరంతో అభిమానంతో తలుచుకోవడం.. మరవకండి !

https://www.youtube.com/watch?v=DdKrakNam84&feature=youtu.be




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jan 24, 2015

చెప్పదలుచుకొన్న పాఠం ..!


గణతంత్ర దినోత్సవం కదా .. పిల్లలకి  
భారతసామ్రాజ్యం .. పాఠం చెబుదాం అనుకున్నాం.
వెంటనే, మహారాజూల్నీ, మాహారాణులనీ, చక్రవర్తులనీ ,సుల్తానాలనీ,పాదుషాలని.. చిట్టా రాసి, ఓ తొమ్మిది మందిని .. పట్టీ రాశేసాం. పిల్లలు తలా ఒక పాత్రలోకి ఒదిగి పోయారు. ఈ నాలుగు రోజులు, కత్తి యుద్ధాలు ,గుర్రాల సకిలింపులు , ఏనుగు ఘీంకారాలు.ప్రభవ దద్దరిల్లిపోయింది.  ఇక , ఇవ్వాళ అందరూ .. వరస గా వేదికెక్కి తమ తమ పాత్రలను ఆఖరి మెరుగులుదిద్దుతూ , దడలాడించేసారు.సోమవారం ప్రదర్షన. ఇంతకీ, చెప్పొచ్చేదేమిటంటే, ఆఖరి పాపాయి, అశొకుడి పాత్రలో జీవించగానే, అప్పటిదాకా రణగొణ్వనులు చేస్తోన్న  యుద్ధవీరులంతా.. కిక్కురుమనడం మానేసి, ఒక తదేక దృష్టితో .. అశోకుడి వైపు ..చూస్తూ .. అన్నారు.
" ఈ కింగ్ చాలా గుడ్!"
" ఏం ?"
 "అందరూ కత్తితో కిల్ చేస్తారు. వాళ్ళు చాలా బాడ్ !" 
ఇందుమూలంగా,  సోమవారం నాడు అశోకుడికి ఎక్కువ సమయం ఇవ్వాలని పిల్లలు ఏక గ్రీవంగా  తీర్మానించారు. 
మా వరసలో ,చిట్టచివరి  స్టార్ ఎంట్రీ  "సామ్రాట్ అశోక"  అన్నమాట!   
మేము చెప్పదలుచుకొన్న పాఠం ఏదైనా మిగిలిందా ?!?



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jan 13, 2015

"నీ వుండే దా కొండపై .. "

"నీ వుండే దా కొండపై ..  నా స్వామీ...నేనుండేదీ నేలపై...
సరిగ్గా ఇదే సమయానికి,  గత పాతికేళ్ళుగా .. .
ఒక నాదస్వరం  మా వీధుల్లో .. ప్రయాణిస్తూ ఉండడం పరిపాటి.
ఎవరెవరం ఎక్కడెక్కడ దాక్కున్నా ,
ఆ వీధిలో నుంచో ఈ వీధిలో నుంచో .. ఆ స్వరం అదాటుగా వచ్చి పలకరించి పోయేది. అలవోకగా  ముంచెత్తుతుంది .
పేపర్లో తల దూర్చినా, దుప్పట్లో ముసుగెట్టినా , కంప్యూటర్లో మునిగిపోయినా ..వెతెకెతికి మరీ తలలో దూరి కూర్చుంటుంది. వదిలితే వొట్టు.
ఇక ఆ రోజంతా , బుర్రలో తిరుగుతూ ... ఉంటుంది.
 ఆ  స్వరంతో పాటు, ఆ పాట.. వదలమన్నా వదలదు.
 అంతా చేసి ఆ నాలుగు వాక్యాలే, మళ్ళీ మళ్ళీ.
అప్పుడప్పుడు, “  నీలి మేఘాలలో .. గాలి కెరటాలలో…. “
ఈ పాటా ఆ నాలుగు వాక్యాలే !
ఆ స్వరం  వెనుక మనిషెవరో కూడా తెలియదు. కానీ , ఆ స్వరమంటే అంతులేని అభిమానం.
ఎంతగా అలవాటు పడ్డామంటే , ఆ సమయానికి ఆ పాట వినబడక ఆ రోజంతా ఏదో లోటుగా ఉంటుంది మరి!
నిజానికి, రాను రాను ఆ పాట రాక తగ్గుతూ వస్తొంది. కొన్ని రోజులు వినబడనే వినబడడం లేదు. అయినా, ఓ చెవి ఆ వైపు అప్పగించేయడం అలవాటయి పోయింది.
ఇదలా ఉండగా,
ఈ మధ్య ఓ పెద్ద హోరెంత్తించే మైకులో …పొద్దున పొద్దున్నే ...
“ నెల్లూరు నెరజాణా…”  అంటూ..
చెవుల తుప్పు వదిలేలా  ,బిగ్గరగా  పాట మా వీధులని సాధికారకంగా చుట్టేస్తోంది!
 హమ్మయ్య ,పాట కాదు…స్వరమే! 
బతికాం!
“ ఎంత నెరజాణతనమయితే మాత్రం అలా మైకులు పెట్టి వీధుల్లో ప్రకటించుకోవాలా  ! సిగ్గులేక పోతే సరి ! “అని  గట్టిగా గొణుక్కోకండి. పాపం ,అదేదో, మంచి మాటని ఉప్పొంగిపోయే వారు బోలెడు నెల్లూరీయులు!
పాపం శమించు కాక !
స్వరం ... ఆ వెంటనే .. సైరనూ..కుయ్ కుయ్ మని... బిగ్గరగా వినబడుతుంది.
 “ అమ్మా…. మున్సిపల్ వాహనం వచ్చింది  
 మీ ఇంటి చెత్త ఇవ్వండీ  ! “
 ఇదేదో బాగానే ఉంది !
అప్పడప్పుడు ఇలాంటి .. అయిడియాలు ..భలే వచ్చేస్తాయి మన వాళ్ళకి !
ప్రహసనంగా మారేంతవరకూ, ఓకే ! 
ఇంతా చేసీ , మా వీధుల్లో మున్సిపల్ చెత్త కుండీలన్నీ , కబ్జా అయిపోయాయి. వందలాది చిన్నచితక ఆసుపత్రుల వీధులు కదా. ఎప్పుడైనా "చెత్తకుండీలో పసిపాప" లాంటి వార్తలు వచ్చే వంటే , అది ఖచ్చితంగా మా వీధి చెత్తకుండీనే అయి ఉండేది ! 

ఇప్పుడిక , చూడాలి! 
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.