Dec 2, 2010

ఆ...! అంటే , తెలుగొస్తుందా?

నోరారా పలకరించాలన్నా..
నోరూరించేలా కబుర్లాడాలన్నా..
నోరెత్తి అరవాలన్నా..
అమ్మ పలుకు పలికితేనే ముద్దు!

ఎటొచ్చి, ఈ నాటి బళ్ళలో ఇరుక్కొని , నానాటికీ చిక్కి పొతున్న మన మాతృభాష మాటెత్తామా ... 
ఇక అంతే!
దుమారం రేగుతుంది!
ఆవేశం పోటేత్తుతుంది!
అది అటు తిరిగి ఇటు తిరిగి... పిల్లల మీదకు వచ్చి వాలుతుంది!

అలాంటప్పుడే , పిల్లల నోట తెలుగు పలికించాలని ,పిల్లల చేత తెలుగు  గిలికించాలనీ   ...
తపనతో తాపత్రయంతో ఉపన్యాసాలు ఒలికించేస్తాం!
అనర్ఘళంగా. ఆగ్రహోద్రకాలతో. ఆవేశకావేషాలతో.

సరిగ్గా అలాంటి  గొప్ప తాపత్రయపు నేపథ్యంలో నుంచే ,మన నోట ఆశువుగా కొన్ని వాక్యాలు దొర్లి పోతూ ఉంటాయి.ఎవరైనా పిల్లలు  తెలుగు మాట్లాడుతుంటే ,
అలవాటో పొరబాటో ఏమరుపాటో ...
ఒక ఇంగ్లీషు పదం తొణికిందనుకోండి .ఏం చేయాలి?
"హేళన చేయండి!"
"ఆపు అపు అని అరవండి!"
"ఆపే దాకా కేకలు వేయండి!"
అంతటితో ఆగని ఆత్రుత మరో వాక్యం చేరుస్తుంది.
"చెంప మీద కొట్టండి!"
ఇంకా ఆవేశం వస్తే, మరో వాక్యం తయార్ !
"చెప్పుతో కొట్టండి!"
ఆగండాగండి.
ఇంత విడ్డూరంగా ఎవరు మాట్లాడుతాం? అనుకునేరు!
అలా మాట్లాడే భాషాభిమానులు కోకొల్లలు!
ఆ నోటితో నే అడక్కుండానే అమ్మలకూ ఒక ఉచిత సలహా వచ్చి వాలిపోతుంది!
"అమ్మలారా... మీరు అన్నం పెట్టక మాడ్చైనా , అలిగయినా  అనుకున్నది సాధించాలి!"
"భయపెట్టయినా బెదిరించైనా ..పిల్లలతో తెలుగు మాట్లాడించాలి!"
బావుందండి.
ఇదన్న మాట విషయం!
నిజమే .
ఏ విషయాన్నైనా  నయానా భయానా చెప్పమన్నారు కదా పెద్దలెపుడో!
అయినా, అనునయంగా చెప్పడాన్ని ముందుంచారెందుకంటారు?
బహుశా నయానా పిల్లలకూ, ఆ తరువాతి పదం మిగిలిన వారందరికీ అయుంటుందని నా అనుమానం!
ఎందుకంటారా?
ముద్దారగ నేర్పిన ముద్దు బిడ్డలు నేర్వగలేని విద్య కలదే ?అన్నరొక పెద్దలు ఎప్పుడో!
అందుకని ,ఇప్పటి పిల్లలతో సన్నిహితంగా కాసేపు గడిపి ,ఆపై మెల్లిగా అడిగి చూడండి. తెలుగు మాట్లాడడానికి ,వాడుకకు వారికున్న సాధకబాధకాలేమిటో!

మొదటి జవాబు:
ఎవరితో మాట్లాడాలి ?
అమ్మతోనా?నాన్నతోనా?టీచర్లతోనా?స్నేహితులతోనా?
తరువాతి జవాబు:
ఎక్కడ మాట్లాడాలి?
ఇంట్లోనా?బడిలోనా? బజారులోనా? షాపింగ్ మాల్ లోనా?
ఆ పై జవాబు:
ఎందుకు మాట్లాడాలి?

మీకు చిర్రెత్తుకొస్తుందని నాకు తెలిసి పోయింది
జవాబులంటూ ..ప్రశ్నలు గుప్పిస్తున్నానని !
కదూ?

నిజమండి.
ఒకమారు తెలుగులో కథలు రాయించే ప్రయత్నం లో ఉండగా ,
ఒక విద్యార్థిని అన్ని ప్రశ్నలను ఇమిడ్చి ఒకే ఒక సూటి ప్రశ్న వేసింది.
"అక్కా, అసలు నేనెందుకు తెలుగు నేర్చుకోవాలి? మా ఇంట్లో మా అమ్మమ్మ తరం వారే ,తెలుగులో మాట్లాడరు.తెలుగు పత్రికలు చదవరు. తెలుగు సినిమాలు ,ఛానెళ్ళు  చూడరు. ఎవరైనా ఇంటికి చుట్టాలొస్తే తెలుగులో పలకరించ బోతే , మా ఇంగ్లీషు ప్రావీణ్యతను పరీక్షకు పెడతారు. అటు ఇటైనా ,మాకు మా బడికీ , అక్షింతలు ! షాపింగ్ కు వెళితే ,అక్కడా ఇంగ్లీషుతో పనయి పోతుంది. ఇక, నేనంటూ తెలుగులో మాట్లాడేది మా ఇంటి పని మనుషులతో ,  డ్రైవర్ తోనూ. ఆ మాత్రం తెలుగు నాకు వచ్చు. అంతకు మించిన తెలుగు నాకెందుకు ?"

నిజమే మరి.
మేమేమో తీరిగ్గా కూర్చోబెట్టి ..ఏకంగా తెలుగులో కథలు రాయమంటిమి!
ఆ అమ్మాయి మాటల్లో నిజం ఉంది.నిజాయితీ ఉంది.
వాటికి మనం ఇచ్చే జవాబుల్లోనే ,మన భాష మనుగడ ఉంది!
ఏమంటారు?

మరి అరుదయిపోబోతున్న అంతరించిపోబోతున్న ..ఒక అద్బుత భాషకు వారసుల్లా...అందరిలోనూ తెలుగభిమానం అంతో ఇంతో పెల్లుబుకుతున్నదన్నది సత్యమే!
అది వీరాభిమానంగా విరుచుకు పడుతున్నదండం అంతే సహజం.

కాస్త నిదానించి చూద్దాం.

ఈ నాటి బడిపిల్లల్ని ఎవరినైనా పిలిచి కాసేపు తెలుగులో మాట్లాడమంటే , ఎంత లేదన్నా వాక్యానికోక ఇంగ్లీషుపదం దొర్లక తప్పదు!దానికి గల చారిత్రక కారణాలను పక్కకు బెట్టి, 
మనం "హేళన చేసి ,భయ పెట్టి ,బెబేలు ఎత్తిస్తే.."..
ఆ పిల్లలకు తెలుగొస్తుందా?

అసలే పిల్లల్లో ఎన్నెన్ని అపనమ్మకాలో .
"మంచి తెలుగు మాకు రాదు. స్పెల్లింగులు రావు .చెప్పాలనుకొన్నది సరిగ్గా చెప్పలేము.భాష బాగా లేదు.  వత్తులు గుణింతాలు తప్పుతాయి. మేం చెప్పేది మీకు అర్ధం కాదు..."
ఇలాంటి అనేక అపనమ్మకాలు వారి తెలుగు వాడుకం మీద వారికున్నాయి. వాటి నుంచి వారిని బయట పడేస్తే తప్ప ,భాష పట్ల వారికి అభిమానం కలుగుతుందా?
భాష పై ఆత్మీయ భావం కలగనిదే , ఆప్యాయత పెరుగుతుందా? గౌరవం కలుగుతుందా?
మన భాష మనకు మిగులుతుందా?
పిల్లల సందేహాలనూ సంశయాలనూ తీర్చకుండా  ,సావధాన పరచకుండా,
భయభ్రాంతులతో భాషను బతికించాలంటే ,
తెలుగొస్తుందా?
***
విపులాచ పృధ్వీ!
అందులోను, మన తెలుగు నాట మనిషికో మాట. ఏ గూటికి ఆ చిలుక పలుకు!
పిల్లలందరినీ ఒక చోట చేర్చి భాషాబోధన  చేసేటప్పుడు , మంచి తెలుగు అంటూ తత్తర పెట్టే బదులు ,పిల్లల మాటలను పిల్లలను చెప్పనిస్తే,
వారిలోని భావధారకు ఆలోచనాస్రవంతికి సృజనాత్మకతకూ..
అడ్డుపుల్ల పడదు కదా?
పైనుంచి,
ఆడుతూ పాడుతూ తెలుగు అదే వస్తుంది!
మనకు మల్లేనే !
***

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 28, 2010

పత్రిక - పాఠక సంబంధాలు !

ఈ శీర్షిక ఎక్కడో విన్నట్టుగా మీకనిపిస్తే ,
ఖచ్చితంగా అది శ్రీ రమణ గారి ,
"గుత్తొంకాయ -మానవసంబంధాలు " అన్నమాట!


కొన్నేళ్ళుగా  ,  ఆపకుండా  ఆ శీర్షికతో కలిగిన పాఠక సంబంధం మహిమ అదీ !
రచయితకి  జై కొట్టి,  ఆ శీర్షికకు భూమిక అయిన "పత్రిక "విషయం లోకి వద్దాం.


ఎప్పటిలాగానే , దీపావళి మరియు జన్మదిన ప్రత్యేక సంచిక , పత్రిక ,మన మాసపత్రిక  , ను ఉత్సాహంగా తీసుకొని అలా తిరగేయగానే,
అట్ట మీది అరచేతిలో ప్రమిద  వత్తి రెపరెపలు తాకాయి!
కాదు, ఆరే దీపానికి వెలుగెక్కువని  అందుకే కాబోలు అంటారు!

ఒకటా రెండా , ఇన్ని సంచికలు" ఆర్ధిక భారం మోస్తూ , హార్ధికం గా " పాఠకులకు చేరాలని పడ్డ తాపత్రయాన్ని మొదటి పేజీలో వివరించారు.ఆని సాధకబాధకాలు ఓర్చి , ఒక మంచి కథల  పత్రికను అందిచాలని చేసిన ఈ ప్రయత్నం చివరకు ఏం మిగిల్చింది?
పత్రికొక్కటున్న పదివేల బలగమ్ము " అన్నారు కదా , మరి అంగబలం లేక ఆర్ధిక బలం చాలక పడ్డ ఇబ్బందులు వివరిస్తుంటే, చదివి బాధ పడకుండా ఉండగలమా?
"ఆ అంతేలే , ఇలాంటి పత్రికలన్నిటి అనుభవం ఆఖరికి ఇంతేలే !" అని ఓ నిట్టూర్పు వదిలి ఊరుకొందామా?
ఒక్కో మంచి పత్రిక ఉక్కిరిబిక్కిరయ్యి ఊపిరాడక కాలంలో కలిసిపోతుంటే, తెలుగువాళ్ళం మౌన ప్రేక్షకులమై సాగనంపక ఏమైనా చేయగలమా?
సీనియర్ పాత్రికేయులు శ్రీ ఐ వి వెంకటరావు గారి మానసపుత్రిక అయిన మన పత్రిక , శ్రీరమణ గారి సంపాదకత్వంలో ఎన్నెన్ని సాహిత్యవన్నెలు చిందించిందో!
***

తెలుగునాడి పత్రిక ను ఇకపై కొనసాగించలేమంటూ ఆ పత్రిక వ్యస్థాపక సంపాదకులు జంపాల గారు , రాసిన సంపాదకీయం ఇంకా మనసు లో మొదలుతూనే ఉంది. 
ఏ దేశమేగినా మన తెలుగు వాళ్ళం ఒక మంచి పత్రికను నిలబెట్టుకోలేని వాళ్ళమై పోయామే అని దిగులు  వేసింది. ఆ సంధర్భంలో , తెలుగునాడికి రాసిన ఇ .లేఖలోంచి కొన్ని వాక్యాలు. 
మళ్ళీ ఇక్కడ ప్రస్తావించ వలసి వస్తుందని అనుకోలేదు. తప్పలేదు.

***
నిన్ననే తెలుగు నాడి ఆఖరి సంచిక అందుకొన్నాను.
 ఇక పై పదమారా పలకరించే పత్రిక ఉండదని దిగులేసింది.
ప్రతి నెల క్రమం తప్పకుండా మా ఇంటికి వచ్చే ఆత్మీయ అతిథి... ఇక రాదు.
సంపదకీయం చదివేప్పుడల్లా  స్వయాన మీరే మాట్లాదుతున్నట్లుగా అనిపించేది.
ఈ సారి మీరు రాసిన సంపాదకీయం చదవ వలసిన రోజు వస్తుందనుకో లేదు.
మరొక పత్రిక రావాలంటూ మీరు చెసిన సూచన ఎంతో హృద్యంగా తోచింది.
నిజమే .
ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండాలి.
మరొక  చోట.
మరొక సారి.
(16-6-2009)

***
"పత్రిక "వారందరికీ అనేకానేక ధన్యవాదాలు. 

పత్రిక సంపాదకులు "ఇది విరామమే కానీ వీడ్కోలు కాకుండా ఉండేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని "అన్నందుకు మరొక్క మారు జేజేలు.

కొంత విరామం తరువాత, మళ్ళీ  మన "పత్రిక" మనలను పలకరిస్తుందనే ..

ఆశతో ఆకాంక్షతో..
మన పాఠక సంబంధాలను మరొక మారు పునర్నిర్వచించే  ప్రయత్నం చేద్దాం!
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 24, 2010

పల్లెమూలాలు

స్వేచ్ఛ, సమత, సౌభ్రాతృత్వాలతో నిండిన మానవ విలువలను ఆవిష్కరించ గలిగే సమర్థత 
సాహిత్యానికి ఉన్నది.
సమాజాంలో అంతర్లీనమై సమాజాన్ని ముందుకు నడిపించగల భావ పరిణితి,మేధో చింతన  ,మానసచేతన ,మానవ సంస్కారం ,సామాజిక ఆర్ద్రత  రచయితకు ఉన్నప్పుడు ఆ రచన ఉన్నత విలువలతో మనకు అంది వస్తుంది.
ఆయా తరాలలో నవలారచయితల పరిమితులను అర్ధం చేసుకొంటూ , పరిణితిని స్వీకరించే ప్రయత్నం చేద్దాం.
అలనాటి అగ్రహార దురాచారాలను దురభ్యాసాలను ఎండకడుతూ కళ్ళు తెరిచిన రాజషేఖర చరిత్రము (1878) తెలుగు నవలకు నిజాయితీని నిబద్దతను  మార్గనిర్దేశం చేసింది.
"మాల పల్లి" లో మొదలైయిన సాంఘిక చైతన్యం కీలుబొమ్మలలో భావ చైతన్యం అయితే ,
“ప్రజల మనిషి " " జనపథం"లో “మోదుగుపూలు” పూయిస్తే , "మట్టిమనిషి " "ఆక్రందన" రేగడివిత్తులై" మొలకెత్తితే  "- చీకటిగదులలోని రాబందులను రామచిలకలు " నిలువరిస్తే నిలదీస్తే - 
"కొల్లాయి గట్టితేనేమి ?" నిబ్బరంగా " రథచక్రాల"పై నిలిచిఉంది తెలుగు నవల.
" చిల్లరదేవుళ్ల" కు వలసదేవర" చేసిన కాలరేఖలు " మన ముందు ఆవిష్కృతమయ్యాయి.
 "చివరి గుడిసె  లోని మూగవాని పిల్లనగ్రోవి " పాట ,"రాముండాడు రాజ్జివుండాది " "గద్దలాడండాయి "నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంది.
"గంగు "  లిఖించిన " బతుకు పుస్తకం "పుటలు "పంచమం"అయి , అంటరానివసంతం" లా మోసులు వేస్తూనే ఉన్నది."కాడి" మోస్తూనే ఉన్నది.
భిన్న కాలాలు .భిన్న నేపథ్యాలు. భిన్న సంధర్భాలు. భిన్న దృక్పథాలు. భిన్న పార్ష్వాలు.  
కేవలం కాలక్షేపం కోసం కాకుండా కాలగమనాన్ని కాలానుగత గ్రామీణ జీవితాన్ని కలకాలం పదిలం చేసింది. చేస్తూనే ఉన్నది తెలుగు నవల.
గత శతబ్దం ఆరంభంలోనూ ,నడుమ వచ్చిన కొన్ని తెలుగు నవలలు  ...
 ఏ ఒక్క గ్రామానికో పరిమతమై ఫోకుండా, ఆయా రచయితల భావచైతన్య రూపాలుగా తాత్విక ప్రాతిపదికలుగా ఉన్నతప్రామాణికతను సాధించాయన్నది కాలం నిరూపించిన సత్యం.
అయితే , గత శతాబ్దాంతపు నవలలు ఈ శతాబ్దారంభ నవలలు కాలం పరీక్షలో నిగ్గు తేలవలసి ఉన్నది.
ఈ నాటికీ మనం గ్రామీణ వ్యవసాయం పైననే ఆధారపడి ఉండడం .. పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం.. విపరీతమైన జనాభా పెరుగుదల ..ఉపాధి అవకాశాల లేమి .. అనివార్యమైన పట్టణీకరణ ,క్రిక్కిరిసిన పట్టణ నగర జీవనం , ప్రపంచీకరణ... 
 ఈ నాటి నవలారచయితను మళ్ళీ గ్రామల వైపే నడిపిస్తున్నట్లుగా ఉన్నది.
మాయమవుతున్న మారుతున్న విలువల కోసం మూలాల కోసం .. పల్లెల్లో వెతుకులాడున్నాం.

సమాచార విప్లవం చేత గ్రామీణజీవితంలో పెనుమార్పులు వచ్చాయి. లోకజ్ఞానం పెరిగింది. ప్రశ్నించే హక్కును ప్రజలు వినియోగించుకొనే వీలు పెరుగుతోంది. ప్రజాస్వామ్య స్వభావ స్వరూపాలు అవగాహన అవుతున్నాయి.
మరో వైపు వస్తు సంస్కృతి గ్రామగ్రామాలకు విస్తరిచిపోయింది.వినిమయప్రపంచం శాసిస్తోన్న విలువలు జీవనవిధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి.వేగంగా మారిన మారుతోన్న జీవన చిత్రాన్ని ఈ తరం తెలుగు నవల అంతే ఒడుపుగా పట్టుకోవాల్సివుంది.
వస్తువులోనూ శిల్పంలోనూ భావపరిణితిలోనూ కళాత్మకతలోనూ సందిగ్దత కనబడుతోంది. బహుశా ఈ సందిగ్దత సమాజంలోని సందిగ్దతే కావచ్చు. 
వేగంగా నలువైపులా విస్తరిస్తోన్న మార్పును స్వీకరించ లేని అన్వయించుకోలేని రచయిత అశక్తతే కావచ్చు. 
స్వీయ శక్తి సామర్హ్ద్యాలపై  కాకుండా ,ఆనాటికి అంది వచ్చే అభిప్రాయలపై ఆధారపడే ఆశ్రయ ధోరణి  వలన కావచ్చు
.ఏమైనా ఈ తరం రచయిత విశాల దృక్పథాన్ని నిండిన మానవవిలువలను ఆవిష్కరించే కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది,
వ్యక్తి , కుటుంబం ,సమాజం ,రాజ్యం ,మతం ,తత్వం,చరిత్ర ,సంస్కృతి ,ఉద్యోగం ,ఉద్యమం .పెంపుముంపు ,కరువుకాటకం ,పంట పరిశ్రమ , 
అన్నిటికీ గ్రామీణజీవితమే నవలానేపథ్యమైంది.
ఆనాటి నుంచి ఈనాటి వరకు.
తెలుగువార్లో అణువణువునా నిక్షిప్తమై ఉన్న పల్లెమూలాల్ని కదిలించగల ఆత్మీయ పలకరింపులా మన ముందు ఉన్నాయి తెలుగు నవలలన్నీ .
తెలుగువారి వాడీ వేడి  ,వాడుక వేడుక ,మర్యాదమన్నన - గ్రామసీమ.
తెలుగు వారి ఎదసవ్వడి ,హృదయవేదన ,గుండె చప్పుడు -పల్లెపట్టు.
అప్పుడు ఇప్పుడు.
ఇది సత్యం!
అందుకు తెలుగు నవల ఒక సజీవ సాక్ష్యం!

( ప్రపంచ తెలుగు సమాఖ్య వారి ప్రత్యేక అనుబంధం కొరకు వ్రాసిన(28-10-4) వ్యాసం లోంచి మరి కొంత )

  

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.