Oct 13, 2010

గిరిజనాత్మకం !


"నేను నాగురించి ఈ రోజు రాయదలుచుకొన్నాను" అంటూ పి.పద్మావతి మొదలు పెడితే, "ఈ అవకాశం మాకు వస్తుందను కోలేదు" అని అంటుంది పార్వతి.
'చిన్న కుటుంబము చింతల్లేని కుటుంబము. కానీ, మాది చిన్న కుటుంబము పేద కుటుంబము ." 
..ఈ భూమిపై ఆవర్భవించిన మానవ పక్షి యొక్క ఆత్మవ్యధ .." అంటూ తన జీవిత విషాదమేమిటొ వివరిస్తాడు భూక్యా శివ S/O మదర్ సుగుణ .

అమ్మ, నాన్న, ఆకలి, చదువుకోవాలన్న తపన, పట్టుదల ..వీటన్నిటినీ ,అక్షరాల్లో అద్ది మన ముందుంచారు కారేపల్లి కళాశాల విద్యార్థులు. గిరిజ గా మలిచి.
 కొన్ని రచనలు  చదువుతుంటే , నిండా పదహారేళ్ళు లేని ఈ పసిబిడ్డలు ఎంత ఎదిగారో కదా , వారి జీవితం ఎన్ని పాఠాలు నేర్పిందో కదా ,అనిపిస్తుంది. 
వినగలిగిన మనసుంటే, ప్రతి రచన మనకు ఒక కొత్త జీవిత పాఠాన్ని పరిచయం చేస్తుంది.
 గుండె చెమ్మగిల్లే ఈ రచనలు ,
" మాకూ ఉన్నాయ్ బాధలు ..మాకూ ఉన్నాయ్ కలలు ..మాకూ ఉన్నాయ్ కన్నీళ్ళు..  వినే ఓపిక మీకుందా? " అని నేరుగా ప్రశ్నిస్తున్నాయి.
మరి మీ సమాధానం ఏమిటో మీరే నిర్ణయించుకోండి!
***
ఏ. నిరోష రాస్తున్నది కదా,
“నేను మొదటి సారి చేసిన తప్పు అవునో కాదో నాకు తెలియదు.అది ఏమిటి అంటే ,మా ఇంటి పక్కన వాళ్ళకు తినడానికి సరిగా  బియ్యం ఉండేవి కావు.వాళ్లు మా అమ్మ లేకుండా చూసి నన్ను అడిగే వారు. వాళ్ళను చూస్తే నాకు బాధ అనిపించేది.వాళ్ళు అడిగినప్పుడల్లా నాకు బాధ అనిపించేది.వాళ్ళు అడిగినప్పుడల్లా నేను బియ్యం ఇచ్చేదానిని." అంటూ తన జ్ఞాపకాలు పంచుకొంటోంది .
అంతే కాదు, జ్వరం వచ్చి కామెర్లు సోకిన తండ్రిని పసిబిడ్డలా చూసుకొని, అలసిసొలసిన  అమ్మకు  చేదోడు గా కూలీ చేస్తూ తండ్రి ని ఆరోగ్య వంతుణ్ణి చేసుకొంది. ఇప్పుడు  ఒక ఆరోగ్యకార్యకర్త గా శిక్షణ పొందుతున్నది!

“ నాకు నేను నచ్చ లేదు " అంటూ ఒక విద్యార్థిని ఎందుకు తనకు తాను నచ్చలేదో వివరిస్తే,మరొక అమ్మాయి ఆ 
నచ్చనితనాన్ని ఎలా అధిగమించను చేయదలిచిన ప్రయత్నాలనూ చెపుతుంది.

"నాకు అన్నం ఎలా దొరుకుతుంది ? " అని ఒకరు ప్రశ్నిస్తే, తమకు పిడికెడు మెతుకులు, గుప్పెడు అక్షరాలు  అందివ్వడం కోసం ,అమ్మానాన్నలు పడే కష్టాలను కళ్ళకు కట్టేట్టు చిత్రించారు  ఈ కొండ పిల్లలు.

"నర్సింగ్ అంటే ఎవరికైనా చులకన. చాలా మంది నర్సింగ్ చేసున్నామని చెప్పుకోవడానికే సిగ్గుపడతారు."అని చెపుతూ తానెందుకు నర్సింగ్ చేయ దలుచుకొందో చెపుతుంది, నర్సింగ్ వలన సమాజసేవ ఎక్కువగా అలవాటు అగును "..అని.
మరి మీరు గణితి వెంకయ్య అనే నాయకుడి గురించి విన్నారా?
"నాకు నచ్చిన నాయకుడంటే,మంచి వాడు,ప్రజల బాధలను తెలిసిన వాడు, మనస్సు సున్నితమైనదిగా చెప్పుకోవచ్చును.' అతను డి.బాలాజీ ఊరి నాయకుడు, బాలాజి ఊరినంతటినీ  “ వెంకయ్య గుంపు “ అనేవారంటే ,అతను ఎంతటి నాయకుడొ , గ్రహించమంటున్నాడు బాలాజీ.
ఇక, మన రాజకీయ నాయకులు వెంకయ్య నుంచి నేర్వ వలసింది ఏమిటో మీరు
గ్రహించారు కదా?
" మనలో కూడా ఈ ఆలోచన అనేది మార్పు తీసుకు వస్తుందా? అని అంటారా?  తప్పకుండా తీసుకు వస్తుంది. ఎప్పుడంటే ! మనం ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు. ఆలోచిద్దాం .మనలో మార్పును ఆహ్వానిద్దాం " అంటుంది శశిరేఖ.
అందుకేనేమో, దరువేసి మరీ చెపుతోంది శారద," అమ్మాయి జీవితం "లో మార్పును ఆశిస్తూ,

"అమ్మా మీకు చెపుతున్నా వినవే అమ్మా
నాన్న మీకు దండం పెడతా వినవా నాన్నా (2)
నాతోటి వాళ్ళందరూ  "ఓహో "
బడికి వెళుతుంటే " ఆహా"
నాకు వెళ్ళాలనిపిస్తుంది ఓ నాన్న
నన్ను కూడా బడికి పంపించవే అమ్మా  (2)"

" ...సార్ , మానవత్వం పోయింది. దాని విలువ వంద రూపాయలు. ఈ గదిలో ఎవరికైనా దొరికిందా?" అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే  హృద్యమైన కథ ఎం.మోహన్ ది. 

ఇవే కావు, "తిన లేని పండు" "తలపాగారాజు " వంటి సరదా కథలూ ఇందులో ఉన్నాయి. 
వ్యక్తిత్వ వికాసం , సైన్సు పాఠాలు ,సుస్థిర వ్యవసాయం, పర్యావరణం 
 అధ్యాపకుల అభిప్రాయాలు ,కవితలు,సామెతలు, అవీ ఇవీ అన్నీ ..ఒక్క చోట ప్రోది చేసారు ..వీరు.

" సీతాఫలం చెట్టు ను చూస్తే ప్రతి మానవుడి నోరూరుతుంది .దాని మీద నిగనిగ లాడుతున్న పండు ,సీతాఫలం కాయ,కు ఏం తెలుసు మనుష్యులందరూ పండు కోసం చూస్తున్న సంగతి ? చెట్టు గుట్టును రట్టు చేసేది (తెలిపేది)  పండు, సీతాఫలం కాయే, కదా? "అని రాస్తూ జి శివాజి ఇలా ముగిస్తాడు ," అలాగే మా అమ్మ యొక్క ఆత్మీయత గురించి మా అమ్మ వాత్సల్యం గురించి గాని, మా అమ్మ మన్స్సు గురించి గాని ,ఒక కొడుకుగా మాతల్లి యొక్క బాధను తొలగించి , నిజమైన పుత్రుడిగా నడుచుకొంటాను" అంటాడు శివాజి , అమ్మను చెట్టుతో ,తనను పండుతో పోల్చుకొంటూ.
కొండా కోనల్లో ఆడుతూ పాడుతూ పెరిగే ఈ గిరిసంతతి , పలకాబలపం బట్టి ,అక్షరం నేర్చి , బడి మెట్లెక్కి ,కళాశాల లోగిలిలో నిలబడి , చేస్తోన్న అక్షర చమత్కారం ఈ "గిరిజ" .
కారేపల్లి ప్రభుత్వ  జూనియర్ కళాశాల , వార్షిక సంచికను ఒక సాహిత్య సంచిక గా రూపొందించడంలో అధ్యాపకుల కృషి ,ప్రధానోపాధ్యాయుల వెన్నుదన్ను స్పష్టంగా కనబడుతున్నాయి.
వారికి ధన్యవాదాలు. 
ప్రభుత్వ కళాశాలు ఇంత చక్కటి ఉదాహరణగా నిలబడడం  కన్నా ఆనందం ఇంకేముంది?

ఈ పిల్లల మాతృ భాష తెలుగు కాదు. తెలుగు నేర్చి ,ఆ తెలుగునే తమ ఆలోచనలకు అనుభూతులకూ వ్యక్తీరణమాధ్యమం గా  వారు మలుచుకొన్న తీరు, 
మనం తెలుగు వాళ్ళం అమ్మ మాట మన నోట పలికితే నామోషిగా భావించే ముందు, 
ఒక మారు ఆలోచించాలి మరి !
పరభాష  మీద వారు సాధించిన పట్టు , ఎంతో అభిమానం గా ఆప్యాయంగా పదాలను అల్లుకొన్న తీరు ముచ్చటేస్తుంది .కదండీ.
అందుకై,
ఎంతో శ్రద్ధగా తరగతిని సృజనాత్మకం గా మలిచిన   తెలుగు అధ్యాపకులను వారు  చేసిన కృషినీ ,
మనం అభినందించక తప్పదు.

ఇంత మంచి ప్రయత్నం చేసిన కవి సీతారాం గారికి ధన్యవాదాలు.

***

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 7, 2010

అఖిలాంధ్ర పాఠకులకు

అసలు సిసలు వైరాగ్యం అంటే ఏంటో-
నన్నడగండి. చెపుతా.
అచ్చమైన స్వచ్చమైన వైరాగ్యం అంటే ఏంటో-
అదీ నాకు తెలుసండోయ్!

ఆ చిదంబర రహస్యం..
నేనేదో  అడ్డొచ్చిన అడవుల బట్టో..
ముక్కు మూసుకొని ఒంటికాలిమీద తపస్సులు చేసో..
కనబడ్డ గ్రంథాలయాల్లోఅంతా దూరేసి..
చేతికందిన పుస్తకాన్నల్లా గిరిగిరా తిప్పేసో..
గురూజీఅమ్మాజీల శిష్యరికం బట్టో ..
చెప్పిన బోధలన్నీ శ్రద్ధగా చెవిన బట్టో..
తెలుసుకోలేదండోయ్!

పోనీ,  బుద్ధిగా  కూర్చుని  ధీర్ఘంగా చింతన చేద్దామన్నా  , 
మా వీధిలో రావిచెట్టైనా లేదయ్యే !


ఉన్న దాన్ని ఉన్నట్టు ఊరక ఉండక..
అడపా దడపా ఓ పుస్తకం అచ్చేసి ..
తెలిసేసుకొన్నా!

అదండీ విషయం!

అసలు సిసలు వైరాగ్యం అంటే..
"అచ్చు వైరాగ్యం..!"
అచ్చమైన స్వచ్చమైన వైరాగ్యం అంటే...
"ప్రచురణ వైరాగ్యం.. " అన్న మాట !!!

చూడండి.
ఎప్పుడు పుస్తకం అచ్చేసినా ..
ఖరాఖండి గా ఖచ్చితంగా..
అనుకుంటాం కదా .. "ఇదే ఆఖరుది !" అని.

ఇంతలోనే ఏ అర్ధ రాత్రో, లోలోపల .. ఓ చిన్ని ఆలోచన తొలవడం మొదలవుతుంది. 
అంతే!
ఆలస్యం చేయకుండా , ఆ తెల్లారే  అచ్చుపనిలో పడతాం. 
బోర్లా బొక్కలా!

"అఖిలాంధ్ర పాఠకులకు అక్షర నీరాజనం " అంటూ నోరారా మంగళగీతాలు పాడుకొంటూ "అచ్చు హారతి "ఇచ్చే లోగా..
ఉన్న శక్తియుక్తులతో పాటు , 
పోపుడబ్బాల్లో బట్టలదొంతర్లో దాచిఉంచిన కొద్దిపాటి రహస్య నిలవలతో సహా ..
సమస్త నిధులూ ..కర్పూరంలా ఇట్టే హరించుకుపోతాయి!

అవన్నీ సరే, తాజాగా తళ తళలాడుతున్న సరికొత్త పుస్తకం , అందునా సొంత పుస్తకం, చేతిలోకి తీసుకోగానే ...
లెక్క ప్రకారం ..
పురిటికందు ను తొలిసారి పొత్తిళ్ళలోకి పొదివి పట్టుకున్న అమ్మ లా మురిసి పోవాలా...
అదేంటొ గానీ..
ఆ బిడ్డ టీకాల ఖర్చునుంచి ట్యూషను ఫీజుల వరకు , పురిటిస్నానం నుండి ఉద్యోగ ప్రస్తానం వరకూ.. తారలను తాకే ధరచీటిలు తల చుట్టూ గిర గిరా తిరుగుతుంటే ,వెలాతెలా బోయే ...నాన్న లా ..నిలబడిపోతాం!
కొత్త పుస్తకానికి .. అందులోనూ తెలుగు పుస్తకానికి.. అమ్మయినా నాన్నయినా ... 
పాపం .. రచయితేగా!

ఫలానా పుస్తకానికి ఇన్నిన్ని మిలియన్ డాలర్లు ముందస్తు చెల్లింపులు జరిగాయనో ..
ఫలానా రచయిత ఒకానొక ద్వీపంలో రాజభవనంలో పూలతోటల్లో నివసిస్తాడనో .. విన్నప్పుడు ...  ఆ కాకమ్మకబుర్లు కట్టుకథలు గా ఎందుకు తోచవు మరి?
సరే, అవన్నీ మనబోటి వాండ్ల ముచ్చట్లు కావు కానీయండి.
అవలా ఉంచండి.

రాసినదేదో రాసినట్లు ఊరుకోక ,తగుదునమ్మా అంటూ అచ్చేసుకోను వెళ్ళడం దేనికి ?
అచ్చుతప్పులు దిద్దుతూ ,అక్షరాలు పేరుస్తూ ..బొమ్మలు గీయించుకొంటూ ,పేజీలు అలంకరింపజేసుకొంటూ ,
బైండింగులను పరిశీలిస్తూ , ఒట్టిఅట్టా ...గట్టి అట్టా ...బేరీజులు వేసుకొంటూ..నిర్ణయాలు తీసుకొంటూ ... 
దుమ్ముధూళిలో పడిపోకుండా కాస్త కనబడేలా ఈ పుస్తకాన్ని ,
అరల్లో అమర్చమని అంగళ్ళ వారికి బతిమిలాడుతూ.. విజ్ఞప్తులు చేస్తూ ,


పరిపరివిధాలుగా .. పదే పదే ఆ శుభకార్యంలో మునిగి తేలుతూ...
నిశ్శబ్దంగా చేతిలో వచ్చి పడే బిల్లును చూసి కూడా , గుండె నిబ్బరం చేసుకొంటూ..
ఉండే క్రమంలో ..


అసలు రచయిత చేయ వలసిన రచనలన్నీ కొండెక్కుతాయంటే , ఎక్కవు మరీ?

ఇక ,అచ్చుతప్పుల దిద్దుబాటు కార్యక్రమం పుస్తకం అచ్చయ్యాక కూడా , 
నిద్రనడకలా పగటికలలా వదలక వెంటాడం లో వింతేముందీ?

చుట్టూ గుట్టలు పడ్డ అట్టపెట్టెలోంచి అందమైన ముఖపత్రాలు వెక్కిరిస్తుంటే , 
మంచం కిందా, అటకల్లో .. ఎక్కడపడితే అక్కడ , వాటిని దూర్చేసి పేర్చేసి ,
అటు వెళుతూ ఇటు వెళుతూ .. 
కాలి  బొటన వేలికి ఎదురు దెబ్బలు తగిలించుకొంటూ , 
ఏ బీరువా మీద నుంచో దభీలున వచ్చి పడే బౌండు పుస్తకం నుదుటికి కట్టించే బొప్పిని తడుము కొంటూ ..
మరికొన్నాళ్ళు ఇలా పుస్తకాల దొంతరల మధ్య సహజీవనం చేయాలన్న
 సత్యాన్ని ఇంట్లో వారందరూ జీర్ణం చేసుకొంటూ..

" ఇదే అచ్చు వేసే ఆఖరు పుస్తకం !" అంటూ అడిగిన వారికీ అడగని వారికీ వివరణలూ సవరణలూ గట్రాలన్నీ సవినయంగా సమర్పించేస్తూ.. 
నిట్టూర్చి నిమ్మళపడే లోగా..

మరి ప్రచురణ వైరాగ్యం కలగదేంటండీ?

*
ఒక్క నిమిషం.
ఎవరిదో చిట్టిసందేశం.


"మీది ఫలాన పుస్తకం ఎక్కడా దొరక లేదండీ. ఎన్నాళ్ళుగా వెతుకుతున్నానో! ఎక్కడ అడిగినా లేదన్నారు.మీ దగ్గరేమైనా ఉందేమోననీ.."
"అది అయిపోయింది.అచ్చేయాలి."
" వేయండి మరి! "
*
తథాస్తు !

***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.