Sep 24, 2015

పఠన విలాసం !

ప్రతి ప్రయాణం ఒక కొత్త స్పూర్తి !
 ఈ సారి కథ కోసం ప్రయాణం.
చాన్నాళ్ళ  తరువాత, హాయిగా కాళ్ళు జాపుకొని, వెచ్చటి  అల్లం తేనీరు గుటకలు వేస్తూ, కమ్మటి చిట్టిగారెలు రుచి చూస్తూ..పుస్తకం చదువుకొంటూ …. అబ్బో... ఓ కలలా ప్రయాణం!
పుస్తకం వేగంగా ముందుకు సాగుతోంటే, చెట్లూ పుట్టలూ ,స్తంభాలు ,స్టేషన్లూ మరింత వేగంతో వెనక్కి పరిగెడుతున్నాయి. మైళ్ళకొద్దీ దూరం. పుటల్లో మటుమాయం.


 అయితే, ఆ పుస్తకమేమోపెను నిద్దరను , నిద్దరలో అదాటున పలకరించే కలలను వదలగొట్టి,నిటారుగా కూర్చోబెట్టి మరీజీవనాంత గమనాల అంతిమమజిలీలో తారసపడే తప్పనిసరి సంధర్భాలని విడమరిచి చెప్పినది.
చివరికి జరిగేదేమిటి ?  ఈ మానవ జీవన ప్రయాణానికి సహజ అంతిమ పరిణామం ఏమిటి? ఎప్పుడు మొదలవుతుంది ? ఎప్పుడు గ్రహింపుకు వస్తుంది? ఎన్నడు ముగింపు కు వస్తుంది?
మనిషి అత్యంత ఉత్సాహభరితం గా ఆరోగ్యవంతంగా చైతన్యదీప్తమైనట్టుగా  కనబడే నడి వయస్సు , ఈ మానవ శరీరంలో ఈ అంతిమ యాత్రకు నాంది పలుకుతుందా?  ఈ జీవనయాత్ర చివరి అంకం ఎంత దాకా సాగుతుంది? ఎప్పుడు గమ్యం చేరుతుంది?   ఈ ప్రశ్నలన్నిటికీ ఒక సూత్రబద్దత ఉన్నదా? సహజత్వము సంభవమేనా?
ఎక్కడ ఇలాంటి ఎన్నెన్నో సున్నితమైన సందేహాలకు మరింత సున్నితంగా , వైద్య పరిభాషను నా బోటి వాళ్ళకు వొలిచిపెట్టి చెపుతూ సాగినది.
వృత్తి ధర్మంగా నిత్యమూ మరణాన్ని ప్రకటించే వైద్యుడి మానవ స్పందన ఇది.
ఆఖరి ఘడియల్లో మానవ మర్యాదను, హుందాతనాన్ని , గౌరవాన్ని నిలపడం ఎలా? అన్న ప్రశ్న అతనిని తొలిచి వేస్తుంది.  ఆఖరి మజిలీలో చిట్టచివరి ప్రయాణంలో, మనిషికి తోడయి నిలిచే దేమిటి? వినపించే జీవన ధ్వనులేమిటి ?
మానవ స్పర్షలేని ప్రాణవాయువు గొట్టాలా? మానిటర్ల హెచ్చరికల లయ లా?
మన వైద్య పరిజ్ఞానమంతా , జీవన ప్రయాణ అంతిమ ఘడియల్లో ఎలా జీవించామన్న దిశగా సాగాలి. ఎలా మరణించామన్న విషయం కోసం కాదు. ఈ నాడు మనకున్న వైద్య సాంకేతిక నైపుణ్యాలు, సౌకర్యాలు ఏ మాత్రం సానుకూలంగా లేవు. మానవ మర్యాదను నిలబెట్టేట్టుగా లేవు. అన్నది ఈ వైద్యుడైన  రచయిత ఆవేదన.
ఆఖరి ఘడియలను నలుచదరపు గదిలో నలిగిపోనీయకుండా నలువైపులా కిలకిలారావాలు వినిపిస్తే ఏమవుతుంది ?. గాజు  గదిలో మరణశయ్యపై వంటరి తనపు నిర్వేదంలో మగ్గి పోనీయకుండా , 
మరింత  మర్యాదగా మనిషిని సాగనంపలేమా? నొప్పి, బాధ ,దుఃఖం ,ఒక్క సారిగా కళ్ళ ముందు విప్పుకొన్న గడిపివచ్చిన జీవితం అన్నీ ముప్పిరిగొనగా .. ఆ మనిషిని ఆధునిక వైద్యం ఉపశమనాన్ని ఇస్తోందా ? మరణం గురించి  మాట్లాడకుండా , మరింత మభ్య పెడుతోందా?  జీవన గమనాల అంతిమమజిలీలో తారసపడే తప్పనిసరి సంధర్భాలని , నిశ్శబ్దంలోకి నెట్టేస్తున్నామా .అశక్తులమై.
 రచయితలో వేళ్ళూనుకొన్న ఈ ఆలోచనలకు మూలం టాల్స్ టాయ్  " ద డెత్ ఆఫ్ ఇవాన్ ఇలియిచ్" నవల . ఆకస్మాత్తుగా మంచాన బడిన ఇలియచ్ చిట్టచివరి రోజులనూ ఘడియలనూ .. భిన్న దృష్టితో చూడడం మొదలు పెడతాడు. తను, తన జీవితం, మానవ సంబంధాలు, దృక్పథాలు .. వీటన్నిటి విశ్లేషణ కన్నా.. మించిన అంశాన్నేదో అనుకోకుండానే అన్వేషిస్తాడు. ఇలియచ్ మరణంలో తన జీవితం తారసపడుతుంది.
తన వారిలోనూ, తన వృత్తివ్యాపకాలలోనూ మరింత అన్వేషణ జరిగింది. ఆ అంతర్మధనం ఫలితమే ఈ”Being Mortal, Medicine and What matters at the End ” పుస్తకం. 
భిన్న సాంస్కృతిక నేపథ్యాలతో అతుల్ కు ఉన్న సాన్నిహిత్యం మరింత లోతైన అవగాహనను అద్దింది.
చదివి చూడండి. 
సావకాశంగా.
అంబులెన్స్ సైరన్లు ..మానిటర్ల బీప్ ల మధ్య పక్షుల కిలకిలారావాలు వినండి.గంగలో అయిన వారి అస్తికల నిమజ్జన అలజడిలోని నిశ్శబ్దాన్ని వినండి.  
సావధానంగా! 
 ***
ప్రయాణం పూర్తి కాక మునుపే పుస్తకం ముగింపుకు వచ్చింది.
ఒక ఉలికి పాటుతో.
అల్లం తేనీరు సమయానికి అంది వచ్చింది !

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 4, 2015

పంతుళ్ళపండుగ ప్రత్యేకం !

 మొన్నో రోజు పొద్దునపొద్దున్నే ...
మా పిల్లలకి పాట నేర్పాలని మొదలెట్టా.

" అడవిలోన  నెమలికెవరు ఆట నేర్పెను ?"
" వాన నేర్పింది ! "  మా బుద్ధిమాన్ బాలిక ఠపీమని అంది. 

నేను పట్టు వలదలు తానా ?

"కొమ్మ పైన కోకిలమ్మకెవరు పాట నేర్పెను ? "

"వాళ్ళే నేర్చుకొన్నారు ! " బుద్దిమాన్ బాలిక ఖంగుమంది. 

హమ్మయ్య ! 
మా పిల్లజనాభాకి తెలిసిపోయిందోచ్ ! 
నేర్పువారెవరు ? నేర్చుకొనువారెవ్వరు ?
***

అదే మాట అంటోంది... TED Talk లో..
అదితి పారెఖ్ ..బుద్దిమాన్ బాలిక,  
మాటలు విని తరించండి.
పంతుళ్ళపండుగ ప్రత్యేకం !


 https://www.youtube.com/watch?v=PFHXx2Jx7VU

***

పంతుళ్ళపండుగ శుభాకాంక్షలు !
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.