Aug 30, 2015

యదియే పదివేలనిన్నీ ...!!!

యాకస్మాత్తుగా, 
సాహితీ పోషణ శాయవలనన్న కుతూహలంబు బుట్టినది.

తలచినదే తడవుగా, సందేహాల తుట్టె రేగినది .
మీమాంస మిగిలినది.
విజ్ఞులు సందేహ నివృత్తి సేతురుగాక !

మొదలాదిగా ,
సాహితీ సేవ శేయుటయెట్లు? బుట్టెడు పుస్తకంబులు వదలక జదువుటయా? తట్టెడు పుస్తకరాజంబులు విడువక వ్రాయుటయా? సంచీడు రూకలు చేతబూని, సభలూ సన్మానములు శేయుటయా ? శేయించుకొనుటయా?

ఆ ప్రకారంబుగా , 
తలకు తట్టెడు ఆలోచనలతో సతమతమయ్యిన్నీ....
 ఇప్పటికియ్యది యప్రస్తుతంబనిన్నీ ...
 ఏదేని ఒక పుస్తకంబు జదివిన యదియే పదివేలనిన్నీ .... 

యధా ప్రకారంబుగా ....కడుంగడు శ్రద్ధతో... జదవదొడిగితిని.


అయ్యహో... ఏమది ! 
యది ఎంతకూ తరగుట లేదే....! smile emoticon
***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 28, 2015

అక్కను నేను ! రష్షించేస్తాను !



అక్కను నేను ! రష్షించేస్తాను ! 

బడిలో బాలికల కొత్త బాట !

" మేం చేసిన రాఖీలు వాళ్ళకు కట్టాము. వాళ్ళు చేసిన రాఖీలు మాకు కట్టాలి కదా? 
మాకు ఎందుకు రాఖీలు కట్టరు ? " బుద్దిమాన్ బాలిక సూటిగా అడిగింది.
"ఎప్పుడూ మేమే కట్టాలా?" అన్నుల మిన్న అలిగింది.
"సుశ్రుత్ ను నేనూ, ధీరూ ని అక్షర, వరుణ్ ని తాన్వి ... బాగా రష్షిస్తున్నం కదా? మాకెందుకు రాఖీ కట్టలేదు?" తస్నీం గట్టిగా అడిగింది.
***
"అక్కా , నా రాఖీ నీకు కడతా" కనిష్క అడిగింది. 
"నేను బాను అక్కకు కడతా!" ఋత్విక  మెల్లిగా అంది.
"మరి స్వప్నక్క కి ? నిరోషక్క కి?"అన్విత జ్ఞాపకం చేసింది ."ప్రియక్కకు కూడా! "
"అక్కలకు కాదమ్మా , అబ్బాయిలకు  కట్టాలి !"
"మీరే కదా చెప్పారు. రష్షించే వాళ్ళకు కట్టాలని! మీరే కదా మమ్మల్ని రష్షిస్తారు ?" బుద్ధిమాన్ బాలిక ఘర్జించింది.
***
"రక్షించడం  అంటే ఏంటమ్మా?" అక్క అడిగింది.
" బాగా చూసుకోవడం!" 
టకీమని సమాధానం. 
ఏ మాత్రం తడబడకుండా ! 

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 16, 2015

ఇదం శరీరం !















పరోపకారర్ధమిదం శరీరం !

నమ్మిన మార్గాన మొక్కవోని కృషి చేస్తూ,
నమ్మిన బాటనే తరలివెళ్ళిన 
లవణం గారికి గౌరవవందం.


నేత్రాలను,అవయవాలను  ఇతరుల జీవితం కోసం ...
శరీరాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం....
వదిలి వెళ్ళిన ప్రముఖ నాస్తిక వాది లవణం గారు ... 
ఆఖరి నిర్ణయంలోనూ తమ మార్గం లోనే నడిచి వెళ్ళారు. 
గొప్ప ఉదాహరణగా మిగిలివెళ్ళారు.   గౌరవ నివాళి.






All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 15, 2015

జల్దుకొని కళలన్ని నేర్చుకొని ...!



అబ్బ... ఎంత అల్పసంతోషులమండీ మనం !

మొన్నటికి మొన్న సత్య నాదెళ్ళ, నిన్నటికి నిన్న సుందర పిచ్చై  ...
ఆ నడుమ రాజ రాజేశ్వరి  ..ఇంకాస్త ముందుగా శంతను నారాయణ్ ..
మన మధ్యనే ఉన్న భారతీయ వారసులుగా మన గురించి మనం కనే కలలని తిరగ రాశారు.

మన అన్నదమ్ముడో ఆడపడుచో  అంతటి అందలాన్ని అందుకున్నారన్నంతగా.
మనం తెగ మురిసి పోతున్నాం.
వారి విజయాలను  తలుచుకొంటూనే మన హృదయాలు సంతోషంతో ఉప్పొంగి పోతున్నాయి.

ఆటగాళ్ళు , పాటగాళ్ళకు మాత్రమే పరిమతమైన రోల్ మోడళ్ళకు ధీటుగాఈ  ఉన్నతవ్యక్తులు ఆకస్మాత్తుగా మన ముందుకు వచ్చి, నిలబడిముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు.  
తమ తెలివితేటలతో మన దేశానికి  సరికొత్త ఆదర్ష పాత్రలయ్యారు వీరు.

నిజమే కదా.
వారి ప్రతిభ,విజ్ఞత ,నేర్పరితనం  చూస్తూ ఎవరమైనా ముచ్చటపడ కుండా ఎలా ఉండగలం ?
వారికి  మనసారా జేజేలు.

ఈ సంధర్భంగా భారత మేనేజర్ల దార్శనికత గురించి బహుదా ప్రశంసల వర్షం కురుస్తోంది.
 ఈ ప్రశంస లోనే, ఒక చిన్న మెలిక మాట  కలగలసిఉంది,
  "భారతీయులు నూతన కంపనీల  సాహస వ్యవస్థాపకులు  కాకపోయినా " అని.

నిజమండీ..
మనలో మాట.
ఒకానొక కాలేజీలో కంప్యూటర్లు కాని డిగ్రీ  చదివి, ఎంబీయె  లు సగాన వదిలేసి .. విప్లవాత్మక సాంకేతిక ఆలోచనలను  వ్యక్తపరుస్తూ, పట్టుమని పదేళ్ళలో అత్యంత కీలక స్థానానికి ఎదగడం అన్నది... ఈ సువిశాల భారత దేశ సరిహద్దుల  నడుమ  మాత్రం ....
ఏక్ దం బాలీవుడ్ ..లేదూ  అరవ ...మరీ మనదనుకొనే పక్కా తెలుగు సినిమా  కథ !

కాలికి పసురు రాసుకొని.. పెరుగన్నం మూట భుజానేసుకొని ...దేశాలు పట్టి పోక పోతే.. ఎవడండీ.. డిగ్రీలు మార్చుకొని .. సగం సగం చదివిన వాడికి ఈ దేశాన ఉద్యోగం ఇచ్చేది? ఇచ్చినా  పై మెట్లు ఎక్కనిచ్చేది?

ఇక ప్రతిభ అంటరా.. అది మనిషిని లోలోన దహించి వేయ కుండా ఎలా ఉంటుంది? అందుకే కదా, ఆ యువతరమంతా చిన్నచితక పనులను ఎవరికి వారు మొదలు పెట్టుకొని పొట్ట నింపుకొనేది. కోటి విద్యలూ కూటి కొరకే ననీ..
     ఎన్నెన్ని కొత్త కొత్త ఆలోచనలు … ఎంతటి పరిశ్రమ .. ఎంతటి వ్యవస్థాపక దృష్టి... ఎంతటి దార్శనికత ..ఎంతటి వ్యవహార దక్షత ...  ఎటు పోతోంది?  
    ఏ మట్టి కొట్టుకుపోతుంది.?
   చదువులతో  నిమిత్తం లేకుండా.. ఎవరికి వారు తమ పనిని తామే
  సృష్తించుకోనే సాహసం చేయనిదే బ్రతికి బట్ట కట్టేదెలా ? చిన్నచితక స్వంత వ్యాపార వ్యవహారాల్లో మునిగే వారే కానీ, ఉద్యోగాల తంతుల్లో పడేదెవరూ ? బతుకుతెరువు   వెతుక్కోక పోతే జీవన  మార్గం ఏదీ ? వెతుక్కోక పోతే జీవన  మార్గం ఏదీ ?
  ప్రవాసీయులకు ఉద్యోగాల్లో ఒదిగి ఎదగడం తెలిస్తే, నివాసులకు  ఎవరి ఉద్యోగమో సద్యోగమో   వారే  సృష్టించుకొని బతకాల్సిన పరిస్థితి.
జీతాలకు గీతాలకు అలవాట పడిపోయిన పాత  ఉద్యోగరత్నాలతో  ఔత్సాహికులు ఏం పోటీ పడగలరు ? ఆ ఎక్కుడు తొక్కుడు పీతలబుట్టల్లో ఎందాక ఎదగ గలరు ?
  
  ఈ  నవ ప్రవాస భారతీయవిజేతల  ముందు చూపు బహుశా   తమ ప్రవాస జీవితాన్ని ఎంపిక చేసుకోవడంలోనే , బయటపడిందా?
 మన దేశానే ఉంటే వారి ప్రతిభ బయటపడేదా ? వారి ప్రతిభ కు ఆవిష్కరించుకొనే అవకాశము ,వాతావరణము , మనం కల్పించగలమా

"చదువుకొన్న భారతీయ యువత లేవండి. పొట్టబట్టుకొని దేశాలు పట్టుకొని వెళ్ళండి. మీ ప్రతిభను ప్రదర్షించండి. మా ప్రశంసలు అందుకోండి."

చదువబ్బలేదూ ఏదో ఓ రంగు జండాలు పట్టుకొని మాకు కాపు కాయండి. లేదూ, మీకు తోచిన పనులేవో మీరు చేసుకు బతకండి. మా పన్నులు మాకు కట్టండి .

జల్దుకొని కళలన్ని నేర్చుకొని ... విదేశీ సరుకులవ్వండి !
ఆ గమ్యం చేరేదాకా విశ్రమించకండి ! "

***
ఇది మనం సంబరపడాల్సిన విషయమా?
స్వాతంత్రదినోత్సవ వేళ !
ఆలోచించండి.
***



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 11, 2015

నిజమా.. మరిచి పోవడమా?

" ఎవరో వస్తారనీ...
ఏదో చేస్తారని...
ఎదురు చూసి మోస.పోకుమా.....
నిజము మరిచి నిదుర పోకుమా....."

ఇవ్వాళ్ళ పొద్దున పొద్దున్నే..
సందుల్లో గొందుల్లో
సమ్మెల్లో బందుల్లో..
ఊళ్ళో ఓ చుట్టు చుట్టి ...
తిరిగి ఇంటి గుమ్మం తొక్కేదాకా ....
ఎందుకో ఈ పాట దారంతా వదలకుండా..
నా బుర్రలో రామకీర్తనలా హోరెత్తిందండీ బాబూ !
***
పాటకు పక్క తాళంలా ...
డిగ్రీ చదివి .... రోడ్డున పడ్డ ... ఈ పూట రథ సారధి గారి ఆటో రాజకీయ విశ్లేషణ!
ఇక,
నిజమా.. మరిచి
పోవడమా?
***

హతోస్మి !



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 7, 2015

లడ్డూ కావాలా ?

పుట్టిన రోజు జేజేలు !
కేకురహిత పుట్టినరోజులకు ప్రభవలో నాంది!
***
చేనేత దుస్తులు , ఇంటి మిఠాయి ల చేర్పు.
దీపాలు ఆర్పడం, కేక్ కోయడం ,వీడ్కోలు కానుకల రద్దు.
ఈ మధ్య అమ్మాన్నానలకు పంపిన "ప్ర్హవలో పుట్టిన రోజు " అన్న సూచనల ఉత్తరంలోని ప్రతి సూచననూ, తూచ తప్పకుండా పాటించారు...ధీరు అమ్మానాన్నలు .
వారికి ధన్యవాదాలు.

ధీరూకి జేజేలు.






All rights @ writer. Title,labels, postings and related copyright reserved.