Feb 27, 2014

ఒకటీ ఒకటీ పదకొండంట!

బుద్దిమంతురాల్ని కదా,
కాస్త ఆలస్యం గానే పేపరు తిరగేస్తా.
ఈ పూటా మరీను.
మొదట పేజీలో ,కొట్టొచ్చినట్టుగా ఓ ఫోటో,నన్ను ఇట్టే కట్టేసింది.
" కష్టకాలంలో మీకు అండగా ఉంటాం"అంటూ!
కష్టకాలం ఎవరికబ్బా అన్న ప్రశ్న ఓ పక్క ములుకులా గుచ్చుకొంటున్నా, ముచ్చటగా ఉన్న ఆ చిత్ర రాజాన్ని మెచ్చుకోకుండా ఉండలేం కదా?
నిన్న గాక మొన్న, కలవర పడ్డవారంతా, కంగారు పడ్డవారంతా, రెండురోజుల్లో కుదుటపడ్డారంటే మాటలా!
కళలాడుతోన్న ముఖాలు. తళతళలాడుతున్న ధవళ వస్త్రాలు.
ఏదో సబ్బుబిళ్ళ ప్రకటన కోసం తీసినట్టు.
చక్కటి ఫ్రేమింగూ టైమింగూ .
అద్బుతమైన రంగులు హంగులు.వెలుగులు నీడలూ.
అమ్మ వారి దర్శనం  చేసుకొని తిరిగి  వస్తున్న మన పదకొండు మంది  నేతన్నగార్లూ!
అమ్మ వారి ముందు సాష్టాంగ పడ్డారా.అష్టొత్తరాలు చదివారా ..లాంటి కొంటె ప్రశ్నలు అడగబోకండి !
ఉష్!
బహుశా , Ocean Eleven  అన్న పేరు ఇలాంటి ఫుటో చూసే తట్టుంటుంది సుమీ!
మాటలా మరి!
తుఫాను రోజుల్లో  హెలిక్యాప్టర్ల్లో కూర్చోని ,
గుండెల్లోతు నీళ్లల్లో   నానుతోన్న మన మీదకు జాలి గుండెతో విసిరేస్తే  ,
నీళ్ళ పాకెట్లు వచ్చి పడ్డటు ,
మన మీదకు  ఆ పదివేలకోట్ల ప్యాకేజీలు విసిరిపడేయ బోతుంటే,
అన్నగార్లు హుషారుగా ఎగిరి పట్టుకోవద్దూ?
దొరికిన వారికి దొరికినంత మహదేవ!

 నా మట్టుకు నేను ,
"ఇక పై పిల్లల కథల్లో,
సముద్రపు దొంగలంటే అచ్చం  ఇలాగే ఉంటారని చెప్పుకోవాలి గాబోలు  !
అనుకొని బుగ్గలు నొక్కుకొన్నా!
ఎంతైనా సముద్రపు తీరాలను నమ్ముకొన్నవారం ,సముద్రపు ఉప్పు తినే వాళ్ళమయ్యే ! 
కదండీ!?!
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Feb 23, 2014

మన పంటలు. మన వంటలు !

కస్తూరిబా కళాక్షేత్ర కు వెళ్ళే సరికి , గుమ్మంలోనే ఘుమఘుమలు పలకరించాయి .
ఉత్సాహంగా సాగుతోన్న వంటలకార్యక్రమంలో అందరూ నిమగ్నమై ఉన్నారు.
భారీ ఉపన్యాసాలు లేవు. వేదిక లాంటిది  ఏమీ లేదు .
పక పక నవ్వులతో పాటు ,చక చక గరిటె తిప్పేస్తూ ,కళ్యాణి గారు వండి వార్చుతోన్న , కమ్మని భోజనం ఉన్నది.
"వంట వారే చేశారు .నేను  కబుర్లు జోడించాను "కళ్యాణిగారు వినయంగా అన్నారు ,
కానీ ..వారే ఆ పూట భోజనానికి కర్త కర్మ క్రియ అన్నీను !
ఇక, సందట్లో దూరిపోయి ,నిశ్శబ్దంగా  నేను చేసిన నిర్వాకం చెప్పాను. మెల్లిగా ,మొహమాటంగా.
వారితో మాట మాత్రం చెప్పకుండా, మా పిల్లలకోసం  ప్రభవ లో ప్రకటించేసిన శీర్షిక " ధాన్యప్రభవ  :చిరుధాన్యాలు -చిరుతిళ్ళు" గురించి .
"కళ్యాణి అక్కా* ,మా పిల్లలు బడి నుంచి వెళ్ళాక ఇష్టంగా తినగలిగే చిరుతిళ్ళు నేర్పించగలరా?"
"తప్పకుండా!" వారు చటుక్కున అన్నారు."ఎలాంటివి?"
ఇక అంతే ! అడక్కుండానే, మా పిల్లల కోరికల చిట్టా విప్పకదా. వారంగీకారం తో బిడియం కాస్తా హుష్ కాకి!
 నా బాల్యజిహ్వచాపల్యాలన్నిటినీ వారికి వివరించాను.
నా సంశయాలు  పటాపంచలు చేశారు.సందేహాలు తీర్చేసారు
 పిల్లలకి రంగులిష్టం కదా , క్యారెట్టు,బీన్సు, కొత్తిమీర ,నిమ్మకాయలు ఇలా అన్ని రంగులతో ఉత్సాహంగా, మా బుట్ట,నింపేసుకొని బడికి తీసుకెళ్ళాం  బాను .నేను.
మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాంటి ఎన్నో చిరుతిళ్ళ ప్రయత్నాలు చేసేది.
కొత్తగా కుక్కర్లు,వత్తుల స్టవ్వులు వస్తూన్న రోజులవి.
అరిసెలు,పాలతాలికలు నుంచి మా చిరుతిళ్ళ ప్రస్తానం ....మొలకెత్తిన పెసలు, ఉగ్గాని,చుడువాలతో పాటుగా సాగి, టమాటా జాం, ఎగ్ పుడ్డింగ్, గుమ్మడి హల్వా,నారింజ కేక్, సొరకాయ పాయసం,తోటకూర పకోడీలు గట్రాల .. ఆరోగ్యవంటలల్తో ఫరిడవిల్లుతూ ఉండేది.
ఇక, ఈ పూట కల్యాణి గారు పాప్ జొవార్,జొవార్ చాట్, కొర్రకేసరి, ఆరిక లడ్డు, కొర్రజాగెరీ లడ్డూ ఇలాంటి వెన్నో స్వయంగా చక చకా  చేసి మరీ, తినిపించారు.ఆరికలు,వరిగలు,జొన్నలు,కొర్రలు,సామలు,రాగులు,సజ్జలు వంటి చిరుధాన్యాలతో వంటలు వండి పెట్టారు.
మా పిల్లలూ వేలు పెట్టి లడ్డూలు చుట్టారు. తల్లులు ఎంతో ఉత్సాహంగా చేయి చేసుకొన్నారు. తాతయ్యలు ,పిన్నులూ ,పంతులమ్మల సంగతి సరే సరి .
కల్యాణి గారు అన్నారు కదా," మాములుగా మనం ఇలాటి "ఆరోగ్యమైన అహారాన్ని ఎప్పుడు మొదలు పెడాతాం అంటే,ఆరోగ్యం గా ఉండాలనీలేదా  మనేకేదైనా బిపి షుగరు  వంటి అనారోగ్య సమస్యలు   వచ్చినప్పుడు, లేదా, ఎవరినైనా చూసి....కొత్తగా ఆహారశైలి అలవాటుచేసుకుందాం అనుకుంటాం. ఇవి ,కొత్తవి కావు. మన సంస్కృతిలో భాగం. మన సహజ ఆహారం."
అదన్న మాట. సినిమా మాటలోఇవన్నీ  సమాంతర వంటలనుకొంటే ,

ఈ సమాంతర వంటలన్నీ ...మన ముత్తాతముత్తవ్వల బువ్వలే కదండీ !
మన వారసత్వ సంపద.
మన పంటలు. మన వంటలు.
కాలానుగుణం గా రూపాంతరం చేసుకోగలిగితే , ప్రతి చిరుధాన్యపు ముద్దా పరమాన్నమే ! 
***
అందుకేనండీ, అనేది,
కోటి ధాన్యాలు కూటి కొరకేననీ !

*(అక్క అనుననది గౌరవ వాచకమనీ ,వారి వయసుతో నిమిత్తం లేనిదని నేను భావించడం కొత్త కాదు మరి! కల్యాణి గారిని చూడగానే ,అలా పిలవాలనిపించించింది.వారి పనిపట్ల గౌరవంతో .వారి చుట్టూ వారు నింపుతోన్న ఆత్మీయభావనతో.)
**CA ప్రసాద్ గారు, జన విజ్ఞానవేదిక ,నెల్లూరు,   వారికి ధన్యవాదాలు. 
*** కల్యాణి గారు ,దినేష్ గార్ల  కార్యక్రమాల వేదిక  http://www.earth360.in/web/earth360.html








***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Feb 20, 2014

నిన్నటికీ రేపటికీ నడుమ

నిజమే!
నిర్మించుకోవడం లో ఆనందం ఉంది.
పెంపు సొంపు అన్నారు కదా. 
ముచ్చటగా.

పునర్నిర్మించుకోవడంలో అంతులేని వేదన ఉంది.

వాస్తవం.

మానని గాయాలు సలుపుతోంటే,
మానుతోన్న గాయాలు కలుక్కుమంటుంటే,
గుండెలు చిక్క బెట్టుకొని ..
ఒక్కో క్షణాన్ని నిర్మించుకొంటూ రావడం ...
ఎంత కష్టం!

దిగ్బ్రమల నుంచి తేరుకొంటూ ... దుఃఖాన్ని అణుచుకొంటూ ... 
దిగులొందుతున్న మనసును ఓదార్చుకొంటూ..

చేజారిన స్నేహాలనీ ..ఎదుట నిలిచిన మోసాల్ని ...
 దాటి వచ్చిన కష్టాన్ని ..నష్టాన్ని..నిష్టూరాన్ని ...
మరుపుబుట్టలో దాచేస్తూ..

వర్తమానాన్ని జ్ఞాపకాలతో బేరీజు వేసుకొంటూ...
భవిష్యత్తు పట్ల భరోసా నింపుకొనే ప్రయత్నం చేస్తూ..
పాతను వదులుకోలేక ..
కొత్త చేసిన పరిస్థితులను వంటబట్టించుకొనే ప్రయత్నం చేస్తూ..

 పోగొట్టుకున్నదేమిటో ..పొందవలసినదేమిటో..
తెలిసీ తెలియని అయోమయంలో..

తలకొక మాట .. చేష్టలుడిగిన చేత ..

ఎవరికి వారం ..
నిశ్శబ్దంగా ..
ఒక్కో నిమిషాన్నీ
నిర్మించుకొంటూ రావడం...!?!
సులువని ఎవరనగలం?
***
నిన్న నిన్నలా లేకుండా పోయింది. 
రేపు ఎలా ఉండబోతోందో తెలుస్తూనే ఉన్నది.
నిన్నటికీ రేపటికీ నడుమ..
ఓ ప్రశ్నార్ధకంలా 
ముక్కలైన
నేడు !
***
శాంతి శాంతి శాంతి !
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Feb 6, 2014

తొలికతలు ,ఒక ముచ్చట !

"అవును గదా,అమ్మలగన్న అమ్మ ఎవరూ అని కనిపెట్టే పని ఏ నరమానవుడికైన సాధ్యమయ్యేదేనా?" 
విషయమేంటో తేల్చుకొందామా? తెలుసుకొందామా?
ఇంకేం మరి ..తిన్నగా ప్రభవకొచ్చేయండి!
ఈ ఆదివారం ఉదయమే! 
మర్చిపోకండి!

http://prabhavabooks.blogspot.in/2014/02/blog-post.html

కతమ్మ వడిలో కాసేపు..!




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

బుద్ధుడిమాట ఈ పూట