Jul 22, 2010

అటెన్షన్ ప్లీజ్!

యువర్ అటెన్షన్ ప్లీజ్... !
ఉదయాన్నే అటెన్షన్ ..స్టాండటీజ్ అంటూ గొడవేమిటనుకొంటున్నారా ?
పొద్దుటే రైల్వే అనౌన్స్మెంట్  ఏంటబ్బా ...అని చిరాకు పడుతున్నారా?
కాస్తాగండి.
అక్కడ మా సిరి గారి చిన్నమ్మాయి గుక్కపట్టి ఏడుస్తోంది. పిడికిళ్ళు బిగించి .కప్పెగిరేలా .
వాళ్ళ అమ్మ  వళ్ళో చేరగానే ఏమీ ఎరగ నట్లు నవ్వులు
ఆరో నెలపెట్టి ఆరు రోజులన్నా అయిందో లేదో ..అందర్నీ హడలు కొట్టే కళలో ఆరితేరి పోయింది! ఇంట్లో ఉన్న అరడజను మందీ ఎల్లవేళలా అటెన్షన్ లో ఉండాల్సిందే.
ఇక్కడ ఒక అయిదేళ్ళ పాప గోడంతా బొమ్మలు గీసేసి, తను నేర్చు కొన్న  అక్షరాలన్నీ  ప్రదర్షించేసి
అమ్మానాన్నల అటెన్షన్   ఓరకంట చూస్తోంది. ప్చ్ ... కథ కొంచం అడ్డం తిరిగినట్లుంది.
 వాళ్ళ నాన్న కళ్ళ ముందు కట్టాల్సిన  పెయింటు బిల్లులు కదలాడి నట్లున్నాయి. అమ్మాయి వీపు విమానం
మోత మోగింది . సహజంగానే
అదుగో , అమ్మాయేమో మంచం  కింద దూరి వెక్కిళ్ళు పెడుతోంది.
వాళ్ళమ్మ కొంగు బిగించి స్పాంజ్ ,సర్ఫు, నీళ్ళతో అక్కడికి దూసుకు వస్తోంది.
“ముందు పాప గుక్క పట్టకుండా చూడండ్రా.”.తాత గారు చదువుతున్న పేపరులోనుంచి ఉచితసలహా జారీ చేసారు.
“మరీ విడ్డూరం కాకపోయే మా కాలంలో ఇలా కాదమ్మా”.. నాయనమ్మా ఒక పాసింగ్ కామెంట్ గాలిలోకి వదిలేసింది.
ఇక మనం తప్పుకోవచ్చు !
!
ఇక  ఇక్కడ పరిస్థితి   చూశామా అంటే ,వంటింట్లో ఏదో ఢామ్మనింది!
 హతోస్మి!
అటెన్షన్ ప్లీజ్!
అందులోనూ ఇది ఆడియో వీడియో యుగమయ్యే.
స్నానానికి వేన్నీళ్ళకు పుల్లలు ఎగ దోసినా,
భుజాన తువ్వాలేసుకొని స్నానానికి బయలు దేరినా ,
దగ్గినా ,తటాలున తుమ్మినా , వాకిట్లో తెల్లటి దుప్పటేసుకొని ముసుగు పెట్టినా ..అన్నీ ..వింత వార్తలయ్యే.
 అయినా మనమేమైనా రాజు గారి బామ్మర్దులమా  ,రాణీ గారి అనుంగు చెలికత్తెలమా..
నలుగురి కళ్ళూ మనవైపు తిరగడానికి.
పొయ్యిలో కట్టెలు, పొయ్యిపైని నీరు, ఎసట్లో బియ్యం ..
  పూటకి వీటినెలా సమకూర్చుకోవాలా అని తాపత్రయ పడే అనేకానేకుల్లో ఒకరమైతే!
ఇక, రాజు గారెక్కడా రాణీ గారెక్కడ .... వారి మందీ మార్బలమెక్కడ ?
అడక్కుండానే అటెన్షన్ దొరుకుతుందక్కడ !
***
 అంతదాకా ఎందుకు ..మొన్నకు మొన్న 
  పచ్చటి పొలాల్లో వెచ్చటి నెత్తురుచిందించినా ...
విస్తుపోయిన చూస్తూ ఉన్న  మనమందరం ...ఒక్క క్షణంలో దృష్టిని మరల్చేసామంటే ,
. మన అటేన్షన్ ను ఇట్టే తమ వైపు తిప్పుకొన్న వారిదే విజయం! మనం ఎప్పుడు పరాజితులమే .
ఎవరు ఎప్పుడు ఎంత అటెన్షన్ ను పొందగలరు అన్న దే నాటి మాట !
అదొక సమకాలీన సామజిక కళ ! కాలానికి తగ్గట్లు నడుచుకోవాలి కదండీ!
దేనికెంత అటెన్షన్ ఇవ్వాలా అని నిర్యించుకొనే వ్యవధి అవకాశం మన బోటి సామాన్యులకు ఎక్కడ. ?

రిమోట్ కంట్రోల్ నొక్కులు నొక్కినా నొక్కగలిగినా మన దృష్టి ఎక్కడ పడాలో మనకే తెలియడం లేదు.
  మరి ,వారంతా చేస్తోంది అటేన్షన్ కోసమేగా... అని అనకండి.
నిజమే, ఎవరు ఏది చేస్తూన్నా  చూస్తున్నా .. వారి  దృష్టి తమ వైపు పడాలనే కదా!
ఇంతకీ బ్రౌను గారి నిఘంటువు ఏమంటుందంటే...
అటెన్షన్ అంటే "ధ్యానము ,లక్ష్యము, గమనముఅని.
అమ్మో ! పదానికి పెద్ద పెద్ద అర్ధాలే ఉన్నాయండోయ్!
వళ్ళు చేసినా చిక్కిపోయినా ,వార్తలకెక్కడానికి మనమేమైనా సినిమాతారలమా?చంద్రులమా ? సూర్యులమా?జగజ్జేతలమా? కనీసం కోచింగు సెంటర్ల టాప్  లిస్ట్ లలోనూ లేక  పోతిమి!
సందుల్లో గొందుల్లో చడీ చప్పుడు లేకుండా బతికేస్తుంటిమి.
మన గూట్లో మనం.
మన వలల్లో జాలాల్లో గోలల్లో  మనం .
శ్రీశ్రీ మాష్టారుకు చిరాకేయమంటే వేయదూ  మరీ!
 ***
అక్కడొక అయ్యవారు మూతి బిగించి బోర్లా పడుకొని ధీర్ఘంగా ఆలోచిస్తున్నారు. బహుశా వాళ్ళవిడ కాఫీ కాస్త ఆలస్యం చేసిందని ఆవిడ మీద అలిగారేమో.
అక్కడో మూతి బిగింపు.
ఇక్కడో కొంగు విదిలింపు.
కనుబొమల ముడి. పెదవి విరుపు.
గద్గద స్వరం.  హూంకరింపు.
కళ్ళు రెపరెప లాడించే వారొకరకైతే,నేల అదిరేలా ధనధనా నడీఛె వారొకరు.
పువ్వులు కానుకలు అందించడం.నవ్వులు చిందించడం.
అని. అమ్మో ఈ పదానికి పెద్ద పెద్ద అర్ధాలే ఉన్నాయండోయ్
 అందాలు అలంకరణలు .సింగారాలు బంగారాలు. వొగలమారి వయ్యారాలు .
అయ్యబాబోయ్.. ..అటెన్షన్ కొరకు ఎన్ని రకాల తిప్పలండీ .
అంత దాకా ఎందుకు ...
మేఘసందేశాలైనా చిట్టిసందేశాలైనా కువకువలైనా..
ఏదో రూపేణా అయిన వారి అటేన్షన్ కోసం అహర్నిషలు ప్రయత్నిస్తూనే ఉంటాం కదా .
తెలిసో తెలియకో.
అయిన వాళ్ళ దృష్టిలో పడడానికి మన తిప్పలు చెప్ప అలవి కాదు.
మనమంతా పసితన్నాన్ని పచ్చబరుచుకొనేది అచ్చం ఆ విషయం లోనే నేమో.
అనకూడదు కానీ ,
మనమందరం ఏకీభవించాల్సిన విషయం ఒకటి ఉన్నది.
ఎవరికి వారం అంతోఇంతో అటెన్షన్ కోరుకొంటాం.
పసి పాపల్లా !
మడిసన్నాక కుసింత అటెన్షన్ కోరుకోవడం తప్పు కాదండీ బాబు...
అర్ధం చేసుకోవాలి తమరు ..!
అయ్యల్లారా... అమ్మల్లారా.... 
గౌరవనీయులైన మడతపేజీ పాఠకుల్లారా....
ఇంతకీ నే చెప్పొచ్చేదేమంటే...
యువర్ అటెన్షన్ ప్లీజ్..!
ఇది వందో టపా !!!!
ధన్యవాదాలు.

*
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jul 11, 2010

హా ....చ్చ్ ....సారీ సారీ...!

ఇలాంటి ఉత్తరాలు అడపాదడపా వస్తూనే ఉంటాయి.
కాకపోతే , మారు కోల్ కతా నుంచి. అందునా ,పశ్చిమబంగ బంగ్లా అకాడమీ వారి సుముఖం నుంచి.
ఏమీ లేదు.
అనేక శుభాకాంక్షలు. దరిమిలా,ఒక జాతీయ పురస్కారం.
ఎవరికేమిటి?
 అక్షరాలా నాకే.
నా పేరు.ఇంటిపేరు చిరునామా,పిన్ను కోడు,చదువు, పుట్టిన తేదీ ఇతర వివరాలన్నీ ..అచ్చుగుద్ది మరీ పంపారు.
ఎలా కాదన గలం ?
కబురేమిటీ ..ఇంత చల్లగా చెపుతున్నానని అనుకోబోయేరు.
కాస్తాగాలి మరి.
ఇక నేం.
కోల్ కతా కి ప్రయాణం కట్టాల్సిందే.
అన్నట్లు, కుటుంబాన్నంతా రమ్మని పత్రం సాదరంగా ఆహ్వానించింది కదా.. “వెళ్ళి తీరాల్సిందే “. ఉత్సాహంగా ప్రకటించేసారు  మా అమ్మాయి అబ్బాయి ..వాళ్ళ నాన్నాను! సోనార్ బాంగ్లా ..అయిదునక్షత్రాల హోటల్లో విడిదీ,భోజనసదుపాయాలు..ఇతర సౌకర్యాలూను. నోరూరిపోదూ వారికి మరి!
లైఫ్ టైం అచీవ్ మెంటు అవార్డు ను పోలిన పురస్కారానికి..దేశవ్యాప్తంగా అనేక మందిని జల్లెడబట్టి ,అందులో ..నన్ను వెలికి తీశామని, వారు రాశారు.
లోగడ అవార్డును విక్టొరియా హాలు,జాతీయ గ్రంథాలయం, విలియంకోట ,శాంతినికేతనము..తదితర వేదికలపై అందజేశామనీ, ఇప్పటి వేదికను త్వరలోనే తెలియపరుస్తామని రాశారు.
ప్రణబ్  ముఖర్జీ ,సోమనాథ చటోపాధ్యాయగవర్నరు గోపాలకృష్ణ గాంధి తదితర ప్రముఖులు సంతకం జేసిన "సారస్వత్ సమ్మాన్ " పత్రం నమూనను కూడా దీని వెంట జత పరిచారు. నరేంద్రనాథ్ చక్రవర్తి,అభిజిత్ ఘోష్ మొదలగు  వారి  సంతకాలతో “అకాడెమీ ఆఫ్ బెంగాలీ పోయెట్రీ.”.చిరునామా ఫోనులతో .. ఉత్తరం పకడ్బందీ గా రచించబడింది.
 బెంగాల్ గవర్నర్ సంతకానికీ,మూడు  సింహాల ప్రభుత్వ చిహ్నానికి కొదవ లేదు.
మెట్లమీద వరసలు వరసలుగా కూర్చిని నిల్చొని ..నిబ్బరంగా చూస్తున్న రచయితల గుంపుచిత్రం ఒకటి కూడా జత పరచబడింది.
అన్నీ బాగానే ఉన్నాయి కానీ, నేనేనాడు కవిత్వం రాసిన  పాపాన బోలేదు కందా..  మరి ఏమిటిది చెప్మా!
 అసలు రవీంద్రుడు తప్ప  వేరొక బెంగాలు కవి లోకమానవాళ్లు తెలియవు కందా...కవిత్వం అకాడెమీ  సంగతి సమాచారాల  ఊసెత్తానా ఎప్పుడన్నా..?
అది అటుంచి, వారికి నా గురించి తెలవడేమేమిటీ.. అనేకానేక కవులు కొలువై ఉండగా వారినందరినీ వదిలి ..   నామానాన నేను నాలుగు కథలేవో రాసిన భాగ్యానికి నాకీ  జీవితకాల పురస్కారమేమిటి.. అసలీ కుట్ర పన్నిన నా బెంగాలీ మిత్రులెవ్వరు?    అసమదీయులెవ్వరు? ఆసుపాసులు తెలుసుకోక పోతే ఎలా చెప్పండి?
తీరా వెళ్ళాక ఆ బెంగాలీ సాహితీవేత్తల ముందు ఎలా తెల్ల మొహం వేయను ? అందునా  తెలుగు మొహం పెట్టుకొని!
అదేదో ఇక్కడె తేల్చుకొంటే పోలా..?అవును మరి.
ఊరుకుంటానా.. గబగబ .. తెలిసిన నలుగురు బెంగాలీ మిత్రులకీ నాలుగు e-ఉత్తరాలు గెలికి పారేసా.
వారు అంత నిజాయితీగానే జవాబంపారు.
పేరు గల కవులు లేరు.కవితా అకాడెమీలు లేవు.  కోల్ కత్తా అంతా కాగడా వేసి వెతికినా.  ఇదేదో   కోల్ కత్తా మాయ పొమ్మంటూ.
పదుగురాడు మాట పాడియవుతుంది కందా.. నా అదృష్టం ఏమంటే పదుగురు పదారు సలహాలు గుప్పించారు.అడగీ అడక్కుండానే.
వొకరన్నారు కందా.."మన సొమ్మేం పోయింది ..వప్పు కుంటే ? ఎవరిచ్చినా జాతీయ  అవార్డంటే జాతీయ అవార్డే .  ఎంత ప్రతిష్ట! ఎంత గౌరవంవొదులుకొంటారా ఎవరన్నా ? "అని మెటికలు కూడా విరిచారు."మరీ వింతపోకడ పోతున్నారు..వద్దనీ అదనీ ఇదనీ"..మూతికూడా వంకర తిప్పారు.
"బోల్డన్ని అవార్డులు  వచ్చేది ఇల్లాగే..మీరు మరీను.. ! "మరొకరు తీగలుతీశారు.
హతోస్మి.
“అవన్నీ అలా వుంచి.. ఆంధ్రులకు ఎంత గౌరవం... ఇది ఒక తెలుగు రచయితకు దక్కనున్నదీ..మీకు కాదు . పిలిచి 
పురస్కారం  ఇస్తానంటే వద్దంటారా ఎవరైనా? అవార్డు రా మోకాలడ్డేవారుంటారా, మరీ విడ్డూరం కాకపోతే !
మీరు కాకుంటే మరొకరు తీసుకొంటారు ! ఆగుతారా ఎవరన్నా? "
***
మెలికపడిందెక్కడో  అదీ చెప్పనీయండి.
అంగీకారపత్రంతో బాటు, పదివేలు ఫణంగా పంపమన్నారు!
అదుగో అదే ... నే చెప్పొచ్చేది.!

***

హాచ్చ్..
సారీ..సారీ ..
ఇది హోక్ష్ అట!
సరి సరి!
***
అందుకే కదా అన్నారు
నలుగురికీ తెలవడం నాలిగిందాల చేటు అని!
***11-7-10***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jul 7, 2010

తడిచిన మొగ్గల్లా


.


తడిచిన పూలు
ఎంత బద్దకిస్తున్నాయో.

విచ్చుకోను 
మొరాయిస్తూ
ముద్దముద్దగా



ఆకుల పొత్తిళ్ళలోకి
ముడుచుకొంటూ
ముద్దుముద్దుగా


అద్దీఅద్దని
పుప్పొడిగా 
ఆరీఆరనీ ఆ వొయ్యారాన్నీ 

చినుకు చినుకుగా 
వణికిపోతూ 
తడితడిగా



 అమ్మకుచ్చిళ్ళ వెచ్చదనాన్ని 
 తడిమిచూస్తూ 

 గారాం పోతూ 
మారాం చేస్తూ
చూడండీ...

తడిచిన మొగ్గల్లా..
ఆకుల పొత్తిళ్ళలో ఒదొగొదిగి..
ఆదమరవగలిగిన ఆ హాయి 
ఎంత ముగ్దమనోహరమో కదా!
***


ఒక పూటకి పనిమానేసి 
నిండారా..
ముసుగుపెట్టేస్తే ..!!!
మెత్తని పక్కలో ఒత్తిగిల్లి
 వెచ్చటి  కలల్లో తేలిపోతే !!!
***
బానే ఉంటుంది.
అందుకేగా,
బంద్ ప్రకటించింది!
***

Jul 3, 2010

గుట్టెనుక 3

<<గుట్టెనుక1,2 చదివాక ,ఇక మిగిలినది>>
"పొద్దున్న వొచ్చాడు. కసువులు చిమ్మను పోయిన మనిషికి కంచెలో దాక్కోని కనబడ్డాడు. భయపడి కేకలు పెడతా వొచ్చింది. చూద్దుము కదా. ఇతను. మాసిన గడ్డము, చింపిరి జుట్టు, ఖైదీల బట్టలు .కాళ్ళకు చేతులకూ బేడీలు.పిల్లలు భయపడి పోయారు.ఎక్కడొళ్ళక్కడే ఉరుకులు బిత్తరపడి నిలువుగుడ్లేసారు. మేమే వచ్చి అందరినీ లోపలికి పంపాం.

"ఏమ్మా, ఎవరికైనా హాని జేసినాడామ్మా?" మాటలు కుక్కుకొంటూ మెల్లిగా అడిగాడు ఆదెయ్య.
"ఊహు, కానీ,ఉదయం నుంచీ అక్కడే ఉన్నాడు.ఉలుకు పలుకు లేదు. అతనికే ఏదన్నా హాని చేసుకొంటాడేమో నని ఇన్స్పెక్టర్ గారికి కబురు పెట్టం..వాళ్ళ మేనమామలొచ్చారు. పిల్లోడు సాక్ష్యం చెప్పినందుకు  వాడిని చంపే దానికే వొచ్చాడనీ.."
ఆదెయ్య ఉన్న చోటనే కుప్ప కూలిపోయాడు. "ఇందరి కళ్ళల్లో ఇంత కిరాతకుడై పోయినాడా నా బిడ్డ.."
"వాళ్ళు కేసులు కూడా పెట్టారు" ఇన్ స్పెక్టర్ అందించాడు.
"పిల్లవాడికీ అదే చెప్పారు"ఆయ్యవోరమ్మ అంది. “ఇలాంటివి బడి దాకా రాకూడదు . వచ్చింది. ఏమి చేయడమా అని?” ఆమె కాస్తాగి అంది, "చుట్టూ గుంపు చేరి పోయింది. తలకొక మాట.దానికి అడ్డూ అదుపు లేదు కదా?
వాళ్ళ మేన మామలూ ఎక్కడ విరుచుకుపడతారో.."ఆమె ఆగి,ఆదెయ్యతో మెల్లిగా అంది,"మీరొక సారి మాట్లాడి రండి.అసలు ఎందుకింత రిస్క్ తీసుకొన్నాడో.అతని ప్రాణానికే అపాయం కదా"
ఆదెయ్య ఇన్ స్పెక్టర్ వంక అనుమానంగా చూసాడు. అయ్యవోరమ్మ అప్పటికే ఏమి మాట్లాడి ఉందో కానీ , అతను మౌనంగా చూస్తూ ,వెళ్ళమన్నట్లు తలాడించాడు.
కంచె దగ్గరకు రాగానే ,ఆదెయ్య కడుపులో పేగులు మెలి తిరిగినట్లయ్యింది. ఎంత ముద్దుమురిపెంగా పెంచుకొన్న బిడ్డ..క్షణాళ్ళో బతుకు బుగ్గిపాలెయ్యనే, ఇంత మంది నడుమ హంతకుడిగా కిరాతకుడిగా.. ఆ ముళ్ళల్లో ఆ కంపల్లో ..పడి... ఆదెయ్య తువ్వాలును నోట్లోకి మరింత కుక్కుకున్నాడు. వణుకుతున్న కాళ్ళతో మెల్లిగా దగ్గరికెళ్ళాడు.
"ఏమిరా ఇట్టా జేస్తివి ?" మాట్లడాననుకొన్నాడు. మాట పెగలలేదు.
“బుడ్డొడికి ఒక మాట చెప్పిపోదామని వొచ్చినా నాయినా , నీ మాట చెవిన బెట్టలే .. మాటిమాటికీ ఆలోచిస్తాంటే ఒక్కో మాటా తెలిసొస్తాంది నాయినా, పోయినణ్ణాల్లూ  గొర్రెలదాటునబోయినాను. ఈ పొద్దు నిలబడి ఆలోచన జేస్తే, ఇనుకొనే దానికి ఎవరూ లేరు.చెప్పకుంటే ,ఆ బాధ తొలిచేస్తాంది ,నాయినా.” కొడుకు మెల్లిగా మాటలు కూర్చుకొంటా అన్నాడు.” ఆదెయ్యకు ఏమీ తోచలేదు. కంచెవైపుగా నడిచాడు. మాటన్నా స్పష్టంగా విందామని..
“ ఈ కొండలుబండలు పనికి మాలినావని ఎద్దేవాజేస్తిని .తాతలకాలం నాటివనీ తలనుబెట్టుకోవాలనీ నీవుజెప్పినా చెవిన బెట్టలే. అవిప్పుడు ఇనుమో బంగారమో ...కానీ ..మన బతుకులు బండలు జేసి అవి మట్టి పాలవుతున్యాయి.ఆ మట్టి ని సొమ్ము జేసుకొన్నోలు మహరాజుల వుతున్నారు. ఇక, ఆప తరం కాదు. కాపలా కాయల్సినోళ్ళే కండ్లళ్ళ కారం కొడుతున్నారు.కనురెప్పల్ని కత్తిరించుకుబోతున్నారు.భూదేవమ్మ పొదుగు కోసుకుపోతున్నారు,నాయినా, పట్టపగలు.నిలబడి అడిగే మొనగాడే లేకుండా బోతున్నాడు.నా బిడ్డకు వొట్టిపోయిన నేలను బండనూ కొండనూ ..ఇయ్యాల్సిందేనా ?"
"బుడ్డోడు వానికా గమనం ఏడుంటాదిరా? నాకూ నీకే ల్యాక పాయే.." ఆదెయ్య ఎలాగో గొంతు పెగల్చుకొన్నాడు.
"ఆళ్ళమ్మ నేరం ఏమీ లేదు. నేరం జేసినోన్ని నేను. నా తప్పు నేను అనుభవించాల్సిందే. నన్ను చేతకానోన్నిజేసిన కాలానిదే కనికరం లేదు. నాలాగా వాడు కారాదు నాయినా , ఎట్టా జేస్తావో.. ."
మాట మాటగా ఉండగానే అతని తల మీద బావ మరిది చేతి కర్ర విరిగింది.పోలీసులు చుట్టుముట్టారు.
ఆదెయ్యను పక్కకు నెట్టారు.
బుడ్డోడ్ని తండ్రి దగ్గరకు తీసుకువస్తోన్న అయ్యవారమ్మ ,అక్కడే ఆగిపోయింది.
 బుడ్డోడ్ని కళ్ళారా చూడకుండానే ,నోరారా పలకరించకుండానే, గుండెల్లో గుబులు పంచుకోకుండానే , అతన్ని పట్టుకువెళ్ళారు. రెట్టలు విరిచి జీపునెక్కిస్తుంటే కొడుకు దయనీయంగా అడిగాడు, ఆ ఒక్కమాట వానికి జెప్పు నాయినా ,ఏ పొద్దుకైనా !”
 జీపు లో  వెళుతున్న కొడుకు కన్నీళ్ళ నడుమ సాగనంపి వెను తిరిగిన ఆదెయ్య ను దాటుకొని ,సెల్లు టవర్ స్తంభాలను మోస్తున్న లారీ దాటి పోయింది.ఆ వెనుకే బుల్డొజరూ. కొండను తవ్వి తలకు పోసుకొనే పొక్రెయిన్లూ ట్రక్కులు.
 “ఏ ఒక్కమాట ? వాడంటే ఎవడు? ఒక్కడా? పదిమందా? ఏ పొద్దులోపల జెప్పలా?ఎవరికి జెప్పాలా? జెప్పు. నీ కొడుకు ఏమి రహస్యాలు జెప్పి పోయినాడు?” అక్కడ ఆగిన పోలీసులు ప్రశ్నలతో ఆదెయ్యను చుట్టుముట్టారు. అంతకన్నా కోపంగా కొడుకు బావమరుదులు బంధువులు ముసురుకొన్నారు.
కొండ మీద  ఎవరో పెట్టిన పొగ ఊరంతా కమ్మింది.ఉక్కిరిబిక్కిరి జేసింది.ఎక్కడి వారక్కడే ఆగి పోయారు.
ఆదెయ్య నిలువు గుడ్లేసుకొని కొడుకు మాటలు మననం చేసుకొన్నాడు. కొడుకు మాటలు అతనిలోకి ఇంకి పోయాయి. లోలోనకు ఇమిడిపోయాయి . అప్రయత్నంగా ఒక పదం అతని గొంతులో గుర గుర లాడింది.
"గుట్టెనుకా...."
<<<అయిపోయిందనే! >>>

సురభి పత్రిక ప్రారంభ సంచికలో ప్రచురితం. సంపాదకులకు ధన్యవాదాలతో.
______

1.టివి 2. రేడియో 3. రంగురెక్కల పురుగు


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.