Jun 28, 2010

గుట్టెనుక 2

మాటే , తమ కోడలికి భూదేవమ్మ నయానా భయానా నచ్చ చెప్పి చూసింది. గుట్టుగా రట్టు కాకుండా అన్నీ చక్కబెట్టాలనీ చూసింది ఒంటి చేత్తో. అమ్మణ్ణి తప్పు కూడా ఏముంది?
 కొత్త మోజులోనేమి ,మంచి మనసుతోనేమి, మొదటంతా వీడు ఆ పిల్లను నెత్తిన బెట్టుకు గారాబం జేసే. వారమంతా పట్నాన ఏమి వొళ్ళు ఇరుసుకోనేటోడొ గానీ, శని వారం రాత్రికి గుట్టెడు ఆశలతో సంసారానికి తిరిగి వొచ్చేవాడు. ఆఖరి బండిలో.
కొంత కాలానికి, కోడలిని పట్నం తీసుకు బోయి కాపురం పెట్టాడు.భూదేవమ్మ పోయొచ్చి కతలుకతలుగా  చెప్పేది.
బొమ్మలపెట్టెలు<1>, మాటలపెట్టెల <2 >గురించి .అయ్యన్నీ సరేగానీ, ఇట్టా కొండగాలి పోసుకొనే తనకు , అగ్గిపెట్టిలాంటి కొంపల్లో బింగన్న<3 >లా కాళ్ళుచేతులు ముడుచుకు కూర్చోవడం మింగుడుపడక , తట్టు పోలేదు.
తన కొడుకు చేసే మొనగాడి పనేంటో  కళ్ళారా చూసి రావాలనీ తనకి మాత్రం గుండె కొట్టుకులాడలేదూ? కొడుకు పనిమంతుడు అయితే తండ్రికే కదా గర్వమూ గవురమూ !
అనుకుంటుండగానే, వాడి పనే , మూలన బడింది.
“సెల్లు ఫోనొచ్చింది. వైరులెస్సు వొచ్చింది. “అన్నాడు వాడు
“అవేమిరా “అని భూదేవమ్మ  అంటే ,”మీకు తెల్దు పోమ్మాఅనేవాడు.కానీ, వాటి దెబ్బ ఏంటో తమకే ముందు తెలిసి వొచ్చింది.
 చుట్టలు చుట్టలుగా కేబుల్ వైరు కొండచిలువ చుట్టుకున్నట్లు తమ వూరిని చుట్టేసింది.
 ఒక్కోడు ఇంటిముఖం బట్టాడు. వొచ్హినోడు వొచ్చాడా రానోడు అక్కడ తిప్పలు బడ్డడా ..ఎవరికి అనువైన పనిలోకి వాళ్ళు బోగా, కూసోని తీరుబడిగా కాపురం చేస్తున్న తన కోడలు లాంటొళ్ళు కష్టాన బడ్డారు. ఒక్కోడు ఒక్కో దిక్కు .ఒకరికి ఒకరు మాట సాయం చేసుకొనే సమయంకూడా దక్కలేదు.ఎవరికి వారు ఒంటరి వారయి పోయారు.
 పూట గడవని స్థితి.పరిస్థితి చేతిలో ఉండగానే ,తమ కొడుకు  భూదేవమ్మను పిలవనంపి కోడల్నీ బుడ్డొడ్నీ ఇంటికి పంపాడు. తెలివిగల బిడ్డ. వాడికి తోచినది చేసాడు. అయితే ఏమి ,సుఖాన నిలిచిన తోడు కష్టాన నిలవలేక పోయింది.  నునుపు బండల మీద  నడుస్తూ  నాజుకు పనులు చేసిన మనిషి  కొండపల్లెలో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
ఆమే తప్పేమీ లేదు. వారానికి ఒక మారు వచ్చే మగడు నెలకో రెన్నెళ్ళకో రాసాగాడు. ముద్దుమురిపెంగా పలకరించే వాడు కస్సుబుస్సు లాడగాడు.చీరారవికా పండూఫలము తెచ్చేవాడు పిడిగుద్దులు తెస్తు న్నాడు. ఎత్తిపొడుపులూ ఏడుపులు  .కాపురం కన్నీళ్ళపరమైంది. కరకరలు మెరమెరలు.  ఒకరంటే ఒకరికి కంటిలో నలుసు యవ్వారమైపోయింది. కన్నవారిగా చూస్తూ ఉండడమే కానీ, కల్పించుకొనే , వీలు లేకుండా బోయింది.
అట్టాంటిది, ఒకనాడు ఇద్దరూ గుట్టుగా కలిసివచ్చారు. వారితో పాటే ఒక పట్నం సారొచ్చాడు. మళ్ళీ వ్యవహారం సర్దుకొన్నట్లే తోచింది కొన్నాళ్ళు. దాచితే దాగే విషయం కాదు కదా .మా బోడికొండ వాలుచెలక ను గుట్టుగా వారికి బేరం పెట్టినట్లు తెలిసింది.గుండె చెరువయ్యింది.లబోదిబోమన్నాడు.
 “పనికి మాలిన కొండల్నీ బండల్నీ ఎన్నాళ్ళు పట్టుకు వేళ్ళాడుతాం?ఇదుగో సారోల్లు.మంచోల్లు. వాళ్ళేదో ముచ్చట పడుతున్నారు.మనకు మంచి బేరం చిక్కింది. దక్కిందే పరమాన్నం కదే నాయినా"  
 అవి పనికి కొండలూబండలూ కావురా భూదేవమ్మకు గుండెలురా..! పొదుగు నరుక్కుంటార్రా ?వాటిని పరాయిపాల్జేయకురా.." ఆదెయ్య ఆక్రోశించాడు.
ఆదెయ్య మాటలు గాలిలో తేలిపోయాయి. కాగితం మీది రాతలే నిలబడి పోయాయి. కుసింత చెలకముక్కా ,ఆ వెనుక బోడికొండా పరాయిపాలయ్యాయి.
అయినా, కొడుకు అనుకున్నది అమలు జేసుకున్నాడు
.వానచుక్క ముఖమెరిగి ఎన్నాళ్ళో.గొర్రెలబయలు తప్ప , ఆ కొండవాలున పిడికేడు పంట ఇంటికి మోసిన పాపాన బోలేదు. వాని మాటనే బోతేపోలా’ అనుకున్నారు తనూ భూదేవమ్మ.
మళ్ళీ మాములు రోజులు వచ్చినట్లు కనబడ్డాయి. కుసింత చెలకముక్కా , వెనుక బోడికొండా పరాయిపాలయ్యాయి.కానీ,కొడుకు సంసారం కుదుటబడ్డట్టే తొచింది.
బోడికొండ మీద టవర్ నిలపాలనీ ,తవ్వకాలు జరపాలనీ , పట్నం సారు రాకపోకలు ఎక్కువయ్యాయి. తన కొడుకును పని మీద పని మీదా పట్నం పంపుతూ ఉన్నాడు. కోడలు అతనికి దగ్గరయ్యింది. అది, ఏకంగా ఎవరికంట పడకూడదో , వారి కంటే పడింది.
ఆదెయ్య తల విదుల్చుకొన్నాడు.
 అందరం అనుకున్నాం . ఇలాంటిదేదో జరుగుతుందనీ.
అయినా , ఆపద రాకుండా ఆపలేక పోయాం.
ఆదెయ్య కంట్లో నీటిచెమ్మ. చేతిలోని కొడవలి ఖణేళ్ మంటూ బండ మీద పడింది. ఆదెయ్య గమనానికే రాలేదు.
"తాతా , ఈడున్నావా ..ఎతికెతికి వొచ్చా" ..వొగరుస్తా అన్నాడు కిష్టప్ప పెద్దకొడుకు ,
"దేనికిరా ?" ఆదెయ్య ఆరా తీశాడు, “ఇందాకడి నుంచి కేకేస్తంది నువ్వట్రా?"
" పెద్దయ్యోరమ్మ నిన్ను ఉన్నోన్ని ఉన్నట్టే ఎంటబెట్టుకు రమ్మంది .మామొచ్చాడు. జైలుకు బోతాంటే తప్పించుకున్నాడంట. బుడ్డోడ్నిచూడను బడికాడికొచ్చాడు”
ఆదెయ్య గుండె గుభేలంది. గొర్రెల్ని అదిలిణ్చడం మాని , బక్కటెద్దు పగ్గం వొదిలేసి , కిష్టప్ప పెద్దకొడుకు వెనక వడివడిగా అడుగులేసాడు. గుండె తపతప కొట్టుకొంటుంటే.
“బుడ్డోడ్ని పలకరిస్తే మక్కెలిరగతంతామని వాల్లమేనమామలొచ్చారు.  ఊల్లో వాల్లంతా దడిగట్టినారు.అయ్యవారమ్మ కు ఎటూ తోచక నిన్ను పిలవనంపింది.పద పద."
ఆదెయ్య గుండె మెలిపెట్టినట్లయ్యింది. కన్నబిడ్డను పలకరించు నోచని పాపాత్ముడైనాడమ్మా నా బిడ్డ!
తువ్వాలును నోట్లో కుక్కుకుంటా.. పరుగులు పెట్టాడు.కిష్టప్ప కొడుకు వయసుమీదుండే..వాడు బాణం లా దూసుకు పోయాడు.
ఒకే ఒక్క చెంపపెట్టు. గింగిరాలు తిరుగుతూ ఆమె నేలకొరిగింది. మళ్ళీ లేవలేదు. ఒక బొట్టు రక్తం చిందలేదు. ఒక్క నరం చిట్లలేదు. బతుకులు బండలయ్యాయి. వాడి కోపం ,ఆక్రోశం  వాడిని కబళించివేసింది. అంతా క్షణాల్లో.అందరం చూస్తుండగానే. . కోడలి ప్రాణాలు గాలిలోకలిసిపోయాయి. కొడుకు కటకటాల పాలయ్యాడు. బుడ్డోడు తండ్రి చేసిన పనికి ప్రత్యక్ష సాక్షి.
పట్నం సారు ఎటుబోయాడో కానీ, బుడ్డోడ్నికోడలి అన్నదమ్ములు చంకనబెట్టుకు పోయారు.
కొడుకును కోడలనీ మనవణ్ణీ పోగొట్టుకొని అనాథలయ్యారు తనూ భూదేవమ్మ.
ఆదెయ్య బడి దగ్గరికి వెళ్ళేసరికి , ఒక పక్క పోలీసులు ,మరోపక్క బుడ్డోడి మేనమావలు .వింతనుజూస్తా ఊరిజనం.
పడతా లేస్తా కొడుకు దగ్గరికి పోబోయాడు.
 చిన్నాయ్యవోరమ్మ మధ్యలోనే అడ్డొచ్చింది.పెద్ద అయ్యవోరమ్మ గదిలో కి తీసుకు వెళ్ళింది.అక్కడ  పంతుళ్ళు పంతులమ్మలు ఇన్స్పెక్టరు ..అందరూ ఉన్నారు.
"పొద్దున్న వొచ్చాడు. కసువులు చిమ్మను పోయిన మనిషికి కంచెలో దాక్కోని కనబడ్డాడు. భయపడి కేకలు పెడతా వొచ్చింది. చూద్దుము కదా. ఇతను. మాసిన గడ్డము, చింపిరి జుట్టు, ఖైదీల బట్టలు .కాళ్ళకు చేతులకూ బేడీలు.పిల్లలు భయపడి పోయారు.ఎక్కడొళ్ళక్కడే ఉరుకులు బిత్తరపడి నిలువుగుడ్లేసారు. మేమే వచ్చి అందరినీ లోపలికి పంపాం.
"ఏమ్మా, ఎవరికైనా హాని జేసినాడామ్మా?" మాటలు కుక్కుకొంటూ మెల్లిగా అడిగాడు ఆదెయ్య.
"ఊహు, కానీ,ఉదయం నుంచీ అక్కడే ఉన్నాడు.ఉలుకు పలుకు లేదు. అతనికే ఏదన్నా హాని చేసుకొంటాడేమో నని ఇన్స్పెక్టర్ గారికి కబురు పెట్టం..వాళ్ళ మేనమామలొచ్చారు. పిల్లోడు సాక్ష్యం చెప్పినందుకు  వాడిని చంపే దానికే వొచ్చాడనీ.."
ఆదెయ్య ఉన్న చోటనే కుప్ప కూలిపోయాడు. "ఇందరి కళ్ళల్లో ఇంత కిరాతకుడై పోయినాడా నా బిడ్డ.."

( "సురభి" ప్రారంభ సంచికలో ప్రచురితము)

<<<<సశేషం >>>>



 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jun 27, 2010

గుట్టెనుక 1

"గుట్టెనుక  దొంగల ముఠా  ...గజ్జెలమోనారే

 తరిమికొట్ట వొస్తవా చెల్లే ...గజ్జెలమోనారే "
ఆదెయ్య తన ఒక్కగానొక్క బక్కటెద్దును ముల్లుగర్రతో అదిలిస్తూ ,అడుగడుక్కో పదం పలుకుతూ ..మెల్లిగా నడుస్తున్నాడు. వెనకే, అటో అడుగూ ఇటో అడుగూ వేస్తూ గొర్రెల దాటు.
"  తాతా " ఎవరో పిలిచినట్లయ్యి, వెనక్కి తిరిగి చూశాడు.కనుచూపు ఆనే మేరలొ ఎవరూ లేరు.
ఎవరో పిలుస్తున్నారు.ఎవరినో మరి.
మునుపటి కాలంలో  కో  అంటే కోటి మంది ”. ఇప్పుడు గొంతు చించుకొన్నా బదులు పలికే దిక్కే లేదు.
"" మనిషి ఉన్నట్లుగానే ఆదెయ్య కేక వేశాడు.చుట్టూ ఉన్న కొండల్ని తాకి , ముసలి గొంతు మురిపెంగా తిరిగి వచ్చింది.
"ఈడ" ఆదెయ్య చుట్టూ చూశాడు.సరిగ్గా బోడికొండ మొదట్లో చిట్టికేసర చెటు మొదట్లో ఉన్నాడు."బోడికొండ
మొదట్లో కి రాండి " బిగ్గరగా కేకేసాడు.  గాలివాటున మాట ఎటు చేరిందో కానీ, మనిషి మాట మళ్ళా వినపడలేదు.
"అంతా ఇడ్డూరం.అసలు మనిషి మాటేనా తను మతి తప్పి ఇన్నాడా? ఆవంతన అరిచిన మనిషి అజాపజా లేడు!" ఆదెయ్య తన బక్కటెద్దుతో వాపోయాడు,"ఒరే సాంబా, చూడరా.. ఎట్టాంటి కాలం చూడాల్సి వొచ్చిందో ! కొండ మీద
కో అంటే కోటి మంది .ఇప్పుడు దిక్కుదెన్నూ లేదు.మాయదారి కాలం!" చెవి వెనకాల భద్రంగా దాచిన బీడీ ముక్కను తీసాడు.చివర కొరికి తుపుక్కున ఊశాడు.
ఆదెయ్య తోలుకొచ్చిన గొర్రెలు అటొకటి ఇటొకటి.తమ పనిలో తాము .తలలు వొంచుకొని .తపస్సు చేస్తున్నట్లుగా.
పగిలిన రాళ్ళ మధ్యన పచ్చిక పరక కోసం ఆత్రంగా వెతుకుతున్నాయి.ఆవురావురున దేవులాడుతూ.
"ట్.. ర్ర్.. ర్ర్.. హ్హె హ్హే.. "  ఆదెయ్య పలకరించాడు.
నింపాదిగా నిలబడ్డ గొర్రె ఒకటి మెడ నిక్క బొడిచి ,"మే" అంటూ బదులిచ్చింది.
"చూశా ... దాని వొయ్యారం!" ఆదెయ్య తెగ మురిసి పోయాడు.
ఎండలింకా ముదర లేదు. అయినా , పెద్దచెట్లన్నీ ఎండుముఖం పట్టాయి.ఆకులన్నీ రాలిపోతున్నాయి.గుట్టలన్నీ ఎండుటాకుల కుప్పల్లా ఉన్నాయి.
ముల్లుగర్ర చివరన వంకీలా కట్టిన పిడి లేని కొడవలిని ,రాతి మీద సాన బెట్ట సాగాడు.
కాగిన బండ.కరకర ఎండ.మొద్దు కొడవలి.
ఒక వింత ద్వని.ఆగి ఆగి. రాచి రాచి. కొండల్ని చుడుట్టూ.ఆదెయ్య చుట్టూ తిరుగుతోంది.
ఆదెయ్య బీడీని వెలిగించ కుండా ,చివరను నోట్లో ఆడిస్తూ ,గొణుగుతూ ,కొడవలి సాన పెడుతూ ఉన్నాడు.
కొండ వొడిలో ఒదిగిన ఒక్కో గుర్తూ ఆదెయ్యను ఆగి ఆగి పలకరించసాగింది.
కొండల్లోని డొంకలూ తోవలూ అన్నీ ఆదెయ్యకు తెలుసు. రాళ్ళూరప్పల్లో  ఎగురుతూ,  కోతి కొమ్మచ్చులు నేలాబండలు చిర్రాగోనెలు ఆడుతూ పెరిగాడు. కొండకి ఆవలి వైపున ఉన్న గంగానమ్మ సాక్షిగా భూదేవమ్మను పెళ్ళి చేసుకొచ్చాడు.
మంచైనా చెడైనా ,మాట రానీయకుండా, మాట పడకుండా,మాట అనకుండా సంసారం నెగ్గుకొచ్చాడు.
ఆ మాట కామాట , భూదేవమ్మ ఒద్దికగా కాపురాన్ని సర్దుకొచ్చింది.
 కొండ మీద కురిసే నాలుగు చుక్కలు భద్రం చేసుకొని జొన్నలో సజ్జలో మొక్కజొన్నలో తయిదలో ,మడిచెక్కలో చల్లుకొని ,సేద్యం చేసారు.
భూదేవమ్మ చెట్టూచేమా గుట్టు మట్టు ఎరిగిన మనిషి.ఏదో అట్టా జరిగిపోతా ఉంటే , నలుసుపడింది.కొడుకు.తెగ మురిసి పడింది.అమ్మ కదా?
నలుగురితో పాటు నారాయణా అనుకొని ,బడికి పంపారు,నాలుగు అక్షరం ముక్కలు ముక్కున పడితే ,మురిసిపోయారు.
చూస్తా ఉండగానే ,ఊరు ఊరంతా ..ఒకరి తరువాత ఒకరు  ..పట్నం దారి బట్టారు.ఒకడి తోక బట్టుకొని ఒకడు.గొర్రెలదాటున బడ్డారు. ఏం చేస్తారు? వాన కురిస్తే ఎవరన్నా ఆ మాట ఎత్తే వారేనా?
ఉరువేది? కరువు తప్ప.
ఏ తాతల కాలం నాటి వూరో ..ఏదో సుడిగాలిన బడ్డట్లు ,ఒక్క పెట్టున ఖాళీ.ఆ వడిలో తమ బిడ్డా.
"ఏందయ్యా దేశం కాని దేశంలో ఏం పని జేస్తాఉండావురా " అంటా,కడుపాతురానికి ఎన్నడ్నా భూదేవమ్మ ఆరాతీస్తే,"కేబుల్ పని " అనేవాడు. "అదేంటయ్యా" అంటే, "నీకు తెల్దు పోమ్మా “అనేవాడు.
. తెలుసుంటే, ఇక్కడిట్టా గుట్టాచెట్టు బట్టి ఇగ్గులాడే వాడా..అందరితో పాటు పడి తనూ పోయే వాడు కాడూ? ఆ నాజూకునాణెంపు పనులు మోటు మడుసులం మాకేం తెలుసు? ఆ మాటంటే ,భూదేవమ్మ మనసు కష్టపెట్టుకొంటది ఎందుకు లెమ్మని చూస్తా ఉండే వాడు.
ఏ కన్న్నీళ్ళు ఎన్ని కొంగుల్లో అదుముకొందో కానీ , తన ముందెప్పుడూ బయట పడిన జ్ఞాపకం లేదు.మేనకోడల్ని తెచ్చి వాడికి ముడేసింది. వాళ్ళకో బుడ్డోడు.
ఆదెయ్య ముక్కు ఎగబీల్చాడు. నానిన బీడీ ముక్కను నోట్లోనుంచి తీశాడు. కొనగోటితో విదిల్చాడు.మళ్ళీ నోట్లో పెట్టుకొన్నాడు.పొసగక, దానిని తీసి ,అగ్గిపుల్ల వెలిగించాడు.ఏమయిందో ఎమో బీడీ వెలిగించకుండానే ,అగ్గిపుల్లను ఆర్పేసి దూరంగా గిరాటేసాడు.మళ్ళీ తన గొర్రెల్ని ఒక మారు అదిలించాడు. కనుచూపు మేరా దృష్టి సారించాడు.
ఏది ఏమైనా బోడికొండ బోడికొండే !
సముద్రం ఒడ్డున బోర్లాబడ్డ శంఖం లా  ఎంత ముచ్చటగా ఉంటుందో.అదుగో అప్పాచెల్లేళ్ళ కొండలు .నీటికోసం వంగిన పిట్టల్లా ఎంతందంగా ఉన్నాయో !అప్పాచెల్లెళ్ళు ఒకదానితో ఒకటి కువకువలాడుతూ ముచ్చట్లాడుతూ ,ఏ పేరంటానికో పబ్బానికో ముస్తాబవుతున్నట్లుగా  ఎంత సొగసుగా ఉన్నాయో !   మభూదేవమ్మ వయసున ముడెసిన కొప్పులో ముడిచిన ముద్దబంతిలా. ఎంతయినా ఈ కొండాకోనా అందం చందం.
ఇంతలో ,కొండను చుట్టేస్తూ పొగ . సుడులు సుడులుగా గాలిలోకి తేలింది.
"అప్పుడే మొదలెట్టారూ!" గొణుక్కున్నాడు."ఆకులు నేల పడనీయరు.మంట ఎగదోస్తారు.  బూడిద తోసేసి ,నేల చదును చేసి,ఇన్ని ఇత్తులు చల్లుతారు.నీటి చుక్క కోసం మబ్బులెంక నోళ్ళెళ్ళబెట్టి కూసుంటారు.వాన బడిందా పరమాన్నం లేదా పస్తు.
అయినా ,ఈళ్ళకింత ఆత్రం ఎందుకుబట్టిందో ,శివరాత్రి సాగనియ్యరు.చెట్టుచేమా చూసుకోరు.మాడిన మాను మరలా చిగుర్చాలంటే ఎన్నికాలాలు పట్టుద్దో!పోయిన అడివి రమ్మంటే వొచ్చుద్దా ?ఆత్రగాడికి బుద్ది మట్టనీ..ఇట్టా అడ్డూ ఆపూ లేకుండా పోతంటే ,చివరాఖరికి మిగిలేదేంటనీ..?"ఆదెయ్య నిట్టూర్చాడు.
( "సురభి" ప్రారంభ సంచికలో ప్రచురితము)

<<<<సశేషం >>>>


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jun 13, 2010

వేలిముద్దరకు వేవేల జేజే




రోజులు క్షణాల్లా ..
ఇట్టే దొర్లిపోతాయి.
మనకు తెలుసు.
క్షణాలు అరక్షణాల్లో ..అరక్షణాలు....ఆహా..
క్షణంలో  వెయ్యోవంతులో ...సమయం  బోలెడంత  చమత్కారం చూపవచ్చు.
మరోలా అయితే , క్షణాలే యుగాలయిపోవచ్చు.
రెండు వేల తొమ్మిది పది లా మారడం మినహాయించిసరిగ్గా ఇదే రోజున , మా అబ్బాయి బడికెళుతూ ఇచ్చిన హోం వర్క్ ను ఇప్పటికీ పూర్తి చేయలేక పోయా.అదేంటో కానీ.
కాస్తాగి  వెనక్కి తిరిగి చూస్తే , బిర బిర చర చర ...కట్టల్లేని వాగులా ..ఆనకట్టల్లేని నదిలా. ..కాలం ఎలా ఉరకలు పెట్టిందో కదా అనిపిస్తోంది.
చదువుదామని పేర్చి పెట్టిన పుస్తకాలు ,అలాగే ఉన్నాయి.
విందామనుకొన్న పాట విననే లేదు. చూద్దామనుకొన్న సినిమా చూడనే లేదు.
వండుదామనుకొన్న కూర వండనే లేదు.తిందామనుకొన్న వంటకం తిననే లేదు.
మారుద్దామనుకొన్న కిటికీ తెరలు మార్వనే లేదు.వేద్దామనుకొన్న విత్తనాలు వేయనే లేదు.
కలుద్దామనుకొన్న వారిని కలవనే లేదు దానా దీనా, చేద్దామనుకొన్న పనులు చేయనే లేదు.
కనురెప్ప పాటులో కాలం కరిగి పోయింది.
చడీచప్పుడు చేయ కుండా.
గబగబ చకచక.
రెండేళ్ళ నాటి మాట.
కన్నెగంటి రామారావు గారి అధ్యక్షతన  సురేష్ కొలిచాల గారు కొత్తపాళీ గారు, వికిపీడియ రవి గారు, కాలాస్త్రి గారు,సిబి రావు గారు..
విడివిడిగా కలివిడిగా వివరించి చెప్పినా ,విడమర్చి చెప్పినా ..చెవినిల్లు కట్టుకొని చెప్పినా ..
గణాంకాలు ,గ్రాఫులు ,బొమ్మలూ ,పిపిటి ప్రెజెంటేషన్ల తో మిరమిట్లు గొలుపుతూ చెప్పినా..
మరుగవ్వబోతోన్న మన భాషను దేదీప్యమానం చేయడానికి  భాషవాడుక ను డిజిటైజ్   చేయడం ఒక మహత్తర మార్గం అంటూ బల్ల గుద్ది చెప్పినా ...
ఎంత ఎక్కువగా అంతర్జాలంలో తెలుగువాడకం పెరిగితే అంత మేలనీ .. దరిమిలా అక్షరలక్షలు కూడా పలక వచ్చనీ...
ఆ పై తెలుగు భాషవాడుకకు ఢోకా రాబోదనీ   అర్ధతాత్పర్యాలు  విశ్లేషించి  చెప్పినా ..
భాష అంతర్ధానం అవుతుందని  తాపత్రయేపడే వాళ్ళంతా అంతర్జాలం మాధ్యమంగా తెలుగును అంతర్జాతీయ భాషగా ఎదిగేలా స్థిరపడేలా కృషిచేయాలనీ భావోద్రేక ఉపన్యాసాలు చెప్పినా ...నలుగురూ నాలిగందాలా నయానా భయానా ఇలా అలా నచ్చజెప్పినా..
ఎక్కడో చిన్నపాటి   ములుకు అంతర్జాల రచనావ్యాసంగాన్ని ఆరంభించాడానికి పట్టిఉంచింది.
అక్కడికీ ఉండబట్టలేక ,వివరణలన్నీ ఆసాంతం విన్నాక, సందేహాలన్నీ గుమ్మరించేసా. దరిమిలా , వారందరూ మాటకా మాట సావాధానంగా సమాధానపరిచారు.
 ముఖ్యంగా అంతర్జాలపత్రికామిత్రులు.పునరుక్తి నుంచి కాపీరైట్ వరకూ.డైరీ నుంచి ఎడిటెద్ కాపీ వరకూ.
అయినా, ఆరంభించరు కదా నీచ మానవులు !
 అప్పుడే కంప్యూటర్ లోకంలోకి కాలు పెట్టిన తొమ్మిదోతరగతి పిల్లాడు తొందరపెడితే కానీ పేజీ మడత పడ లేదు !
నిజమండీ .. కాకిపిల్ల కాకికి ముద్దేమో కానీ.. ఈనాటి పిల్లలు అమ్మానాన్నలతో అనుకొన్న పని చేయించ గల గడుసుపిండాలు. ఔననలేకా కాదనలేకా.. వాదించలేకా గెలవలేకా ..వారి బాట పట్టాల్సిందే కదా!
ఏది ఏమైనా,
అంతమంది నిష్ణాతులు దార్శనికుల వివరణల నేపధ్యానికి... పిల్లవాడి వాదన ముఖపత్రమైంది .అంతే కదా మరి రూపేణా  నాకు సైతం చిటికెడు -జ్ఞానం అబ్బిందండోయ్!
తోచింది తోచినట్లు రాయడం, అచ్చేయడం.. మీరు తీరిక చేసుకొని చదవడం ,మొహమాటం లేకుండా అభిప్రాయాలు రాయడం ,తెలియని విషయాలు తెలపడం,   ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకొనే అవకాశాన్ని మీరు కల్పించినట్లే.
ఇక, వచ్చేదారెటు పుస్తకానికి వెనుక ఉన్నది మీ స్పూర్తి ప్రోత్సాహమే.
అందుకు మీకు నా ధన్యవాదాలు. రచనతో సరిపెట్టుకోకుండా , కొద్దిపాటి ప్రయత్నం చేయగలిగా మంటే  ,అది మీ అండాదండల వలననే.
వందలాది సంతకాలు సేకరించగగినా ,ప్రజాభిప్రాయసదస్సులో ప్రసంగించగలిగినా ,అది మీ సహకరం  తోనే సాధ్యమైంది.
అబ్బా ..ఇది రాయదగ్గదేనా .. సరిగ్గానే ఆలోచిస్తున్నానా .. అంటూ ఆగినప్పుడల్లా.. ఇదుగోండి ఇంతటి దైర్యాన్ని నూరిపోసి ముందుకు నడిపింది  మీరే.అర్ధరాత్రైనా అపరాత్రైనా.
చిట్టిరచనల బాగోగుల గురించి ఇప్పుడు నేను సైతం..ఘంటాపథంగా చెప్పగలను.. మరోమారు కన్నెగంటి వారో కొలిచాల వారొ కొత్తపాళీ గారో ..మాట్లాడే అవకాశం ఇస్తే.
ఇక,వేలిముద్రపాటుతో రచించేయడం, క్షణాల్లో అచ్చేయడం ,నిమిషాల్లో అభిప్రాయాలు తెలవడం...అంతా బాగున్నట్లే అనిపిస్తుంది కాసేపు.కొనగోటిమీతులో ప్రపంచం ఇమిడినట్లు.
ఎటొచ్చి,
ఒక రచన చేసి,తరిచి చూసి,ఒక పత్రికకు పంపి , నెలకో నెలన్నరకో ఏడాదికో ఎడాదిన్నరకో ..అచ్చయినప్పుడు ..కొత్తగా చూసుకొని ..వింతపడి..బొమ్మ భలే ఉందే !అచ్చులో నా అక్ష్రాలు ఎంతా బావున్నాయో ! అనుకొంటూ మురిసిపోయి ..
ఫలాన పత్రికలో ఫలానా సంచికలో అచ్చయిందహో ..అంటూ తెగ సంబరపడేంత ఓపిక ఒక్కరవ్వ తగ్గిందేమో నని ..ఒక చిన్న అనుమానం.
ఎందుకంటారా?
ఇట్లా రాయడం అట్లా అచ్చేసుకోవడం అలవాటయ్యాక ..వారాలే యుగాలుగా తోచడంలో వింతేముంది ?మీరే చెప్పండి!
అచ్చు లోకంలో మునుముందు ఏమేమి వింతలు జరగనున్నాయో ఎవరం చూడొచ్చాం లెద్దూ!ఇప్పటికి ఒక్ అకొబ్బరికాయ కొట్టేసి షుభం పలుకుదాం!
మళ్ళీ మా అబ్బాయి , ఇచ్చిన హోంవర్క్ చేయకుండా ఏమిటా టైం వేష్ట్ ..అంటూ గుడ్లురమ గలడు. వాడసలే చంఢామార్కుడు!
 నేనేమో బుద్దిమంతురాలిని! ఇచ్చిన పని చక్కగా చేయద్దూ మరి?
 మా వడొచ్చి వొంకా వొంకా పెట్టకుండా, కాంపోజిషన్లు రాయించకుండా ..
 మీరు కూడా చొరవ తీసుకొని  తలా ఒక చేయి వేస్తే ..
మడతపేజీ ని తీరుతెన్నులు తప్పకుండా తీర్చిదిద్దగలనని సవినయ మనవి.
***
ఆకటి వేళలఆకేసి పప్పేసి బువ్వేసి "నా..వగలమారి వంకాయ వేపుడేసినా..పిప్పరమెంట్ల తో సరిపుచ్హ్చినా ...వారెవా అంటూ ప్రోత్సహించిన మీకు నా అభిమానాలు.
"అన్నీ అక్కడే ఆరంభమయ్యాయిశ ..అంటూ ఆశ్చర్యపడినా, కటా కటా "అంటూ కష్టపడి నిష్టూరపడినా ..ఉల్లిపొరలు పొరలుగా" విప్పిచూసినా .. మేమున్నమంటూ ..అండదండగా నిలిచినా మీకు .. మరొక మారు ధన్యవాదాలు.
***
త్వరలోనే మళ్ళీ.

***12-6-2010*** 
 Dot Painting: Krishna Vamsi,Greeshma Prabhava, 12 yrs.
***


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jun 9, 2010

విడివడ్డ పురికొస ముడి

ఎప్పుడూ ఇంతే.
ఎదురు చూసినంత సేపు పట్టదు కదా..
ఎండాకాలం సెలవలు అయిపోవడానికి!
మొన్నటి దాకా ..
సెలవల్లో ఏం  చేయాలన్న సవాలక్ష  సమాలోచనలు.
నిన్నటిదాకా..
సెలవలు ఎలా గడపాలన్న పదిన్నర పథకాలు.
పూటో మర్నాడో ..
సెలవలు ఇక లేవంటూ మిగిలే ఒకే ఒక్క దిగులు.
పిల్లల సంగతి అటుంచండి.
టీవీలు, పియస్ త్రీలు, కంప్యూటర్ ఆటలు ,ఆర్కూటులు,ఫేసుబుక్కులు,చాటింగులు..వాళ్ళవేవో వాళ్ళకున్నాయి.
పెద్దాళ్లతోనేగా అసలు సంగతి.
సెలవలు వస్తాయన్న సూచన రాగానే ..సెలవల్లో ఈ పిల్లలని ఎలా సరి దిద్దేయడమా ..ఈ సెలవలు అయిపోయేలోగా ఈ పిల్లల్ని ఎలా తీర్చి దిద్దుదామా ..ఎంత బాగా మణి మాణిక్యాల్లా మలిచివేద్దామా ..ఇలా అలా..
తలకు తట్టెడు ఆలోచనలు.
అమ్మానాన్న లకు అంత ఆలోచించే శ్రమ ఎందుకనో ఏమో..
బోలెడన్ని బడులు వేసంకాలం మధ్య వరకూ సాగి, ఏరువాక సాగక ముందే భళ్ళున తెరుచుకుంటాయి.
ఏ మాట కా మాట చెప్పుకోవాలి.
మునుపటి కన్నా ఇప్పుడు వేసంకాలంలో వెసులుబాట్లు ఎక్కువ.
ప్రయివేట్లు ,ఎంసిట్టింగ్లు తరహా వేసవి శిక్షణా శిబిరాలు ,సినిమాలుసిత్రాలు,కుటుంబప్రయాణాలు ,దేశసంచారాలు ఇప్పుడు కావలిసినన్ని.
వేసంకాలం కోచింగులు క్యాచింగులు ..కోరుకున్న వారికి కోరుకున్నంత.
ఏటి దగ్గరి ఊరన్న మాటే గానీ ,కాలువ గట్టు బతుకులయ్యే .కాలవ ఆగిందా ..ఎండాకాలం సెలవలు వచ్చినట్లే లెక్క.
అటు ధాన్యం ఇటు దాణా ...అన్నీ ప్రియమయి కూర్చుంటాయి. నీటి సంగతి సరేసరి.
మనుషుల అతీగతీ  పట్టించుకొనే నాథుడుండుండు.పశువుల సంగతి అడక్కరలేదు.
పిడికెడు పరక కోసం ముట్టెలాంచి రేగడంతా వెతుకుతూనే ఉండేవి.
ఏట్లోనే నీరు బొటబొటలాడుతుంటే కాలువ నెర్రెలు బారదా? ఇక ఉన్న ఒక్కగానొక్క చెరువు సంగతి చెప్పక్కర లేదు.
ఉన్నకాసిని నీళ్ళు ఆవిరయ్యే లోపుగా చేపలుపట్టే వాళ్ళు తయారు.
పట్టిన చేప పట్టగా ఒట్టిపోయిన చెరువు గట్టు దాటి.... గాట్టి బురదలో తొక్కుకొంటూ వెళ్ళి జనుం కోసుకొనే వాళ్ళు కొసుకొన్నారా ..ఇళ్ళ కప్పులు కప్పుకొనే వారు కప్పుకొన్నారా..ఇక ,చెరువులో మిగిలిన కొద్దిపాటి   బురద నీళ్ళలో పట్టిన నాచుపాచిల నడుమ బుడుంగు మంటూ .. ఏ కప్పో చేపో బురద మట్టో... అప్పుడప్పుడు ..విప్పారి ముసి ముసి నవ్వులు నవ్వే కలువపూలో ..కళకళలాడుతూ విరిసే  తామర పూవో.
అలాంటి ఎండాకాలం సెలవుల్లోనేగా..
బ్యాటరీలు అవజేస్తారని చీవాట్లు తింటూ.. క్రమం తప్పకుండా బాలానందం విన్నదీ.
కనులు తిప్పకుండా అన్నానికి లేవకుండా అప్పచ్చులు అడగకుండా ... అన్నాకెరీనానాను  పలకరించిందీ స్పార్టకస్ ను పరామర్షించిందీ.
చిట్టిమేఘమైనా లేని ఒట్టి ఆకాశంలో ..లెక్కలేనన్ని చుక్కల్ని చూసిందీ.. వడగాడ్పుల్లో మాడిమసవుతున్న చెట్టుచేమల్ని చూసిందీ ..సుడిగాలుల్లో తేలిపోతున్న ఇళ్ళకప్పుల్నీ, పెళపేళలాడే ఉరుముల్నీ ,నేలను చీల్చేస్తాయే అనిపించే మెరుపుల్నీ.. వడగళ్ళవాన్నల్లో తడిచి పోతున్న గడ్డివాముల్ని. పెళ్ళున విరిసే హరివిల్లుల్నీ
 ..చూసింది.
పెద్దాళ్లంతా చదివి,పురికొసతో ముడేసి, అటకెక్కించిన యువ,జ్యోతి,స్వాతి ,ప్రభలూ.... వెతికి పట్టుకొని చదవ ప్రయత్నించిందీ...
వడ్డాదిపాపయ్య గారి బొమ్మల సుకుమార్యంలో లేతరంగుల ప్రపంచంలో విహరించిందీ..బాపుబొమ్మల కొంటెతనం పరిచయం అయిందీ ..
అవి మధుబాబు తరహా డిటెక్టివ్ లైనా  , పాకెట్టు జానపద నవలల విక్రమబేతాళైనా..చంద్రకాంత  శిలలనూ   తుపాకీ రహస్యాలనూ ..ఒకా పట్టున చదివిందీ..
ఏం అర్ధమయిందని సొమ్ములు పోనాయండీ చవడం? అనుక్షణికం ,చెంఘిజ్ ఖాన్...ఏం అవగాహన అయ్యాయనీ?కరప్పూస పటుకు పటుకు మంటూ.. పెద్దలు వద్దన్నవి ప్రతి పేజీ పదే పదే ..చదవడం తప్ప!పరీక్షకు చదవనంత శ్రద్ధగా!
ఏ పురినీడలోనో బోరాల చాటునో నులక మంచం వాల్చుకొనో.. చూరు నీడపొడలో ఒదిగి కూర్చునో . పాతకెరటాలను తాకి వచ్చిందీ ఎండాకాలం సెలవల్లోనే కదా?
అయిదో ఆరో తరగతి సెలవల్లోనో చదివిన "విశ్వ దర్శనం” ఆపై చదివిన నరావతారం" ప్లూటొకాలంలో ఒక్క ఏడాదైనా లేదు కదా ఈ మానవ జీవితం అంటూ కలిగిన వైరాగ్యం..అన్ని జీవుల్లో కెల్లా బుద్ధిజీవై ఉండి ..మనుగడ కోసం.జీవిక కోసం..నరావతారం పడ్డ తపన ..చేసిన ప్రయోగాలు విఫలాలు,ప్రయాణాలు ప్రయత్నాలూ .. బౌతికంగా మానసికంగా మేధోపరంగా  జరిగిన పరిణామ క్రమపు ఆంతర్యం,చేతన, వికాసం   ..సమాజాల్లోని ఏడుతరాలు..అమ్మ ..అసమర్ధుని  జీవయాత్రలు...హకుల్బరీఫిన్లు...చివరికి మిగిలేదీ .. దీ అర్ధమయ్యీ అర్ధమవ్వక ముందే ..తలల్లోకి తలపుల్లోకి ఇంకి పోయినదీ .. ఇలాంటి ఎండాకాలం సెలవుల్లోనేగా!
పిట్టలు కూడా నోళ్ళు తెరుచుకొని ..ఆవురావురంటూ కాలువ నెర్రుల్లో ముక్కులు జొనిపి .నీటిచుక్కలకై వెతుకు తుండగా ..
రాలిన వేప పళ్ళో ..మాగేసిన ఈతకాయలో ..చిగురుకొమ్మనున్న సీమచింతకాయల్నో ..సాధించుకొని ..సావధానంగా తింటూ..
అలంపురం బేనిషాలను మాగేసి.వంతులేసుకొని టెంకెను పంచుకొంటూ.. చీకేసిన టెంకెను ఎండెసి..ఎండెసిన టెంకెను నాటేసి..ఉన్ని కొన్ని నీళ్ళు చిలకరించి..ఆకాశం వంక ఆశగా చూస్తుండగానే.. ఎండాకాలం సెలవలు అయిపోయేవి !
వడగాడ్పు.సుడిగాలి.ఏరువాక.వడగళ్ళ వాన.తొలకరి.
మళ్ళీ బడి !
 ***
కట్టండి బండి..తెల్లార గట్ట
పాలమూరు ప్రయాణం!


*
వద్దంటే వినకుండా
విడదీసిన  పురికొసముడి ని బిగించి.. అక్కడక్కడా పడిఉన్న పుస్తకాల్ని అటకపై విసిరేసి ... 
ఎద్దుల మువ్వల సవ్వడిలో ఎక్కిళ్ళు దాచేసి ..దిబ్బరొట్టి నములుతూ
..చడీచప్పుడు లేకుండా ..చెన్నుపాడు బస్ స్టాండుకి.. మళ్ళీ బడికి.
*
 మళ్ళీ బడికెళుతున్న పిల్లలకు ,వాళ్ళ అమ్మానాన్నలకూ..అనేక శుభాకాంక్షలు.
***

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Jun 8, 2010

ఉల్లి పొరలు పొరలుగా

ఒక రచనకు, ఆ రచయిత వ్యక్తిగత జీవితానికి, అనుభవాలకు మధ్య ఉన్న అవినాభవ సంబంధం గురించి , ఆయా తరాల పాఠకులం ఆసక్తిగా తరిచి చూస్తుంటాం.
 అనుకుంటాం గానీ, రచయిత ,ముఖ్యంగా ,కాల్పనిక సాహిత్య రచయిత, తన రచనకు వ్యక్తిగత అనుభవానికి మధ్య  గల సంబంధాన్నిస్పష్టంగా వ్యక్తపరచడం కష్టం.ఎందు చేత నంటే, ఒక రచనకు అనేక అనుభవాలు,ఆలోచనలు ,అనుభూతులు ,స్పందనలు ముడి పడి ఉంటాయి. ముఖ్యం గా, నవలల విషయం లో. 
భక్తిన్ (Mikhail Bakhtin, రష్యన్ తత్వవేత్త) అంటారు కదా, నవల రచయిత జ్ఞానం,అనుభవం,దార్శనికతల ముప్పేట అని. ఇక, రచయిత ప్రతిభాకౌశలం కాల్పనిక శక్తి ఆ రచనకు జీవమని వేరే చెప్పక్కర లేదు. అందు చేతనే అతి యదార్థవాదుల రచనలు కూడా .. అనుభవాల ప్రేరణలూ,ప్రతిస్పందనలూ, ప్రతీకలూ..కావచ్చు కానీ, అనుభవాలే కావు. మరో చిన్న మాట. ఏ రచనా “పాఠకుని” అనుభవం తో జ్ఞానంతో ముడి పడకుండా పూర్తి కాదు కదా?
అదలా ఉంచుదాం. ఒక రచయిత ఉన్నారు.
డాంజిగ్ అనే చిన్న సరిహద్దు పట్టణం లో పుట్టి, కొలోన్ మతవసతి గృహాలలో తలదాచుకొని , డసల్ డార్ఫ్ లో కళాకారుడిగా రూపు దిద్దు కొని, బెర్లిన్ చేరి, కళాకారుడిగా,రచయితగా, సామాజిక కార్యకర్తగా ,రాజకీయ పర్యావరణ రంగాలలో నిర్విరామ కృషి చేసారు. వారే, నోబుల్ పురస్కృత , గుంటర్ గ్రాస్.(Gunter Grass)
డాంజిగ్ కీ డసల్ డార్ఫ్ కీ నడుమ – సైన్యంలో పని చేసి,యుద్ధఖైదీ గా పట్టుబడి,విడుదలయి,గని కార్మికుడిగా జీవించి, సమాధి రాళ్ళు చెక్కే రోజువారీ కూలీ తో కొనసాగించి, సొమ్ము కూడబెట్టి కళావిద్యార్జన చేసాడు. అతను ప్రపంచం ముందు దోషిలా నిలబడిన అవిభక్త జర్మన్ దేశపు సగటు పౌరుడు.వివాదస్పద పోలండ్, జాత్యహంకార జర్మనీ, స్వతంత్ర డాంజిగ్ .. ల నడుమ పుట్టి పెరిగిన మాములు పిల్లవాడు.
మొదటి ప్రపంచయుద్ధం మిగిల్చిన మాంద్యాన్ని తట్టుకొని నిలబడే లోగా, తరుముకు వచ్చిన రెండో ప్రపంచ యుధ్ధం .. ఓటమి, హింస,అవి రెండూ మిగిల్చిన అపరాధ భావన, చెదిరిన మానవ సంబంధాలు,పునర్నిర్వచించబడిన మానవ విలువలూ…ఈ నేపధ్యం లో …ఆస్కార్ మాట్జెరాత్ (Oskar Matzerath) అనే మరుగుజ్జు కథ గా మొదలై మూడు నవలలు విస్తరించిన యుద్ధ శకలాల కథ..రచయిత సజీవ స్మృతి.. డాంజిగ్ త్రయం (Danzig Trilogy) గా సుప్రసిద్ధమైన -The Tin Drum (1957), The Cat and Mouse(1961) మరియు The Dog Years(1963)
ఆస్కార్ మూడవ పుట్టిన రోజున అమ్మ ఇచ్చిన బహుమతి ఆ తగరం డప్పు , Tin Drum. సరిగ్గా అదే రోజున ఆస్కార్ ఇక ఎదగ కూడదని నిర్ణయించు కొంటాడు.ఆ నాటి నుంచి డప్పు అతని జీవితంలో భాగమై పోవడమే కాక, అతనికే అది ప్రతీక అవుతుంది.
కళకు యుద్ధానికీ  నడుమ జరిగిన ప్రత్యక్షఘర్షణ కు సజీవ ప్రతీకగా ఈ నవలను విమర్షకులు పరిగణిస్తారు.
 ప్రతీకాత్మక సాహిత్యం గా, మాజిక్ రియలిజం గా , ప్రయోగాత్మక శైలిగా..భాషలో భావనలో .. అటు జర్మన్ సాహిత్యం లోనూ , ఇటు ప్రపంచసాహిత్యంలోను సుస్థిర స్థానాన్ని సంపాదించుకొన్నది ఈపుస్తకం. ఈ నవలను చలన చిత్రంగా మలిచినప్పుడు ఆస్కార్ పురస్కృతమైనది.
ఈ విశేషాలన్నీ మీకూ తెలిసే ఉండవచ్చును. ఎటొచ్చి, ఉమ్మడి అపరాధ భావన ను రేకిత్తించిన నవలా రచయితగా,జర్మన్ స్పృహను కలిగించిన కళాకారుడిగా. Gruppe 47 వ్యవస్థాపక సభ్యుడిగా సమకాలీన జర్మన్ సమాజాన్ని పునర్నిర్మించే క్రమంలో , కీలక పాత్ర పోషించిన సామాజిక విమర్శకుడిగా.. రాజకీయ రంగంలో ప్రధానపాత్ర పోషించిన సోషల్ డెమోక్రాట్ గా … ప్రభావశాలిగా…కీర్తించబడే , గ్రాస్ తన ఆత్మకథ , Peeling The Onion ప్రచురించాక ఒక్క సారిగా ,పెద్ద వివాదం లో పడి పోయారు.
ఆయన నాజీ సైన్యంలో కీలకవిభాగమైన SS నందు సభ్యుడు కావడమే ఇందుకు కారణం. ఎటొచ్చి అప్పుడు గ్రాస్ బడి పిల్లవాడు. బడిలో జరిగే డ్రిల్ లో భాగం మొదలయి , తమ సరిహద్దు పట్టణాన్ని శత్రువుల బారి నుంచి తప్పించుకొనే వీరోచితకార్యం లో బాధ్యతగా,ఉత్సాహంగా పాల్గొన్న బడి పిల్లవాడి ఆలోచనే కనబడుతుంది .ఉల్లిపొరలు విప్పి చూసినపుడు.
బాల ఖైదీగా మిత్రకూటమి కి పట్టు బడినపుడు .. వారు చూపించిన చిత్రాలు ఒక్కసారిగా యుద్దపు మరో ముఖాన్ని నిర్దయగా ముందు నిలిపినట్లు …ఒక సామూహిక జాత్యహంకార హత్యాకండలో పరోక్ష భాగమైనా… ఉన్నతాధికారుల కొసం తుపాకులు తలకెత్తి మోసిన సామాన్య గన్నర్ గా పట్టుపడిన బాలఖైదీగా…ఆ నమ్మశక్యం కాని నిజాన్ని.. జీర్ణించుకోనే క్రమంలోనే ఆస్కార్ ..రూపు దిద్దుకొన్నట్లు గ్రాస్ తెలియజేస్తారు.తన లోని అపరాధన భావననే  ఉమ్మడి అపరాధన భావనగా రేకిత్తంచడంలో ..రచయిత సఫలీ కృతుడయినట్లే విమర్శకులు భావిస్తున్నారు. 
వివాదాలు గ్రాస్ కు పరిపాటే.
ఆస్కార్ పొందిన ఆ చలన చిత్రం మితిమీరిన అశ్లీలతకు ప్రతీకగా కోర్టుకెక్కింది. ఆ క్రమంలో, అసంబద్దరచనల అశ్లీల రచయితగా గ్రాస్ పిలవబడ్డారు. ఆ అసంబద్దతా ఆ అశ్లీలత ..యుద్ధం మిగిల్చిన శకలాలేననీ.. తాను మరే ఇతర జర్మన్ కన్నా  అతీతుడను కాదనీ .. గ్రాస్ తెలియపరిచారు.కొన్ని చోట్ల ప్రదర్శన నిలిపివేసినా , ఆ చిత్ర ప్రదర్శన కొనసాగడం, ఆస్కార్ స్వీకరించడం – చరిత్ర. ఇప్పుటి వివాదం , మరింత తీవ్రమైనది.
ఇంతకీ, ఒక బడి పిల్లవాడి అనుభవం,ఒక బాధ్యతాయుతమైన రచయిత కలం లో జాలు వారిన నిజం … ఆ రెండు రచనలకు మధ్యన అయిదు దశాబ్దాల పరిధిలో… ఆ రచయిత నిర్వహించిన సామాజిక బాధ్యత ….. డాంజిగ్ కు ప్రపంచవేదిక కు నడుమ జీవించిన ఏడు దశాబ్దాల పైబడిన జీవితం…… ఆ రచయిత ను ఎలా అర్ధం చేసుకోవడం? వ్యక్తిగా, రచయితగా…ఎలా స్వీకరించడం?
***
అన్నట్లు ,రచయిత తన జీవితానుభావాలనూ జ్ఞాపకాలనూ ..ఉల్లి పొరలు విప్పుతుంటే ..కంటిలో గిర్రున తిరిగే నీటి తో పోల్చుతారు. ప్రతి పొరా విప్పినప్పుడూ ఒక కన్నీటి అల. అంతే కాదు, తన జీవితాన్ని అన్ని శకలాలను తనలో దాచుకున్న అంబర్ రాయి( సముద్ర తీరాన అదాటున లభ్యమయ్యే పసుపు పచ్చని మణి) తో పోల్చుతారు.
కొడుకుగా ,అన్నగా తన కుటుంబం అనుభవాలను ఒక అపరిచితుడిగా తెలుసుకోవలసిన హృద్యమైన ఆ క్షణాలను, ఏ యుద్ధంలో తానూ పాల్గొన్నాడో ఆ యుద్దపు మరో పార్శ్వం ..అతని జీవితంగా ఎదురుగా నిలబడిన నిమిషాలను .. మనం జీర్ణించుకోవడం అంత సులభం కాదు…నిజం!

***
పుస్తకం.నెట్ వారికి ధన్యవాదాలతో
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.