Mar 22, 2010

ఏమో ..అదేమో ..మరేనేమో !

ఎన్నైనా చెప్పండి.

వేసం కాలం.
సాయం సమయం.
సముద్రం గాలులు.

మంచి నిద్రలో కమ్మి వేసే కమ్మటి జ్ఞాపకం లా..
నిలువెత్తు వివశత్వంలో ముంచేయ గలదు ...
అప్పుడప్పుడే విచ్చుకొంటున్న ఒక చిన్న మల్లెచెండు.

ఎప్పుడైనా ఆదమరుపున  మనసున మెదులుతుందొక మధురమైన పాట.

మనుసున మల్లెల మాలలూగెనే.. ఎంత హాయి ఈ రేయి నిండెనో ..
అంటూ.

ఆ పారవశ్యం ఆ పాటదా ఆ మాటదా..
ఆ తియ్యటి పలుకు ను ఒలికిన స్వరానిదా..ఆ అందమైన స్వరాన్నిన స్వరకర్తదా..? ఆ కమనీయ భావాన్ని కంటిముందు నిలిపిన ఆ అపురూపమైన  జంటదా?
ఏమో?

బహుశా...
ఆ హాయి ..
ఆ వయ్యారి మల్లెలమాలలదేనేమో!

***


All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

Mar 14, 2010

Mar 10, 2010

కథ రాకడ

ఒకానొక పెద్దమనిషి యెకాఎకిన మా ఆఫీసులోకి వచ్చి , నా టేబులుకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చునే లోగానే ,
గబ గబ అనవలసినవన్నీ అనేసేసారు. పరిచయాలు పక్కన బెట్టి. ఆహ్వానాలు  ఆవలపెట్టి.
"అసలా కథ అలాంటిదిలాంటిది కాదు..నోబిలు ప్రైజు రావలిసింది.ఎలాంటి కథెలాంటి కథ ! తెలుగులోది కాబట్టి నలుగురి కంటా పడకుండా పోతంది కానీ , ఏం కథండీ బాబూ .. .నన్ను నిలవనీయ లేదనుకోండీ! వెంటనే ఫోను జేసా.  మీరు లేరు. "
వారి కథాప్రేమకూ అందునా తెలుగు కథాప్రేమ కు కడుంగడు సంతసించి ,  ఆ ఆనందం నేనూ పంచుకొందామని ,    అరక్షణం లో వెయ్యోవంతు ఆయన ఊపిరి పీల్చుకోవడానికి ఆగ గానే ,    వారి అత్యుత్సాహానికి   ఒక అడ్డుపుల్లేసా.
" ఇంతకీ ఆ కథాకమానీషు ఏమిటన్నారు? ఎవరిదాకథ? "
"ఎవరిదేంటండీ బాబూ .. మీదే!"
 అంతే ! నా గుండె ఠా మంది! కళ్ళు బైర్లు కమ్మాయి. కొంత దిటవు చేసుకొనే లోగా..ఆయన కొనసాగించారు.
"అదేనండీ.. ఎంత అద్భుతమైన కథండీ బాబూ.. భలే కథ ! అంతా బాగుంది కానీ , ఆ పేరేంటండీ ..అలా పెట్టేసేరు?   ఎలాంటి కథకు  ఇలాంటి పేరు పెట్టిందీవిడ అని తెగ దిగులు పడి పోయా.."
పోనీ లెండి . ఒక వంక దొరికింది !
హమ్మయ్య !  తెరిపిన పడ్డా.
"ఇంతకీ, ఏ కథన్నారు?"   బిక్కు బిక్కుమంటూ....  మెల్లిగా అడిగా.
ఆయన ఆలోచించి ఆలోచించి ... ఒక్కసారిగా అరిచినంత పనిజేసారు.
"ఒక్క మాట ..ఒక్క మాటండీ బాబూ"
"మీరంటోంది ఫలానా కథ గురించి కాదు కదా?" సందేహిస్తూ అడిగా.
"ఆ... అదేనండీ. కాస్త ఆలోచించి మంచి పేరు పెట్టొచ్చు కదా. ఫలానా . ఛ.లానా.... .. ఏం పేరండీ అది?”
మింగా లేను కక్కా లేను. మిడి గుడ్లేసుకుని , గుటకాలు మింగా.
..ఆ అదండీ కథంటే! ఆ సంఘటనలూ ఆ సంభాషణలు ..మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఒకటి మాత్రం నిజం! "ఆయన కుండ బద్దలు కొట్టేసారు."ఇంత బ్రహ్మాండమైన కథ స్వీయానుభవం కానిదే ఎలా రాస్తారు?ఇది కచ్చితంగా మీ అనుభవమే ! అనుమానం లేదు!"
అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారం ఈ దోవ  మళ్ళిందేమిటని ఆశ్చర్యపడే లోగానే , మళ్ళీ అన్నారాయన.
"మీరే ఆ కథలోని ఒక పాత్ర. ఏ పాత్ర అన్నది తేల్చేయాలి ముందు!"
ఇక వ్యవహారం ముదిరి పోయి అత్యవసర పరిస్థితి ని చేరుకొంది కనుక, నా  మొహమాటాన్ని ఒక్కరవ్వ పక్కకు పెట్టి, అన్నా.
" ప్రతికథా స్వీయానుభవం లోనుంచే రానక్కరలేదు. ప్రతి అనుభవమూ కథ కానక్కర లేదు.కథా  ప్రేరణకు మూలాలు ఒకటి కావచ్చు అనేకం కావచ్చు."
" మరి ఈ కథ ఎలా రాశారు?" ఆయన గద్దించారు.
" నిజం చెప్పాలంటే, నాకు తెలియదు."
" అనుభవించనిదే కథ ఎలా వస్తుంది? "  ఆయన కోపం గా అడిగారు.
"కథ రాకడ ప్రాణం పోకడ తెలియవు , కదండీ?"  
***
ఆ గుర్తొచ్చింది. ఆ కథ ప్రథమ పురుషలో ఉన్నది. 
ఈ తిప్పలన్నీ రచయితకు కథకుడికీ మధ్యన ఉన్న తేడాను వారు గుర్తించక పోవడం తోనో , గుర్తించినా గ్రహించక పోవడంతోనో, గ్రహించినా కొన్ని స్థిర అభిప్రాయాలను అంటి పెట్టుకోవడంలోనో.. అలానో ఇలానో ఎలానో ..వచ్చాయన్న మాట !
ఆ మాటే వారికి చెబుదామని నోరువిప్పేలోగానే,
 నా గది తలుపు ఢామ్మని మూసుకొంది. 
నా ఎదురు కుర్చీ ఖాళీగా పలకరించింది!
***
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.