Aug 18, 2009

అంతా బావున్నారా?


All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.
Posted by Picasa

డా. విజయ్ గుప్తా గారి మాట


హిల్సా, బైజీ, సామన్, డాల్ఫిన్,పులస, చీరమీను,జలుగు...చేప ఏదైనా ...అది ఒక జీవి.

గంగా,నర్మద,కొలరాడో,యాంగ్చీ, గోదావరి,కృష్ణా... నది ఏదైనా ...అది ఒక జలనిధి.

ఆహ్వానాన్ని మన్నించి... చేపలెగరావచ్చు...!!!
పుస్తకం ఆవిష్కరణకు వచ్చి ... తమ తమ అభిప్రాయాలను అందరితో పంచుకొన్న వారందరికీ ధన్యవాదాలు. పంచుకోవాలనుకొంటున్న వారికి ఆహ్వానం.
ఇది ,పూర్వ Addl.Director General ,World Fisheries వారి మాట.
వీలుOటే విని చూడండి.
మరికొందరి స్వరాలు...
త్వరలో.

సెలవు.

*
డా. గుప్తా గారి ముఖ్యమైన మాటలు.

- అనేకానేక ఆనకట్టల నిర్మాణం జలచరాల ఉనికిని ప్రమాదంలో పడవేసింది.అదృశ్యమైనవి ఎన్నో.అరుదై పోయినవి మరెన్నో.

-ఇతర దేశాలలో జరిగిన జలచర ఉనికిని కాపాడే ప్రయత్నాలు.సఫలాలు.

-మన దేశంలో జరిగిన ప్రయత్నాలు.విఫలాలు.

-ముంపువాసులైన మత్స్యకారుల అనుభవాలు.విషాదాలు.

-జలచరాల ప్రవర్తన ,జీవక్రమం పై స్ఠానిక ప్రాధమిక అధ్యయనం జరగవలసిన తీరుతెన్నులు.

-వివిధశాఖల మధ్య సమన్వయ కార్యాచరణ ప్రణాళిక.

-వరిపొలాలలో చేపలపెంపకం వంటి ప్రయోగాల పర్యవసానాలు.ఫలితాలు.

13-8-2009

Aug 17, 2009

గడపలలో కెల్ల...

పుష్కరకాలం నాటి మాట.

కాలిఫోర్నియా వెళ్ళబోతూ .. మా ఆథిధేయిని మర్యాదగా అడిగాను,

"మీ ఇంటికి వస్తున్నాను.. మీకేమి తేనూ.." అని.

ఆవిడ మురిపంగా నవ్వి ముచ్చటగా అడిగారు," మునక్కాయ విత్తనాలు!"

మళ్ళీ తనే అన్నారు," మీరు విత్తనాలవారు మాత్రం తేలేరూ..."

'అదెంత పనీ ' అని అనుకొని అదే మాట వారికి వాక్రుచ్చి , సరే నంటూ వాగ్దానం చేసేసాను. అన్ని దానాలలోకీ సులువుగా చేయగలిగేది వాగ్దానమే కదా మరి !

అయినా నిజం చెప్పొద్దూ .. ఆమె వింత కోరిక కు కొంత హాశ్చర్య పోయి .. తరువాత విత్తనాలవేటలో పడ్డా. అప్పుడు తెలిసింది.మునక్కాయల్లోని ముప్పైఆరు రకాలు.సంతోషపడి చేతికందినవన్నీ పోగేసాను.

తరువాత తెలిసింది. ఒక్క పొల్లు గింజను కూడా అనుమతి లేనిదే అమెరికా గడప దాటదని.దాటనివ్వరనీ.

వ్యవసాయ వ్యవహారాలన్నీ కస్టంస్ కన్నా ముందే క్లీన్ చిట్ తీసుకోవాలనీ.. అక్కడ ఏదైనా తేడా వస్తే .. తిరిగి రవాణా చేసేస్తారనీ.. అదనీ ఇదనీ.

మాత్రం తేలేరూ” అంటూ మా ఆథిదేయి మెత్తగా విసిరిన సవాలు.. తేగలను అంటూ గట్టిగా నేనిచ్చిన సమాధానం మధ్యన బోలెడు సలహాలు వచ్చి పడ్డాయి.

నల్ల కాగితంలో చుట్టి హ్యాండ్ బ్యాగేజ్ లో పెట్టుకోమనీ..హ్యాండ్ బ్యాగ్ లో ససేమిరా వద్దు చెక్ ఇన్ చేసేయమనీ .. చెకిన్ చేస్తే సవాలక్ష సమస్యలు ..లగేజీ నంతా చిన్నా భిన్నం చేయగలరనీ .. అదనీ ఇదనీ.

ఇవన్నీ ఎందుకు రాజమార్గం ఉండగా అని.. నేను నాలుగు గింజలు పొట్లం కట్టుకొని .ఎగుమతి చేసే వారి వద్దకు వెళ్ళి నాతో తీసుకు వెళ్ళడానికి అనుకూలంగా తయారుచేసుకొని... తీసుకెళ్ళా .

అడగక ముందే తీసి ... అక్కడి వ్యవసాయభద్రతాధికారుల వారి పరీక్షకు పెట్టా.మూడు గంటలూ ముప్పైఆరు ప్రశ్నల తరువాత .. నా మునక్కాయ విత్తులు నా చేతికి వచ్చాయి.అందుకొన్న ఆథిదేయి ఎంత సంతోషపడ్డారో చెప్పలేను.

అబ్బ ..వారి దేశం పట్లా దేశప్రజల పట్లా వారి జీవ భద్రత పట్లా వారికి ఎంత శ్రద్ధ అనీ!

దేశభద్రత ను ఎంత పటిష్టం కాపాడుకొంటున్నారో జీవభద్రతనూ అంతే పటిష్టంగా కాపాడుకొంటున్నారు.ఈ పన్నెండేళ్ళలో వారి భద్రతా ఏర్పాట్లు మరెంత కట్టుదిట్టం చేసుకొన్నారో!

బాగానే ఉన్నది.

ఒక్క మునగ గింజ కూడా వారి అనుమతి లేనిదే వారి గడప దాటదు.. దాటనివ్వరు.దాటడానికి వీలులేదు. కానీ,స్వైన్ ఫ్లూ ల్లాంటి ప్రాణంతక వైరస్లు వారి గడపలు చడీ చప్పుడు కాకుండా ఎలా దాటున్నాయన్న ప్రశ్న మనం వేయకూడదు !

ఏడేడు సముద్రాలు దాటి మన గడప దాటి ఎలా లోనికి వస్తున్నాయన్నది ..మనం ఎలా రానిస్తున్నామన్నదీ.. అసలే అడగ కూడదు!!

ష్ .. గప్ చుప్..!!!

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 10, 2009

వారెవా..!!!

అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారున్నారు ! రాజు గారికి ...
ఆగండాగండాగండి.
రాజు గారంటే గుర్తొచ్చింది.
మా పాలమూరు తిరుమల్దేవుని గుట్ట బళ్ళో ఒకటో తరగతిలో ఒక రాజు ఉండే వాడు.
మా రాజుకి గిల్లి కజ్జాలు పెట్టడమంటే మహా సరదా.
ఒక రోజు ఇద్దరు అమ్మయిలు బుధ్ధిగా పలక మీద ఆ లు దిద్దుకొంటుంటే ..వారి వెనకగా చేరి.. వారి జడకొనల రిబ్బన్లను ముడేసాడు.
దిద్దింది చాలని పలకను సంచిలో పెట్టి..కుంటాటకు పరిగెత్త బోయిన అమ్మాయిద్దరూ .. బొక్క బోర్లా పడ్డారు.
మా మల్లమ్మ టీచరు ఊరుకొనే రకమా ?
సీతాఫలం కొమ్మను రాజు వీపు మీద తిరగేసింది.
పిల్లలం తక్కువ తిన లేదు కదా?
కచ్చి కొట్టేసాం !
రాజు భోరు భోరు మంటూ వెళ్ళి వాళ్ళమ్మను వెంట తీసుకొని వచ్చాడు.
నేనేం పాపం ఎరగనంటూ బుధ్ధిమంతుడి మొహం పెట్టుకు నుల్చున్నాడు.
అతనికన్న దీనంగా వాళ్ళమ్మ అంది కదా..
"వాడొట్టి అమాయకుడు. నోట్లో వేలు పెడితే కొరక లేడు.బాబ్బాబు అనవసరపు అభాండాలు వేసి వాడిని ఆడిపోసుకోకండి." అంతటితో ఆగక...
" మీకు పజ్జాలు వంటపట్టవు.ఎక్కాలు బుర్రకెక్కవు" అంటూ జడిపించేసి..
" అసలే పండగ కాలం పసివాడిని .." అంటూ అర్ధాంతరంగా ఆపింది.
నిజమే మరి. రాఖీపున్నమి దాటి నాలుగునాళ్ళయినా కాలేదు.
ఒక్క మాటతో గుండె నీరయి పోయి ..అన్నిటిలోనూ ముందుంటాం కదా ఆడపిల్లలం.. రాజుతో పండు కొట్టేసాం!
మా వెనకే అడుగులో అడుగేస్తూ మగ పిల్లలూ!
వాళ్ళమ్మ మా మంచితనానికి తెగ సంతోషపడి ..
మా బడి చుట్టూ దడిలా పెరిగిన తుమ్మచెట్లను అలా దాటిందో లేదో ..
మా రాజు ఇద్దరు మగపిల్లల మధ్యన చేరి.. ఒకడి ముంజేతి కాశీదారానికి మరొకడి నిక్కరు మీది మొలతాటికీ
ముడేసి ..గుట్ట మీది సీతాఫలం చెట్టు చాటున ... చిద్విలాసంగా నవ్వుతూ కూర్చున్నాడు..!
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.